10
శ్రీనివాస్ యీ మధ్య ట్యూషన్లు ప్రారంభించాడు. బి.యస్.సి. బి.యి.డి పాసయ్యాక, ఎస్సెల్సీ పరీక్షకు కూర్చునే వాళ్ళు పి.యు.సి కి కట్టేవాళ్ళు యిలా వోకరోకరుగా పదిమంది పోగయ్యారు. చాలా మటుకు ఆడపిల్లలే అతని దగ్గర చనువుగా యింటికి వచ్చేవారు.
రాజేశ్వరి ప్రోద్దంతా వాళ్ళ స్నేహంలో, శ్రీనివాస్ ప్రేమతో గడిపేస్తుంది. పెళ్లి అయాక ఆరోజు అడిగింది అతన్ని! 'ఇవాళ సినిమాకు వెడదాం ' అని.
'వొద్దు రాజేశ్వరీ'
'ఏం యిప్పుడు కూడా నలుగురూ నాలుగు మాటలు అంటారా> మీరు తలెత్తుకోలేక యేమో యేమో అయిపోయి.'
'అదేం లేదు.'
'మరి.'
'నెలాఖరు లో సినిమా కు బయలుదేరితే కష్టం కదా అనే మాటకి అన్నాను.'
'అంటే ఫస్టు తారీఖున తీసుకు వెళతారన్నమాట!'
'వూ.'
'యిటువంటికి చాలా ఫస్తులే వెళ్ళాయి. మీరు చూపించిన సినిమాలకి కళ్ళు దెబ్బతిని వొళ్ళు తిరిగి పోతుంది.'
'నన్ను దేప్పకు రాజేశ్వరి'
'హైదరాబాదు కి వచ్చాక ముద్దుగా ఏనాడైనా తీసుకు వెళ్ళారా మీరు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. వరంగల్ లో ఉన్నంత కాలం వీళ్ళూ వాళ్ళూ అంటారన్నారు. నిజమే. వొక్క సినిమాకు వెళ్ళినంత మాత్రంలో వున్న ఎస్టేటు తరిగిపోదు.'
'అన్ని మాటలెందుకు రాజేశ్వరి , నీకు వెళ్ళాలనుంటే తప్పకుండా వెళ్ళు, నేను వోద్దనను. మనం యిద్దరం వెళ్ళాలంటే మగవాళ్ళల్లోకి వెళ్ళాలి. మగవాళ్ళ దాంట్లో కి వెళ్ళాక సెకెండ్ క్లాసు టిక్కెట్టు లో నువ్వు కూర్చోవడం నాకు యిష్టం లేదు. ఫస్టు క్లాసు టిక్కెట్ల కి యిద్దరికీ అయిదు రూపాయలు అవుతాయి. అవికాక బస్సు చార్జీ లు, హైదరాబాదు లో బస్సు అంత సులభంగా దొరుకుతే యింకా అనుకోవలసిన అవసరం లేదు. రిక్షా కి రెండు రూపాయలు రానూ-- పోనూ యింటికి రాగానే వంట ఏం చేస్తావు? హోటల్లో పూర్తీ చేసుకుంటే యిలా అంచ లంచలుగా యెంత డబ్బు ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించు రాజేశ్వరి.'
'అయిందా ఉపోద్ఘాతం. ఒక్క మాటకి గంట సేపు లెక్చరు యిస్తారు.' రాజేశ్వరి అంతవరకూ చెవులకి అడ్డంగా చేతులు పెట్టుకుంది.
'నువ్వు చెవులు మూసుకోనవసరం లేదు. నీకు అంత చూడాలని వుంటే నేను వొద్దనలేదు. నువ్వు వోక్కత్తివే అయితే యింత ఖర్చు కాదు.'
'ఖర్చు, ఖర్చు, ఖర్చు, ఛీ! మల్లెపూల దగ్గర నుంచే కానీలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారు. డబ్బుతో ప్రాణాలు రక్షించుకునే వాళ్ళని మనవెం చేయగలం?'
'రాజేశ్వరి-- శ్రీనివాస్ తెల్లబోయాడు.
'ఏం వున్నమాటే అన్నాను. మొన్న పూలవాడిని తిప్పి పంపలేదా మీరు.'
నిట్టూర్చాడు , 'ఈ హైదరాబాదు లో రోజూ బస్సు చార్జీలకే రూపాయి కావలసి వస్తోంది. అక్కడికీ యెంతో మంది టీచర్లు మధ్యాహ్నం కాఫీ తెప్పించు కుంటారు. తను అది కూడా మానేశాడు. తండ్రి చేసిన అప్పు కానీతో కూడా వడ్డీ లెక్కకట్టి నిలుచున్నా పాటున యిచ్చేయమని రామదాసు మనిషిని పంపాడని రాజేశ్వరి కి చెప్పను కూడా లేదు. రామదాసు కి తనంటే చాలా అభిమానం. అయినా రాజేశ్వరి ని చేసుకున్నందుకు అతను పగబట్టాడు. నిలుచుని వసూలు చేయిస్తున్నాడు. రెండు వందలైనా సరిగా చేతికి అందని తనకు మూడు వేల రూపాయల బాకీ తీర్చడం అనేది అంత తేలిక విషయం కాదు. రామదాసే తనతో స్వయంగా మాట్లాడాడు. రాజేశ్వరి భుజం మీద చేయి వేస్తె విసుగ్గా వెళ్ళిపోయింది.
'నీకో విషయం చెప్పక తప్పదు రాజేశ్వరీ.'
'ఏవిటో అది?' రాజేశ్వరి కోపం వీసం కూడా తగ్గలేదు.
'మీ బాబాయి ఈ వూరు వచ్చాడు.'
రాజేశ్వరి నిర్ఘాంత పోయింది. గొంతులో పటుత్వం తగ్గిపోయినట్లు ఆ భాగం ఏదో దెబ్బలకి హూనం అయిపోయినట్లు, చాలా నెమ్మదిగా గొంతును తగ్గించేసి అంది. 'యెందుకు వచ్చాడు యిక్కడికి?'
'నిన్ను పంపించేయ మన్నాడు?'
'మీరు ఏమన్నారు?'
'అతను చెప్పేది విన్నాను. ఏమంటాను?'
'ఇంకా ఏవన్నాడు?'
'మన పెళ్లి సరిగా జరిగిందో లేదో ఋజువు కావాలిట, లేకపోతె కోర్టుకు యెక్కుతాడట.'
'మీరు చెప్పలేదా?'
'నేను ఒక్కడనే కాదు వెంకటేశ్వర్రావు, చంద్ర మౌళి కూడా చెప్పారు.'
'ఏమని?'
'మనం ఆర్య సమాజ మతం పుచ్చుకున్నట్లు శాస్త్రోక్తంగా జరిగినట్టూ.'
'అందుకు బాబాయి ఏమన్నాడు?'
'పుండాకోర్ గాడిద లంతా పన్నాగం పన్నారు. మీరు నాకే టోపీ వెయ్యాలను కుంటున్నారేమో అదేం వీల్లేదు' అన్నాడు.
'అయితే నన్నేం చేస్తారు?' రాజేశ్వరి కళ్ళు నీళ్ళతో తడిసి పోయాయి.
'పిచ్చి రాకేశ్వారీ!' శ్రీనివాస్ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు! మనల్ని యెవరూ వేరు చేస్తారు? ఒక్క నాటికీ మనల్ని విడదీయడం అనేది అంత సులభం కాదు. నేనూ నువ్వూ వొక్కటి. రామదాసు బాకీ నాకూ తెలుసు. నాన్న బాకీ నేను తీరుస్తానన్నాను. శ్రీధర్ మన పెళ్లి రోజున తీసిన ఫోటోలూ, సర్టిఫికేట్లూ చూపి రామదాసు మరి నోరెత్త లేదు. నెలకి యాభై చొప్పున కడుతున్నాను. అందుకే మనం యిబ్బంది లో యిరుక్కు పోయాం.'
రాజేశ్వరి అతని మొహంలోకి చూస్తూ అంది : 'యేమండీ నేనూ వుద్యోగం చేస్తే మన యిద్దరి సంపాదనా సరిపోతుంది. బాబాయి బాకీ కూడా తీర్చేయ వచ్చును. మాట్లాడరేం.'
'వుద్యోగం! మనం ప్రయత్న చేయడం లేదనా? ఎంత అమాయకంగా అంటున్నావు. నిన్ను ఎన్నిసార్లు యింటర్వ్యూ కి పంపలేదు, నేను ఎన్నిసార్లు నీతో ఆ స్కూళ్ళ కి రాలేదు.' రాజేశ్వరి ఆలోచనలో పడింది. నిజమే తను అనవసరంగా అపోహ పడింది. యెన్నో సార్లు ఎంప్లాయ్ మెంట్ చుట్టూ తిరిగింది. ఎక్కడ చూసినా రికమెండేషన్లూ , లంచాలు యివి తప్ప మరో మార్గం కనిపించడం లేదు. లంచం పెట్టడం గానీ, తీసుకోవడం గానీ సుతరామూ చేయడు శ్రీనివాస్. యింక రికమెండేషన్లు యెక్కడి నుంచి వస్తాయి.

మెరుపు లాంటి ఆలోచన చటుక్కున మెదిలింది. అవును నిరంజనం గారి అఫీసులో టైపు వస్తే చాలు తీసుకుంటాం అన్నారు. తనకి అంత స్పీడు లేదు కాని టైపు చేయడం క్షుణ్ణంగా తెలుసు. రాజేశ్వరి ఆ రాత్రి చేయబోయే వుద్యోగాన్ని గురించి కలలు గంటూ, భర్తకి మర్నాటి వరకూ చెప్పకుండా యెలా సస్పెన్సు లో వుంచాలో ఆలోచిస్తూ జాగారం గానే గడిపింది ఆ రాత్రంతా.
* * * *
గుమ్మం తలపులకి తాళం చూస్తె ఆశ్చర్యం వేసింది శ్రీనివాస్ కి. యిన్నాళ్ళు గా పక్కింటికి కూడా వెళ్ళని రాజేశ్వరి యిప్పుడు యెక్కడికి వెళ్లి వుంటుంది. చంద్రమౌళి యింటికి గాని... అలా వీల్లేదే' శ్రీనివాస్ పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు.
కిలకిలా నవ్వుతూ వెనక నుంచి భుజం మీద చేయి వేసింది రాజేశ్వరి శ్రీనివాస్ నవ్వి లోపలికి దారి తీశాడు.
'ఎక్కడికి వెళ్ళావోయ్'
'ముందు కాఫీ తీసుకోండి.'
'ఏవిటో సస్పెన్సు.'
'సస్పెన్సా, మరీ సస్పెన్సా ....చూడండి నేను చెప్పేవరకూ మీరు అడగ కూడదు.'
'అబ్బ వుండలేనోయ్'
'అయితే మానేయండి.'
'అంటే వుండకుండా పొమ్మనమనా'
'ఛ!'
'మరి?'
'నేను చెబుతానన్నాగా.'
'నేనే చెప్పేస్తాను.'
రాజేశ్వరి ఆశ్చర్యంగా చూసింది.
'పేరంటానికి.'
కొంగు అడ్డు పెట్టుకుని నవ్వుతూ వింటోంది.
'అవునా?'
'ఉహూ.'
'పార్కు కి'
'నా బొంద కి, యివేవీ కావు. మీ మాటల్లో చూడండి. డికాషన్ పొంగు కూడా వచ్చేసింది. కొంచెం వుప్మా కలియ బెట్టె సరికి కాఫీకి పాలు వస్తాయి.
'అంతవరకూ నన్నిలా సస్పెన్సు లో వుండమన్నావా?'
'ఏం చేస్తాం మరి తప్పదు.'
శ్రీనివాస్ కొంచెం దగ్గరగా జరిగి రాజేశ్వరి చెంపల మీద ముద్దులు కురిపిస్తూ 'నా బంగారు కొండని చెప్పు రాజేశ్వరి' అన్నాడు ముద్దుగా. పాలు రావడం కాఫీ కలపడం పూర్తయ్యాయి కానీ రాజేశ్వరి చెప్పలేదు. కాస్సేపు ఆగి అంది. 'మీరు తృప్తిగా ఫలహారం చేశారా.'
'ఏవిటో ఏం తృప్తో సస్పెన్సుతో ప్రాణం చచ్చిపోయింది.'
'ఇంక చెప్పేస్తున్నాను లెండి.'
'వొద్దు రాజేశ్వరీ నా వుత్సాహం చప్పబడి పోయింది.'
'నిరంజనం గారి ఆఫీసులో టైపిస్టు పోస్టు ఖాళీగా వుంటే .......' శ్రీనివాస్ యింకా వినలేదు.. 'ఒద్దు రాజేశ్వరి ఆ సాలె గూడు లో నువ్వు ఉద్యోగం చేయద్దు. నీకు ఉద్యోగం లేకపోయినా నాకు యిష్టమే కానీ ఆ నిరంజనం ఆఫీసులో.......
'అసలు నేను వుద్యోగం చేయడం మీకు యిష్టం వుండదు. ఆ మాట చెప్పకూడదా.'
'నిరంజనం సంగతి తెలిసే యెలా యిష్ట పడ్డావో అర్ధం కావడం లేదు.'
'మనం మంచివాళ్ళం అయితే లోకంతో పనేమిటి? అతను యెంతో మందితో తిరుగుతాడని నన్నూ వాళ్ళల్లో జమ కట్టేయకండి.'
'నువ్వు ఏదో ఆశలో కొట్టుకు పోతున్నావు. నేను ఏం చెప్పినా నీకు అలాగే అనిపిస్తుంది. పోనీ నీ యిష్టం అలాగే కానివ్వు.'
రాజేశ్వరి మాట్లాడలేదు.
రాత్రి భోజనాలయాక ఆరుబయట మంచాలు వేసుకుని శ్రీనివాస్ మాత్రం అటు తిరిగి పడుకున్నాడు. పుచ్చ పువ్వు లాంటి వెన్నెల ప్రకృతి లో పిండార బోస్తోంది. మూసీ నదికి కొద్దిగా వరదలు తగిలాయి. సన్నటి గాలి ఈ చెవి లోంచి ఆ చెవుల్లోకి దూసుకు పోతోంది. కొబ్బరి చెట్ల ఆకులూ గలగల లాడుతున్నాయి. అతని మనసు పూర్తిగా అశాంతి ని చుట్టేసింది. 'సుఖంగా వున్నాను అనుకునే టైము లోనే తామదాసు అర్ధాంతరంగా ఊడి పడటం, ఏవిటో అప్పుల్లో చిక్కుకోవడం యివన్నీటి ని దాటేయగలను అనుకుంటుంటే రాజేశ్వరి యేమిటో యిలా చేస్తోంది.'
తమలపాకులు పళ్ళెం లో వుంచుకుని నెమ్మదిగా అతని పక్కకి వచ్చే కూర్చుని వీపు మీద చేయి వేసి అంది 'మీకు కోపం వచ్చిందను కుంటాను.'
'............'
'నిజంగానే కోపం వచ్చింది. అయితే మీకూ కోపం వస్తుందన్న మాట' రాజేశ్వరి నెమ్మదిగా అతన్ని చూట్టేసి చీకటి వైపు వున్న శ్రీనివాస్ మొహాన్ని రెండు చేతులతో తన వైపు తిప్పుకుంటూ అతని పెదాల మీద ముద్దు పెట్టుకుని 'నేను కొంచెం వుద్రేకంగా ఏదో అని వుంటాను. నాకు నచ్చకపోతే ఆరోజే మానేస్తాను. మీరు మాట్లాడకుండా కూర్చుంటే నాకు యెంత బెంగగా వున్నదని' అంది.
