ఆరోజు చాలా సామాన్యంగా తేల్లవారింది. ఎన్నికల కాలంలో నైతే తెల్లవారే సరికి ఒకవార్త ఉండేది. ఈరోజు అలాంటిదేమీ లేదు. విశ్వనాధయ్య గారు స్నానం చేసి దేవతార్చన చేసి అందరికీ తీర్ధ మిచ్చారు. పూజ పూర్తయ్యేసరికి ప్రకాశం వచ్చాడు. ఇద్దరూ కలిసి ఊళ్ళో కి బయలుదేరారు. సుందరమ్మ వంట పనిలో ఉంది. శారద నడవ లలో కూర్చుని ప్రకాశం యిచ్చిన పుస్తకం చదువు కుంటుంది. రత్నమ్మ నడవ లో కూచుని వత్తులు చేస్తుంది.
పదకొండు గంటలకు పోస్టు మాన్ వచ్చి ఉత్తరం యిచ్చి వెళ్ళాడు. రత్నమ్మ కు ఆ అక్షరాలూ బాగా గుర్తు. ఆ ఉత్తరం ఉమాపతి వ్రాసిందే! ఒక్క క్షణం లో ఆవిడ మనస్సులో అనేక ఆలోచనలు సందడి చేశాయి. ఇంట్లో డబ్బు దొంగిలించి పారిపోయిన ఉమాపతి ఉత్తర మెలా వ్రాశాడు? ఇక మీదట తాను ఈవూరి దారి తొక్కననేగా తన స్నేహితులతో చెప్పి వెళ్ళాడు? డబ్బు కోసం -- వ్రాశాడా? విశ్వనాధయ్య పంపుతాడా? ఉత్తరం లో ఏముందో? నీళ్ళు పూసి చించినట్లు తెలియకుండా ఉండేలా కవరు తెరిచింది రత్నమ్మ.
'తల్లిగారికి,
ఉమాపతి నమస్కారములు.
"జీవితంలో కొన్ని విశ్వాసాలూ, ఆదర్శాలూ ఉండటం కన్నా బుద్ది లేనితనం మరొకటి లేదని యీ లోగా తెలుస్తుంది. అలాంటి వాడికి జీవితం తప్పకుండా ద్రోహం చేస్తుంది. వాడు ఆశించింది జీవితం యివ్వదు.జీవితం యిచ్చినదాన్ని వాడు గ్రహించలేడు. ప్రతివిషయాన్ని తర్కించి నిరూపణ చేయబోవటం కూడా బుద్ది లేని తనమే! నేనలాగే అయ్యాను. అనవసరమైన విషయాల్ని గురించి అతి తీవ్రంగా అలోచించి జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఎక్కువగా జీవితాన్ని గూర్చి ఆలోచించే వాడు సుఖ పడలేడెమో!

"నేను డబ్బు తీసుకు బయలుదేరిన నాడు అది తప్పని నాకు అనిపించలేదు. అది నా డబ్బేనని అనిపించింది. శారదను అన్యాయం చేసిననాడు అది కూడా తప్పనిపించ లేదు. అది మానవ సహజ మని పించింది. ఇలాగే ఎన్నో! మనము చేసే తప్పులకు మన ఆలోచన కుంటి సాకుల్ని సరఫరా చేస్తుంది. నాకు జీవితంలో శాంతి కావాలి. ఒకనాడు ఆ శాంతి జీవితంలో ఆనందాన్నిస్తుందనుకున్నాను. ఆశాంతికి మనసారా ఆహ్వానించాను. ఎండలో భోజనం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. వెన్నెలంటేనే అందరికీ యిష్టం, సంతోషం. అందువల్ల శారదను వివాహం చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. అదే నా కోరిక. కానీ శారదకు ఈ సరికే పెళ్ళి నిశ్చయమయింది. అందువల్ల శారదను, నాన్నను ఒప్పించే భారం నీది. మీరు అ పని చేస్తే, ఉత్తరం వ్రాస్తే యింటికి కోస్తాను.
ఉమాపతి.'
ఉత్తరం చదువగానే రత్నమ్మ కు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఆవిడ మనస్సులో చాలా కాలంగా నిద్రపోతున్న కొన్ని ఆలోచనలు మళ్ళీ మేల్కొన్నాయి. ఉత్తరాన్ని చక్కగా అతికించింది.
"సుందరా! ఎక్కణ్ణుంచో ఉత్తరం వచ్దమ్మా . ఇదో- ' గొంతులో ఏ భావమూ వ్యక్తం కాకుండా సుందరమ్మకు ఉత్తరాన్నిచ్చింది.
పని తొందరలో ఉన్న సుందరమ్మ దాన్ని గోడ కున్న పటం వెనకాల పెట్టింది. కాస్త నిరాశ పడ్డ రత్నమ్మ మళ్ళీ ఫరవాలేదనుకొని వంటింట్లోకి వచ్చేసరికి, పెరట్లో కి వెడుతున్న శారద తల్లి ముఖంలోని ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోయింది.
మధ్యాహ్నానానికి విశ్వనాధయ్య గారు వచ్చారు. "ఏదో ఉత్తరం వచ్చింది" అంటూ ఉత్తారాన్ని యిచ్చింది సుందరమ్మ.
విశ్వనాధయ్య గారు చించి చదివారు. వారి ముఖంలో ఎటువంటి భావ ప్రకటనా కనిపించలేదు రత్నమ్మ కు.
"ఎవరు రాశారు ఉత్తరం?" అని ప్రశ్నించింది.
ఆవిడ ప్రశ్న విననట్టుగా వెళ్ళారు విశ్వనాధయ్య గారు.
మధ్యాహ్నం భోజనాల తరువాత రత్నమ్మ కావాలనే ఎక్కడికో వెళ్ళింది. తాను లేకుంటే ఉత్తరం విషయం సుందరమ్మ కు విశ్వనాధయ్య చెబుతారని ఆవిడ నమ్మకం. అలాగే జరిగింది. విశ్వనాధయ్య గారు భార్యకూ, శారదకూ ఉత్తరాన్ని చదివి వినిపించారు. ఇద్దరూ ఉత్తరం విని మౌనంగా కూర్చున్నారు.
"నాకేమీ తోచడం లేదు సుందరా!" అన్నారు విశ్వనాధయ్య గారు.
ఎవరూ జవాబు చెప్పలేదు.
"ఒకవైపు ప్రకాశం, మరొక వైపు ఉమాపతి. ఏవర్ని దూరం చేసుకోమంటావు సుందరా?"
సుందరమ్మ కు దుఃఖం ఆగలేదు. వెక్కివెక్కి ఏడవసాగింది. శారద బుగ్గల మీద కన్నీటి ధారా జారుతుంది.
"ఏమమ్మా శారదా! జవాబు చెప్పమ్మా."
శారద కూడా వెక్కిళ్ళు పెట్టి ఎడవ సాగింది. ఇంతలో రత్నమ్మ వచ్చింది.
"ఎందర్రా యిది? అంతా యిలా ఏడుస్తున్నారెందుకూ?" అంది ఆశ్చర్యాన్ని నటిస్తూ.
ఇక లాభం లేదనుకొని విశ్వనాధయ్య గారు ఉత్తరాన్ని ఆవిడ చేతికిచ్చారు. రెండు నిమిషాల తరువాత రత్నమ్మ ఏడుపు లంకించుకుంది.
"అయ్యో!నా తండ్రి... ఉమాపతీ! నువ్వేం పాపం చేశావురా నాయనా, ఇన్ని అవస్థలు పడటానికి! తల్లీకి, తండ్రికి కూడా కాకుండా పోయావు."
విశ్వనాధయ్య గారికి రత్నమ్మ మాటలు బాధ కలిగించాయి.
"చెల్లమ్మా, చాలు, ఊరుకో.నోటికెంత మాటొస్తే అంత మాట అనకు" అన్నారు మందలింపు గా.
"ఎందుకురా ఊరుకోవాలి? నా నోరు నొక్కి నొక్కి నీ యిష్టం వచ్చి నట్టల్లా ఆడుతున్నావు. నువ్వు మనిషివైతే కదూ? నల్లరాతివి! ఎవరో ఒక పరాయివాడి కోసం కన్న కొడుకును దూరం చేసుకొంటున్నావు."
"ప్రకాశం పరాయి వాడు కాదు. నీకు కాబోయే అల్లుడు."
"నాకేవడ్రా అల్లుడు? అగుండుగోవి అడ్డ గాడిదా? వాడికేవరిస్తారు పిల్లని?నా ప్రాణం పోయినా ఇవ్వను."
"అంతా నీ యిష్టమేనేమిటి?"
"కాక అంతా నీ యిష్టమా?"
"మనిద్దరికీ మధ్య ఒప్పుకోవలసిన అమ్మాయి ఉంది."
"ఉంటె ఉంటుంది. జానెడు పిల్ల. దానిది గూడా మాటే!"
శారద వెక్కి వెక్కి ఏడుస్తుంది.
"చెల్లమ్మా, నీకు సిగ్గు లేదా? తాంబూలాలు పుచ్చుకున్న పెళ్ళిని కాదంటావా? సరే, నీ యిష్టం! అలాగైతే నువ్వూ నీ కూతురూ నా కొంప వదలి బయలు దేరండి. మీ యిష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ నా కొంప లో మీరు ఉండదలచుకున్నట్లయితే నా మాటే వినాలి. అలాగని నేను గూడా బలవంతం పెళ్ళి చేయడం లేదు. వాళ్ళిద్దరూ మనస్పూర్తిగా ఒప్పుకొన్నారు. ఏం, నే చెప్పేది అర్ధమయిందా?"
విశ్వనాధయ్యగారి మాటల్తో రత్నమ్మ పూర్తిగా చప్ప బడిపోయింది. మారు మాటనకుండా వీధిలోకి వెళ్ళిపోయింది. రత్నమ్మ వెళ్ళిపోగానే విశ్వనాధయ్య గారు శారద ను అడిగారు.
"చెప్పు తల్లీ! నీకు ఉమాపతి ని చేసుకోవడానికి సమ్మతమేనా?"
శారద జవాబు చెప్పలేకపోయింది. కానీ పెదవులు బిగబట్టి తల అడ్డంగా తిప్పింది. విశ్వనాధయ్య గారు భార్య కేసి చూశారు. ఆవిడ లేచి పెరట్లోకి వెళ్ళిపోయింది. శారద కూడా నడవ లోని గదిలోకి వెళ్ళింది.
విశ్వనాధయ్య గారు పెరట్లో కి వెళ్ళేసరికి సుందరమ్మ ఏడుస్తూ బావి వద్ద నిలబడి ఉంది.
"సుందరా! ఏడ్చి ఏమి లాభం చెప్పు? మన పూర్వ జన్మ సుకృతం అలాంటిది' అన్నారు భార్య భుజం మీద చేయి వేసి.
"ఏమండీ! ఎలాగైనా శారదను ఒప్పించి ఉమాపతి కి చేసుకొంటే --"
విశ్వనాధయ్య ఆశ్చర్యంగా భార్య ముఖం లోనికి చూశారు.
"వాడు మళ్ళీ మనవా డవుతాడండీ. చేయ్యేత్తు కొడుకు మనకు దక్కుతాడండీ."
"చూడు, సుందరా! అన్నీ తెలిసిన నువ్వు అజ్ఞానంలో పడితే ఎలా చెప్పు? ఉమాపతిని గురించి నాకు బాధ లేదూ? వాడు పాడై పోతున్నాడని నామనస్సు మండిపోవటం లేదు? నువ్వు చెప్పేది నిజమే! శారదను చేసుకుంటే వాడు తప్పక బాగుపడతాడు. కానీ, ప్రకాశం గతి ఏమి కావాలి? మన పిల్ల సంగతి తెలిసి కూడా పెళ్ళికి ఒప్పుకున్న అతని దొడ్డమనసును మనం గౌరవించక పోవడం న్యాయమా? చెప్పు సుందరా! నువ్వే చెప్పు."
"కానీ.... మనబిడ్డ మనకు దక్కడ మెలా గండీ? నా బిడ్డను నాకు దూరం చేయకండి. శారద నాకు కోడలు కావాలనే పట్టు నాకేమీ లేదు. నా బిడ్డ నాకు కావాలి." భర్త రెండు చేతులూ పుచ్చుకుని అంది సుందరమ్మ.వయస్సు పడమటి దిక్కుకు మొగ్గుతున్న తన భార్యను యింతగా నొప్పించవలసి వచ్చినందుకు చాలా బాధ పడ్డారు విశ్వనాధయ్య గారు.
"అందుకు ఒక దారి ఉంది. ప్రకాశం చెల్లెలు శాంతను ఉమాపతికి చేసుకుందాము. ఆ పిల్ల మన శారదకుఎందులోనూ తీసిపోదు." అన్నారు విశ్వనాధయ్య గారు. కానీ భార్య కళ్ళలో ఏదో అనుమానం వారికి కనిపించింది.మళ్ళీ అన్నారు.
"ప్రకాశాన్ని నేను అడుగుతాను. అతడు వీల్లేదంటే సావిత్రమ్మ కాళ్ళు పట్టుకుంటాను. వాళ్ళిద్దరూ అనుకుంటే శాంత ఒప్పుకొంటుంది. నువ్వు బాధ పడకు. నీ బిడ్డను నీ చేతుల్లో పెడతాను."
సుందరమ్మ బాధతో ముడి వేసుకున్న భర్త ముఖాన్ని చూచింది. విశ్వనాధయ్య గారి కళ్ళ నిండా నీళ్ళున్నాయి.
ఆరోజు రాత్రి విశ్వనాధయ్య గారు జరిగిన విషయాన్ని, ప్రకాశం తోనూ, సావిత్రమ్మతోనూ చెప్పారు. శాంత విషయంలో ఉమాపతి అభిప్రాయం తెలుసుకు రావటానికి మరుసరి దినం ప్రకాశం మద్రాసుకు వెళ్ళేలా అనుకున్నారు.
* * * *
