Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 19


    'ఎక్కడికి వెళ్ళనిది ఎందు కిలా సింగారించుకున్నారనేనా నీ ప్రశ్న.'
    'నేనలా అన్నానా?'
    'లోన అనుకుని వుంటావ్. ఏమిటీ బాభీ రోజుకు రెండు గంటలు సింగారించుకోడానికి వేస్టు చేస్తుందని! ఇలా సింగారించుకోకపోతే మీ అన్నయ్య వూరుకుంటారా?'
    "పో బాబీ-- మా అన్నయ్య మీద నింద యెందుకు వేస్తావ్?'
    'మీ అన్నయ్య వూరుకుంటారా అంటే అయన యిలా వుండమంటారని కాదు. మీ మగవాళ్ళ సంగతి మాకు తెలీదు? మీ కళ్ళు తుమ్మెదల్లాంటివి. నేనిలా శృంగారంగా కనపడకపోతే యీ మహానగరం లో యిలా తిరిగి వస్తారు కదా మీ అన్నయ్య -- తారసపడిన యే అమ్మాయిని మనసులో వుంచు కుంటారో?'
    'ఇద్దరు పిల్లల తండ్రి-- మీరలా అతనిని అనుమానించవచ్చా?'
    'అబ్బే నేను అనుమానించలేదు. కాని నా విధి నేను నిర్వర్తించాలిగా.'
    శృంగారించుకోవటం విధి అనగానే యెందుకో సూర్యనికి నవ్వు వచ్చింది.
    'నీ నవ్వు నాకు అర్ధమైంది లే! మా తల్లి తండ్రి వుండేవాడు. నాకు మాటలతో ఆడించేవాడు. పెళ్ళం పగలు యెంత కష్టపడినా రాత్రి అయ్యేసరికి రంభ లా తయారవ్వాలనే వాడు. తన పెళ్ళాం ముసలి దైనా కుదురుగా లేకపోతె అతనికి కోపం వచ్చేది.'
    సూర్యం యీమె మూగమాటం లేకుండా అన్నందుకు నవ్వుకుంటే ....
    'నివ్వు నవ్వావంటే అందులో యెన్నో ప్రశ్న లుంటాయ్. ఆడవాళ్ళ కున్న దేమిటి చెప్పు? మెదడున్నందంటే నేను యింత చదువు కున్నాను కానీ ఒప్పుకోను. ధైర్యం వుందంటే ఊహూ అదీ లేదు. వాళ్ళ కున్న దల్లా కోమలత్వం . అదే వాళ్ళకి అందాన్ని ప్రసాదించేది. దాన్ని పరి రక్షించుకోడానికే ఆడది మొగాడి పై అధారపడ వలసి వస్తోంది.'
    'మగాడి పై ఆదారపడని ఆడవాళ్ళు లేరా?'
    'అలా అనుకోవటం ఆత్మవంచన. ఒక మహారాణి యైన భర్తను సలహా అడక్కుండా పాలించలేదు. ఈ దేశం లోనే కాదు మీరు పాశ్చాత్యదేశాలు తీసుకున్నా ఆడది మగవాడి మీద ఆధార పడకుండా బ్రతకలేదు. ఆ ఆధారం కోసమే అంత మంది అతివలు అర్ధనగ్నంగా నాట్యం చేస్తారు. సీతకోకల్లా ఆకర్షవంతంగా తయారవుతారు.
    ఇంత చదువు సంస్కారాలతో శిభిల్లి ఆమె గృహిణి గా వుదాత్తంగా నమ్రతతో మెసలటం చూసి సూర్యం యిదివరకు పాతుకుపోయిన నిర్ణయాలను తెంపసాగాడు. ఈమెతో మాటాడుతుంటే ఇలాంటి సంస్కారం గల భార్యే తనకూ వుంటే యెంత బావుండేదనిపించింది.
