Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 19


    "తాళం ఎక్కడుందో చూడండి బావ లేరు కదా"
    "సారీ, నేనివాళ అన్నీ మర్చిపోతున్నాను." అంటూ తాళం వేశారు. ఇద్దరం బయల్దేరాం. ఒక పెద్ద హోటల్ కు తీసుకు వెళ్ళారు. ఎయిర్ కండిషన్ హాల్లోకి వెళ్లాం. భోజనం టికెట్లు తీసుకున్నారు. దాదాపు పాతిక మంది పైగా భోజనం చేస్తున్నారు.
    వారి పక్కన నేను కూర్చున్నాను. అటు పక్క సీటు కాళీ అయింది. టేబుల్ క్లీన్ చేశాక ఇంకెవరో వచ్చి కూర్చున్నారు. అతను వారి స్నేహితుడేమో ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకున్న తరువాత అతనన్నాడు.
    "హు ఈజ్ దట్ న్యూ బర్డ్" అని నా వైపు చూసి పళ్ళికిలించాడు.
    అతని దృష్టి లో నేనొక కొత్త పిట్టని. విస్తట్లో చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుని ఎడం చేత్తో కణతలు నొక్కుకుంటూ కూర్చున్నాను. కళ్ళు తిరిగి పోతున్నాయ్యి.
    "షి ఈజ్ మై వైఫ్ ప్లీజ్" నెమ్మదిగా అన్నారు.
    "దెన్ సారీ బ్రదర్."
    గ్లాసుడు మంచి నీళ్ళు తాగి వాష్ బేసిన్ లో చెయ్యి కడిగేసు కున్నాను. ఇవతలకు వచ్చి కుర్చీ లో కూర్చున్నాను. అతనన్న మాటలకు అతని మీద నాకేమాత్రం కోపం రాలేదు. వారి మీద జాలి కలిగింది. వారు పూర్తిగా పరస్త్రీ లోలురై పోయారన్న మాట. వారి పక్కన బార్య ఉన్నా, చెల్లెలు ఉన్నా మరొక బంధువు ఉన్నా ఇతరుల దృష్టి లో ఆ వ్యక్తీ వారి తాలూకు ఉంపుడు కత్తే. అంటే తాళి కట్టిన భార్య కూడా వారి పక్కన ఉంటె వారు తీసుకొచ్చిన విలాస వతి అయిపోతుంది. ఈ సంఘటనతో నా మనస్సు పూర్తిగా దెబ్బతిన్నది. అందకారంతో నిండిపోయింది. వారిక బాగుపడరు. నా జీవితం లో వెలుగు ప్రసరించదు.
    వారు భోజనం చేసి వచ్చి "అదేమిటి సుభా. అన్నం తినకుండా వచ్చేశావెం" అన్నారు.
    'ఆకల్లేదు . ఇక పదండి పోదాం."
    రిక్షా లో ఇంటి కొచ్చాం. బావ రాలేదు. నేను వచ్చానని ఏ స్నేహితుడింటి కయినా వెళ్ళాడో, లేక తను వెళ్ళే చోటికి వెళ్లి పోయాడో తెలీదు. తాళం తీసి ఇంట్లోకి వెళ్ళగానే నాకు కళ్ళు తిరిగాయి. మంచం మీద పడుకున్నాను. కడుపు లో కాదు మనస్సులో వికార పెడుతున్నది.
    మంచం మీద నా పక్కన కూర్చున్నారు.
    "సోడా తాగుతావా సుభా."
    "వద్దండీ. కాస్త వళ్ళు తూలింది అంతే,"
    "కళ్ళు మూసుకుని పడుకో" సిల్కు లాల్చీ, పైజమా విప్పి లుంగీ కట్టుకుని ఈజీ చైర్లో పడుకుని సిగరెట్ వెలిగించారు.
    "ఇట్లా మంచం మీద కూర్చోండి." కుర్చీ లో నుంచి లేచి మంచంమీద కూర్చున్నారు.
    "మీ పక్కన భార్య ఉన్నా మీ స్నేహితుల దృష్టి లో నేను లేచి వచ్చిన దాన్నే కదూ" కళ్ళలో నీళ్ళు తొణికిసలాడాయి.
