"పెళ్లి అయిన తరవాత ఇంకేమి చదువుతారండీ?"
"అవునులే. మీ చెల్లెమ్మ చూడు, నే చదువు కొమ్మని చెప్పినా ససేమిరా అని మానేసి కూర్చుంది."
"నేనేం మానేయ్య లేదు. నాన్నగారు వద్దన్నారు" అన్నది ఇందుమతి.
"దాని చాడువుకేమి లోటండి. తెలుగు సాహిత్యం లో డానికి ఉన్న ప్రవేశం అంతకన్న పెద్ద చదువులు చదివిన వాళ్ళకీ లేదు" అన్నాడు మధుసూదనరావు .
"నిజమే అనుకో. అయినా రేపు ఏ డిల్లీ యో ఉద్యోగానికి వెళితే అక్కడ నలుగురితో మాట్లాడటానికి కాస్త ఇంగ్లీషు ముక్క కావాలా?"
"మీరు చెబితే నేర్చుకోవాలిగా?"
"అయినా నాకు రాకపోతే కదా?' అన్నది ఇందుమతి ఇంగ్లీషులో."
రాజశేఖరమూర్తి ఇంతవరకు ఇందుమతి ఇంగ్లీషు లో మాట్లాడగా వినలేదు. నాలుగో ఫారం చదివిన వారికి ఇంగ్లీషు చదవనూ, వ్రాయనూ రావడం నిజమే కాని. ధారాళం గా మాట్లాడే శక్తి సాధారణంగా ఉండదు. కాన్వెంటు స్కూళ్ళ లో చదివిన వారికి మాత్రం చిన్నప్పటి నుండి ఇంగ్లీషు మాట్లాడటం నేర్పుతారు. ఇందుమతి ఇంగ్లీషు లో పలికిన నాలుగు ముక్కలూ స్వచ్చమైన ఉచ్చారణ తో నిర్దుష్టంగా పలికింది.
"ఇంగ్లీషు మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నావు?" అని ఇంగ్లీషు లో అడిగాడు రాజశేఖర మూర్తి.
"నాకిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు?"
"మీరు అడగలేదు కనక."
ఈ సంభాషణ అంతా ఇంగ్లీషు లోనే జరిగింది. తరవాత భానుమతి చెప్పింది. దివాకరరావు గారు ఇంగ్లీషు సంభాషణ తానె స్వయంగా నేర్పాడట. కాని, ఆశ్చర్య మేమంటే ఇంగ్లీషు మాట్టాడ్డం వచ్చిన పిల్లలు ఇంగ్లీషు లోనే కాని తెలుగులో మాట్లాడరు ఇందుమతి తెలుగులో మాట్లాడే తప్పుడు పొరపాటునయినా ఒక్క ఇంగ్లీషు పదం కూడా దొర్లనివ్వదు. రాజశేఖర మూర్తి ఆమె విజ్ఞత కు ముగ్ధుడై నాడు.
ఆనాడు రాత్రి ఊరేగింపు. మగపెళ్లి వారందరూ సన్నద్దులవు తున్నారు. రాజశేఖర మూర్తి కూడా బయలు రేరాడు. పదడుగులు వేసిన తరవాత రాజశేఖర మూర్తి చూశాడు. ఆడవాళ్ళలో భానుమతి లేదు, ఇందుమతి లేదు. రేవతి మాత్రం పిల్లలతో కలిసి వస్తున్నది. రేవతిని పిలిచి అడిగాడు. చిన్నక్క కు తల నొప్పిగా ఉందిట. విడిది లోనే ఉండిపోయింది. తోడుగా పెద్దక్క కూడా ఉండిపోయింది. రాజశేఖర మూర్తి కి ముందుకు పోవటానికి కాలాడలేదు. వెనుదిరిగి విడిది కి వెళ్లి పోయాడు. లోపల ఇందుమతి మంచం మీద పడుకుని ఉన్నది. భానుమతి ఆమె పక్కనే కూర్చుని తలలో పూలు సర్దు కుంటున్నది. లోపలికి వచ్చిన రాజశేఖర మూర్తి ని చూచి భానుమతి లేచింది. ఇందుమతి కూడా లేవబోయింది. రాజశేఖర మూర్తి వద్దని బలవంతం మీద పడుకో బెట్టాడు.
"మీరు ఊరేగింపు కు పోలేదా?" అని అడిగింది భానుమతి.
"పోదామనే బయలు దేరాను. దారిలో రేవతి చెప్పింది, ఇందుకు తలనొప్పి గా ఉన్నదని. ఇక పో బుద్ది పుట్టలేదు. ఎక్కువగా ఉందా?"
"లేదు. మామూలే" అన్నది ఇందుమతి.
"మీరు ఉంటానంటే నేను వెళ్లి వస్తాను" అన్నది భానుమతి.
"మీ ఇష్టం" అన్నాడు రాజశేఖర మూర్తి.
భానుమతిదేవీ వెంటనే బయలుదేరి ఊరేగింపు ను కలుసుకున్నది. విడిది లో ఇందుమతి, రాజశేఖర మూర్తి తప్ప మరెవ్వరూ లేరు.
"ఇందూ, మందును క్రమంగా పుచ్చు కుంటున్నావా?"
"పుచ్చుకుంటూనే ఉన్నాను. అలసట వల్ల కాబోలు ఇవాళ మళ్ళీ వచ్చింది."
"నువ్వు ఇంత సుకుమారి వైతే నాబోటి దరిద్రుడి తో సంసారం ఎలా చేయ్యగలవు?"
"ఛీ, మీరు దరిద్రు లేమిటి? ఐశ్వర్య రేఖ మీ నుదుటి మీదే ఉంది."
"నీవేనా ఐశ్వర్య రేఖవు. ఇందూ, నీ ఆరోగ్యమే నా మహాభాగ్యం." అని ఇందుమతి ని ప్రేమతో నుదుటి మీద చుంబించాడు. ఆమె ఓడలు అంతా పులకరించింది.
"వదినగారు మనిద్దరినీ ఒంటరిగా వదిలి పెట్టి వెళ్ళారేం?"
"ఆమె పన్నిన పన్నాగమే నా తలనొప్పి. మీ బాధ ఆమె కర్ధమయింది కాబోలు!"
"నిజమా, దొంగా! అయితే తలనొప్పి లేనేలేదా?"
చిరునవ్వే జవాబయింది. ప్రేమాభిరేకంతో నుదుటి పై , చెక్కుల పై, అధరం పై, మెడ పై భుజాల పై , మోచేతుల పై ముద్దులు కురిపించి, ఉక్కిరిబిక్కిరి చేసి, ఆమె రెంటిని తీసి తన ముఖం పై కప్పుకున్నాడు రాజశేఖర మూర్తి.
"నా కృతజ్ఞతల ఆమె కేలాగ చెప్పుకోను?"
"ఏం చెప్పుకోనక్కర లేదు గాని, ఇక సంవత్సరం వరకు నా దగ్గిరికి రాకండి."
"ఇదేమి శిక్ష?"
"హద్దులు మీరినందుకు అదే శిక్ష."
"పోనీ అలాగే కానీ. ఈ ఒక్క మధుర క్షణమైనా ప్రసాదించావు అదే చాలు! ఈ అనుభూతే పదేపదే జ్ఞాపకం తెచ్చుకుంటూ పన్నెండు నెలలూ తపస్సు చేస్తాను నీకోసం."
"మీ హృదయం బంగారం."
తనివి చెందని రాజశేఖర మూర్తి లేత తమల పాకులా వంటి ఆ మెత్తని చేతులు అలాగే పెదవుల కద్దుకుని అరక్షణం కన్నులు మూసుకున్నాడు.
ఎక్కడ నించి వచ్చాడో నాగభూషణ రావు తన మందుల సంచీ తో బాటు తుఫాను లా ప్రవేశించాడు.
"ఏమే, మళ్ళీ తలనొప్పి వచ్చోందిటగా? ఓహో?" భర్తగా రిక్కడే ఉన్నారా? అత్తయ్య తలనెప్పి అని చెబితే నిజమే అనుకున్నాను."
"ఇప్పుడు లేదని ఎవరన్నారు?"
"అయితే , ఇదుగో , మందు పుచ్చుకో."
"ఇచ్చి వెళ్ళు."
"అవునులే. పానకం లో పుడక లాగ నేనెందుకు ఇక్కడ?"
"కూర్చోండి , అన్నగారూ, ఇందుమతి ఆరోగ్యం విషయం లో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు మీరు" అన్నాడు రాజశేఖర మూర్తి.
"మీకంటే ఇప్పుడు భార్య కాని, చిన్నప్పటి నుంచి నాకు మరదలే కదండీ?" అన్నాడు నాగభూషణ రావు.
"ఇందుమతి దివాకరరావు గారిచ్చిన ఎలోపతీ మందులేవో పుచ్చుకుంటుంది. ఆ మందులు పుచ్చుకుంటూ ఉండగా హోమోయో పతి మందులు వాడటం మంచిది కాదను కుంటాను. ఆ మందులు వాడుతున్నప్పుడు ఈ మందులు పని చెయ్యవని మీకు తెలియని విషయం కాదు."
"నిజమే అనుకోండి. అసలు ఎలోపతి మందులెం పని చేస్తాయండీ. ఒళ్ళంతా పాడు చెయ్యటం తప్ప. హోమోయోపతి మందు నేనిస్తాను. ఒక నెలరోజులు శ్రద్దగా విడవ కుండా పుచ్చుకో మనండి. దాని శరీరం ఇనమల్లె కాకపొతే నా పేరు నాగభూషణ రావు కాదు."
"ఇందుమతి శరీరం కలవ కాడలా ఉండటమే నా కిష్టం. ఇనుము చేసెయ్యకండి. మీకు పుణ్య ముంటుంది."
ఇందుమతి నవ్వుకున్నది. నాగభూషణ రావు కోపగించు కున్నాడు.
20
మధుసూదన రావు పెళ్లి అయిదు రోజులు అయింది. గుడివాడ తిరిగి వచ్చేసరికి గుంటూరు నుంచి ఉత్తరం వచ్చింది. సీతమ్మ గారికి జబ్బుగా ఉన్నదట. ఇందుమతి ని కూడా తీసుకుని వెంటనే రావలసిందని వెంకటాచలపతి గారు వ్రాశారు. ఆ ఉత్తరం మామగారికి, పినమామ గారికి చూపించి వెంటనే బయలుదేరాడు రాజశేఖర మూర్తి. గుడివాడ లో మూడు నిద్రలైన తరవాత నారాయణరావు గారితో ఇందుమతి ని గుంటూరు పంపిస్తానన్నారు అనంత కృష్ణ శర్మ గారు. సీతమ్మ గారికి తానంటే ప్రాణమని ఇందుమతి కి బాగా తెలుసు. ఆమె అవసానదశలో ఉన్నప్పుడు ఆమెను పోయి చూడటం తన విధ్యుక్త ధర్మం. భర్తతో వెంటనే గుంటూరు పోవడానికి తండ్రిని ఎలాగో ఒప్పించి బయలుదేరింది ఇందుమతి.