    తను ఆఫీసుకు ఎలక్ట్రిక్ ట్రైను మీద వెళ్ళాలి. స్టేషను దిగి ఒక అరమైలు నడిచి యిల్లు చేరుకోవాలి. ఒకనాడు స్టేషను నుండి వస్తూ వర్షం లో చిక్కుకున్నాడు. తడవటం వలన ఆ రాత్రి కొద్దిగా రొంప చేసింది. ఆమె మాటిమాటికి నిద్రపోయే వరకూ గది;లోనికి వచ్చేది. వద్దన్నా మాత్ర మింగించింది. ఒకసారి యిద్దరూ కలిసి వచ్చారు.
    'మీ తమ్ముడికి యిక ఒంటరి జీవితం లాభం లేదు.'
    'ఇదే బాగుంది భాభీ!'
    'కొన్నాళ్ళ కి తల పండిపోయే యే ఆడదీ వలచి రాదు.'
    'నన్నెవరు వలుస్తారు భాభీ?'
    'ఊ. అన్నావంటే ఒక బొంబాయి పిల్లని తెచ్చి నీ ముక్కుకు దొండ పండులా తగిలించేస్తాం.'
    'అమ్మో.. బొంబాయి పిల్లే -- నాకొద్దు బాబో?'
    "ఏం?'
    "నేను భరించలేను!"
    "వాళ్ళెం భూతాలా?'
    'దానితోనే సమానం. వాళ్ళ వేషాలు, యెవరు సహించగలరు? వాళ్ళ క్రింద యెవరు ఖర్చు పెట్టగలరు? వాళ్లంతా పాశ్చాత్యదేశంలో ఒక కాలు మనదేశంలో ఒక కాలు పెట్టుకొని నడుస్తారు. నాకొద్దు బాబోయ్.'
    లత ముసిముసి నవ్వుతూ 'మీ అన్నయ్య భరించగలిగింది నివ్వు భరించ లేవా?'
    'భాభీ -- నీది బొంబాయేనా?' అన్నాడు ఆశ్చర్యంగా.
    'ఇక్కడే పుట్టాను-- ఇక్కడే పెరిగాను . ఇక్కడే చదివాను-- ఇక్కడే యీయనను కలిసాను-'
    'క్షమించు భాభీ. నీ అంత మంచిది దొరికితే పెళ్లాడడానికి నాకేం అభ్యంతరం లేదు.'
    అంతా నవ్వేశారు.
    బొంబాయి నగరం అందరూ కలిసి చూసారు. ఇక్కడ సూర్యం కు నచ్చిన వెన్నో విషయాలు వున్నాయ్. ఎత్తైన మేడలు, విశాలమైన రోడ్లు -- ఎప్పుడూ నాడిలా కొట్టుకునే యీ పట్టణం లో కొద్ది నెలల నివాసమే తనకు నాదీ అన్న ఆప్యాయతను అభిమానాన్ని సృష్టించింది. బస్సులూ, ఎలక్ట్రిక్ రైళ్ళు రక్తాన్ని మోసుకుని పోయి శుభ్రపరచి పంచి పెట్టె నాళాల్లా పట్టణ మంతా తిరిగి యీ పట్టణాన్ని నిత్యం నిండుగా సజీవంగా వుంచుతున్నాయ్. పట్నం లో , పచ్చని ఉద్యానవనాలు, ప్రేమ పూలను విరజిమ్ముతూ ప్రణయానికి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయ్. అందాన్ని పుణికి పుచ్చుకుని అపురూపమైన ఆభరణాలు, దుస్తులతో అతివలు కళ్ళ వేడుకతో అన్ని స్థలాల్లోను అగు పిస్తున్నారు. ప్రాణం ప్రతి చోట తొణికిసలాడుతుంది.
    ఈ అందమంతా అందని చందమామలా మనస్సుకు సంతోష పరచినా మరుక్షణం లో అందిన చందమామ ను వదలుకున్నానన్న నిస్పృహ తనను వేధించేది. పూల తోటల పరిమళం, ఆకాశం అందించిన విశాలం, అందం వెదజల్లిన అమృతం, చంద్ర కళల చల్లదనం , యివన్నీ ఒక యవ్వని లో రూపాలు ధరించి తనకు అందు బాటైతే ఎలా విడువగలిగాడు? అభిమానాలతో అర్ధం లేని అడ్డు గోడల మధ్య దాగుండి పోయిన తను యెంత తెలివి తక్కువ వాడు? మళ్లీ చందమామ లాంటి అమోము తన దగ్గరగా రమ్మంటే రాదు. తన అందాన్నంతా ఆవేశంతో అమృతం లా తనపై వోలికించదు. ఆమె గుండె ప్రేమ బాష లాడదు. ప్రణయం మళ్లీ వుప్పొంగదు. ఆమె వలపు యెల్లప్పుడూ ప్రవహించే నదిలా వుండవలసింది. ఎల్లవేళల్లో వెలిగే కిరణం కావలసింది. కానీ తను ఆ నదికి ఆనకట్ట కట్టే ప్రవాహాన్ని అపు చేశాడు. ఆ కిరణం వెలుగు రాకుండా యెత్తిన గోడలు సృష్టించాడు. ఇప్పుడు తలచుకుని ఆ గోడల మధ్యలో నివశించే కంటే యింకేం చెయ్యలేడు. విశాల, విశాల విశ్వం లో ప్రతి చోట కనిపిస్తోంది. ఆ రూపంతో కాదు అనేక రూపాలతో , అనేకామైన భంగిమలతో , ఎన్నెన్నో అనుభూతులను సృష్టిస్తోంది. కానీ తను ఆమెను ముట్టుకోలేడు. నిస్పృహ ఆశను పూర్తిగా కాల్చలేదు.
    తనకు తనపై నున్న జాలి తగ్గించు కోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నానికి దోహదమిచ్చే వాళ్ళలో లత ఒక్కర్తే! ఎల్లవేళలా యందు తనకు సంతోషంగా వుండేటట్లు ఏ మాటల్లోనో చేతల్లోనో చేస్తోంది. శలవ రోజున యింట్లో కూర్చో బెట్టదు. ఎక్కడికో భర్త పిల్లలతో పాటు సూర్యం ని కూడా పిక్ నిక్ కి తీసుకు పోతుంది. ఒకరోజున తన చెల్లెళ్ళు ముగ్గురు వాళ్ళతో కలిసారు. అంతా కలిసి వాళ్ళ తండ్రి కారులో ముందు అరే మిల్కు కోలనీ లో గడిపారు. ఎక్కడా పచ్చదనమే. కొండ మీద నున్న పాల కేంద్రాన్ని చూసారు. ప్రకృతి పచ్చదనం, పూల అందం రెండింటిని జోడించి పూల తోటలుగా అపూర్వమైన సృష్టి చేసారు. పాలు వుత్పత్తి అయ్యే ఆ కేంద్రం లో తేనే కూడా వుత్పత్తి అవుతున్నట్లు అక్కడ విరజిమ్ముతూ పూలపై కదిలే తేనే టీగలే చెప్తున్నాయి. అక్కడ చేరిన వేలాది జవ్వనులు రంగు రంగుల దుస్తులతో పుప్పొడి లాంటి ప్రణయం ఒళ్ళంతా విరజిమ్ముకుని ప్రియులను ఆహ్వానించే విరబూసిన పువ్వుల్లా వున్నారు. ఎన్నో ప్రణయ సౌదాలకు అక్కడ పునాదులు వెయ్యబడుతున్నాయ్. యెంత మందో యువకులు తేనే టీగలై వాళ్లు సృష్టించే వలపు తెనేలను వాళ్లే త్రాగేస్తున్నారు.
    అక్కడ నించి కస్ హెరి గుహలకు వెళ్లారు ఆ బుద్దుని విగ్రహం , ఆ విహారం చూడగానే ప్రేమతో నిండిన మనసు కరుణ కు చోటిచ్చింది. యేవో ధర్మాలు, కలలు, సన్యాసం వగైరా మనసులో తిరిగి నరాల పొంగును తగ్గించాయ్.
    ఆఖరి మజిలీ బోరి విల్లీ లో నేషనల్ పార్కు. క్రొత్తగా సృష్టించిన ఆ పార్కు సింగారం యింకా పూర్తీ కాలేదు. ఒక మూలకు వెళ్ళిపోయారు. చెట్ల క్రింద బస చేసారు. బాభీ పెద్ద చెల్లెలు గీత చాలా సరదా యైన పిల్ల. మగాడి దుస్తులతో తయారై వుంది. తల మీద ఫెల్ట్ టోపీ, గాడీల బుష్ షర్టు , పిక్కలకు పట్టిన వులేన్ ఫెంట్. చెవులో బెంగాలీ రింగులున్నాయ్. కళ్ళు కలువరేకులను జ్ఞప్తికి తెస్తున్నాయ్. ముఖం లో చిలిపి తనం, ముక్కులో కోపం , మూతి పై యెరుపు రంగు ముచ్చటగానే కనిపోస్తున్నాయ్. చెట్టున పండిన బొప్పాసి పండు లా మధురంగా వుంది.
    ఆమె చేసిన అలజడి యింతా అంతా కాదు. టేప్ రికార్డు చేసిన పాటలు, వస్తుంటే పిచ్చిగా డ్యాన్సు చేస్తోంది. ఆ ట్విస్టు డ్యాన్సు లో ఆమె ఒక పాశ్చాత్య కన్యలా సూర్యం కు కనిపించింది. మొదట మౌనంగా ఏవగించుకున్నా అందరితో పాటు తనూ తప్పట్లు కొట్టాడు. ఎంతో హంగామా చేసింది. అందర్నీ యేడిపించేసింది. జుత్తులు పీకేసింది. చివరకు ఆమె పాడుతుంటే ఆ టేప్ రికార్డు చేసిన పాట ఆమెదే నని పోల్చుకున్నాడు. ఆమె పై పళ్ళు పెదాలను పట్టి వుంచి కన్నె పడుచు వలపు పెదాల నుంచి జారి పోకుండా పట్టి వుంచినట్లుంది. సూర్యం ఒకోసారి గాబరా, యింకోసారి ఒకవిధమైన జాలీ, వేరోకసారి ఆమెను మెచ్చుకోకుండా వుండ లేకపోయాడు. మెహతా ను , పిల్లలను పట్టుకుని లత యింకో వేపు కదలింది. చెల్లెళ్ళ అంతా వేరొక వేపు కదిలారు. సూర్యం జేబులో పుస్తకం తీసి ఒక మూల చెట్టుకు చారబడి చదువు కోసాగాడు. కాస్సేపటికి అందులో నిమగ్నుడై పోయాడు. చెవి దగ్గర జోరీగ లా ఏదో శబ్దం -- తరవాత పిల్లి అరుపు . ఇక్కడ పిల్లులు కూడా వున్నాయా అని ఒకసారి తేరి చుట్టూ చూస్తె యెవరూ అగపడలేదు. కొంత సేపయ్యాక మీద బటానీల వర్షం పడుతోంది. తన పుస్తకం మీద రాలిన రెండు బటానీ గింజలను నోట్లో వేసుకుని తలెత్తి చూసాడు. యెర్ర కోతి నల్ల బట్టలు వేసుకుని కూర్చున్నట్లు గీత చెట్టు మీద నుంది. సూర్యం నవ్వు నాపు కోలేక పోయాడు. పళ్ళికిలించి వెక్కిరించింది గీత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS