పద్మ స్వర్ణ దగ్గరకు వచ్చిన మరునాడే రాయన్ కూడా వచ్చాడు.
పద్మ రాయన్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడ లేదు.
రాయన్ వినేటట్లుగా -- "నా మనసు బాగా లేదు. నన్ను ప్రశాంతంగా ఉండనియ్యమను, స్వర్ణా!" అని గట్టిగానే అన్నది.
స్వర్ణ ఇవతలకు వచ్చి, "రాయన్ గారూ! పద్మ మనస్సు బాగా కలత పడింది. కాస్త విశ్రాంతి తీసుకొంటే, అదే కుదుటపడుతుంది. ఇప్పుడు మీరు ఒత్తిడి చెయ్యటం భావ్యం కాదు. పద్మ మనస్సు మరీ విరగవచ్చు. మీరూ చదువుకొన్న వారె! విషయాలన్నీ పద్మతో చెప్పి ఉండవలసింది! ప్రస్తుతం మీరు వెళ్ళి పొండి. నెమ్మదిగా అన్నీ వాటంతట అవే సర్దుకొంటాయి!" అన్నది.
"మిస్ స్వర్ణా! నేనెందుకు అట్లా చెయ్యవలసి వచ్చిందో చెబుతానంటే వినిపించుకోదు కదా! ఎంత సేపూ తన వైపు నుండి ఆలోచిస్తుందే గాని నా వైపు నుండి ఆలోచించదు కదా! పద్మ ఇంత తొందరపాటు మనిషని అనుకోలేదు నేను! నేను చాలా తొందరపడి బంధనాలు తగిలించుకొన్నాను!" సీరియస్ గా అన్నాడు రాయన్.
"మిస్టర్ రాయన్! బంధనాలు లేకుండా, మర్యాద గల ఏ ఆడపిల్లా మీ చేతికి అందదు. అట్లా అనుకోవడం మీ సంస్కారం లోని లోపం! సరే! ఆ విషయాలన్నీ మీరూ, పద్మా కలిసి అనుకోవలసినవి! నాకు అనవసరం! దయచేసి మీరు వెళ్ళిపొండి. . జీవితానికి సంబంధించిన విషయాలు ఎంత నిదానంగా ఆలోచిస్తే అంత మంచిది !" అన్నది స్వర్ణ.
"మీతో మాట్లాడినప్పుడంతా, మిమ్మల్ని, చూసి నప్పుడంతా పద్మ బదులు మీరే అమెరికాకు వచ్చి ఉంటె ఎంతో బాగుండేదని మరీ మరీ అనుపించు తున్నది, మిస్ స్వర్ణా!' ఆరాధన నిండిన కళ్ళతో స్వర్ణ వంక చూస్తూ అన్నాడు రాయన్.
"ఇటువంటి మాటలు నాకు నచ్చవని ఇదివరకే అన్నాను. ఇక మీరు వెళ్ళవచ్చు!" నిష్కర్షగా అంది స్వర్ణ.
చిన్నపుచ్చుకొన్న ముఖంతో వెనక్కు తిరిగాడు రాయన్.
వెనకకు తిరిగిన రాయన్ కు ఇంతకూ ముందు స్వర్ణ ఇంటికి వచ్చిన ముసిలాయన ఎదురయ్యాడు.
అడుగు ముందుకు వెయ్యబోయి, ముసిలాయన వంక ఒక్క క్షణం తదేకంగా చూసి, "నాన్నా!" అంటూ దగ్గరకు వెళ్ళాడు రాయన్.
స్వర్ణ చలించలేదు. అలాగే నిలబడి "రండి!" అని ముసిలాయనను ఆహ్వానించింది.
"నాన్నా!" అంటూ ఎదురయిన రాయన్ ను ఎగాదిగా చూస్తూ నిలుచున్నాడు ముసిలాయన.
"నేను, నాన్నా, నారాయణ శాస్త్రి ని!" అన్నాడు రాయన్, తండ్రిని చేతులతో చుట్టి.
"ఎవరూ? నాయనా, శాస్త్రీ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కురా? ఇన్నాళ్ళ కు మీ నాయన బతికున్నాడని జ్ఞాపకం వచ్చిందా?"
ముసిలాయన ముఖంలో సంతోషం, వాత్సల్యం జ్యోతి లాగా వెలిగి పోతున్నవి. సంతోషంతో గొంతు గాద్గాదికమయింది. కొడుకును గుండెకు హత్తుకొని కళ్ళు మూసుకొన్నాడు. మూసిన కళ్ళ నుండి నీరు ధారా కట్టింది.
స్వర్ణ ఇదంతా చూస్తూ నిలుచున్నది. కొత్త గొంతు విని పద్మ కూడా మోహన కృష్ణతో బయటికి వచ్చి నిలబడింది.
రెండు నిమిషాల తరవాత ముసిలాయన తేరుకొన్నాడు. కొడుకు అమెరికా వెళ్ళిన తరువాత తన ఆతీ గతీ కనుక్కోలేదని, కట్టుకొన్న పెళ్ళాన్ని వదిలి పారిపోయాడని క్రమంగా స్పురణకు వచ్చాయి. ఒక్క అడుగు వెనక్కు తగ్గాడు. క్రమంగా కొడుకును హటాత్తుగా చూడగానే ఏర్పడిన వాత్సల్య భావం తగ్గి, కొడుకు చేసిన అన్యాయాలకు కోపం, బాధ కలగటం మొదలెట్టాయి.
"ఏమిరా? చదివించి, నిన్ను ప్రయోజకుడిని చేస్తే ఇదిట్రా నువ్వు చేసేది? డబ్బు తీసుకుని చెప్పకుండా డుబ్బుకు పోతావా? వెళ్ళిన వాడిని నేను బతికున్నానో, చచ్చానో విచారించావా? ఏం పాపం చేసుకోన్నానో నీ లాంటి వెధవ నా కడుపున పుట్టడానికి! చదువుల కోసం దేశాలు వదిలి పోయిన వాళ్ళంతా నీ లాగే చేశారా? ఏ ముఖం పెట్టుకొని తిరిగి వచ్చావురా?" అని అడిగాడు . రాయన్ వైపు చురచురా చూస్తూ.
రాయన్ ముఖం లో కళ తప్పింది. తనంత వాడిని పట్టుకొని, ఎంత తండ్రయితే మాత్రం, ఆడవాళ్ళ ముందర "వెధవా' అని తిదతాడా!
రాయన్ లో రోషం పెరిగింది. "నోటికొచ్చినట్లు మాట్లాడకు నాన్నా! నా కిష్టం లేని పని చేస్తే, పారిపోక ఏం చేస్తాను! అమెరికా వెళ్ళి చదవాలని ఎన్ని కలలు కన్నాను! డబ్బు కావాలి. అది నీ దగ్గర లేదు. అది రాగానే నా కోరిక నేరవేర్చుకున్నాను. డబ్బు అవసరం విదేశంలో నాకు ఎక్కువగా ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయి చిక్కితే పెండ్లి చేసుకోవాలని డబ్బు దాచాను. ఏదో చిక్కింది . చేసుకొన్నాను. నేను పెద్దవాడి నయ్యానన్న మాట మరిచి నోటి కొచ్చినట్టు తిట్టకు!" అన్నాడు కోపంగా.
"ఓరి దౌర్భాగ్యుడా! మహాలక్ష్మీ లాంటి పిల్ల ఉండగా, ఎవత్తేనో మళ్ళీ కట్టుకొన్నావురా! నిన్ను చంపినా పాపం లేదురా! ఆ పిల్ల ఉసురు నీకు కట్టి కడుపు తుందిరా!" కోపంతో ముసిలాయనకు ఒళ్ళు తెలియటం లేదు.
ముసిలాయన తన మామగారే అని గ్రహించిన పద్మ మోహన కృష్ణ తో ఒక్క అడుగు ముందుకు వేసింది.
"మహాలక్ష్మీ లాంటి పిల్లట! నల్లగా, జీడి గింజ లాగా ఉన్నది! కొండముచ్చు ముఖం! చదువా శూన్యం! పోనీ, పేరన్నా బాగుందా? సన్నమ్మట! సన్నమ్మా, లావమ్మానూ! దాని అన్న ఒక తలపోగరు వెధవ! డబ్బు చూసి ఒప్పుకున్నానే గాని, మెరిసిపోయే పిల్ల అందాన్ని చూసి కాదు!" కోపంలో సభ్యత కూడా మరిచాడు రాయన్.
ఆ అమ్మాయి సంగతి ఎత్తగానే ముసిలాయనకు తానున్న పరిసరాలు జ్ఞాపకం వచ్చాయి. ఎవరిని గురించి కొడుకు తప్పుడుగా మాట్లాడుతున్నాడో , ఆ అమ్మాయి ఇంట్లోనే ప్రస్తుతం ఇద్దరూ నిలబడి ఉన్నారు!
"అదిగో, ఆ అమ్మాయినే నేను పెళ్ళి చేసుకొన్నది. ఆ పిల్లవాడు నా కొడుకు. నీ మనవడు! మన ఊరికి వెళ్ళగానే కామాక్షమ్మత్త వెనకటి సంగతంతా పద్మకు చెప్పింది. పద్మ నా మీద కోపం తెచ్చుకొని ఇక్కడకు వచ్చింది. అదిగో!" అంటూ పద్మను చూపించాడు రాయన్.
ముసిలాయనకు ఈ మాటలు వినిపించలేదు.
"గుడ్డి వెధవా! మహాలక్ష్మో , కొండ ముచ్చో కళ్ళు పెట్టుకొని చూడరా! ఆ పిల్ల ఇంట్లోనే నిలబడి ఉన్నావుగా! నీ ఎదురుగానే ఆ అమ్మాయి ఉందిరా! కళ్ళు తెరుచుకొని చూడు!" బాధతో, ఉద్రేకంతో ముసిలాయన గొంతు బొంగురు పోయింది.
భగవంతుడి విశ్వరూపాన్ని సందర్శించిన భక్తుడి లాగా రాయన్ ఆనందంతో, తన్మయత్వంతో , పారవశ్యంతో స్వర్ణ వంక చూస్తూ నిలుచుండి పోయాడు.
కళ్ళు తిరిగి పడిపోతున్న పద్మను స్వర్ణ పట్టుకొని పక్కనే ఉన్న సోఫాలో కూర్చో పెట్టింది.
కళ్ళు తుడుచుకొని ముసిలాయన అడుగు ముందుకు పెట్టాడు.
* * * *
శేఖర్, స్వర్ణా, సోఫాలో కూర్చుని ఉన్నారు. వెంకట్రామ శాస్త్రి గారు, రాయన్, పద్మ విడిగా ఉన్న కుర్చీలలో కూర్చుని ఉన్నారు.
అందరికంటే దిగులుగా పద్మ , అందరి కంటే నిర్లిప్తంగా స్వర్ణ ఉన్నారు.
శేఖర్ -- "పద్మా! నీ వైర్ అందగానే కంగారు పడి పరుగెత్తు కొచ్చాను. ఇక్కడి కొచ్చి చూస్తె ఇదీ సంగతి. ఇందులో నా ప్రమేయం ఏమిటో నా కర్ధం కావడం లేదు. ఇది మీరూ మీరూ కలిసి చర్చించుకోవలసిన విషయం. మరి నన్నెందుకు పిలిపించావు?' అని అడిగాడు.
పద్మకు కన్నీళ్లు పొంగు కొచ్చాయి. "అన్నా! తెలియక నేనూ, తెలిసి, రాయన్ గారూ -- ఇద్దరం మీ ఉప్పు తిని మీకు ద్రోహం చేశాము. రాయన్ గారు అమెరికా వెళ్ళింది మీ డబ్బుతోనే! నేను వెళ్ళింది మీ డబ్బుతోనే! రాయన్ గారూ స్వర్ణ కు ద్రోహం చేశారు. నేనూ చేశాను! తెలిసి ముట్టుకొన్నా, తెలియక ముట్టుకొన్నా నిప్పు కాలుస్తుంది. అట్లాగే పాపం కట్టి కుడుపుతుంది! నన్ను చెల్లెలు లాగా చూచుకొన్నందుకు ఎంత ద్రోహం తలపెట్టాను! నా పాపానికి పరిహరమేమిటో మీరంతా కలిసి నిర్ణయించండి. స్వర్ణ ఏమీ చెప్పటం లేదు. మీ రన్నా చెప్పండి. లేకపోతె మరకతం లాగా నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలి!" అని ఏడ్చింది పద్మ.
"చూడమ్మా, పద్మా! మా ప్రాణం లో ప్రాణంగా పెంచుకొన్న స్వర్ణ ను ఈ దుర్మార్గుడు మోసం చేసినప్పుడే ఏమీ చెయ్యలేక పోయాను! ఏ శిక్షకూ అందకుండా పారిపోయి దూర దేశంలో బుద్ది మంతుడుగా నటించాడు. ఒకప్పుడు ఈ శాస్త్రి కనపడితే నరికి పోగులు పెట్టాలన్న కోపం వచ్చేది. కాని, కాలం గడిచిన కొద్దీ అ వేడి చల్లారి పోయింది. ఇప్పుడు నీకద వింటూ ఉన్నా నాకు పెద్ద ఆవేదన కలగడం లేదు. నా చెల్లెలు జీవితాన్నే చక్కదిద్ద లేని నేను ఇతరుల కెట్లా సలహాలు ఇస్తాను? ఈ విషయంలో నేను జోక్యం కలగజేసుకొను. మీ ఇష్టం వచ్చినట్లు పరిష్కరించుకొండి! వస్తా, పాపా!" అంటూ లేచాడు శేఖర్.
స్వర్ణ మౌనంగా తల ఊపింది.
"ఒక్క మాట. అసలు నీకు చెప్పవలసిన పని లేదనుకో. బాగా అలోచించి నిశ్చయానికి రా. ఎవరి జీవితాలు వాళ్ళే చక్క దిద్దుకోవాలి గాని, ఇతరుల సలహాల ననుసరించి చేస్తే గాడిదా, ముసిలాడి కధ లాగా అవుతుంది! నీవు ఏ నిర్ణయం తీసుకొన్నా అది మంచిదీ, ఉచితమైనదీ అని నా నమ్మకం. వస్తా , పాపా!" అంటూ వెళ్ళిపోయాడు శేఖర్.
తెల్లబోయి, చిన్నబుచ్చుకొని కూర్చున్నాడు రాయన్.
"ఛీ కొట్టాడంటే ఛీ కొట్టాడూ మరి! ఇంకా నయం! ముఖాన ఉమ్మేశాడు కాడు! లక్ష్మీ లాంటి భార్యను పెట్టుకొని, ఇంకొకతెను కట్టుకొంటివి! ఇప్పుడు విచారిస్తే ఏం లాభం రా?' వెంకట్రామ శాస్త్రి గారు కొడుకుకు వాత పెట్టినట్లు మాట్లాడారు.
