Previous Page Next Page 
రంగులవల పేజి 19

                                   
    సీతాపతి టూరునించి ఆ సాయంత్రమే వస్తున్నాడు. అలాగే వాళ్ళ అన్నయ్యనుకూడా చూసి వస్తానన్నాడు.
    కాని ఇంటికి చేరిన సీతాపతి మొహంలో పరీక్ష పాసైన సంతోషంకన్నా, బాధ ఎక్కువ ఉంది. ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. రాత్రి అన్నం తినేటప్పుడు తనంతతానే ఆ విషయం ప్రస్తావించాడు.
    "అమ్మను పంపించివేసినందుకు అన్నయ్య దెప్పుతున్నాడు తులసీ. అమ్మకూడా అలాగే మాట్లాడింది" కాని కాసేపాగి, మళ్ళీ, "ఏమిటో, నాకు చాలా విసుగ్గా ఉంది, తులసీ. నీ వల్ల నా కన్నీ ఇబ్బందులే. వాళ్ళన్న ఇంట్లో నిజం లేకపోలేదు. నువ్వెవ్వర్నీ ఇంట్లో ఉండనివ్వవు. ఎలాగో తెలియటం లేదు" అన్నాడు సీతాపతి.
    "ఆ మాట ఇదివరకో సారి అన్నారు గద" అంది తులసి.
    తను అలిసిపోయింది. తను ఎలాంటిదైనా ఇప్పుడిక స్వభావాన్ని మార్చుకోలేదు. చాలా కోల్పోయింది. కష్టపడింది. కోరికలు చంపుకుంది. అసౌకర్యాలు లెక్క చెయ్యటం లేదు. ఇంక తను ఏమీ మారలేదు.
    "మరేం చెయ్యను. నే నన్నమాట నిజమా, కాదా?" అన్నాడు సీతాపతి తీవ్రంగా.
    తులసి మాట్లాడకుండా అన్నం కలిపింది.
    "నాకు పిచ్చెక్కుతోంది. అసలు ఈ తప్పంతా నాదేనేమో-నువ్వలా చిన్నా, పెద్దా వ్యత్యాసం, గౌరవం లేకుండా వ్యవహరించటానికి" అన్నాడు సీతాపతి.
    "ఊఁ. తప్పంతా మీదే. నాకూ విసుగొచ్చిందండీ, ఈ సంసారం ఈదలేక. మరే సత్తువా, కోరికా లేక ఇలా పడుంటున్నాను. ఈసారి నాలో ఎప్పుడే అగౌరవప్రవర్తన కనిపించినా తిట్టండి, కొట్టండి. నాకు తోచింది నేనూ చేస్తాను. అక్కడితో కథ ముగుస్తుంది. మీరు మళ్ళీ పెళ్ళికొడుకవ్వండి. మీ అమ్మగారు కొత్తకోడలితో సుఖపడుతుంది."
    "ఏమిటా మాటలు-" అన్నాడు సీతాపతి.
    "మరింకేం గత్యంతరముంది? మీకూ లేదు, నాకూ లేదు వేరు గతి" అంది తులసి.
    ఆ రాత్రి పక్కమీద-
    "నాకు బుర్ర సరిగా పనిచెయ్యటం లేదు, తులసీ" అన్నాడు సీతాపతి పడుకుని. అతడు అక్కడే కూర్చున్న తులసి చేతి గాజులను తిప్పుతూ ఉన్నాడు.
    "నేనేం చెప్పినా నామీద విరుచుకుపడతారు గాని, ఎందుకండీ, అలా ప్రతి చిన్న విషయాన్నీ సీరియస్ గా తీసుకుని బాధపడతారు" అంది తులసి, తన మరో చేతితో సీతాపతి చేతిని నొక్కుతూ.
    నాన్నను చూస్తే భయమేస్తున్నది, తులసీ. అదేమిటి, ఆ మనిషి అలా మత్తుగా పడుకుంటా డెప్పుడూ? అడిగితే బాగానే ఉందంటాడు గాని ఏమిటో నాకు అనుమానంగానే ఉంది" అన్నాడు సీతాపతి.
    తులసి మాట్లాడలేదు. కాని అతడు పై వాక్యం పలుకుతున్నప్పుడు ఆమె సన్నటి వేళ్ళు అతని మణికట్టు మీద మెత్తగా బిగుసుకున్నాయి.
    "డాక్టరు ఆ జబ్బు అలా సాగనిస్తున్నదంటే అదే గొప్ప అంటాడు గదా, మీ రింకా గాభరాపడతారెందుకు?" అంది.
    సీతాపతి ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు.
    "మీరు పరీక్ష పాసయ్యారేమో, ఇప్పుడేం చేస్తారింక?" అంది తులసి.
    "ఏం చేస్తాను, ఉద్యోగం వదిలి పెట్టను" అన్నాడు.
    "అదికాదండీ, మరేదైనా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించకూడదూ?" అంది తులసి.
    "అవన్నీ ఉత్తమాటలు, తులసీ. ఉన్నదేదో మహా భాగ్య మనుకోవాలి ఈ రోజుల్లో" అన్నాడు సీతాపతి.
    "పోనీ, లా చెయ్యండి" అంది.
    "ఊఁ. లా పాసై ప్రాక్టీసు పెట్టనా!" అన్నాడు సీతాపతి, డెస్పరేట్ గా నవ్వుతూ.
    "నా ప్రతి మాటకూ అలా నవ్వుతారేం, నే నంత మూర్ఖంగా అడుగుతున్నానా?" అంది తులసి.
    "ప్రతి మాటకూ ఎక్కడ నవ్వానోయ్, గంట క్రితమే నిన్ను తిట్టాను కదూ" అన్నాడు సీతాపతి.
    భర్తవైఖరి ఆమెకు చిరాకెత్తించింది. కొన్ని తియ్యటి తలపులతో పక్కమీద కూర్చుంది. కాని అవి త్వరలోనే ఆవిరైనాయి.
    సీతాపతి అటు తిరిగి పడుకున్నాడు.
    తులసికి నిద్ర రాలేదు. ఐనా అలాగే ఏవేవో ఆలోచనలతో పక్కమీద ఒరిగింది. చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. ఊళ్ళో తల్లి జ్ఞాపకం వచ్చింది. 'అమ్మను చూడక మూడేళ్ళయింది. ఎప్పుడు వెళ్ళాలి?' అనుకుంది. తన మాట నమ్మని తండ్రి జ్ఞాపకం వచ్చాడు. శశిరేఖ జ్ఞాపకం వచ్చింది. ఆకస్మికంగా మామగారి గదిలోంచి గురక వినిపించింది. అతడెప్పుడూ గురక పెట్టడు. ఆ గురకకూడా విచిత్రంగా ఉంది- ఏదో మూలుగులాగా. తులసికి భయమైంది. భర్త దగ్గిరగా జరిగి అతడిమీద చెయ్యేసి పడుకుంది.
    
                            *    *    *

    తెల్లవారుఝామున మెలకువ వచ్చినప్పుడు, లేవాలంటే ఇంకా భయంగానే ఉంది తులసికి. ఐనా లేవక తప్పలేదు. భర్త గాఢనిద్రలో ఉన్నాడు. అతని చేతులు తనపై నించి నెమ్మదిగా తీసేసింది. మంగళసూత్రం కళ్ళకద్దుకుంది. లేచి లైటు వేసింది. కళ్ళమీద వెలుగు పడేసరికి అతడు కళ్ళు నులుము కున్నాడు.
    "లేచావా?" అన్నాడు నిద్రమబ్బుతో.
    "ఊఁ. మీరుకూడా లేస్తారా?" అంది తులసి.
    అతడు కళ్ళు తెరిచాడు.
    తులసి చీర సరిచేసుకుంటూ నవ్వింది.
    అతడు కూడా చిరునవ్వుతో, "కాసేపు పడుకోరాదూ, ఇంత ప్రొద్దున్నే లేచి ఏం చేస్తావు?" అన్నాడు.
    "ఇప్పుడింత ప్రొద్దున్నే అంటారు. మరి కాసేపైతే, ఇంత ప్రొద్దైందే అనిపిస్తుంది. మీ కెందుకుగాని, పడుకోండి" అంది, అతడిమీద దుప్పటి కప్పుతూ.
    ఆ రోజు తులసి మామగారు ఆలస్యంగా లేచాడు. అప్పటికే తులసీ, సీతాపతీ నాలుగైదు సార్లు లేపాల్సి వచ్చింది.
    "ఏం నాన్నా, ఇవాళింత ఆలస్యంగా లేచావేం?" అన్నాడు సీతాపతి. అతడికి తండ్రిలో పెద్ద మార్పు కనిపించింది.
    "ఏమో, ఒంట్లో బావుండలేదురా" అన్నాడు. అతని గొంతు చాలా బలహీనంగా ఉంది.
    "డాక్టరు దగ్గరికెడదాం. మొహం కడుక్కో, నాన్నా" అన్నాడు సీతాపతి.
    "ఎక్కడికీ వద్దురా. ఏమో, ఒక్కో రోజు ఇలాగే ఉంటుంది. మళ్ళీ రేపటివరకు బాగవుతుందిలే. ఇంతకీ డాక్టరెందుకు? వాడికి ఫీజు, వాడేదో రాసిస్తాడు, మళ్ళీ దానికి డబ్బు-"
    "డబ్బు పోతే పోయిందిలే, నాన్నా, వెడదాం పద. డబ్బుకు చూసుకుంటే ఎలా" అన్నాడు సీతాపతి.
    "వద్దురా. మరోసారి వెడదాంలే."
    రాత్రి గురక సంగతి చెప్పాలనుకుంది తులసి. కాని మానేసింది. తండ్రి వాలకంతో సీతాపతికి తృప్తి కలగలేదు. అతడు ఆఫీసుకు సెలవు పెట్టేశాడా రోజు.
    "నేను కూడా సెలవు పెట్టనా?" అంది తులసి.
    "వద్దులే. నాకు వేరే పనికూడా ఉంది. కాసేపలా వెళ్ళిరావాలి" అన్నాడు సీతాపతి.
    తులసి ఆఫీసుకి వెళ్ళింది.
    అది నెల మొదటి వారం.
    తులసి ఆఫీసులో అడుగు పెట్టేటప్పటికే, మనియార్డర్ కౌంటర్ ముందు పెద్ద క్యూ ఉంది.
    అది చూడగానే తులసికి దిగులు మొదలైంది. తను ఈవేళ ఒక్కత్తీ ఎంత చావాలో - మళ్ళీ అసిస్టెన్సుకూడా ఇవ్వరు. తనెంత వద్దన్నా వినక తనను మనియార్డర్ లో వేశారు. త్వరగా చెయ్యకపోతే పబ్లికు గునుస్తారు. మాటికీ "ఆడవాళ్ళు!" అంటారు. డబ్బులు లెక్కపెట్టేటప్పుడు తన చేతులు వణుకు తాయి. 'ఎక్కడ షార్టు వస్తుందో నని భయం. కానీ తను అనుకున్నంత బలహీనురాలు కాదు. మొదటికన్నా చాలా వేగంగా పని చేస్తూంది ఇప్పుడు. ఇదివరలో వరసగా రాయాలంటే, స్టాంపు చెయ్యాలంటే చేతులు నొప్పిపెట్టేవి. ఇప్పుడవన్నీ అలవాటై పోయాయి. మరీ రద్దీ లేకుండా ఉంటే తను సులభంగా పని చేసెయ్యగలదు.'
    సరిగ్గా పదయ్యింది.
    తను స్టాంప్స్, రిజిస్టరు బుక్స్, కాష్ బాక్స్, కార్బన్స్ వగైరా సామగ్రంతా తీసుకుని కౌంటర్లో కూర్చుంది. మనసులోనే భగవంతుణ్ణి ప్ర్రార్ధించుకుంది. మొదటి రసీదు చించింది.
    క్యూ- రద్దీ- నెమ్మదిగా పెరిగింది. పన్నెండు వరకు జనం చాలా ఎక్కువైనారు. తనకు సహాయంగా, పక్కన మరో చిన్న కౌంటర్ తెరిచారు. తనకు ఒత్తిడి తగ్గినట్టే కనిపించింది.
    ఆ కౌంటర్ తీసేశారు.
    సరిగ్గా రెండున్నర ప్రాంతాల ఎక్కడినించో జనం వచ్చి పడ్డారు.
    అబ్బ! ఎంత జనం, ఎంత డబ్బు!
    వీళ్ళెంత డబ్బు మనియార్డర్ చేస్తారు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS