8
రోజూ అలవాటైనా ఆఫీసరు మాటలు ఎవరూ లెక్క చెయ్యరు గాని నారాయణ మొహం మాత్రం చూస్తుండగా ముడుచుకు పోయి. ఇంకో అన్ని తప్పులు చేసి మరో ఇన్ని చివాట్లు తింటుంటాడు. ఆఫీసరు మోహ మెదుట ఏమీ అనలేని గుమాస్తాలు అతడు వెళ్ళగానే నారయడ్ని మొహం వాచేటట్లు చివాట్లు పెడతారు. 'నీవల్లే ఇవన్నీ భరించవలసి వచ్చిందనీ, ఇంత అవమానం చాతగాని తనం దుఃఖం నారాయణ లాంటి అల్పజీవి ఎలా భరించగలడు? అన్నీ కలిసి వడ్డీతో సహా తనకు లోకువైన ఒకే ఒక వ్యక్తీ ఆ భార్య మణికి బాజాభజంత్రీలతో బహుకరిస్తాడు. అంతేగాక అంత అందమైన భార్యకు తను తగనని వాడికి మరో ఏడుపూ. అందుకని ఇవన్నీ మా ప్రెండ్స్ అందరికీ ఎప్పుడో తెలుసు. మీకు తెలుసునేమో అనుకున్నాను. నిజంగానే తెలీదా నాచేత వాగుస్తున్నారా?' గాజు గ్లాసు నిండా బత్తాయి రసం ఇచ్చాను. గోపాలం గారికి అయన చెప్పేదంతా ఆశ్చర్యంగా వింటూ. ఈయన జరిగిందంతా అతనికి చెప్పేరు.
'బాబ్బాబు ఆ అమ్మాయిని ఒక్క వారం రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి. వాడి రోగం కుదురుతుంది. ఇంటి దగ్గర అన్నీ పెళ్ళి కొడుక్కి చేసినట్టు చేసి పంపిస్తుంటే వాడికెలా బుద్దోస్తుంది? పక్క వూళ్ళో కలరా గా వుందని వూళ్ళో హోటళ్ళన్నీ పదిహేను రోజుల పాటు కట్టేస్తున్నారట కూడా. వాడి తిక్క కుదరాలంటే ఇంతకన్న అవకాశం ఉండదు.'
'పాపం ఏమైపోతాడో" అన్నాను నేను.
'అదిగో మీ ఆడాళ్ళ కున్న ఆ జాలే మా మొగాళ్ళని మరింత పనికి రాని వాళ్ళని చేస్తోంది. ధ్వజస్తంభం లా ఉన్నాడు. ఇంతలో వాడేమీ అయిపోడు. ఈవేళ ఆఫీసుకు వచ్చాడుగా, మాములుగా పని చేసుకుంటూనే ఉన్నాడు. వాడివల్ల వాడి పెళ్ళాం ఒక్కర్తే గాదు. మేమందరం మాట కాయవలసి వస్తోంది తల్లి. తల్లి.....'
'సరళ కూడా చాలా మూర్కపు మనిషిలా కనిపిస్తోంది గోపాలం గారూ ప్రయత్నిస్తాంగా' అయన వెళ్ళిపోయాడు. వీరిని ఆఫీసుకి సాగవంపి నేను సరళ పడుకున్న గదిలోకి వచ్చాను. పక్క కాళీ! పక్కన పనిమనిషి మంచం కోడుకి జారపడి కునుకుతోంది! దాన్ని ఒక్కటి అంటించాను. లేచి కూచుంది. వాళ్ళింటికి వెళ్ళిపోడానికి అయన తాళం వేసుకుని వెళ్ళిపోయేడాయే. సరళ ఎక్కడికి వెళ్ళినట్టూ? ఇల్లంతా నేనూ రంగీ రెండు మూడు సార్లు హడావిడిగా తిరిగేం. డాబా మీదకు వచ్చి ఎదురింటి వైపుకి అప్రయత్నంగా చూసేసరికి వీధి తలుపు తీసి వున్నట్టు కనిపించింది.
'చిత్రంగా ఉందే! చూడు రంగీ, ఆవిడ యింట్లో ఉందొ లేదో! చూసి అక్కడ్నుంచే కేకేట్టు నే నిక్కడే ఉంటాను.' అన్నాను. అది గబగబా మెట్లు దిగి ఆ యింటికి పరిగెత్తి లోపలికి తొంగి చూసి 'ఉన్నారమ్మగోరూ' అని పెద్ద కేకేసింది.
నేను వెళ్ళేసరికి ఆవిడ ముక్కలు తరుగు తోంది!
'తాళం వేసిన ఇంట్లోకి ఎలా ప్రవెశించావమ్మా, తాంత్రికురాలివి కాదు కదా?' అన్నాను. ఆమాత్రం అర్ధం చేసుకోలేరా అన్నట్టు మెళ్ళో హారానికి ముడేసిన డూప్లికేటు తాళం చూపించింది. దెబ్బలాడి అవిడ్నక్కడి నుంచి లేవదీసి పడక్కుర్చీలో కూలేశాను.
'డాక్టరేమని చెప్పేడు, రెండ్రోజులు విశ్రాంతి తీసుకోమనలేదూ?'
ఆవిడ మాటాడలేదు. అయిదు నిమిషాలు ఆగి అతి నీరస స్వరంతో అంది. 'ఏవండీ నా కాపురం యిలా సాగనియ్యదల్చుకోలేదా?'
'ఉహు నీ కాపురం యిలా మాత్రం సాగనియ్యదల్చుకోలేదు. ఇది కాపురం కాదు, కాలునిపురం.'
'ఇలా దెబ్బలు తినడం, యిట్టే దులిపెసుకొడం నాకు మామూలై పోయింది. మా అమ్మకి, నాన్నకీ రాసైనా ఎరగను. మీకెందు కింత పట్టుదల?
'నోరుమూసుకు వూరుకోడానికి యిది నిర్జీవమైన ఎడారి కాదు. కిక్కిరిసిన లోకం. హింసను చూస్తూ, వింటూ వూరుకోడానికి మేం చెక్కిన శిల్పాలం కాదు, మనసున్న మానవులం. ముఖ్యంగా ఆయనేం చేస్తారో నాకు తెలీదు గానీ యింతగా చెబుతున్నావు కనక దీని అంతు చూడకుండా నేను మాత్రం వదిలి పెట్టను. నువ్వు వో పదిరోజులు పాటు మీ ఆయనకి మొహం చాటేస్తే గాని యీ వ్యవహారం తేలదు.'
చూస్తుండగా ఆమె కళ్ళు నీళ్ళతో నిండి పోయాయి.
'ఆయనేదో నన్ను హింసించా రంటున్నారు, మీకన్న వేరే హింసించేది ఎవరు? కొట్టినా, తిట్టినా భర్త కళ్ళ ముందుంటే చాలు. అంతకంటే ఆడది కోరేదేమీ ఉండదని మీకు తెలియదా?
ఎంత చు'రుకైనప్రశ్న ! ఎంత సూటి ప్రశ్న! ఎంత సునిశితమైన ప్రశ్న! ఆమె మీద నా అభిమానం రెట్టింపు అయింది. ఆమెను దగ్గిరగా తీసుకొని ఆమె బుగ్గకు నా బుగ్గ అన్చాను. నా కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
'ఇవాళ నుంచి నువ్వు నా చెల్లెలివి. నన్ను అక్కా అని పిలు.'
'అయితే సరే అలాగే పిలుస్తాను. చెల్లెలి మాట అక్క కాదనదని నాకు తెలుసు. అందుకని.....'
'....అందుకని నిన్నిక్కడ విడిచి వెళ్ళమంటావ్. అదేం కుదిరే వ్యవహారం కాదు, నువ్వు చెల్లెలి వైనప్పుడు నీ సంసారం చక్కబరిచే బాధ్యత మరింత ఎక్కువైందని నాకు తెలుసు. లే, లేచి తలుపు తాళం తియ్.'
'అక్కా, ఆయన్ని నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోలేదు. చిటికెనవ్రేలితో పెద్ద కొండ నెత్తిన కృష్ణుడే వెన్న తినే చిన్నకృష్ణుడని మరచిపోకు. కాస్త చేతి పాటుతనం ఉన్నా అయన మనసు నవనీతం.
'అవును, నాకు తెలుసు. కాస్త వేడి తగిలిస్తే గాని ఆ ఘుమఘుమ యివతలికి రాదు. నవనీతం జన్మ పునీతం కావాలంటే అదొక్కటే మార్గం' సరళ మాటాడలేదు.
'చెప్పి చెప్పి నాకు ప్రాణం విసిగెత్తి పోతోంది. నీ కాలో చెయ్యో విరిగితే గాని నీ కేలాగా బుద్ది రాదు. అన్నీ చూస్తూ వూరుకున్నారా అని మీవాళ్ళు రేప్పోద్దుట అడిగితె మేం జవాబు చెప్పుకోలేక చావాలి. ఇవాళ మీ నాన్నగారికి మీ బావగారి చేత ట్రంక్ కాల్ చేయించి అన్ని విషయాలూ చెప్పిస్తాను'

'వద్దక్కా, వద్దక్కా.'
'ఏమో నీ మొండితనం చూసి ఇదివరకే మీ బావగారికి ప్రాణం విసిగింది. నేనిప్పుడు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. మేమెందుకు ఇంతదూరం చెబుతున్నామో నీకే పట్టనప్పుడు మాకెందు కింక?. మీవాళ్ళే వచ్చి చూసుకుంటారు. వస్తా చెల్లీ.'
సరళ లేచి నిలబడింది.
'ఉండు నేనూ వస్తున్నాను.'
నా కళ్ళు తళతళ మెరిశాయి. ఆమె కన్నీళ్లు తుడిచి బుగ్గ మీద ముద్దెట్టుకున్నాను.
'మా చెల్లి మంచిది. ఈ వ్యవహారం యిప్పటికి వీధిని పడింది చాలు. వూళ్ళకి వూళ్ళు పాకడం, కన్నవాళ్ళు దుఃఖించడం ఎందుకని ఇప్పటి కెనా గ్రహించావు. అంతేచాలు. నిజానికి అయన నిన్ను బెల్టుతో కొడుతున్నప్పుడు నాకేం అనిపించిందో తెలుసా? దెబ్బల రుచి ఆయనకీ చూపించాలని అనిపించింది. మీ బావగారి కున్న పరపతికి నలుగురు రౌడీలను పిలిపించి నువ్వూ అనకుండా ఒళ్ళు హూనం చేయించాలన్న కసి కలిగింది. కాని ఎందుకు వూరుకున్నామో తెలుసా నీ మొహం చూసి.....
నే అలా చెబుతుండగా సరళ తన బట్టల పెట్టి, పరుపూ పైకి తీసింది. రంగి చేత ముందవి మా యింటికి పంపించేశాం. తర్వాత పై తాళం వేసింది వేసినట్లు వేసేసి యిద్దరం గుట్టు చప్పుడు కాకుండా మా యింటి మేడమీదకు వచ్చేశాం. ఆమె యిలా మళ్ళీ వెళ్ళిపోయినట్టూ, నేను వెళ్ళి తీసుకు వచ్చినట్టూ మాత్రం ఆయనకు చెప్పలేదు.
ఆ తరవాత మాత్రం సరళమాతో బాగా సహకరించింది. ఏ పత్రికలో చదువుతూనో మధురిమకి కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసేది. అప్పుడప్పుడు వాళ్ళాయన గురించి అడిగేది గాని అదేపనిగా వేధించేది కాదు.
ఆ మూడో రోజు కాబోలు మధురిమ బడి నుండి వస్తుంటే నారాయణ పిలిచి అడిగాడుట.
"ఏం పాపా , మా సరళ మీ యింట్లో ఉందా?'
"వూ'
"ఏం చేస్తోందీ?'
"పడుకుంది.'
"ఏం?'
"నాకు తెలీదు.'
'వంట్లో బాగులేదా?'
"నాకు తెలీదు.'
"పోనీ అన్నం తింటుందా?'
"నే చూళ్ళేదు.'
'ఆలా ఎన్నాళ్ళు ఆ అంతఃపురంలో ఉంటుంది?'
"నాకు తెలీదు.'
'పోనీ నేనోసారి కిందకి రమ్మన్నానని చెబుతావా?'
'ఎందుకూ?'
'ఎందుకో, నీ కేండుకూ?'
'అయితే నే నెందుకూ?' మధురిమ తుర్ర్రుమని పారిపోయి వచ్చేసింది.
ఈ జావాబులకి నాకు చాలా ముచ్చట వేసి అది చాలా రోజుల్నుంచి అడుగుతున్న చాకలేట్ టిన్ కొనిచ్చాను.
"ఎందుకే అలా చెప్పేవ్, ఇలా చెప్పమని నీకెవరు చెప్పేరు?'
'బళ్ళో మా మేష్టారు గారు చేతి ముణుకుని యిలా పట్టుకుని గట్టిగా కస్సుకుని కొడతారు చాలా నొప్పి పడుతుంది. ఏడుస్తే మళ్ళీ కొడతారు. ఆయన్నోకసారి ఎద్దు కుమ్మేసింది. మా కందరకు ఎంత సంతోషం వేసిందనుకున్నావ్? కొట్టే వాళ్ళని చూస్తె నా కసహ్యం. అందుకే అలా ఎడిపించాను.
