Previous Page Next Page 
అర్పణ పేజి 19

                                          
    బావి ముందున్న దానిమ్మ చెట్టు క్రింద కూర్చొని కృష్ణ లీలా తరంగిణి చదువుతున్న సరస్వతి దగ్గరకు పార్వతి పరుగెత్తు కుంటూ వచ్చింది.
    చిన్నపిల్లలా ఆమె ఒళ్లో తల పెట్టుకుని వెల్లకిలా పడుకుంది, బట్టలు పాడవుతాయని అక్కగారు గోల పెడుతున్నా. ఆ అమ్మాయికి ఏ సందర్భం లోనూ ఎవరి మాటాలక్ష్యం లేదు.
    మళ్ళీ చదవడం లో లగ్నమయింది సరస్వతి.
    "అక్కా, నీకేంచక్కా మొగుడు లేడే! ఈ అదృష్టానికి ఎంత నోచుకోని పుట్టావో! ఊ........ ఊ?' హటాత్తుగా పార్వతి అంది.
    సరస్వతి కి ఆలస్యంగా అర్ధమయింది. ఉలిక్కిపడి "ఛీ! ఛీ! ఏమిటా వెధవ మాటలు? లెంపలు వేసుకో!" అంది తర్వాత.
    పార్వతి నవ్వడం ప్రారంభించింది. సరస్వతి చెల్లెలి ముక్కు నలిమింది.
    "నేనొకటడుగుతా , చెప్తావా?" కాస్సేపుండి అర్ధించింది సరు.
    "ఏమిటది?"
    "నువ్వూ, రాజూ ఇప్పుడు చాలా సఖ్యతగా ఉంటున్నారటగా? మరి నువ్విక్కడికి వచ్చేస్తే అతనెలా ఊరుకున్నాడు , పారూ!"
    పార్వతి కళ్ళు పెద్దవయ్యాయి. "ఆహా! ఆహా! అద్భుతం! నీకింకా తెలీదా? అతని హృదయం లో నేను, నా హృదయం లో అతను స్థిర నివాసం ఏర్పరుచు కున్నాం. ఎక్కడి కెళ్ళినా మాకు వియోగం లేదు. ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం. ప్రతి క్షణమూ తిట్టుకుంటూ ఉంటాం!" పార్వతి అన్నది మొహంలో అట్టే మార్పు రప్పించ కుండా.
    "అదేమిటది?' కళ్ళల్లో కళ్ళు పెట్టబోయింది సరస్వతి.
    "అదొక వింత ప్రేమలే. నీ కర్ధం కాదు, నా చిట్టి తల్లీ! అవన్నీ కట్టి పెట్టి వేరే కబుర్లు చెప్పు-- బుద్దిగా వింటాను."
    "అది కాదు పారూ! నీపట్ల అతనింకా అప్పటికీ, ఇప్పటికీ , ఒక్క మాదిరి గానే ఉన్నాడా అని!"
    "మేం ఆగర్భ శత్రువుల మని నాకిప్పుడిప్పుడు తెలుస్తోంది . పోనీయ్ -- ఆ ఊసెత్త కింక."
    ఇంకెంత ప్రశ్నించి లాభం లేదనుకుంది సరస్వతి.
    "ఇదేం పుస్తకమక్కా?"
    "కృష్ణ లీలాతరంగిణి."
    "రామ లీలా ప్రోతస్విని కూడా ఉందా? ఇదుగో . ఇల్లాటివి చదువే నువ్వు పాడవుతున్నావు."
    "ఏం ? ఏమయిందేమిటిప్పుడు?"
    "అస్తమానం వ్రతాలు, మడులు, ఉపవాసాలు-- ఇంత చిన్న వయసు లో ఇవన్నీ ఏమిటి నీకు?"
    "చిన్న వయసులో ఇవన్నీ ఆచరించ కూడదని నిబంధన ఎక్కడైనా ఉందా? వెర్రి పిల్లా! ఇందులోని ఆనందం నీకింకా తెలియదు. తెలియ వలసిన అవసరమూ ఇప్పుడు లేదు. నేనేమో - నేనేమో మరి, వితంతువునాయె! ఏనాటికే బుద్ది పుట్టినా ఈ నియమాలు నన్ను కాపాడతాయి. ఈ శ్రమంతా అందుకే."
    "అబ్బబ్బ! అలా మాట్లాడకు-- నాకెందుకో కష్టంగా ఉంటుంది. నువ్వు వితంతువ్వి కావే! నీకు నేను పెళ్లి చేస్తాను ఎల్లాగైనా!"
    "అదేమిటి! ఇందాకంతా మొగుడు లేనందుకు నా అదృష్టాన్ని పొగిడి -- ఇప్పుడిలా ........చెయ్యి అడ్డం చేసుకు నవ్వింది సరస్వతి.
    "అది కాదే, అక్కా! నీకు మంచి మొగుణ్ణి స్వయంగా వేదికి తెస్తాను.
    "చాల్లే! తెల్లవార్లూ మొగుడు మొగుడంటూ అసహ్యంగా......"
    "పోనీలే , భర్త అంటాను...నీకు మంచి భర్తని--------ఆహా కాదు -- మంచి వరుణ్ణి సాధించి తెస్తాను. నీమాట జవదాటని వాడు, నువ్వా జ్ఞాపిస్తే గాని కదలని వాడు, నువ్వు ఏమైనా కోరితే పొరపాటునైనా కాదనని వాడు.........." పార్వతి గంబీరతను పోషిస్తూ చెప్పుకు పోతున్నది.
    సరస్వతి కి నవ్వాగలేదు. చెల్లెలికి దాంపత్య జీవిత సౌఖ్యం దూరంగా ఉందని తెలుసుకుంది.
    ఎప్పుడూ లేనిది పల్లెటూరు విడిచి వెళ్ళటం అనిర్వచనీయ బాధాకరంగా పరిణమించింది పార్వతి కి.
    సెలవులయినాయి. ఈసారి సరస్వతి కి కూడా పార్వతిని వదిలి ఉండటం కష్టాతి కష్టంగా తోచింది. ఇదివరకు తనే బాధ్యత తీసుకునేది కాని, ఆ పిల్ల ఎప్పుడూ తనకింత సన్నిహితంగా తిరగలేదు.
    పార్వతి వెళ్ళేటప్పుడు సరస్వతి కళ్ళు నీళ్ళతో నిండిపోతే --------
    పార్వతి సరస్వతి భుజాల మీద వాలిపోతూ "ఈసారి వచ్చినప్పుడు నీకు మంచి ........." అని దీర్ఘం తీసింది. 'ఛీ......నోర్ముయ్యి!" అంటూనే కళ్ళు వత్తుకుని నవ్వింది సరస్వతి . "నాకన్నా పెద్దదై పోయిందట ఇది!" అంది చెల్లెలి చెక్కిళ్ళు నొక్కుతూ.
    పూర్ణ సుధాంశునిలా వెన్నెలలు కురిపించే సరస్వతి ముఖ బింబం సుదూరమేఘామృత చిహ్నాలు చూసి వెలవెల పోతున్నది మళ్ళీ.
    అడుగడుగునా ఎంత ఆశ ఉందొ, అంగుళం అంగుళం మేరకు అంత నిరాశ ఉంది. మానవుడు ఆశాజీవి మాత్రమె కాడు. సిసలైన నిరాశా జీవి కూడా. అందువల్ల సరిసమానమైన ఆశ నిరాశల మధ్యనే జీవించ గలుగుతున్నాడు. ఎదేక్కువైనా ప్రమాదం.
    పార్వతి ఇంటికి రాగానే ఆమె చెవిలో ఒక వింత వార్త పడేసింది, జానకమ్మ. ప్రయత్నపూర్వకం గా రాజు పక్క ఊరైనా చందన పూర్ హైస్కూల్ కు టీచరు గా మార్పించు కున్నాడట ఉద్యోగాన్ని. కాలేజీ లో తనంత వయసున్న విద్యార్ధులకు బోధకుడుగా ఉండటమే అతనికి విసుగు కలిగించిన విషయమట.
    పార్వతి మనసులోనే మధన పడ్డది. 'దర్జాగా లెక్చరర్ హోదాలో ఉండకుండా -- ఇతనికిదెం బుద్ది? బతకలేక బడి పంతులంటారు ఈసారి మరి ఇదిగా!' అని తలపోసింది.
    అంతేకాని, నిలదీసి వేరే కారణాలు అడగగల సాహసం ఆ యింట్లో ఆడవాళ్ళకు రాదు. అటువంటి అవసరం ఆయింటి మగవారికి లేదు.
    మొత్తం మీద ఒక పెద్ద సీసం గుండు లాంటి రాయే. పార్వతి గుండెల్లోకి హటాత్తుగా జారిపడింది. ఆ భారం ఇంకా తగ్గక మునుపే రాజు టీచరు గా పై ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. తనను కూడా ఎక్కడ వెళ్ళమంటారో అని పార్వతి గుండె ఏ క్షణానికా క్షణం గుబగుబ మంటూనే ఉంది. అక్కడ చావగొట్టి సేవ చేయించు కుంటాడే మోనన్న భయం తప్ప మరొకటేమీ కాదు. కాగా, చేస్తున్న ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకోబోయింది. జానకమ్మ ఈ విషయంలో తగ్గలేదు. భర్త దగ్గర ఉండటమే స్త్రీ ఉద్యోగం అని ఉపన్యాసం ఇచ్చింది ఆమె.
    అయినా మూడు నాలుగు నెలల వరకు ఎలాగో తప్పించుకుంది పార్వతి. ఈలోగా ఒకసారి రాజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత పడి రోజుల కోక ఉత్తరం వచ్చింది. తనకు మంచి ఇల్లు దొరికినట్టు, వస్తు సామగ్రులన్నీ ఏర్పడే వరకు ఎవరూ తొందరపడి రావద్దని వ్రాశాడు. తిన్నగా ఆ ఉత్తరాన్ని తీసికెళ్ళి వంటింట్లో పోపుల డబ్బాలో పడేసింది జానకమ్మ.
    పార్వతి ని పిలిచి ఒక పెద్ద అబద్దం ఆడి ప్రయాణం కమ్మంది.
    పాపం జానకమ్మ కు ఎంతసేపూ ఒకే వేదన. తప్పించుకోలేని అవసరాల వల్లనైనా తన కొడుకూ, కోడళ్ళ మధ్య సఖ్యత ఏర్పడితే చాలనే కోరికే ఆమెలో.
    ఆవిడ పోరు పడలేకనే పార్వతి ఉద్యోగానికి తిలోదకాలిచ్చి బయల్దేరింది రాజు దగ్గరికి, ఉత్తరం వ్రాసినా స్టేషను కు రాడని తెలిసి ఆ ప్రయత్నం చెయ్యలేదు. అదే మంచిదను కుంది జానకమ్మ. ఒంటరిగా వెళ్ళ గలిగే సాహస వంతురాలే పార్వతి -- అన్న ధైర్యం ఆవిడ కుంది.
    సాయంత్రం దర్జాగా ఈజీ చెయిర్ లో కూర్చుని సిగారేట్ కాలుస్తున్న రాజు, ఠీవి గా సామానుతో దిగిన పార్వతి ని చూడగానే చివ్వున లోపలికి వెళ్ళిపోయాడు.
    ఏ ముహూర్తంలో ఆ యింట్లో అడుగు పెట్టిందో కాని నిమిషాల మీద నిప్పుల వర్షం కురిసిందక్కడ.
    "నిన్నెవరు రమ్మన్నారిప్పుడు?' పార్వతి కి జరిగిన సన్మానం అది.
    "నువ్వే వ్రాశావటగా రావలసిందని!" ఆశ్చర్యమిళితమైన ఆగ్రహంతోనే అంది సమాధానంగా.
    "ఎవరు చెప్పారు?"
    "మీ అమ్మగారే!"
    "కల్పించు అబద్దాలు!"
    "కల్పించడానికి నేనేం కధకురాల్ని కాను. అబద్దాల కోరు నంతకంటె కాను......."
    "షటప్! సిగ్గు లేకుంటే అవతలి కెళ్ళి అరుచుకో! ఇక్కడ కాదు-- ఇది నా ఇల్లు!"
    "నువ్వు విడాకులిచ్చే వరకు ఇది నా యిల్లు  కూడాను. నాకదికారం ఉంది."
    "విడాకులు పుచ్చుకోవడాని కే కాబోలు పెళ్లి చేసుకున్నావు!" వికటంగా నవ్వాడు.
    "నువ్విలాటి పిశాచివని నాకప్పుడు తెలీదు."
    "నువ్వు శూర్పణఖవని నాకు ముందే తెలుసు. అందుకే వద్దు, బాబోయ్ అన్నాను."
    "నీ ఇష్టం వచ్చినట్టల్లా తిట్టు. తృప్తి దీరా ఇంగ్లీష్ లోనూ, తెలుగు లోనూ , అరవం లోనూ తిట్టు. నీలాంటి క్రాక్ తిట్టినా, కొట్టినా నాకు లెక్కలేదు."
    "మళ్ళీ నా చేతి మహత్యం చూడాలనిపిస్తున్నదేమిటి?"
    "నా చేతి రుచి నువ్వు చూసేవుగా!" వెక్కిరించినట్టుగా అని, అతి వేగంగా వెళ్ళిపోయింది అక్కడి నుండి.
    "ఇక్కడికి తయారయ్యావు రాక్షసి వి -- నా ప్రాణాలు తోడడానికి. ఈ యిల్లు కూడా తగలబెట్టు!" కోపంగా వీధిలోకి నడిచాడు రాజు.
    ప్రజ్వరిల్లు తున్న కోపంలో ఒక ఉత్తరం వ్రాసి పడేసింది పార్వతి. అటువంటిదేదో రాక తప్పదన్నట్లు ఎదురు చూస్తున్న జానకమ్మ మర్నాడే ఆఘమేఘాల మీద పరుగెత్తు కొచ్చింది.
    ఆమె రాగానే విరుచుకు పడింది పార్వతి -- "ఇంత అబద్ద మాడతావా అత్తా?" అని.
    "అబద్ద మేమి ఉందే? ముందుగా వస్తే సర్దుకుంటా వనీ!" అంటూ నసిగి వాళ్లకు ఇంటి పరికరాలు, సదుపాయాలూ సమకూర్చి పెట్టింది. ఇద్దరు నౌకర్ల ను కూడా కుదిర్చి --
    "నేనే ఇక్కడ కొన్నాళ్ళ పాటు ఉందును గాని ఆయనకి బోలెడు చిరాకు, పరాకూను" అంది, లోలోపల 'పాడు పిల్లలు నాచేత అబద్దాలాడిస్తున్నారు' అనుకుంటూ.
    పార్వతి తన ధోరణి లోనే ఉంది. 'ఏమో! వెళ్తే వెళ్ళావు కానీ మళ్ళీ నన్ను చూస్తావో చూడవో?' అన్నది.
    "ఏం?' భయంగా ప్రశ్నించింది జానకమ్మ.
    "నీ కొడుకు నన్ను బతకనిచ్చేటట్టు లేడు; ఎప్పుడో ఒకనాడు హత్య చేసి తగాలబెడతాడేమో నన్ను!"
    జానకమ్మ కు కష్ట మనిపించింది కొడుకునలా అంటూ ఉంటె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS