Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 19

 

    రాయన్ ఉన్నందుకు, స్వర్ణ, పద్మతో చొరవగా కబుర్లు చెప్పలేక పోయింది.
    పద్మ నాలుగు రోజులు ఉండింది.
    ఈ నాలుగు రోజుల్లో రాయన్ ప్రవర్తన స్వర్ణ కు చికాకునూ, పద్మకు నవ్వునూ, ఆశ్చర్యాన్ని కలగ చేసింది. అయితే రాయన్ కు ఎట్లా చెప్పటమో ఇద్దరికీ తెలియటం లేదు.
    స్వర్ణ తలంటి పోసుకొని, పొడుగాటి వెంట్రుకలను అర బెట్టుకొట్టు కొంటూ ఉంటె తదేకంగా చూస్తాడు. "ఎందు కట్లా చూస్తారు!" అని మందలించటం ఎట్లా?
    స్వర్ణ రాగానే సన్నని కూని రాగం మొదలు పెడతాడు. ఇది సభ్యత కాదని తెలియ చెప్పడం ఎట్లా?
    అంతెందుకు? స్వర్ణ ఉన్నచోట పద్మ ఉనికినే మరిచిపోతాడు!
    ఏ పరిచయం లేని వాళ్లై నా సరే రాయన్ ప్రవర్తన చూస్తె, స్వర్ణ అతనిని విపరీతంగా ఆకర్షించిందని అట్టే గ్రహిస్తారు.
    పద్మకు ఆశ్చర్యంగా ఉంది. అమెరికా లో అమ్మాయి లతో ఎంతో నిగ్రహంగా ప్రవర్తించే వాడు. అతని అప్పటి ప్రవర్తన, చూసిన పద్మకు రాయన్ మీద ఎంతో గౌరవం, అభిమానం కలిగేవి.
    మరి ఇదేమిటి? స్వర్ణ ను చూడగానే ఇంతగా చలించి పోతున్నాడు.
    తన భర్తను గురించి స్వర్ణ కు చాలా చులకన అభిప్రాయం కలుగుతుందేమోఅన్న భయం కూడా ఏర్పడింది పద్మకు.
    అతని ప్రవర్తన స్వర్ణ కు ఇబ్బంది కలిగించుతున్నదని పద్మ గ్రహించింది.
    రాయన్ తోటలో ఉంటె, స్వర్ణ ఇంట్లో ఉంటుంది. అతను ఇంట్లో ఉంటె, స్వర్ణ తోటలో ఉంటుంది.
    పద్మ, స్వర్ణా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు రాయన్ వస్తే, స్వర్ణ ముఖంలో చికాకు అలలాగే వచ్చి పోతున్నది.
    వచ్చిన రోజున ఏం మాట్లాడారో అంతే! మిగతా స్నేహితురాండ్రు వచ్చినప్పుడు చక్కగా మాట్లాడే రాయన్ స్వర్ణ సాన్నిధ్యంలో మూగ వాడిలాగా ఊరుకే చూస్తూ ఉంటాడు. తనను తాను మరిచి పోతాడు.
    స్వర్ణ నిస్సందేహంగా పెద్ద అందగత్తె కాదు. కళ్ళు, పొడుగాటి జుట్టూ మాత్రం ఎంతో అందంగా ఉంటాయి. రంగు కూడా చామనచాయ , రంభ ల్లాంటి ఆడవాళ్ళను అమెరికా లో చూఛి చలించని రాయన్ మాములుగా ఉన్న స్వర్ణ లో ఏం ఆకర్షణ చూశాడు?
    మొత్తానికి తానింకా స్వర్ణ దగ్గరే ఉంటె స్వర్ణ కు ఇబ్బంది గానే ఉంటుందని పద్మ గ్రహించింది.
    ఈ ఊహతో అనుకొన్న తేదీకి రెండు రోజులు ముందుగానే ప్రయాణమయింది పద్మ.
    రాయన్ చికాకు పడ్డాడు. ప్రోగ్రాం మధ్యలో మార్చటానికి వీలులేదని పట్టు పట్టాడు. కాని, పద్మ స్నేహితురాలి కంటే మామగారిని చూడడం చాలా ముఖ్యమని, స్వర్ణ మీది ప్రేమ కొద్ది మర్యాదను పక్కకు నెట్టి స్వర్ణ ను చూడటానికి వచ్చామనీ, చూడటం అయింది కాబట్టి మామగారు ఊరు వెళ్ళి పోదామని ఒత్తిడి చేసింది. ఎంతో అయిష్టంతో ఒప్పుకున్నాడు రాయన్.
    వెళ్ళబోయే ముందు రాయన్ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ, హటాత్తుగా -- "మిస్ స్వర్ణా! పద్మ బదులు మీరే అమెరికా వచ్చి ఉంటె ఎంతో బాగుండేది!" అన్నాడు.
    పద్మ నవ్వుతో ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చి, భుజాలేగారేసి, "ఆయామ్ సారీ! ఏమిటో! మనస్సులో ఉన్న ఆలోచనను అనుకోకుండా బయట పెట్టాను! క్షమించాలి!" అన్నాడు నొచ్చుకుంటూ.
    "నేను అప్పుడే చెప్పాగా, స్వర్ణా! నా బదులు నీవే అమెరికా పోయి ఉంటె...."
    పద్మ మాటలు పూర్తీ కాకుండానే -- "ప్లీజ్ , పద్మా! ఇట్లాంటి మాటలు నాకు నచ్చవు. ఈ విధంగా అనుకోవడం మనని మనం కించపరచుకోవడమే!" అన్నది స్వర్ణ. నెమ్మదిగానే అన్న, మాటలలోని కఠినత్వం గోట్టవచ్చినట్లు కనిపించింది.
    భుజాలెగరేసి, అడుగు ముందుకు వేశాడు రాయల్. మోహన కృష్ణతో పద్మ రాయన్ ను అనుసరించింది.  
    పది రోజుల పాటు ఉంటానని మామగారి ఊరికి పోయిన పద్మ రెండు రోజులకే తిరిగి స్వర్ణ దగ్గరికి వచ్చింది. వెంట రాయన్ లేరు.
    పద్మ వాలకం చూసి స్వర్ణ విస్తుబోయింది.
    ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా ఉబ్బి పోయి ఉన్నాయి. ముఖంలో రోషం, బాధ, సిగ్గు, దిగులు , దుఖం -- ఎన్నో భావాలు కనిపించు'తున్నాయి.
    నెమ్మదిగా బుజ్జగించి కారణం అడిగింది స్వర్ణ. జవాబుగా వెక్కివెక్కి ఏడ్చింది పద్మ.
    ఎంతో బుజ్జగించిన మీదట, "రాయన్ నన్ను మోసం చేశాడు, స్వర్ణా! అతనికి ఇంతకూ ముందే పెండ్లి అయిందట. మేము మా మామగారి ఊరు వెళ్ళేసరికి అయన ఊళ్ళో లేరు. జాబు వ్రాశానని రాయన్ అంటారు. అది అందిందో, లేదో తెలియదు. ఏదో ఊరు వెళ్ళారుట. రాయన్ గారికి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆవిడ చెప్పింది -- బోలెడు కట్నమిచ్చి , రాయన్ గారికి పదిహేనేళ్ళ క్రితం వివాహం చేశారుట. అప్పట్లో అయన కాలేజీ లో చదువు తున్నారుట. పెండ్లయిన తరువాత నిష్కారణంగానే మామగారి గడప తోక్కలేదుట . ఆఖరికి పాపం, ఆ పిల్ల ముఖం కూడా చూడలేదట. శోభనం మూహూర్తం పెట్టుకొన్న వేళకు, వాళ్ళిచ్చిన కట్నం డబ్బులతో అమెరికా వెళ్ళి పోయాడుట. పాపం, ఆ అమ్మాయి వాళ్ళది మంచి సంప్రదాయమైన కుటుంబం అట. జరిగిన అవమానానికి వాళ్ళు ఊళ్ళో నుండే కాపరం ఎత్తి వేశారుట.
    ఈ సంగతులు చెప్పిన ఇల్లాలు నన్ను దెప్పుతూ -- "పెళ్ళాం ఉండగానే నువ్వెట్లా చేసుకొన్నావమ్మాయీ!" అని నన్ను పట్టుకొని ముఖం మీదే అడిగింది. నాకే సంగతీ తెలియదని చెప్పినా నమ్మే స్థితిలో లేరు!
    ఇప్పుడు నా గతి ఏమిటి? నాది చట్టబద్దమైన పెండ్లి కాదు! పెళ్ళి సంగతి అట్లా ఉంచు. రాయన్ నన్నెందుకు మోసం చెయ్యాలి? అతనికి నేను చేసిన ద్రోహం ఏమిటి? ఆలోచిస్తే, నాదీ తప్పే! పెళ్ళి చేసుకోకముందే ఇవన్నీ అడిగి ఉండవలసింది! అసలు ఆ ఊహే నాకు రాలేదు. పదేళ్ళ నుండి అమెరికా లో ఒంటరి గానే ఉన్నాడని వినినప్పుడు, అతనికి పెండ్లి కాలేదన్న ఊహ నాకు తెలియకుండానే నాలో ఏర్పడింది. ఆయనా నాతొ చెప్పలేదు!" అని అన్నది.
    "ఆ అమ్మాయి ఇప్పుడెక్కడుందిటా?' మాములుగా నే అన్నా, స్వర్ణ గొంతులో కొద్దిగా వణుకు తెలుస్తుంది. సహజం గానే గంబీరంగా ఉండే ముఖం మరింత గంభీరమయింది.
    అయితే, తన దుఃఖంతో మునిగిన పద్మ ఇవన్నీ గమనించే స్థితిలో లేదు.
    "ఎక్కడుందో వాళ్ళకు సరిగ్గా తెలియదుట. మా మామగారికి తెలుసట కాని, వాళ్ళతో చెప్పలేదుట. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నదని మాత్రం చెప్పారుట. రాయన్ పూర్తీ పేరు నారాయణ శాస్త్రి అట. ఫాషన్ కోసం "నారాయణ' ను 'రాయన్' గా మార్చుకొన్నారన్న మాట! వాళ్ళ ఊళ్ళో అంతా రాయన్ గారిని "శాస్త్రులూ' అని పిలుస్తారు.
    'శాస్త్రులు ముఖాన ఉమ్మేసినా పాపం లేదమ్మాయీ! ఆ పిల్ల ఉసురు వీడికి కొట్టదూ? అభం శుభం తెలియని పిల్లను నట్టేట్లో ముంచి, లేచిపోయిన వెధవ గాడూ వీడు! అంతెందుకు? ముసిలాడిని కన్న తండ్రిని 'చచ్చావా? బ్రతికావా?' అని అడిగిన పాపానికి పోయాడా? పాపం, ముసలి ముప్పున అవస్థ పడుతూ ఉంటె, చూడలేక మేమే సాయం చేస్తూ ఉంటాము. పరమ చండాలుడు కదూ వీడు! వీడి ముఖం చూస్తె పంచ మహాపాతకాలు చుట్టుకోవూ! మా ఆయనకు జడిసి ఊరుకొన్నా గాని, నేనైతేనా వాతలు పెట్టి పంపిద్దును వేడిని!' అని అ ఇల్లాలు అంటుంటే నాకు తల కొట్టేసినట్లయింది. స్వర్ణా! రాయన్ ఇంతటి నీచుడని అనుకోలేదు! అతని గత చరిత్ర నా కెట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేమీ తోచడం లేదు! సలహా ఇవ్వు, స్వర్ణా!' అని ఏడ్చింది పద్మ.

                                  
    స్వర్ణ కళ్ళల్లో నీళ్ళు నిండాయి. మనిషి నిలుచోలేక కుర్చీలో చతికిల పడ్డది. గుండెలో అగ్నిపర్వతం రగిలింది!
    "మగవాడి దగ్గర రహస్యాలు లాగటం ఎంత సేపు!" అని అనుకొన్నాను. నా గర్వానికి తగ్గ ప్రాయశ్చిత్తం జరిగింది!" స్వగతం లాగా అనుకొన్నది పద్మ.
    స్వర్ణ మాటా, పలుకూ లేకుండా అట్లాగే కూర్చుండి పోయింది.
    "చెప్పు, స్వర్ణా! నా భవిష్యత్తు ఏమిటి? నా సమస్య నెట్లా పరిష్కరించాలి?" ఆత్రంగా ఏడుస్తూ అడిగింది పద్మ.
    తన్ను తాను నిగ్రహించుకొని, "తొందరపడకు, పద్మా! ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి గాని, ఇంకొకళ్ళ మీద ఆధారపడితే లాభం ఏమిటి? నీ భవిష్యత్తు ఏమిటో నువ్వే నిర్ణయించుకో!" అన్నది స్వర్ణ నెమ్మదిగా.
    "నేను నిర్ణయించుకోనే స్థితిలో లేను! ఆలోచన లతో నాకు పిచ్చెక్కుతుందేమో అని భయంగా ఉంది! నాలుగు రోజులు నీ ఇంట్లో ఉంటె నీకు అభ్యంతరమా, స్వర్ణా?' అని అడిగింది పద్మ.

                                         
    "అదేమిటి, పద్మా, కొత్తగా మాట్లాడుతున్నావు? నాకెందుకూ అభ్యంతరం? ఇక్కడ ఉంటె మోహనకృష్ణ కోసం మన స్నేహితురాండ్రు వస్తూ ఉంటారు. ఆ సందట్లో నీవు దుఃఖాన్ని కాస్త మరిచి, తాపీగా ఆలోచించుకోవడానికి అవకాశ ముంటుంది. తప్పకుండా ఉండు." అన్నది స్వర్ణ.
    దిగులుగా తల ఊపింది పద్మ.
    "మరొక్క సంగతి. ఈ విషయాన్ని నలుగురి తోనూ చెప్పకు. మనకేదన్నా కష్టం వస్తే నిజంగా విచారించే వారు చాలా కొద్ది మంది ఉంటారు. వీలుగా సంతోషించే వాళ్ళు  చాలామంది ఉంటారు. వాళ్ళని మనం తప్పు పట్టలేము. ఒక మనిషికి ఆపద వస్తే 'ఆ ఆపద మనకు రాలేదులే' అని లోలోపల సంతోషిస్తారు. ఇది మనిషికి సహజ ప్రవృత్తి కాబట్టి, అనవసరంగా అందరి తోటి చెప్పి బాధపడకు. ఇది నీ సమస్య. అందరి సమస్యా కాదు. తొందరపడకు. ఆవేశంగా ఏ విషయాన్ని ఆలోచించకు!" అని స్వర్ణ సలహా ఇచ్చింది.

                                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS