Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 19


    మగవాడికి రోజూ వండు కోవాలనే పని అన్ని శిక్షల్లో కఠిన శిక్షగా అనిపిస్తుంది నామటు నాకు. నా బాగోగులు చూసినందుకు స్త్రీ చాలా అవసరం అనిపిస్తోంది. యెప్పటి కైనా యీ బంధం నుంచి తప్పించుకోలెం కద. ఆ పిల్ల చాలా పెదయింటి నుంచి వచ్చింది. ముందు నేను పెళ్లి చేసుకుంటే కొంతలో కొంత యిద్దరం సంఘం బాధలోంచి తప్పుకోవచ్చును. మీరు యేమంటారు?'
    తలెత్తి అంది: 'మీరు యేవీ అనుకోకపోతే నన్ను వెల్ఫేర్ సెంటర్ లోనే వుంచేయండి. త్వరగా ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. అన్నయ్య కు లాగానే నన్నూ కొన్నాళ్ళు మీరు దయగా ఆదరించి ఆశ్రయం యిచ్చారు. కృతజ్ఞురాలిని. రేపే యేర్పాట్లు చేయండి!
    'అదేవిటి రాజేశ్వరి అంత తొందరేం. మాటవరసకి చెప్పవలసిన టైము వచ్చిందని అన్నానే గానీ మీరు నాకు బరువు అని నేను అనలేదే. ఫస్టు దాకా ఆగండి.'
    నవ్వింది రాజేశ్వరి! 'ఫస్టేం ఖర్మ ఎన్నాళ్ళైనా వుండేదాన్ని. యిన్నాళ్ళూ యే ఆశా లేకుండా మీరు అట్టే పెట్టుకున్నారంటే మీ ఆవిడ నమ్మదు. అనవసరంగా మీ జీవితాన్ని దేనికి పాడు చేయడం?'
    'అంటే మీ ఉద్దేశ్యం?'
    రాజేశ్వరి లేచి నిలుచుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి కూర్చుంది:
    'మీకూ మాకూ కులం పట్టింపులు వుంటాయి కాదనను. మావాళ్ళు మతం పుచ్చుకున్న క్రైస్తవులు. అలాగని నేను మిమ్మల్ని మా మతం లో చేరమనీ, నా యిష్ట ప్రకారంగా నడవాలనీ నేను అనుకోను. కాలం మారిపోయింది. పూర్వం లా కులం అనీ గోత్రం అనీ యెవరూ అంతగా లెక్క చేయడం లేదు. మరి మీకు యీ విషయాల మీద వున్న అభిప్రాయం ఏవిటో నాకు తెలియదు.'
    'అంటే నాకు యేవీ అర్ధం కావడం లేదు,' శ్రీనివాస్ వింతగా చూస్తున్నాడు. రాజేశ్వరి యిన్నాళ్ళూ యిటువంటి ప్రస్తావనే తీసుకు రాలేదు. 'స్త్రీ వొక్కోసారి మనసులో బడబాగ్నులు దాచుకుని పైకి ఎలా నటిస్తుంది?' అతను అనుకున్నాడు మనసులోనే.
    'నేనింత ధైర్యం చేస్తున్నానని, స్త్రీ జాతికే తలవొంపులు తీసుకు వస్తున్నాననీ అనుకోకండి. మీరు అనుకున్నా ఆ విషయం నాకు తెలియదు. వున్నమాట అడగడం నాకు అలవాటు. నేను స్త్రీని. మీకు స్త్రీ అవసరం యెంత వుంటుందో పురుషుడి అవసరం అతని కన్నా ఎక్కువగా అడుగడుగునా మాకు వుంటుంది. నేను కూడా పెళ్లి చేసుకోవాలను కున్నాను.' శ్రీనివాస్ మొహం లో సంతోషం తాండవం చేసింది. 'ప్రభాకరం కూడా సంతోషించే వాడు' అనుకున్నాడు. 'చాలా మంచి కబురు చెప్పారు రాజేశ్వరి. యివాళ యెంత మంచి రోజు. ఎవరు అతను. నేను వెళ్లి ఇవాళే కనుక్కుంటాను, ఉన్నంతలో నలుగురిని పిలిచి ఘనంగానే చేద్దాం. నాకు అసలు కుల పట్టింపులు లేనే లేవు. చెప్పండి అతని కులం గోత్రం. మాట వరసకే అడుగుతున్నాను, సుమా!'

                                     
    'హూ, యెంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ఒక యింట్లో యిన్నాళ్ళు వుండి అర్ధం చేసుకోలేక పోయారు నన్ను. యీ గది గోడలు దాటి నేను యెక్కడికి వెడుతున్నాను? యెవరిని చూస్తున్నాను. నాకు తెలిసిన మనిషి మీరు యెందుకు కాకూడదు. ఈ ఆలోచన మీకు రానే లేదా? నేను...యింత మనిషిని యింట్లో మీ కళ్ళ యెదుట తిరుగుతుంటే......పై పై సంబంధాలు తిరగేస్తున్నారా? మీకు నేను తగనా? నన్ను చేసుకుంటే ఏం?'
    'రాజే...శ్వరీ' అతను ఆశ్చర్యం తో, సంతోషం తో మాట్లాడలేక పోతున్నాడు. 'మీకు....మీకు యింత మంచి వుద్దేశ్యం వుందా రాజేశ్వరీ. నేను ఆ ప్రస్తావన తీసుకువద్దాం అనుకున్నాను చాలాసార్లు. కానీ భయపడ్డాను. నాకు తోచిన సహాయం నేను చేశానని మిమ్మల్ని నిర్భంధం లో వుంచడం యిష్టం లేకపోయింది. నేను మనిషిని రాజేశ్వరి. కోరికలూ, ఆశలూ రెండు పాళ్ళు ఎక్కువగానే వున్నాయి నాలో. జీవితంలో మరీ అన్యాయంగా బ్రతుకుతున్నాను నేను. బంగారం ముట్టుకో బోతుంటే అది నల్లగా మసి బొగ్గు అయిపోయి మిగులుతోంది నా చేతిలో........
    'మిమ్మల్ని చేసుకోవడం నావంటి వాడికి అదృష్టమే మరి. చాలా థాంక్స్ ..మెనీ.....మెనీ థాంక్స్ . నేను సిద్దమే ,' శ్రీనివాస్ యింక ఆలోచించలేదు. మనసు విప్పి నిస్సంకోచంగా తన యెదుట నిలుచున్న రాజేశ్వరి ని చూస్తుంటే అతని కన్నుల్లో సుభద్ర కదిలింది. అతని అంతరంగం జాలితో నిండిపోయింది. బహుశా ఆవిడ కూడా యిలాగే అడిగిందేమో...?
    యిన్నాళ్ళూ స్తబ్దుగా వున్న అతని రక్తనాళాలు కట్టలు తెంచుకుని విజ్రుంభించాయి. అతని శరీరం లోంచి వెచ్చని రక్తం ప్రవహిస్తూ నెమ్మదిగా అతని భుజం తట్టి లేపుతోంది. రాజేశ్వరి ఎదురుగా అతని వక్ష స్థలానికి దగ్గరగా నిలుచుని అతని భుజం మీద చేయి వేసింది . రెండు చేతుల్తో ఆవిడ నడుం చుట్టూ చేతులు పోనిచ్చి గుండెలకు అదుముకుని నుదుటి మీద చెంపల మీద తనివి తీరా ముద్దు పెట్టుకున్నాడు.
    రాజేశ్వరి తమాయించుకుని అంది! 'నేను మీకు యెంత ఋణపడి వున్నాను? మీరు యెంత మంచివాడు?' రాజేశ్వరిని మాట్లాడ నివ్వలేదు అతను. అపార అనురాగం కొన్నాళ్ళు గా గుండెల్లో మంచుగడ్డ లా పెరుకుపోతే డాన్ని నెమ్మదిగా యీ క్షణం కరిగించేసింది. ప్రవాహం లా తయారైన ఆ ప్రేమలో రాజేశ్వరి కి వూపురి సలపడం లేదు. కళ్ళు మూసుకుని అతనికి లోలోపలే కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

                         *    *    *    *
    నెల తిరక్కుండానే శ్రీనివాస్ కి హైదరాబాదు ట్రాన్స్ ఫర్ అయింది. సామానంతా సర్దేసి ముందుగా చూసుకు వచ్చిన అందమైన చిన్న డాబా యింట్లో మకాం మార్చాడు.
    ఆరు బయట వెన్నెల్లో తెల్లని దుప్పటి పరిచిన మంచం మీద శ్రీనివాస్ జరుగుతున్న ఘడియల్ని నెమరు వేసుకుంటున్నాడు. పైన వెన్నెల్లా అతని జీవితం పండు వెన్నెల పిండార బోసినట్లుగా వుంది. చక్కని చదువు కున్న, ప్రేమించిన భార్య, తనని అనుక్షణం అంటి పెట్టుకున్న సహచారిణి....మనిషికి యింత కన్న యింకేం కావాలి?
    'యావండీ ' రాజేశ్వరీ అతని పక్కనే చోటు చేసుకుని పడుకుని అతని వీపు మీద చేయి వేసి తన వైపుకి తిప్పుకుని నెమ్మదిగా అంది. 'మరి మనం ...'
    'అపెశావెం? మరి మనం....'
    'మనం సంఘంలో పెళ్లి చేసుకోవాలి.'
    శ్రీనివాస్ మొహం లో ఆశ్చర్యంతో నిండిపోయింది. అంటే మనకి పెళ్లి కాలేదనా?'
    'అది వేరు శ్రీనివాస్. మనం సంఘంలో  బ్రతికే వాళ్ళం. తప్పకుండా యీ ముద్ర బహిరంగంగా వేసుకోవాలి. చెప్పండి మీకూ నాకూ యెవరూ లేరు. శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటే ఆ తరువాత..........
    'ఆ తరువాత ' శ్రీనివాస్ కోపంగా రెట్టించాడు.
    'మీరైనా, నేనైనా పేచీ పెట్టుకుంటే కోర్టు రక్షణ యిస్తుంది.'
    'పోనీ అని వూరుకున్నాను. యిదే మరోకల్లైతే'
    'వూ, మరొకళ్లు అయితే '
    'చంపెవాడిని.'
    'అబ్బ ధైర్య వంతులే. తమాషా కి అంటే కోపం దేనికీ?'
    'చూడు రాజేశ్వరీ మనం కొత్తగా యీ వూరు వచ్చాం. కొత్త దంపతుల మాదిరి గానే నువ్వు యిలా అశుభం మాటలు అంటుంటే ఏవీ బావుండదు నాకు.'
    'సారీ....ఐయామ్ వెరీ సారీ . ,మిమ్మల్నిక నొప్పించను.'
    'థాంక్స్ సోమెనీ థాంక్స్' శ్రీనివాస్ ఆ మాటకే వుప్పొంగిపోయాడు.
    రాజేశ్వరి నవ్వుతూనో, తమాషా కో ఏదో విధంగా అంది. నిజం యెంతైనా వుంది అందులో. నలుగురి కోసం పెళ్లి చేసుకోవడం లో తప్పేవీ లేదు. రాజేశ్వరి ని అనవసరంగా అపార్ధం చేసుకున్నాడు. అతను గుండెల్లోకి తీసుకుని అన్నాడు.
    'నేను యింట్లోంచి బయటకి వెళ్ళింది మొదలు రోజు రిసెర్చి చేస్తూనే వున్నాను'
    'దేనికేవిటి?'
    'మనం యే విధంగా పెళ్లి చేసుకుంటే మంచిదో అని'
    'పోనివ్వండి' రాజేశ్వరి కి శ్రీనివాస్ ని నొప్పించడం యిష్టం లేదు.
    'మీకూ నాకూ యిష్టం అయింది. యింకెవరూ అడ్డు పెట్టరు. మనం యిలాగే హాయిగా వుందాం.'
    'అది కాదు , నువ్వు అన్నదాంట్లో నిజం గ్రహించాను. ఆర్య సమాజం లో మనం మతం పుచ్చుకుని చేసుకోవచ్చును. నీకు అభ్యంతరం యేవీ లేదుకద.'
