"మీ కోడలింత చదువుకోందని మీరేమన్నా వ్రాశా....." మాట పూర్తీ కాకుండానే రాయన్ కు తన తండ్రికి తాను అడ్రస్ ఇవ్వలేదన్న సంగతి గుర్తు కొచ్చింది. తన తండ్రికి అడ్రెస్ తెలిస్తే, తనాట్ట మామలకు తెలుస్తుందేమో అన్న భయంతో రాయన్ అడ్రెస్ వ్రాయలేదు.
"తెలిసిందా నీ తప్పేమిటో? ఎక్కడికని వ్రాయనురా? నేను, చచ్చినా, నీకు కబురు ఎట్లా అందుతుందిరా? కన్నతండ్రి కళ్ళలో కారం గొట్టి పోయిన వాడివి, పెళ్ళాన్ని మోసగించడం ఓ లెక్కా?" అన్నారు కోపంగా వెంకటరామ శాస్త్రి గారు.
"ఇంక ఊరుకో, నాన్నా! గడిచినదాన్ని అనుకొంటే లాభమేమిటి? ఇదివరలో తప్పు చేశానని ఒప్పుకొంటున్నాగా! ఆ తప్పును దిద్దు కొంటాను. స్వర్ణ నాకు అవకాశ మివ్వాలి,పద్మ ను పెండ్లి చేసుకోవడం లో కూడా తొందరే పడ్డాను. దాన్నీ చక్కదిద్దు కోవాలి మరి!" అన్నాడు రాయన్ స్వర్ణా, పద్మ వైపు చూస్తూ.
ఇంతసేపటికి స్వర్ణ మాట్లాడింది. కంఠస్వరం నిశ్చలంగా ఉంది.
"ఎట్లా చక్కదిద్దుకొంటారు?"
ఈ మాత్రం మాటకే ఉబ్బిపోయాడు రాయన్. ఎంతో సంతోషంతో -- "స్వర్ణా! న్యాయంగా నువ్వు నా భార్యవు. అగ్నిసాక్షి గా భార్య వయ్యావు. కనకనే నీ పట్ల ఇంతగా ఆకర్షితుడనయ్యాను! నీ అంగీకారం లేకుండా పద్మను మళ్ళీ పెళ్ళీ చేసుకొన్నాను. చుట్టప్రకరంగా ఈ పెళ్ళి చెల్లదు. కనక మనిద్దరి మధ్యా పద్మకు స్థానమే లేదు. ఈ సంగతి బయటికి పొక్కడం ఎవరికీ మంచిది కాదు కాబట్టి ముగ్గురం కలిసి ఉందాము. నేను మళ్ళీ అమెరికాకు పోను. ఇదీ నా ఊహకు తోచిన పరిష్కారం. మరి మీరేమంటారు?" అని ఇద్దరి వైపూ చూశాడు.
"చాలా బాగుందమ్మా! అల్లాగే చెయ్యండి. నేనూ సంతోషిస్తాను !" అన్నారు వెంకటరామశాస్త్రి గారు.
స్వర్ణ ముఖంలో అసహ్యం కొట్టవచ్చినట్లు కనిపించింది.
రోషం ఆపుకోలేక పద్మ వెక్కి వెక్కి ఏడ్చింది. దిగులుతో, ఏడుపుతో ఈ కొద్ది రోజులలోనే ఎంతో చిక్కినట్లు కనిపించుతున్నది. ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి.
ఏ దిగులూ అంటని మోహన కృష్ణ పువ్వులాగా నవ్వులు విరజిమ్ముతున్నాడు.
