Previous Page
ఇంద్రధనుస్సు పేజి 21

 

    విమలకు ఆ సలహా నచ్చింది. సునంద వద్ద సెలవు తీసికొని ప్రక్కనే ఉన్న తన క్వార్టర్స్ కు చేరుకుంది. డ్రెస్సు కూడా మార్చుకోకుండా అలాగే కుర్చీలో కూర్చుంది. ఇంకా ఏడు గంటలు కూడా కాలేదు. మూడు గంటలు గడవాలి. అప్పటికి గానీ బహుశా ఉమాపతి నిద్రపోడు. అతను నిద్రపోతే గానీ వెళ్ళటానికి వీలులేదు. పాపం! ఉమాపతి కి జబ్బేమిటో?తాను సారధి ని కూడా అడగటం మరిచిపోయింది. ఉమాపతి జీవితం ఒక విషాద గీతం! ఆ గీతానికి ఆలాపన చేసింది తనే! హాయిగా చదువు కుంటున్న అతనికి స్వేచ్చా ప్రణయాన్ని గూర్చి నూరి పోసింది తానే! తాను అతణ్ణి కామించినా అతడు నన్ను ప్రేమించాడు. ఇదే అతడిలోని దౌర్భాల్యం! తాను వెళ్ళిపోతే అందుకే అతడంతగా బాధ పడ్డాడు. కానీ ఆనాటి తన తత్వాన్ని అర్ధం చేసుకోలేక పోయాడు. అందువల్ల ఆడజాతిని ద్వేషించటం ప్రారంభించాడు . ప్చ్-- పాపం! ప్రేమించడం, లేదా ద్వేషించడం రెండే తెలుసతనికి. ద్వేషించడం మాత్రమే తెలుసు రాజారావు కి.
    ఉమాపతి ఒకవేళ తన్ను చూడటం తటస్థిస్తే ఎలా? తనను చూడగానే కోపంతో కేక వేయడూ? చేతి కేది దొరికితే దానితో తన తల బద్దలు కొట్టడూ? ఎంత ప్రమాదం జరిగినా సరే ఉమాపతిని తాను చూడక తప్పదు! ఎందుకింత పట్టుదల తనకు? తానెవరు? ఉమాపతెవరు? తనకు ఉమాపతి మీద ప్రేమ చిగురిస్తున్నదా?......పది గంటల దాకా ఆలోచనలతో సతమత మైంది విమల. పది కావస్తుండగానే లేచి డాక్టరు గారింటికి వెళ్ళింది. సునంద విమల కోసం వరండా లోనే ఎదురు చూస్తుంది. ఇద్దరూ కలిసి నర్సింగ్ హోమ్ లోనికి వెళ్ళారు. నర్సింగ్ హోమ్ నిద్ర పోతున్నది. రోగులు ఒక్కరు కూడా మెలకువగా లేరు. ఒక్క నర్సు తప్ప మిగిలినవారు కూడా వారి వారి వార్డు లలో నిద్రిస్తున్నారు. విమలా, సునందా ఒక్కొక్కరినీ చూస్తూ ముందుకు నడుస్తున్నారు. విమల ఆలోచనా శూన్యంగా , అన్య మనస్కంగా నడుస్తుంది. కానీ సునంద ముఖంలో మాములుగా నాట్యమాడే శాంతి చెరిగి పోలేదు. ఇద్దరూ ఉమాపతి మంచం దగ్గరికి వచ్చి టక్కున ఆగిపోయారు. ఉమాపతి నడుము దాకా ఎర్రటి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. ఎందువల్లనో సునంద వెనక్కు వెళ్ళిపోయింది. కానీ విమల మంచం పక్కకు పోయి నిలబడింది.
    ఎనిమిది రోజుల గడ్డం ఉమాపతి ముఖాన్ని కప్పివేస్తూ ఉంది. ఉంగరాలు జుట్టు పెనుగాలికి చెదిరిన బోద దుబ్బులా ముఖం మీద పడి ఉంది. చెక్కిళ్ళ మీద నుంచి కారుతున్న చెమట ధార గొంతు మీదికి జారుతుంది. చొక్కా కాస్త తొలగటం వల్ల రొమ్ము మీది ఎముకలు, భుజం ఎముకలు గీతలు గీచినట్లు కనబడుతున్నాయి.
    ఉమాపతిని చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి విమలకు. తనకే తెలీకుండా తన కుడి చెయ్యిని ఉమాపతి నుదురు మీద పడింది. విమలస్పర్శ తో ఉమాపతి కి మెలకువ వచ్చింది. ఎవరిదో మృదువైన అమృతహస్తం తన నుదురు మీద ఉంది. ఆ స్పర్శ తో అతని కోక అనిర్వచనీయ మైన శాంతి. మాధుర్యం, లభించాయి. వాటి భారంతో అతడు కళ్ళు కూడా తెరువలేదు. తన చేతితో విమల చేతిని పట్టుకుని గట్టిగా నుదురు కేసి ఒత్తుకున్నాడు.
    విమల నిర్వికారంగా అలాగే నిలబడింది.కానీ కొద్ది సేపటికి తాను గూడా ఒక రకమైన మాధుర్యాన్నీ, శాంతి నీ అనుభావిస్తున్నట్లు తెలుసుకుంది. తన ఎడమ చేతితో ఉమాపతి చేతిని పట్టుకుంది. ఇద్దరి పెదవుల మీదా మంచులో తడసిన మల్లె మొగ్గ లాంటి స్వచ్చమైన చిరునవ్వు పూసింది. కాస్సేపు ఎవరూ కదలలేదు, మాట్లాడనూ లేదు.
    ఉమాపతి మెల్లిగా కళ్ళు తెరిచాడు. మసక మసకగా విమల కనిపించింది. కళ్ళు చికిలించి చూశాడు. విమలే! సందేహం లేదు. ఒక్కసారిగా లేచి బెడ్ మీద కూర్చున్నాడు. విమల భయపడి రెండడుగులు వెనక్కు వేసింది. మళ్ళీ పరీక్షగా చూశాడు విమలను. తల మీద తెల్లటి టోపీ మొదలుకొని కాళ్ళకు తెల్లనిజోళ్ళ దాకా విమల తెలిమబ్బులాగా ఉంది.
    "రా! కూచో!' తాను కాస్త జరిగి విమలకు చోటు చేశాడు.
    విమల కాస్త దూరంగా కూర్చుంది. ఆవిడ కళ్ళలో యిప్పుడు భయం లేదు,. చెట్ల నీడల్లో కదలని నీటి చెలమల్లాగున్నాయి ఆవిడ కళ్ళు. ఉమాపతి కి సునంద కళ్ళు జ్ఞాపకం వచ్చాయి.
    'ఇక్కడ నర్సుగా ఉన్నావా?" నీరసంగా ప్రశ్నించాడు ఉమాపతి.
    "ఔను."
    "నేనిక్కడ ఉన్నానని తెలిసి కూడా నువ్వెందుకు ఈరోజు డ్యూటీ మానుకోలేదు?"
    "సారధి గారు ఆమాటే చెప్పారు. కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేక పోయాను."    
    "ఏమిటి కొత్తగా మీరంటున్నావు?"
    "ఏమో అనాలనిపిస్తోంది."
    "ఈలోగా నామీద గౌరవం పెరిగిందన్న మాట. నాకు కూడా నిన్ను గురించి అలాగే అనిపిస్తుంది."
    విమల జవాబు చెప్పలేదు.
    "ఒక మాటడుగుతాను. జవాబు చెప్పు. నీ ముఖంలో అంత కాంతీ, నీ కళ్ళలో అంత శాంతీ ఎలా వచ్చాయి?"
    "నేను చాలా తృప్తిగా బ్రతుకుతున్నాను."
    "నేను కూడా అలా బ్రతికితే ఆ శాంతి నాకు లభిస్తుందా?"
    విమల కేస్ చార్టు చూసిచూపు మళ్ళించింది.
    "విమలా! నేను బ్రతుకుతానా? చెప్పు."
    "ఏం మాటలవి?' చేతితో ఉమాపతి నోరు మూసింది. ఉమాపతి మ్లానంగా నవ్వాడు.
    "నేను ఈ జబ్బు నుంచి బయటపడితే ఒక మంచి పని చేయాలను కుంటున్నాను. అందుకు నువ్వు సాయం చేస్తావా?"
    'చెప్పండి..."
    "నేను బాగుపడటం నీ కిష్టమే కదూ?"
    "మళ్ళీ ....అలాంటి మాట లెందుకూ?"
    'అలాగైతే నాకీ జబ్బు బాగవుతుంది. జబ్బు బాగయ్యాక మనమిద్దరమూ పెళ్ళి చేసుకొందాం. అందుకు నీకు సమ్మతమే కదూ?"చాలా నీరసంగా గద్గిదికంగా అన్నాడు ఉమాపతి.
    విమల దిగ్గున లేచి నిలబడింది. తన గుండె వెయ్యి ముక్కలుగా పగిలి పోయినట్ల నిపించింది ఆవిడకు. "తానా! ఉమాపతి ని పెళ్ళి చేసుకోవడమా? అసంభవం! అంతకంటే చావు మేలు!'
    'చెప్పువిమలా! జవాబు చెప్పు." కళ్ళలో నీళ్ళతో ప్రశ్నించాడు ఉమాపతి. కానీ విమల ఉమాపతి కేసి చూడలేదు.
    "వీల్లేదు, ఉమాపతి గారూ! నేను పెళ్ళి చేసుకోవడం అసంభవం" అంది. ఆ గొంతు విమల గొంతులా లేదు.
    ఉమాపతి మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలిపోయాడు. అతనిలో వెలిగిన ఒకే ఒక ఆశా జ్యోతి ఆరిపోయింది! దుర్భరమైన శోకంతో బయటికి పరుగెత్తింది విమల. బయటి నుంచి లోపలికి వచ్చిన సునందం వార్డు నర్సును నిద్ర లేపి విమల క్వార్టర్స్ కు వెళ్ళింది. సునంద వెళ్ళేసరికి విమల చాప మీద బోర్ల పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది.
    'అంతా విన్నాను విమలా! నీ కెందుకంత ఆవేశం? ఉమాపతి నెందుకలా నొప్పించావు? చూశావా, అతడెలా కూలి పోయాడో నిరాశతో?"
    విమలకు ఏడుపు ఆగలేదు.
    "ఉమాపతంటే నీ కెందుకు యిష్టం లేదు?" సునందం విమల వీపు నిమురుతూ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు విమల ఆశ్చర్య పోయింది. ఆ ప్రశ్న తనకు తోచనే లేదు.
    'చూశావా, అతడంటే నీకు యిష్టం ఉంది. కానీ క్షణికోద్రేకంతో కాదన్నావు. వెళ్ళి అంగీకారం తెలిపిరా."
    "ఇప్పుడేనా?"
    "అతడంటే నీకు యిష్టం ఉంది. నాకంతే చాలు . ఇప్పుడు కాకపొతే తెల్లవారాక వెళ్ళు. ఉమాపతిని సరిగ్గా చూసుకుని దక్కించుకో. నేను వెళ్ళి డాక్టరు గారిని లేపి నర్సింగ్ హోము కు పంపుతాను." సునంద వెళ్ళిపోయింది.
    విమలకు గుండెల మీద బరువు దించినట్ల యింది. సునంద లేకపోతె తానెంత గుడ్డిగా ప్రవర్తించేది! తనకూ, ఉమాపతి కీ ఒకరి లోటు పాట్లు మరొకరికి బాగా తెలుసు. కాబట్టి తమ జీవితం సుఖవంత మౌతుంది. మోడు బారిన తన బ్రతుకు మళ్ళీ చిగురిస్తుంది. తెల్లవారు ఝామునే లేవాలి. ఉమాపతి కి చాలా ఇష్టమైన లేత నీలపు రంగు సిల్కు చీర , ఎర్ర బ్లౌజు ధరించాలి. పెళ్ళి యిష్టమే నని చెప్పాలి. అబ్బా! ఎలా చెప్పడం, ఇప్పుడే సిగ్గుతో శరీరం కుంచించుకు పోతుంటే! హాయిగా మాధుర్య భారంతో కనురెప్పలు మూత పడ్డాయి. విమలకు చక్కటి నిద్ర పట్టింది.
    కరకర ప్రొద్దు పుడుతుండగా ఎవరో తలుపు తడుతుంటే మెలకువ వచ్చింది విమలకు. వెళ్ళి తలుపు తీసింది.
    "ఉమాపతి నర్సింగ్ హోమ్ నుంచి వెళ్ళిపోయాడు." లోపలికి రాకముందే సునంద అంది.
    "ఎక్కడికి?"
    "తెలీదు."
    విమల పరుగు లంకించుకుంది. సుడి గాలిలా పరుగిడుతుంది.
    "విమలా! ఎక్కడికి?"
    "వారి కోసం."
    విమల కనుచూపు మేర దాటిపోయింది. సునంద విమలను వారించలేదు. తర్వాత ఆవిడ కోసం వెదికించను లేదు.
    ఆరోజు సాయంకాలం ప్రకాశం వచ్చాడు. సునంద జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది.
    "సారధి ని ఎక్కడ చూడవచ్చు?' అని అడిగాడు.
    'సౌదామిని మద్రాసు ఎండలకు తాళలేనందిట. అందువల్ల ఈ రోజు మధ్యాహ్నం ఊటీకి యిద్దరూ వెళ్ళారు." అంది సునంద.
    "వారికీ విషయం తెలుసా?"
    "తెలుసు."
    ఆ రోజు రాత్రి రైలుకు ఊరికి బయలు దేరాడు ప్రకాశం.

                               *    *    *    *
    నాలుగైదు రోజులు గడిచాయి. ఊళ్ళో చాలా,మందికి ఇందిర, భానుమూర్తు ల పెళ్ళి పత్రికలు అందాయి. ఈసారి జగన్నాధం కోపం పాలేరు రాముడి మీదకు ఒరిగింది. వాడి గుడిసెలో సారా సీసాలు పెట్టి వాణ్ణి అరెస్టు చేయించాడు. కానీ రెండో రోజే వాణ్ణి ప్రకాశం జామీను మీద విడుదల చేయించుకు వచ్చాడు.
    ఇందిర , భానుమూర్తి ల పెళ్ళి చాలా ఉల్లాసంగా  జరిగింది. బళ్ళు తెరిచారు. భానుమూర్తి, ఇందిరా వేరుగా కాపురం పెట్టారు. భానుమూర్తి నెలాగైనా బదిలీ చేయించటానికి జగన్నాధం వెయ్యి విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఇందిర భర్తతో కూడా ఒకసారి నాన్నను చూడటానికి వెళ్ళింది. జగన్నాధం తలుపులు మూయించాడు. ఆనాటి నుంచీ ఇందిర ఆ గడప తొక్కలేదు.
    దుఃఖం నుంచీ కోలుకున్న విశ్వనాధయ్య గారు శారద పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రకాశం ఎంత వద్దంటూన్నా మూడు వందలు బట్టల కోసం యిచ్చారు. ప్రకాశం చిత్తూరు కు వెళ్ళి శారదకు మంచి మంచి పట్టు బట్టలు తెచ్చాడు. పెళ్ళి పనులన్నీ ఇందిరే చేస్తుంది! పెళ్ళి కబుర్లన్నీ భానుమూర్తే చెబుతున్నాడు.
    పెళ్ళికి ముందు రోజు స్పెషల్ బస్సులో తిరుచానూరు కు బయలుదేరాలనుకున్నారు. బస్సు వచ్చింది. సామాన్లంతా భానుమూర్తీ, రాముడూ సర్దారు. మగ పెళ్ళివారు, అడ పెళ్ళి వారు అన్న భేదం లేదు కాబట్టి అంతా ఒకే బస్సులో బయలుదేరారు.
    బస్సు కదిలే ముందు పోస్టు మాన్ వచ్చి ప్రకాశానికి ఒక కవరిచ్చాడు. సారధి వ్రాశాడు దాన్ని.
    'డియర్ ప్రకాశం!
    'నువ్వు ఊటీకి పంపిన పెళ్ళి ఆహ్వానం అందింది. కానీ నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. సౌదామిని తిరుచానూరు ఎండలకు పూర్తిగా తట్టుకోలేదు.
    "నీ పెళ్ళి కన్నా నాకు ఆనందదాయకమైనది మరొకటి లేదు. నువ్వు చాలా అదృష్ట వంతుడివి. శారద కూడా అదృష్ట వంతురాలే. మీది ఆదర్శ ప్రాయమైన వివాహం.
    'ఒక రకంగా చూస్తె నువ్వూ, నేనూ, భానుమూర్తి , ఉమాపతీ నలుగురూ జీవిత చతుర్భుజం లో నాలుగు కోణాలు. కానీ అన్ని కోణాలు సమానమైనవి కావు. ఒక్కొక్కరి జీవిత దృక్పధం ఒక్కొక్క రకమైంది! ఉమాపతి జీవితంలో పోరాడి ఓడిపోయాడు. నేను ఆదర్శాల్ని, ఉత్తమ అభిరుచుల్ని వదిలి జీవితంతో రాజీ పడ్డాను. నా వద్ద చెప్పదగిన విషయాలేమీ లేవు. కాబట్టి నేను ఇక మీదట కవిగా బ్రతక దలుచుకోలేదు. నాలోని కవి, ఆదర్శవాది చచ్చిపోయాడు. భానుమూర్తి కి జీవిత సాగరం లోని అలల ఒడుపు తెలుసు. వాటి నుంచి ఎప్పుడు తప్పుకోవాలో, వాటి మీది కెక్కి ఎప్పుడు స్వారి చేయాలో తెలుసు. అతడు కూడా ఒకరకంగా జీవితం మీద విజయం సాధించాడనే చెప్పవచ్చు. కానీ జీవితాన్ని పూర్తిగా జయించిన వాడివి నువ్వు. విమల, ఇందిర , శారద సరిగ్గా మనకు సరైనవారు. మనం ఏడుమందీ కలిసి జీవితాకాశం లో ఇంద్రధనుస్సు లాగా ఉంటాము. ఇక సౌదామిని సంగతంటావా? ఆ ఇంద్రధనుస్సు లో నాకు ప్రాతినిత్యం వహించే రంగును మూసే నల్లటి మబ్బు! నిజం చెబుతున్నందుకు కోపించుకోకు.
    'మన స్నేహితులకు, ముఖ్యంగా విశ్వనాధయ్య గారికి నా నమస్కారాలు తెలియ జెయ్యి.
    "మీకు ఆనంద ప్రదమూ, ఆదర్శ ప్రాయమూ అయిన దాంపత్య జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని మనసారా ప్రార్ధిస్తాను.

                                                                                                   నీ వాడు    
                                                                                                     సారధి'
    ఉత్తరం పూర్తీ చేసి ప్రకాశం ఎదురు సీట్లో కూర్చున్న శారదను చూశాడు. బుగ్గలలో గులాబీలు విరిసి , కన్నులలో వెన్నెల కురిసి శారద తల వంచుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన భానుమూర్తి , ఇందిరా ఒకర్నొకరు వెక్కిరించుకున్నారు.
    జీవితరధంలా బస్సు కదిలింది.

                

                                  -----సమాప్తం----------
   


 Previous Page

WRITERS
PUBLICATIONS