    రాజేశ్వరి అతని క్రాపులోకి వ్రేళ్ళు పోనిచ్చి నెమ్మదిగా అంది : 'నాకు మాత్రం మీద అంత నమ్మకం లేదు. నా మతంలో మీరు జేరాలనే పట్టుదల అంతకంటే లేదు. మీ యిష్టమే నా యిష్టం . అలగే కానివ్వండి.'
    రాజేశ్వరి శ్రీనివాస్ ల మధ్య యేనాడూ పొరపొచ్చాలు లేవు. తమాషా కి కూడా పోట్లాట గానీ, వాదన గానీ పెంచు కోరు. నిమిషాల మీద ఆలోచనల్ని సెకండ్ల లో పెడతారు. ఆర్య సమాజం లో పదిమంది పెద్దల మధ్య ఉన్నంత లో ఘనంగానే చేసుకున్నారు పెళ్లి. గవర్నమెంటు వుద్యోగం , ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కొరత లేని సంపాదన తో జీవితం మల్లె పూల పాన్పు లా వుంది. యిన్నేళ్ళ కి శ్రీనివాస్ సుఖంగా బ్రతుకుతున్నాడు.
    రాజేశ్వరి మంచానికి దగ్గరగా వచ్చింది. తెల్లని గ్లాస్కో చీర అదేరకం జాకెట్టు పొడుగ్గా మిసమిస లాడే తలకట్టుతో కదిలి వస్తుంటే మంచి పరిమళం తో అతని తనువు పులకరించింది.
    'అమ్మ దొంగా యింత అందం యెక్కడ దాచుకున్నావు యిన్నాళ్ళూ. నాకోసం యెంత శ్రమ పడ్డావో నోయ్"
    'యేవీ లేదు. మీరు అద్దంలో చూసుకోండి. ఆ నొక్కుల జుట్టు. ఆ బుగ్గన ఆడపిల్ల మాదిరి సోట్టలూ, ఆ సన్న ముక్కూ, ఛ! భగవంతుడు పక్షపాతి. ఆడదానికి వుండాల్సిన అందం మీకు యిచ్చాడు అనవసరంగా.'
    'సరి సరి. యీ మాటల్తో అమూల్యం అయిన కాలాన్ని వృధా చేస్తావు కాబోలు అదేం కుదరదు.'
    'వూ' రాజేశ్వరి కొంటెగా అతన్ని ఎడిపిస్తుంది . అతను కంఠం విప్పి సన్నగా ఆలాపన చేయడం ప్రాంభించగానే అతని గుండెల్లో కి జారిపోయి మైమరిచి నిద్రపోతుంది. శ్రీనివాస్ అంటుంటాడు : ' నీ దగ్గర దాచాను మొదట్లో, పిన్ని యెక్కడుందో ఏం యిబ్బంది పడుతోందో?' అతని ఆలోచనలు సాగనివ్వదు.
    'నిజమే ఏం చేస్తాం? నాకు నమ్మకం వుంది. యెప్పుడో వో రోజున మీకు కనిపిస్తారు. బహుశా మనలాగే వాళ్ళూ హాయిగా వుంటున్నారేమో.'
    'అలా అయితే నాకు కావలసింది యేముంది రాజేశ్వరి. నా నిరీక్షణ ఫలిస్తుంది. కానీ నాకు నమ్మకం లేదు.'
    'అయితే ఆవిడ ఏమై పోయారంటారు?'
    'ఆ జగదీశ్ మోసం చేసి పారిపోతాడు. అబ్బ పిన్ని నరకం అనుభవిస్తూ అందరి పక్షం లో ఆశ్రయం కోరి వూడిగం చేస్తుంటుందేమో'
    'మీరు ఎన్నాళ్ళు ఆలోచించినా లాభం వుండదు. కాలం కలిసి రావాలి. ఆవిడ మీకు కనిపిస్తారు. తప్పకుండా మనింటికి తీసుకురండి.'
    'ఆవిడకు జగదీశ్ వల్ల పిల్లో పిల్లాడో పుట్టి వుంటాడు రాజేశ్వరీ.
    'పిన్ని మనదై నప్పుడు పిల్ల జగదీశ్ ది కాలేదు. మనతోటే వుంటుంది. అభం శుభం తెలియని పిల్ల మీద మన ప్రయోగం? పిచ్చిక మీద వజ్రాయుధం లా'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS