'ఏవిటో ?' శ్రీనివాస్ నిట్టురుస్తుంటే అతని కంఠం చీరుకుపోతోంది . రాజేశ్వరి కబుర్లతో అతను రెప్పలు వాల్చాడు.
* * * *
వారం రోజులు గడిచి పోయాయి. సుభద్ర చేతికి డిశ్చర్జి కాగితాలు యిచ్చారు. యే వోక్కరూ కనికరం చూపించలేదు. కొంచెం దయగా ఆదరించి యింటికి రమ్మని అడ్రసు యిచ్చిన రాజారావు ఆ రాత్రికి రాత్రే ట్రాన్స్ ఫర్ ఆర్డర్ చేతిలో పడగానే చెప్పేందు కైనా అవకాశం లేకుండా వెళ్ళిపోయాడు విశాఖపట్టణం.
'పద యింటికి అడకూసుకుని ఏం సేత్తావు.' సుభద్ర వినిపించుకోలేదు.
'ఏయ్ నిన్నే అంటున్నది. యినిపిస్తోందా?' తలెత్తి చూసేలోగా అందుకున్నాడు పిల్లని ఫకీరు. గళ్ళ లుంగీ, గళ్ళ బనీను , చెంపల వరకూ జుట్టూ సినిమాలల్లో రౌడిలా సుభద్ర కంటికి కనిపిస్తుంటే గజగజ లాదిపోయింది.
'పిల్లని యిటివ్వు' సుభద్ర అంది.
'యింటికి పద యిస్తాను.'
'నేనెందుకు రావాలి?'
'నిన్ను కొన్నాను కనుకే'
నిలువునా నీరై పోయింది. 'నేను రాను. నువ్వు నాకు తెలీదు. పిల్ల నిచ్చి వెళ్లు. పోలీసులకు చెబుతాను లేకపోతె.'
'వాహ్....యిలాంటి బెదిరింపుల కేం లొంగే ఘటం కాదు. నా పేరు చెప్పి చూడు, పోలీసులు నీకే పాటి సాయం చేత్తారో? ఫకీరు పోలీసుల యెదురు రొమ్ముల్లో నిద్ర పోతుంటాడు.'
సుభద్ర గుండె ఆగిపోలేదు. గజం దూరంలో నలుగురైదుగురు డాక్టర్లు నిలబడి మాట్లాడుకుంటున్నారు. విమానల్లా రెక్కలు చాచుకున్న కార్లకి అనుకుని రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. సుభద్ర పరుగున వెళ్లి అంది. 'నేను దారి తప్పాను. వీడెవడో నన్ను బలవంతంగా తనింటికి రమ్మంటున్నాడు , నన్ను రక్షించండి.' యే ఒక్కరూ వినిపించుకోలేదు.
'డాక్టర్.....నేను...నేను...'
యిటువైపు తిరిగి అన్నాడు అందులో ఒకతను. 'ఎవిటమ్మా ' అని.
'నన్ను వాడు రమ్మంటున్నాడు. నాకు తెలియదు అతడు యెవరో. నా పాపను కూడా బలవంతంగా లాక్కుపోతున్నాడు. మీరు చెప్పండి!' సుభద్ర ఏడుస్తూంటే అన్నాడు అతను మెల్లగా. 'నిన్ను అసలు ఈ హాస్పిటల్లో చేర్పించింది ఎవరమ్మా?'
సుభద్ర మాట్లాడలేదు. ఆవిడ కన్నుల్లో నీళ్ళు జలజలా రాలుతున్నాయి వోకటోకటిగా.
'నిన్ను చేర్పించింది ఎవరూ? అతను మళ్ళీ మళ్ళీ అడిగాడు.
'మా అన్నయ్య.'
అతను ఏడీ'
'ఆనాటి రాత్రే వెళ్ళిపోయాడు.'
'ఎక్కడికి?'
'తెలీదు.'
'మరి నీ భర్త?' డాక్టరు ప్రశ్న పూర్తీ కాలేదు.
'నన్నడగండి నేను సెప్తాను' డాక్టర్ కి సుభద్ర కీ మధ్యన నిలువెత్తు విగ్రహం నిలబడి పోయింది.
'యిది నా పెళ్ళాం డాక్టరు బాబూ. ఆడి ఎవడెంటో యెల్లి పోయింది. దీన్ని కంది. యిప్పుడు యింటి కి రామ్మంటుంటే యిట్ట మొండి కేత్తుండాది'
డాక్టర్ పరీక్షగా చూశాడు సుభద్ర ని. తలదించుకుని కుళ్ళి కుళ్ళి యేడుస్తోంది.
'డాక్టర్ ...' వెక్కిళ్ళ మధ్య అంటుంటే సుభద్ర ని ఆప్యాయంగా చూస్తూ అన్నాడు. 'చూడమ్మా కట్టుకున్న వాడు భర్త కాకుండా పోడు. ఒకసారి తప్పటడుగు వేస్తె భగవంతుడైనా రక్షించడు. నేనేం చేయగలను చెప్పు'
'నేను పరువున్న యింట్లో పుట్టాను డాక్టర్. నా ఖర్మ కాలి నన్ను అతను అన్యాయం చేశాడు.'
ఈసారి చుట్టూ వున్న డాక్టర్లు కొంచెం ముందుకు వెళ్ళారు.
అంతవరకూ మాట్లాడిన అతను దగ్గరలోనే నిలబడ్డాడు. స్వరం తగ్గించి అన్నాడు : 'నా యింట్లో నిన్ను వుంచుకునెందుకు అభ్యంతరం యేవీ లేదు. అందం యౌవనం అన్నీ నీలో రంగరించి పోశాడు. అది పుట్టింటికి వెళ్ళింది. కొన్నాళ్ళు వుందువు గాని.'
'డాక్టర్' సుభద్ర ఆశ్చర్యం లో వుండి పోయింది. భూమి, ఆకాశం యేకం అయిపోయి గుండ్రంగా తిరిగి పోతున్నాయి. ఆవిడ మెదడులో . ఎటువంటి సాలె గూడు ఈ ప్రపంచం. అందిన పురుగుని గప్ చిప్ గా తినేసి దర్జాని వొలక బోస్తూ యేవీ యేరుగానట్లు యందు కుంటుంది? కడుపుకు తిండి లేదని ప్రలోభం లో పడి వచ్చేస్తే చివరికి తనకి మిగిలింది యేవిటి? డాక్టరు యింత చదువు, సంస్కారం, యెంతో ఆదర్శం వున్న యిటువంటి పెద్ద మనుషులు సంఘం లో యెంత ఘనంగా చలామణీ అవుతున్నారు. సంస్కారం లేని యీ యెదుటి మనిషి కీ, డాక్టర్ కీ తేడా యేముంది?
'లక్షణంగా అతనితో వెళ్ళు. అట్టే పిచ్చపిచ్చ వేషాలు వెయ్యక. మొగుణ్ణి వదులుకోవాలనే ఆడదాన్ని క్షమించడానికి వీల్లేదు. రండి డాక్టర్ మనకి టైము అయిపోతోంది.' సారాంశం తెలీని మరో డాక్టర్ సంజాయిషీ యిచ్చి వెడుతుంటే అచేతనంగా నిలబడి పోయింది సుభద్ర.
'నా మాటిను బుల్లె. కొబ్బరి పంట అంతా నీ సేతుల్లో పెడతాను. నిన్ను అడమ్మేసినట్టమ్మేత్తా ననుకోమాకు. నా దగ్గిరే అట్టి పెట్టుకుంటాను. యింటి కాడ అదుంధనుకో. దాంతో నీకేటి పేసీ'
'భగవంతుడా ,' సుభద్ర అనుకుంది అడుగు ముందుకు వేస్తూ.
తెగిన గాలి పటం లా గాలి వాటుకికొట్టుకు పోతూ అందిన చిటారు కొమ్మలో కాస్సేపు దాక్కుంటూ మళ్ళీ పెనుగాలి రాగానే కొద్ది కొద్దిగా చిరిగి పోతూ ప్రయాణం చేస్తోంది సుభద్ర బ్రతుకు. ఆశా, నిరాశా, పాపం, పుణ్యం ..యేవీ లేవు ఆ మనసులో. నిశ్చలంగా కదలికే లేకుండా వుండిపోయింది మొద్దు బారి సుభద్ర హృదయం. ఫకీరు మర్యాదగానే తీసుకు వెళ్ళాడు.
* * * *
'చందమామ రాయే, జాబిల్లి రాయే.' ఫకీరు మోటు కంఠం రాత్రి కాగానే పలుకురాయిలా ఖణేల్ మంటుంది. లావుగా యెత్తుగా బలంగా బుర్ర మీసాల్తో కదులుతుంటే, భూమి కంపిస్తుందేమో అనిపించే ఆకారంతో నల్లగా జోడ్దోడుతూ బుర్ర మీసాల్తో వున్న ఫకీరును చూస్తె చిన్నారి మాధవి దడుసు కోదు. పైపెచ్చు ఆ మీసాల్లోకి బుల్లి బుల్లి వ్రేళ్ళు పోనిచ్చి తమాషాగా ఆదుకుంటుంది. ఆ పిల్ల అంటే కసాయి లాంటి ఫకీరు కి పంచప్రాణాలు. పిల్లల్లేని అతని గుండెల్లో మాధవి గుబగుబ లాడుతూ వొదిగి పోతుంటే 'ఏటే రత్తాలూ, యెట్ట ముడుసుకు పోతుండాదో సూడు' అంటాడు.
సీతా , సావిత్రీ అనసూయ సంగతులు సరిగా తెలియవు. కానీ రత్తాలు మహా యిల్లాలు. 'అన్నెం పున్నెం యెరుగని అయినింటి పిల్లని తీసుకొచ్చి అడ్డమైనోళ్ళు సేతులు మార్చేసి నాశనం చేశారు సచ్చినోళ్ళు. పాపం పున్నెం వూరికే అన్లేదు భాగమంతుడు మేలు సేత్తే ఈ పుండాకోర్లంతా ఆ యిల్లాలు వుసురు గట్టుకుని సావరూ' అనుకుంటుంటుంది. వచ్చిన చాలా రోజుల వరకూ సుభద్ర మంచినీళ్ళు కూడా తాగలేదు ఆ యింట్లో. రత్తాలు బుజ్జగిస్తూ 'చూడండమ్మాయి గోరూ కలికాలం యిది. అందరి మడుసుల్నీ నమ్మేసి మీలాంటోరు యిలాగ వచ్చేయడం యెంత పోరాబటండి. జరిగిందేదో జరిగి పోయింది. మీకు మంచిరోజులు రాకపోవు. మీ ముఖాన వుండండి ఆ కళ . వో గుప్పిడు మెతుకులు తినండి. అనేది. సుభద్రకి ఆ అమాయకురాల్ని పదేపదే చూస్తుంటే సరస్వతి మెదులుతుంది. తనకోసం , తన తిండి కోసం ప్రాకులాడి చివరికి హాయిగా కన్నుమూసింది. తనూ అలా పోయి వుంటే? సుభద్ర కీ మధ్య శరీరం పూర్తిగా దెబ్బతింది. ఫకీరు రాత్రి వచ్చి జబ్బ పట్టుకుని లాగుతుంటే సుభద్ర యేవీ మాట్లాడలేదు. 'తెరగా పెట్టిందుకు నీ అబ్బజాగీరేవీ లేదు.' ఫకీరు మాటలు రింగు మంటున్నాయి. పట్నం వెళ్లినప్పుడల్లా అతను వట్టి చేతుల్తో రాడు. రత్తాలికీ ముతకచీర తనకి ఖరీదైన వాయిల్ చీరలు అవే రకం జాకెట్లూ, మాధవి కి మెరుపు గౌన్లు , రంగురంగుల అట బొమ్మలు యిలా అతనిని నచ్చినవి తెస్తుంటే అంది సుభద్ర . 'మీ భార్యకు తీసుకు రావలసిన బాధ్యత మీమీదవుంది. నాకూ మాధవి కి యేవీ తీసుకు రావద్దు.
'నీకు తేవద్దంటే మానేత్తాను. నీకిక్కడ యిట్టం లేకపోతె చేతులు మారుతావా పో. పాప నాది. నువ్వు సచ్చి 'గీ' పెట్టినా యిచ్చేది లేదు' సుభద్ర లాక్కుంటుంటే ఫకీరు జాలిగా అన్నాడు: 'చూడు బుల్లె నీ పిల్లని నువ్వు పోషించుకో లేవు. అదీ నీలాగే అయిపోతే నీ పాణం వుసూరంటది. నాకు బాగా తెలుసు. నాకు పిల్లలు లేరు. ఎందుకీడదీత్తావు. నీ పిల్లని పువ్వుల్లో పెట్టి పెంచుతాను. నాకు దూరం చేయకు,' సుభద్ర మాతృహృదయం రెపరెప లాడింది యెంతో సేపు. తనలా తన బిడ్డ పతితై . భ్రష్టురాలై, చరిత్ర హీనురాలై పోకూడదు. మాధవరావు లాంటి వాళ్లున్నా ప్రపంచం బాగుపడి పోయేది . ఫకీరు మానవత్వపు వున్న మనిషి. అతనికి తన బిడ్డని యిచ్చేస్తే పరువుగా పెంచుతాడు. తనకి కావలసింది ఏముంటుంది అంతకంటే. సుభద్ర ఆ తరువాత యెప్పుడూ కలిపించు కోలేదు. ఫజీరు పట్నం వెళ్ళాడంటే పాప కోసమే వెడతాడు. రత్తాలు మురిపెంగా 'అమ్మాయి గారూ' అనే అంటుంది. యిప్పుడు మాధవి ఎనిమిదో నేలనే నడుస్తోంది. పట్టాలు, పాంజేవులూ, మార్వాడి కదియాలూ, బంగారు మొలత్రాడు , మెళ్ళో పులిగోరు గొలుసు చెవులకి రింగులు తెల్లగా అందంగా వున్న పాప నవ్వుతుంటే చటుక్కున శ్రీనివాస్ గుర్తుకు వస్తాడు . ఆ శ్రీనివాస్ కి మల్లేనే పాప కుడి బుగ్గ అంగుళం లోతుకు వెళ్లి పోతుంది. నవ్వుతుంటే 'మారాణి' అంటాడు ఫకీరు.
రాత్రి నాటుసారా వేసుకుని సుభద్ర కి దగ్గరగా వచ్చినప్పుడు తప్ప యితర సమయాల్లో ఫకీరు మాధవి పాలిట కల్ప వృక్షం లా కనిపిస్తాడు సుభద్ర కంటికి. అమాయకంగా రత్తాలూ, ఫకీరుల అనురాగ స్రవంతి లో పాప ముద్దు ముద్దుగా ఏడాది తెచ్చుకుంది.
