భోజనాల తర్వాత బండ మీద కావలికి కాస్త ఆలస్యంగా ప్రకాశం బయలుదేరాడు. ప్రకాశం బండ వద్దకు చేరేసరికి కుప్పకు నిప్పంటించడానికి సిద్దమవుతున్న రాముడు కనిపించాడు. ప్రకాశం చెట్ల చాటున అలాగే క్షణం ఆగి రాముడు వామి వద్దకు వెళ్ళేసరికి వెనక వైపుగా వెళ్ళి రెండు చేతులతోనూ ఒడిసి పట్టుకున్నాడు. హటాత్తుగా జరిగిన ఈ సంఘటనకు రిచ్చ పడిపోయిన రాముడు ప్రకాశం కాళ్ళ మీద పడి జరిగిన దంతా చెప్పుకున్నాడు.
"బుద్ది గడ్డి తింది, అయ్ గోరూ! నా పానం ఉంటె యిట్టా పనిమల్లా చెయ్యను. దయచూపించు సామీ. సచ్చి నీ కడుపున పుడతా." కన్నీళ్ళతో వేడుకొన్నాడు.
"సరి , వెళ్ళు రాముడూ! కానీ ఒక విషయం-- మళ్ళీ నిన్ను గురించి చేడుమాట నా చెవిని పడకూడదు."
ప్రకాశానికి దండం పెట్టి రాముడు వెళ్ళిపోయాడు. ప్రకాశం నులకమంచం వాల్చుకుని వెల్లకిలా పడుకున్నాడు. ఆకాశానికీ, భూమికీ మధ్య జలతారు పరదలా వెన్నెల, తారలతో పరుగు పందెం వేస్తున్న చంద్రుడు , చంద్రునికి చిక్కకుండా పరుగెత్తుతున్న తారలు, చంద్రుని తారలను చూచి ఈర్ష్యతో వెంబడిస్తూన్న రోహిణి.దూరంగా మామిడి తోపు కంచే కానుకొని ఆకాశాన్ని ముద్దెట్టుకో జూస్తున్న భార్యా భర్త ల్లాంటి జంట నేరేడు చెట్లు.
ఆ చెట్లను చూడగానే శారద జ్ఞాపకం వచ్చింది ప్రకాశానికి. తామిద్దరూ కూడా ఆదర్శాల అంబరాన్ని అందుకో చూస్తున్న జంట నేరేడు చెట్లే ననిపించింది. పాపం, సుందరమ్మ గారి మనస్సుకు కలిగిన వేదన ఎలా తగ్గటం? ఉమాపతిలో ఇంత హటాత్తుగా ఎలా యింత పెద్ద పరిణామం కలిగింది! ఇలాంటి ప్రశ్నల వల్ల ప్రకాశానికి మెత్తని నులక మంచం నిప్పుల పడకయింది.
* * * *
రెండు రోజుల్లో ఊరి నుంచి ఉత్తరమో లేక ప్రకాశమో రావచ్చు ననుకున్నాడు ఉమాపతి. నాలుగు రోజులు కావస్తున్నా, ఆ సూచనలే కనబడడం లేదు. నాలుగు రోజుల నాడు చిగురించిన ఆశ, జీవించాలన్న కోరిక యీనాడు ఉమాపతికి లేవు. ఉత్తరం అందగానే ఇంట్లో జరిగిన దృశ్యాన్ని ఊహించుకుంటూ పడుకున్నాడు. తనుత్తరాన్ని చూసి నాన్న మండి పడి ఉంటాడు. అమ్మను పిలిచి చెప్పి ఉంటాడు. అమ్మ కూడా తనను అసహ్యించుకొని ఉంటుంది. శారద నిక్కచ్చిగా తన్ను పెళ్ళి చేసుకోనని చెప్పి ఉంటుంది. ఇదంతా తనకు ముందుగానే తెలిసినా ఎందుకు ఉత్తరం వ్రాశాడు తాను? ఏదో శక్తి తన చేత ఆ ఉత్తరం వ్రాయించింది. ఆ రక్తి ఏది? విమల మీదున్న ద్వేషమా? చక్రవర్తీ ,సునందలంటే తన కున్న భయమా? లేక సారధి మీద తన కున్న అసూయా? అవును, సారదంటే తనకు అసూయ! అతడు జీవితంలో కృత్రిమంగా ఆనందాన్ని సృష్టించుకోగలిగాడు. తాను కూడా ప్రయత్నించాడు. కానీ విఫలుడయ్యాడు. అందుకు కారణ మేమిటి? అతడు తన సృష్టించుకున్న అల్పమైన కృత్రిమానందం తోనే తృప్తి పడుతున్నాడు. కానీ తనకు రోజూ రోజుకూ దాహం ఎప్పువయింది.
ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. జారిపోతున్న దుప్పటి సరి చేసుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు ఉమాపతి.
సారధి, డాక్టరు చక్రవర్తి లోపలికి వచ్చారు. ఉమాపతి ఆశ్చర్యపోయాడు. "రండి, ఇలా పరుపు మీద కూర్చోండి." అన్నాడు.
"ఫరవాలేదు. మీరు పడుకోండి" అంటూ కోటు జేబులోంచి స్టేత స్కోపు తీశాడు డాక్టరు.
సారధి కూర్చున్నాడు.
డాక్టరు చక్రవర్తి ఉమాపతి ని పరీక్ష చేశాడు.
'ఇది టైఫాయిడ్. కానీ భయం అనవసరం. మన నర్శింగ్ హోమ్ కు తీసుకెళ్ళదాం" అన్నారు డాక్టరు.
"నర్శింగ్ హోమ్ కా! నేను రాను.క్షమించండి, డాక్టర్" అన్నాడు ఉమాపతి.
"ఫరవాలేదు, ఉమాపతి గారూ! అలా అనకూడదు. మీ కిక్కడ దిక్కెవరు చెప్పండి? నర్సింగ్ హోము లో నైతే సరైన చికిత్స లభిస్తుంది." అన్నాడు సారధి.
ఉమాపతి జవాబు చెప్పలేక పోయాడు.
సారధి సాయంతో డాక్టరు చక్రవర్తి గారు తన నర్సింగ్ హోము కు తెచ్చారు ఉమాపతిని. మళ్ళీ టెంపరేచరు చూసి ఒక ఇంజక్షను యిచ్చి మరో వార్డుకు వెళ్ళారు. సారధి మంచం ప్రక్కనే స్టూలు మీద కూర్చున్నాడు.
"నాకోసం మీరెందు కింత శ్రమ తీసుకొంటున్నారు?" నీరసంగా ప్రశ్నించాడు ఉమాపతి.
"తోటి మానవుడు గనుక."
"అందరు మనవుల మీదా ఇలాంటి అభిమానం చూపగలుగుతున్నారా?"
"లేదు."
"మరి మీరు అన్న రెండు మాటలకూ పొంతన లేదు."
'చూడండి ఉమాపతి గారూ. ఒక మాటకూమరొక మాటకూ , మాటలకూ చేతలకూ సంబంధం కోసం వెదకటం బుద్దిలేని తనం. మనోవాక్కాయ కర్మలా ఎవడూ నడుచుకొలేడు. అలాగే అభిప్రాయాలు మార్చుకోలేకుండా కూడా ఎవడూ జీవించలేడు. జీవితాన్ని చూసే కొద్ది అభిప్రాయాలు మారక తప్పదు."
"ఈ కబుర్లు నాకు ఈలోగా చాలాసార్లు చెప్పారు." నీరసంగా అన్నా వాడిగానే ఉంది ఉమాపతి మాట.
'ఇవి కబుర్లు కావు, ఉమాపతి గారూ! నాజీవితంలో నేను తెలుసుకున్న సత్యాలు. ఆదర్శమంటే ఏమిటో తెలుసా?తీరని కోరిక! కోరిక తీరిందా అది ఆదర్శం కాదన్న మాట! అలా జీవితమంతా ఎండమావుల్ని వెదుకుతూ వృధా ఎందుకు చేసుకోవాలి? నేనిక్కడే ఉంటె మీకు మాట్లాడ బుద్దేస్తుంది. నేను కాస్సేపు బయట ఉంటాను." అంటూ లేచాడు సారధి.
ఉమాపతి కదలకుండా పరుపు మీద పడుకున్నాడు. అతనికి మాటిమాటికి తన నిస్సహాయత జ్ఞాపకం వస్తుంది. తాను దిక్కులేని వాడు. తన క్షేమం కోరేవారు ఒక్కరు కూడా లేరు. అందరూ తన్నిలా ద్వేషించడానికి తాను చేసిన తప్పేమిటి? విమలను నమ్మడమా? తానేమో చాలా అభిమానం తోనే చూశాడు విమలను. ఆ కృతజ్ఞత ఆవిడకే లేకపోయింది. అందుకు తాను బాధ్యుడు కాడు. విమల తన జీవితం నాశనం చేసిన రాక్షసి! తాను శారద జీవితం నాశనం చేయలేదూ? లేదు. మళ్ళీ తానే పెళ్ళి చేసుకుంటా నన్నాడు. శారద తనంటే అసహ్యపడుతుంది. అందరూ తన మీద కుట్ర చేసి తనజీవితాన్నే నాశనం చేస్తున్నారు. సారధి కూడా మేలు చేస్తున్నట్లు గానే నాశనం చేస్తున్నాడు. తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు.
ప్రొద్దువాటారుతుంది. నర్సింగ్ హోము లో అక్కడక్కడ దీపాలు వెలుగుతున్నాయి. నర్సు లకు డ్యూటీ మారే సమయం. పాత ముఖాల స్థానం లో కొత్త ముఖాలు వస్తున్నాయి. బజారుకు వెళ్ళి ఉమాపతి కోసం పళ్ళు కొనుక్కొని వస్తున్న సారధి కి నర్సింగ్ హోమ్ వరండా లో నిల్చున్న విమల కనిపించింది.
"నమస్కారం సారధి గారూ!" మొదట విమలే పలకరించింది. సారధి కి తాను పలకరించాలని కూడా తోచలేదు.
"నమస్కారం" అన్నాడు కాసేపటికి.
విమల, సారధి చేతిలోని పళ్ళు చూసి ప్రశ్నించింది.
"మీ వాళ్ళేవరయినా మా నర్సింగ్ హోము లో ఉన్నారా?"
సారధి జవాబు త్వరగా చెప్పలేకపోయాడు. తల ఊపాడు.
"ఎవరు?"
విమల ప్రశ్నలు సారధి మనస్సును కలచి వేస్తున్నాయి.
"మీరు కాస్త వస్తారా, ఆ తోటలోకి? మీతో ఒక విషయం మాట్లాడాలి."
ఇద్దరూ తోటలోకి వెళ్ళి ఒక వేపచెట్టు మొదట కూర్చున్నారు.
"మీరిక్కడెం చేస్తున్నారు?" మొదట సారధి మాట్లాడాడు.
"నర్సుగా ఉన్నాను. అరె! అలా ఆశ్చర్య పోకండి. నర్సింగు చదవకపోయినా యం.బి.నాలుగేళ్ళు చదివాగా!"
"మీరు నాకో సాయం చేస్తారా?"
"చెప్పండి."
"మీరు నాలుగు రోజులు సెలవు పెట్టాలి.నర్సింగ్ హోము కు దయచేసి రాకూడదు."
విమల ఆశ్చర్యానికి హద్దుల్లేవు.
"ఎందుకండీ?" అంది. కంఠం లో ఆశ్చర్యంతో పాటు భయం కూడా ధ్వనితమైంది.
"దయచేసి ఆవిషయం అడగకండి" అన్నాడు సారధి.
"సారధి గారూ! నన్ను ఎన్ని దుర్గుణాలు వదలినా మొండితనం వదలలేదు. మీరు కారణం చెప్పాలి."
ఒక్క క్షణం సారధి తల వంచుకుని ఆలోచించాడు. "ఉమాపతి నర్సింగ్ హోమ్ లో ఉన్నాడు." అన్నాడు.
విమల త్రుళ్ళిపడింది. కానీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. సారధి తలఎత్తి చూచేసరికి అలి చిప్పల్లాంటి విమల కనురెప్పల చివరల్లో ముత్యాల్లాంటి కన్నీటి బిందువులు నిలిచి ఉన్నాయి. సారధి జవాబు చెప్పమన్నట్లు మెత్తగా దగ్గాడు.
"ఒకసారి చూచి వెడతాను." అంది విమల.
'ఉమాపతికి మీరు కనపడితే అతడు బహుశా బ్రతకడనుకుంటాను. మీరే కాదు, డాక్టరు గారి భార్య సునంద గారు కూడా కనబడకూడదు."
"ఎందుకూ?"
"మీరు చెరొక రకంగా అతని మనసులోని గాయాన్ని కెలుకుతారు."
"........"
"నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పనే లేదు."
"సరే! వెడతాను.
ఇద్దరూ లేచి నిలబడ్డారు.
"డాక్టరు గారు లేరు. సునంద తో చెప్పి వెడతాను.' అంటూ కాంపౌండు లోనే ఉన్న డాక్టరింటి కేసి బయలుదేరింది విమల.
సారధి లోపలికి వెళ్ళాడు.
విమల డాక్టరు గారింటికి వెళ్ళేసరికి టేబులు లైటు కాంతి లో చదువుకుంటూ కూర్చుని ఉంది సునంద. విమలను చూడగానే లేచి సోఫా చూపించింది. ఇద్దరూ ప్రక్క ప్రక్కనే సోఫాలో కూర్చున్నారు.
"ఏమిటి, విమలా, అదోలా ఉన్నావు?' సునంద ప్రశ్నించింది.
"ఉమాపతి నర్సింగ్ హోమ్ లో ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేదట. సారధి గారు చెప్పారు. నన్ను నాలుగు రోజులు సెలవు పెట్టమన్నారు. ఎక్కడైనా వెళ్ళి పొమ్మన్నారు. నేను ఉమాపతి కి కనబడకూడదట." పొడి పొడిగా జవాబు చెప్పింది విమల.
"సరే! వెళ్ళగలవా?"
తల అడ్డంగా తిప్పింది విమల.
"మరి?"
"నా కోసం తన జీవితం నాశనం చేసుకొన్న వ్యక్తీ చావు బతుకుల్లో ఉంటె ఎలా వెళ్ళగలను సునందా?' సునందను కౌగలించుకొని బావురుమంది విమల.
'అలాగైతే నా మాట విను నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. సరిగ్గా పది గంటలకు మళ్ళీ రా. స్థితుల్ని బట్టి ఆలోచన చేద్దాము."