"నేను చట్టబద్దమైన భార్యను కానా? అంటే మీ ఉంపుడు గత్తేనా? మీ ఇద్దరి మధ్యా నాకు స్థానం లేకపోయినా, దయతో ఇస్తారా? నన్నింత అవమానించటానికి మీకు నేను చేసిన ద్రోహం ఏమిటి? ఒక ఆడపిల్ల బ్రతికుతో ఎందుకు చెలగాట మాడారు? మీ దయ నాకు అక్కరలేదు! నా బతుకు నేను బతకగలను! నా కాళ్ళ మీద నిలబడ గల స్తోమతు నాకుంది. మీ మధ్య స్థానం నాకు ఇస్తానన్నా అక్కర్లేదు! ఇట్లాంటి మాటలని నన్ను అవమానించకండి!" కన్నీళ్లు దిగమింగుతూ రోషంగా అన్నది పద్మ.
స్వర్ణ నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. "చూశావా పద్మా! 'సమస్య ఎట్లా పరిష్కరించాలి?' అని ఒక్కటే దిగులు పడుతూ ఉంటివి! నిమిషం లో నువ్వే పరిష్కరించు కొన్నావు! ఏం చేసినా , ఏం జరిగినా 'మీ పాదాల దగ్గిర ఇంత చోటు నాకివ్వండి! అని సినిమాటిక్ గా అడగటానికి నువ్వు చదువూ, సంస్కారం లేనిదానివి కాదు. ఆడది తప్పు చేస్తే మగవాడు క్షమించలేడు వాళ్ళు తప్పులు చేస్తే మనం ఎందుకు క్షమించాలి? నీ నిర్ణయం చాలా మంచిది. గతమంతా ఒక పీడ కలగా భావించి కొత్త జీవితాన్ని గడుపు!" అన్నది స్వర్ణ.
రాయన్ ముఖంలో కోప చిహ్నాలు కనిపించాయి.
"గతం మరిచిపోవడం అంత తేలిక కాదు. పద్మ వివాహిత. పైగా అడుగో , నా రక్తం పంచుకొని పుట్టిన సంతానం! జరిగిన పీడకలను అనుక్షణం గుర్తు చేసే అంశం! ఆవిడ ఒక్కతే అయితే నీ సలహా బాగుండేదేమో కాని, సంతానం కలిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కు ఆవిడ జవాబు దారీ ఉంది. పిల్లవాడు పెరిగి పెద్దయి నప్పుడు తండ్రిని గురించి ఆడగడా? అప్పుడు ఏమని చెబుతుంది? ఇవేమీ ఆలోచించుకోకుండా నిర్ణయానికి రావటం మంచిది కాదు!" అన్నాడు.
పద్మ కోపంగా -- "సంతానం అంటూ నన్ను భయపెట్టడానికి చూడకండి. వీడు పెరిగి తన తండ్రిని గురించి అడిగితె , వాడి తండ్రి ఎంత నీచుడో వాడికి దాపరికం లేకుండా చెబుతాను. నేనెంత అన్యాయానికి గురి అయ్యానో వాడికి అర్ధమయ్యే టట్లు వివరించుతాను. వాడి నరనరాన మీరంటే అసహ్యం, ద్వేషం పుట్టి స్తాను! మీ నీడ సోకితే కూడా వాడు మైల పడతాడన్న భావం వాడిలో కలిగించటానికి నా సాయశక్తులా కృషి చేస్తాను!' అన్నది.
పద్మ తీవ్రంగా అన్న ఆమాటలకు రాయన్, వెంకటరామ శాస్త్రి -- ఇద్దరూ జంకారు.
"తప్పమ్మా! తప్పు! తొందర పడకు!" అన్నారు వెంకటరామ శాస్త్రి.
"పద్మా! కృష్ణ నా కొడుకు. వాడి మీద నీ కెంత అధికార ముందో, నాకూ అంతే ఉంది. ఈసంగతి మరిచిపోకు!" హెచ్చరించినట్లు అన్నాడు రాయన్.
"మీ అధికారాన్ని ఎట్లా నిరూపించుకొంటారో నిరూపించుకొండి! మీకూ, నాకూ ఏ సంబంధమూ లేదు. నాకు సంబంధించినంత వరకూ నా బిడ్డకు తండ్రి లేడు. ఇదే నా పరిష్కార మార్గం. వస్తా. స్వర్ణా! ఇందిర దగ్గరకు వెడుతున్నాను. ఉద్యోగానికి మళ్ళీ అప్లై చేస్తాను. ఏం జరిగినా నా మీద కోపగించుకోకు. ఇది నేను తెలిసిచేసిన తప్పు కాదని నీకే తెలుసు! దైవికంగా జరిగిన ఈ సంఘటన మన స్నేహానికి భంగం కలిగించకూడదు. నీ స్నేహం విలువ నాకు ఎంతో ఎక్కువ. ఈసంగతి గుర్తుంచుకో!" అని మోహన కృష్ణ తో వెళ్ళి పోయింది పద్మ.
"ఎంత తొందర పడుతున్నది! పోనీలే! ఇదీ మంచిదే. ఇక మనిద్దరం కలిసి ఉండడానికి అభ్యంతరం లేదనుకొంటాను. నేను ఎంత అదృష్ట వంతుడిని! ఎంతలో నిన్ను పోగొట్టుకొనే వాడిని, స్వర్ణా! నువ్వు నాకు దైవ దత్తమయిన భార్యవు కాబట్టే, నీ పట్ల ఇంతగా ఆకర్షితుడనయ్యాను!" అన్నాడు రాయన్. కళ్ళలో తన్మయత్వం కనిపించుతున్నది.
స్వర్ణ చిరునవ్వు నవ్వింది.
"ఒక్క సంగతి, రాయన్ గారూ! నన్ను మీరు "స్వర్ణా" అని పిలవవద్దు. మర్యాద కాదు. "మిస్ స్వర్ణా!' అని పిలవండి. నాతొ కలిసి ఉండటానికి మీకు అభ్యంతరం లేకపోవచ్చు. కాని, నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. మీరింక వెళ్ళవచ్చు!" అన్నది దృడంగా.
భయపడ్డాడు రాయన్.
"నువ్వు నా భార్యవు. నిన్ను "మిస్ స్వర్ణా!' అని పిలవడం భావ్యమేనా? ఒకప్పుడు నిన్ను అసహ్యించుకొన్నాను , నిజమే! నా స్థానంలో నిన్ను ఊహించుకొని ఆలోచించు. పెళ్ళి నాటికి నీవు నల్లగా, కటికతో, వెర్రిగా పెట్టిన పూలతో ఎంతో అసహ్యంగా కనిపించావు. చదువు కూడా అట్టే లేదు. పెళ్ళి పీటల మీద నిన్ను చూచినప్పుడు నేను ఎంత నిరుత్సాహం పొందానో నీ కెట్లా తెలుస్తుంది! రూపం లేదు! చదువు లేదు! పేరు కూడా మోటే! నా స్నేహితులతో "నా భార్య పేరు సన్నమ్మ . నల్లగా ఉంటుంది. చదువులేని మొద్దు' అని ఎట్లా చెప్పుకోను! పెండ్లి మానేద్దామా అంటే, మీ నాన్న ఇస్తానన్న కట్నం నన్ను కట్టి పడేసింది. అయినా, అందవికారి బాతుపిల్ల హంసగా మారినట్లు, సన్నమ్మ స్వర్ణగా మారుతుందనీ, అందాల భరిణ అవుతుందనీ , కవయిత్రీ, విద్యావతీ అవుతుందని నేనేం కలలు కన్నానా? ఈ వేళ నిన్ను చూస్తూ ఉంటె, ఒకప్పటి నా ఊహ ప్రేయసి కళ్ళ ముందర సాక్షాత్కరించినట్లవుతున్నది. ప్లీజ్ స్వర్ణా! గతాన్ని మరిచిపోదాము. నన్ను అన్యాయం చెయ్యకు!" అని ప్రాధేయ పడ్డాడు రాయన్.
స్వర్ణ కు పట్టరాని కోపం వచ్చింది.
"మిస్టర్ రాయన్! మీ అంత స్వార్ధ పరుడిని నేను చూడలేదు! మీలో తప్పు చేశానన్న జ్ఞానమే లేదు! పశ్చాత్తాపమే లేదు! నేను హంసగా మారటానికి మీ రెట్లా సహాయం చేశారు? విద్యావతిని, కవయిత్రి ని కావటానికి మీరెంత అవకాశ మిచ్చారు?' 'సన్నమ్మ ' పేరును అసహ్యించుకొన్నారే గాని, 'స్వర్ణ' గా మార్చాలని మీకు తోచిందా? నాలోని మార్పుకి కారణం మా అన్న. మీరు కాదు! మీరే అయి ఉంటె ఆజన్మాంతము మీకు క్రీత దాసిగా ఉండేదాన్ని. ఆరోజున నేను నల్లగా ఉన్నానని, నాతొ కలిసి కాపరం చెయ్యాటానికి ఇష్టం లేక మా కుటుంబాన్ని అవమానం పాలు జేసి పారిపోయారు! ఈవేళ హంసగా మారానని మీతో కలిసి ఉండమని ప్రాధేయ పడుతున్నారు! ఇంత నీచత్వం మీకే సరిపోతుంది! పురాణకాలం నాటి సీతాదేవే రాముడిని క్షమించలేకపోయింది. నేను, చదువుకొని, ఒంటరిగా జీవితాన్ని గడుపుకో గల స్తోమతు సంపాదించుకొన్న నేను మీకు భార్యగా ఉండటానికి ఇష్టపడతానా? మీ నీడ తొక్కటానికి కూడా ఇష్టపడను! చెప్పానుగా నాకూ చదువూ , సంస్కారమూ ఉన్నాయని! మీతో కలిసి ఉండడం అసహ్యమని ఉచితం కాదని చదువూ, మీటి కాపురం చెయ్యడం స్త్రీ జాతికే అవమానమని సంస్కారమూ చెబుతాయి! అనవసరంగా మాటలు ఎందుకు? మీరు వెళ్ళిపొండి. నాకు పని ఉన్నది" అని లేచింది స్వర్ణ.
"తొందరపడకు, తల్లీ! నీ జీవితం బాగుపడబోతున్న సమయంలో చేజేతులా మళ్ళీ చేడగొట్టుకోకు, వీడి కిప్పటికెనా బుద్ది వచ్చింది! వాడి మీద లేకపోయినా, నా మీదన్నా కనికరం తో తొందరపడక చెప్పినట్లు విను తల్లీ!" అన్నారు వెంకటరామ శాస్త్రి గారు, తానె తొందర పడుతూ.
"పెద్దవారన్న గౌరవం తప్పితే, మీ మీద నాకు ఆవగింజంత అభిమానం లేదు! మీకొడుకు చేసిన తప్పులో మీకూ భాగముంది. డబ్బు కోసం మీరూ కక్కుర్తి పడ్డారు! మీ కొడుకు మీ చెప్పు చేతల్లో లేడని తెలిసినప్పుడు, మీరు ఆ విషయాన్ని గురించి నాన్నగారిని హెచ్చరించారా? కాలేజీ లో చదివేటప్పుడు మా అన్నతో స్నేహంగా ఉండమని మీ కొడుకును ఎప్పుడైనా మందలించారా? మీకు నా మీద ఇష్టం కూడా నా డబ్బు వల్లనే ఏర్పడింది! నేను బీదపిల్ల నయి ఉంటె, మీకొడుకు ప్రవర్తన మీకు బాగా నచ్చేదను కొంటాను! ఇన్ని మాటలెందుకు? నా ఊహ ఏమిటో స్పష్టంగా చెప్పాను! ఇంక మాటి మాటికీ నన్ను చికాకు పెట్టకండి! వెళ్ళండి!" అన్నది స్వర్ణ.
"భర్త లేకుండా ఎన్నాళ్ళు ఉంటావు? భర్త కావాలను కొన్నప్పుడు వస్తాడా?" కాస్త వెటకారంగా అడిగాడు రాయన్.
"ఎంత చదువుకొన్నా, ఎన్ని దేశాలకు పోయినా మీ భావాలకు పట్టిన బూజు పోలేదు! అవివాహితలుగా ఎంతమంది జీవితాలు ధైర్యంగా గడపటం లేదు! బాల్యం లోనే విధవలయిన వాళ్ళు ఎట్లా కాలం గడుపుకొన్నారు? మీ లాంటి భర్త నా శత్రువు కు కూడా వద్దు! ఎంతసేపూ ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతున్నాయే కాని, నన్ను గురించి ఆలోచించరే! నాకూ ఒక మనసుంది! నన్ను ఇష్టపడిన వారికి భార్యను కావాలన్న కోరిక నా లోనూ ఉంది! నాకు ఏ ఊహ జ్ఞానమూ లేని వయసులో మిమ్మల్ని ఆరాధించాను! వైవాహిక జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నాను! నా ఊహల్లోనే మిమ్మల్ని మోహశృంఖలాలతో బంధించాను! కాని, నా మోహాల గొలుసును తెంచుకొని మీరు హాయిగా అమెరికా వెళ్ళిపోయారు. ఆ సంగతి మరిచి పోవటానికి నాకెంత కాలం పడుతుందో మీ కెట్లా తెలుసు! మరిచిపోవటానికి వీలు లేకుండా , మానిపోయే పుండును రేపుతూ మీ నాన్నగారు వచ్చేవారు! వచ్చినప్పుడంతా నా గుండెల్లో మంట రగిలేది! నన్ను మెచ్చిన, నా మనసుకు నచ్చిన యువకుడు తనను పెండ్లి చేసుకోమని కోరినప్పుడు నేను పొందిన బాధ మీ కెట్లా తెలుస్తుంది? నా వాంఛలకు మీరూ, సంప్రదాయాలూ వేసిన ఆనకట్ట ఎట్లా పడగోట్టను! మీలాగే అసలు సంగతిని దాచి, అతనిని మోసం చెయ్యనా? లేక నిజం చెప్పి, 'నేను వివాహితను . మీ కభ్యంతరం లేదు కదా!' అని అడగనా? ఒకమారు వివాహిత అయిన స్త్రీ భర్త ఉండగానే ఇంకో భర్తను కట్టుకోగా మీరు ఈ దేశంలో చూచారా? నన్ను గురించి, నా పరిస్థితి గురించి ఆలోచించారా? నా సమస్యను అట్లాగే అపరిష్కృతంగా వదిలి , హాయిగా వెళ్ళిపోయారు! దీని కిక ముగింపు లేదు. నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది. పైకి చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారో! ఇక మీరిద్దరూ వెళ్ళిపొండి! మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకండి!" కన్నీరు అపుకొంటూ చరచరా లోపలికి పోయింది స్వర్ణ.
రాయన్ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"ఏమిటి, నాన్నా, ఈ ఘోరం ఏమిటి? చిక్కినట్లే చిక్కి స్వర్ణ జారిపోయింది. పద్మ ముందరే వెళ్ళి పోయింది! నా సంగతేమిటి మరి?" అన్నాడు రుద్ద కంఠంతో.
"అమెరికా వెళ్ళి మూడోదాన్ని కట్టుకొని, దాన్ని కూడా నటేట్లో ముంచు! అంతకంటే నువ్వు చెయ్యగల ఘనకార్య మేముందిరా? సిగ్గు లేకపోతె సరి! ఆడవాళ్లిద్దరూ కలిసి మంచి బుద్ది చెప్పారు, నీ బోటి వెధవలకు!" ఉత్తరీయం దులిపి మళ్ళీ మెడ మీద వేసుకొని, కొడుకు వైపు చూడనన్నా చూడకుండా సాగిపోయారు వెంకటరామ శాస్త్రి గారు.
(సమాప్తం)