    "తెలీని వాళ్ళు అట్లాగే అనుకుంటారు. బాధపడకు, వ్యక్తిగతంగా నా గౌరవం ఎంత దిగ జారిపోయిందో కళ్ళారా చూశావుగా సుభా! మంచి చెడ్డలు విచక్షణా జ్ఞానమూ నాకు లేకపోలేదు. నేను వ్యభిచారిని, త్రాగుబోతు ని, లంచ గోండి ని నేను చేసేది ప్రతిదీ తప్పని నాకు తెల్సు. కాని ఏదీ మానుకోలేక పోతున్నాను. అది నా మనో దౌర్భల్యమో, జాతక ప్రభావమో నిర్లక్ష్య స్వభావమో ఏదైనా కానీ ఏదీ నేను మానుకోలేను." అన్నారు.
    "భార్యా బిడ్డల్ని మర్చిపోయారా" పరుష వాక్యాలు అనదల్చు కోలేదు.
    "లేదు. ఉన్నారని నాకు తెల్సు."
    "మాకోసం కాకపోయినా మీ ఆరోగ్యం  కోసమైనా ఈ వ్యసనాలను మానుకోలేరు."
    "నాలాంటి వాళ్ళు లేకపోతె ఈ డాక్తర్లెందుకు సుభా."
    "ఏమిటి వైద్యం చేయించు కుంటున్నారా , ఆరోగ్యం బాగుండ లేదా" మంచం మీద లేచి కూర్చున్నాను.
    "వ్యసనాలున్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం విషయం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటారు."
    "ఈ రకంగా మీరు ప్రవర్తించినా మనస్సునీ, హృదయాన్నే కాదు నా జీవితాన్ని పొడిచి పొడిచి చంపుతున్నారు. ఈ రంపపు కోత నేను భరించలేను. మిమ్మల్ని కొట్టిన ఈ చేతులు చూడండి. నేనే వాతలు పెట్టుకున్నాను. పుండు మానినా మచ్చ పోలేదు" నన్ను క్షమించండి ప్రభూ క్షమించండి" అని భోరున ఏడుస్తూ వారి కాళ్ళ మీద పడ్డాను. మంచం కోటి కేసి తల బాడుకున్నాను. బ్రతి మాలుకున్నాను. ఇంత చేసినా వారు మాట్లాడలేదు. ఆ హృదయం కరుడు గట్టి పోయింది. ఈ శోక సంతప్త హృదయానికి ఒక్క శాంతి వచనం కూడా లేదు.
    "ఏడవకు సుభా, లే, నీ ఏడుపుకు ప్రయోజనం లేదు. నా మనస్సుకు మార్పు రాదు. పుర్రెకు పుట్టిన ఈ బుద్ది పుడకలతో కాని పోదు. రేపే వెళ్ళిపో!"
    "స్వామీ నాకెందుకీ శిక్ష" అని ఆ రాత్రి తెల్లవార్లూ వార్ని ప్రాధేయపడి బ్రతిమాలుతూ ఏడుస్తూనే వున్నాను. నా ఏడుపు కాని, కుమిలింపు గాని, అర్దింఛి అడిగే మాటలు గాని వారి మనస్సుకు పట్టనే లేదు.
    మర్నాడు ఉదయమే పుట్టెడు దుఃఖాన్ని మూట గట్టుకుని రాజమండ్రి వచ్చేశాను.
    అమ్మా, అత్తయ్యా ఆదుర్దాగా అడిగారు. ఎంత ఆదుర్దాగా ఎన్ని కోరికలతో వెళ్ళానో అంతకు పది రెట్లుగా అన్ని కోరికల్నీ చంపుకుని తిరిగి వచ్చాను.
    రాధ కొన్ని ప్రశ్నలు వేసింది. సమాధానాలు చెప్పాను.
    "అన్నదమ్ములిద్దరూ ఒక తాటి మీదనే నడుస్తున్నారా?"
    "ఆ. ఇద్దరికీ భార్యల వసరం లేదు ఒకర్ని మించిన వారు మరొకరు."
    "నువ్వు కూడా కాకినాడ బదిలీ చేయించు కుంటానని చెప్పావా."
    "చెప్పాను. అప్పుడు వారు అమలాపురం వెళ్ళిపోతా నన్నారు. అసలు భార్యతో కాపురం చెయ్యటమే వారికి ఇష్టం లేదు. నేనున్నా ఊళ్ళో వారు ఉండరుట."
    "ఈ ఖర్చులకు డబ్బు."
    "జీతమంతా ఖర్చు చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారని ఆనందరావు చెప్పాడు."
    "దీనికి ఒక్కటే మార్గం. నీ కాపురం బాగుపడాలంటే ముందు మీఅక్కయ్య కాపురం బాగుపడాలి. అది జరగాలంటే సునంద కు మనం బాగా చదువు చెప్పి మనిషిగా తయారు చెయ్యాలి. ఒకటి రెండేళ్ళు ఈ బాధలన్నీ పడాల్సిందే."
    మనస్సు రాయి చేసుకుని రోజులు గడుపుతున్నాను. ఒకరోజు ఉదయం జైలు నుంచి విడుదలై అన్నయ్య వచ్చాడు. చాలా భయంకరంగా ఉన్నాడు. సంస్కారం లేని జుట్టు, బాగా పెరిగిన గెడ్డం . కళ్ళు పీక్కుపోయి ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. క్రౌర్యంగా చూసే చూపు. పిల్లలిద్దరూ చూసి భయం వేసి, నన్ను కౌగలించుకుని కళ్ళు మూసుకున్నారు. రాగానే అమ్మను పలకరించి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అయిదు నిమిషాలు ఎవరం మాట్లాడలేక పోయాం. వాణ్ణి చూస్తుంటే వాడి పరిస్థితికి జాలీ, సానుభూతి కలిగినా వాడి మనస్తత్వానికి , గడిపే జీవితానికీ అమ్మ కుమిలికుమిలి ఏడ్చింది. అక్కయ్య మ్రాన్పడి చూస్తూ కూర్చుంది. వాడిని ఎట్లా పలకరించాలో అత్తయ్యకు అర్ధం కాక అవతలకు వెళ్ళిపోయింది.
    ఒక పక్కన కుర్చీలో కూర్చున్నాడు . పిల్లలిద్దరూ నా వళ్ళో కూర్చున్నారు. మావయ్యగా వాడిని పరిచయం చేసి చెపుదామని మనస్సులో ఉన్నా మాటలు పెగిలి రాలేదు.
    ఇన్నాళ్ళూ జరిగిన సంగతులన్నీ అమ్మ అన్నయ్యతో చెప్పింది. అమ్మ చెప్పిందంతా విన్నాడు.
    "ఈ పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు వస్తావో నని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మా ఇద్దర్నీ ఇక నుంచి పోషించవలసిన బాధ్యత నీది. మా నుంచి సుభా కూడా ఎన్నో బాధలు పడుతున్నది. మనం విడిగా ఉందాం రా వాణీ నాదం." ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పింది అమ్మ.
    అవనత వదనుడై కూర్చున్న అన్నయ్య ఎర్రగా ఉన్న ఆ కళ్ళు తుడుచుకుని ఒక్క నిట్టుర్పు విడిచి అన్నాడు.
    "అమ్మా, నే చెప్పేది బాగా విను. నాకా చదువు లేదు. సంఘంలో మంచి పేరు లేదు. నేను మోసగాడిని. జూదరిని. చెప్పారాని వ్యసనాలున్న వాడిని. నన్ను చూసిన వాళ్ళు కోపంతో , క్రోధంతో అసహ్యించుకుని తిడుతూ వెళ్లి పోతారేగాని నాతొ అయిదు నిమిషాలు మాట్లాడ్డానికి ఎవరూ సాహసించరు. గౌరవ మర్యాదలు కలవారెవరూ నాతొ మాట్లాడరు. నా జీవితమూ ప్రపంచమూ నా సంపాదన వేరు. ఒక సామాన్యుని కన్న ఎక్కువే సంపాదిస్తాను. కాని నా మీద ఎంతో నిఘా, ఎప్పుడు మళ్ళీ జైలు కు వెళతానో నాకే తెలీదు. ఇటువంటి వాణ్ణి కన్నతల్లిగా నువ్వు నన్ను కొడుకని చెప్పు కున్నందు వల్ల నీకున్న గౌరవ మర్యాదలు పూర్తిగా పోతాయమ్మా -- పూర్తిగా మంట కలిసి పోతయ్యి. ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలీదు. ఇంటికి వస్తానో రానో , రాగాలనో లేదో కూడా తెలీదు. గౌరవంగా బ్రతుకుతున్న మీరు నా పోషణ లో ఉంటె మీకు దినదిన గండంగానే ఉంటుంది. అంతే కాదమ్మా అక్కయ్య నా ఆదరణ లో ఉంటం మంచిది కాదమ్మా. ఇంతకన్నా ఎక్కువ చెప్పగలిగినా చెప్పకూడదు."
    అమ్మ మనస్సులో గూడు కట్టుకున్న ఆశలు చెల్లా చెదరై పోయాయి. అక్కయ్య అవతలకు వెళ్ళిపోయింది. ఇన్ని భావాల్నీ వేలిబుచ్చాక వాడి ముఖం చూస్తుంటే గొంతు పిసికి మెళ్ళో ఉన్నవి లాక్కుని పోతడేమోనన్నంత భయం కలిగింది.
    తీక్షణమైన వాడి చూపుల్లో కోపమూ, క్రోధమూ ఈ సంఘం మీద దెబ్బ తీయాలానే పట్టుదలా, క్రౌర్యమూ ప్రస్పుటంగా చూశాను. వాడు బాగుపడి గౌరవంగా జీవించగలడనే నమ్మకం పూర్తిగా పోయింది.
    "ఇదంతా నీ ప్రోద్భలమేనా సుభా" వాడి చెయ్యి మీసాల మీదికి వెళ్ళింది. గజదొంగలా , రౌడీ లా, హంతకుడి లా నావైపు చూశాడు. నా మీద అంతగా ఎందుకు కక్ష కట్టాడో నాకు తెలీదు. నాన్న బ్రతుకున్న రోజుల్లో ఆనాటి సంఘటన వాడి మనస్సులో శాశ్వతంగా నిల్చి పోయినట్లుంది. నా మీద వాడికింత కార్పణ్యం ఏర్పట్టానికి అదే కారణమేమో.
    "నా ప్రోద్భలం కాదు. అమ్మ కోరిక." పిల్లల వైపు చూస్తూ తల వంచుకుని ఆన్నాను. అన్నయ్యకు నా మీద ఉన్న కోపం ఇంత కక్షగా మారిందని నాకు తెలీదు.
    "సుభా. నువ్వు చదువుకుని గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నావ్. బాగా అర్ధం చేసుకో. నాన్న పోయాక అమ్మనూ, అక్కయ్య నూ పోషించవలసిన బాధ్యత నాది. కాని ఈ సంవత్సర,మంతా వాళ్ళను నువ్వే పోషించి కూతురుగా నీ బాధ్యతా నిలబెట్టుకున్నావ్. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. వాళ్ళను పోషించవలసిన బాధ్యత లేకపోయినా నా పరిస్థితి పూర్తిగా చెప్పాను కనుక వాళ్ళను నా సంరక్షణ లో ఉంచే ప్రసక్తే లేదు. వాళ్ళిద్దరూ యిక్కడే ఉంటారు. వాళ్లకు గౌరవ ప్రదమైన చోటు ఇదే. నా సంపాదన క్రమమైనదో అక్రమ మైనదో , దొంగ సోమ్మో, దొర సోమ్మో నీకు అనవసరం. ప్రతి నెలా వాళ్ళిద్దరి పోషణకు గాను వంద రూపాయలు పంపుతాను. పంపటమే కాదు నేనే వచ్చి ఆ డబ్బిచ్చి వెళ్లి పోతాను. సరే. వస్తాను. నేను చాలాసేపు ఇక్కడ కూర్చోటం నీకూ మంచిది కాదేమో. వెళ్ళొస్తానమ్మా" అని వెళ్ళిపోయాడు.
    నిశ్చేష్టురాలై నోట మాట రాక నిలబడి పోయింది అమ్మ. పిల్లలిద్దరూ నా వళ్ళో నుంచి లేచి కూర్చున్నారు. 'ఆ బూచాడు వెళ్ళాడా అమ్మా" అని భయంతో అడిగాడు పెద్దవాడు.
    నా జీవితం ఇంత దారుణంగా ఉన్నదేమా అని బాధపడుతూ రెండో వాణ్ణి సముదాయిస్తూ కూర్చున్నాను. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS