Previous Page Next Page 
ముద్ద మందార పేజి 19

 

                                      10

     
    నూజివీడు వెళ్ళిన మూడో రోజు రాత్రి కలలోకి సింహాచలం వచ్చింది. ఆమె కన్నీరు విడుస్తోంది. కన్నీరు చిన్న కలవయ్యింది. సెలయేరై , చేరువై, నదిగా తయారయి చివరికి మహాసముద్రం అయ్యింది. ఇంకా సింహాచలం ఏడుస్తూనే వుంది. ఆ కన్నీటి సముద్రంలో ఒక పసిపిల్లాడుకొట్టుకు పోతున్నాడు. సింహాచలం నాకేసి జాలిగా చూసి, "నన్ను రక్షించమని ఏనాడూ అనలేదు. నా కొడుకు మీకు మాత్రం కొడుకు కాదా. ప్రవాహంతో కొట్టుకు పోతుంటే చూస్తూ వూరు కుంటారా. మీ సుఖానికి, నేనెలాగూ బలి అయ్యాను. వాడిని తీయండి! తీయండి" అని ఏడ్చింది. నేను చంగున ప్రవాహం లోకి దూకి ఆ పసిపిల్ల వాడిని తీసి, ఒడ్డుకు తెచ్చేసాను. ఆవేశంలో వున్న సింహాచలం నవ్వింది. "నాకు తెలుసు. మీరు వాడిని రక్షిస్తారని  వాడు మీకొడుకు. వాడు మీ కొడుకు" అంది.
    వులిక్కిపడి లేచాను.
    రాత్రి మూడున్నరయ్యింది. అంటే తెల్లారుజామున్న మాట. ఇక నిద్రపట్ట లేదు. కలని మననం చేస్తుకుంటూ తెల్లవార్లూ గడిపాను.
    తెల్లవారుతూనే గోపాల్ పూర్ వెళ్లాలని సన్నాహం చేశాను. మేనేజరుతో చెప్పి గోపాల్ పూర్ చేరి, తిన్నగా రామనాధం గారింటికి వెళ్లాను. పోయినసారి వెళ్ళి బీచిలో సింహాచలం కోసం వెతికి వచ్చేసినటుగా కాక, యీసారి తిన్నగా వాళ్ళిల్లు అడిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.
    మధ్యాహ్నం భోజనం చేసి, కాస్సేపు లోకభిరామాయణం ప్రశ్నలూ అవీ అయ్యాక నా జీవిత కధ వాళ్ళకు చెప్పవలసిన భాగాలు చెప్పి, ఓ కునుకు తీసి, సాయంత్రం లేచి సింహాచలం యిల్లు కనుక్కోడానికి బయల్దేరాను.
    తిన్నగా వూరికి పక్కగా వున్న పాకల వైపు వెళ్ళాను. ఎవడో ఓ ఆగంతకు డెదురోచ్చి, "బాబూ మందీ వూరేనా-- ఓ అందమైన" అన్నాడు.
    "ఛీ నోర్మూయ్" అనేసి ముందుకు నడిచాను. లోకంలో అరాచకం బహుముఖమయిపోయింది. నాలుగు పాకలు దాటి ఒక చోట పిల్ల లాడుకుంటుంటే వాళ్ళ ద్వారా గుర్తు తెలుసుకుని, ఆ పాక చేరాను. పాక ముందు ఆనాడు నా యింట్లో ఆనాడు పని చేసిన మనిషి వుంది. నన్ను గుర్తు పట్టింది. "మీరా బాబూ, ఈ పాకలకు మీరు రావాలా, కాకితో కబురంపుతే నే రానూ" అంది.
    "ఫరవాలేదులే. నీ కోసమే ఓ పనుండి వచ్చా" అన్నాను. వరాలమ్మా లోపలకు వెళ్ళి, ఓ చిన్న బల్ల తెచ్చి "కూకోండి బాబూ' అంది. కూర్చున్నాక, యోగక్షేమాలన్నీ  అడిగింది. అన్నీ చెప్పాను. "మీ అక్క కులసాయేనా' అనడిగాను. వరాలమ్మ తల వూపుతూ ఇంకెక్కడి అక్క బాబూ చచ్చిపోయింది" అంది.
    "మరి దాని కూతురు వాళ్ళూ" అన్నాను. నా ధైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది.
    వరాలమ్మ వుస్సురుమంది.
    "అదీ పోయింది బాబూ" అంది.
    నేను కూర్చున్న కుర్చీ పీట విరిగినట్టయ్యింది. క్రింద పడబోయి నిభాయించుకుని కూర్చున్నాను. "జాగ్రర్త బాబుగారూ, దిక్కుమాలిన పీట" అంది.
    "ఫరవాలేదు" అన్నాను పూడిన కంఠంతో.
    వరాలమ్మ కన్నీరు తుడుచుకుంటూ సింహాచలం ఎలా చనిపోయిందో చెప్ప నారంభించింది.
    "ఎవడో ఒక వెధవ దాని జీవితం బండలు చేసి పోయాడు. అది మగ పిల్లాణ్ణి కంది. మూడేళ్ళ వరకూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసింది. వాడు వస్తాడోస్తాడని సంబరపడుతూనే వుంది. దాని పిచ్చి గానీ, వచ్చేవాడయితే అసలు చెప్పా, చెయ్యకా పారిపోడం ఎందుకు? మనస్సులో దానికి నమ్మకం పోయాక, కొడుకుని వొళ్ళో పెట్టుకుని గంటల తరబడి ఏడ్చేది. చివరికి తిండి కూడా మానేసింది. వాడెవడో చెప్పమంటే ససేమిరా అనేది. పోయిన నాగులు చవితికి కొడుకు చేత పుట్టలో పాలు పోయించింది. అంతా అయ్యాక పుట్టలో దడేల్న చెయ్యి పెట్టి నిండు ప్రాణం తీసుకుంది. అంతే బాబూ. ఏ పాపం ఎరగని దాని చావుకు కారణమైనవాడికి దీనుసురు మంట తగలదా బాబూ, వాడూ, వాడి పెళ్ళాం పిల్లలూ బుగ్గయి పోరూ."
    ఇది ఆమె చెప్పిన మాటల సారాంశం. అవును.సింహాచలం వుసురు మంట నాకు, నా పెళ్ళాం బిడ్డలకు తగిలింది.
    వరాలమ్మ మళ్ళీ ప్రారంభించింది.
    "పిల్లాడికి మాత్రం రాజగిరి వొచ్చింది బాబూ. ఇస్కూల్లో జేర్చింది. ఫస్టుస్తున్నాడు. ఇస్కూలు ఫైనలు చదివించి డాక్టరు చేయించాలనేది. వాడికి ఎంగిలి కూడు పెట్టేది కాదు. ఒకవేళ ఏవేవో పెడితే వాడు తిండి ముట్టేవాడు కాదు. ఇంట్లో వుడకేసి పెట్టాలి...."
    లక్షాధికారి కొడుక్కి ఎంత గతి పట్టిందో.
    నా శరీరమంతా వణికింది.
    "అబ్బా యెక్కడున్నాడు?" అన్నాను. బొంగురు పోయిన కంఠంతో. 'అలాగ పెరట్లో ఆడుకుంటుంటాడు బాబూ. ఆ మేళం తో ఆడడు" అంది. ఎలాగయినా నా కొడుకుని నేను తీసుకుపోవాలి. లేకపోతె సింహాచలం ఆత్మఘోష నా జీవితాన్ని బలితీసుకుంటుంది. "ఈ పాడుళ్ళో వుండడం ఎందుకు? మావూ రోచ్చేయ్యరాదూ. అక్కడ మా యింట్లో వుందువు గాని నువ్వు... నాకా బోలెడు ఆస్తి వుంది." అన్నాను డబ్బు ఆశ కయినా వస్తానంటుందేమోనని కానీ, ఆమె వొప్పలేదు. నా బతుకంతా యీ గడ్డ మీదే బాబూ. ఇక్కడే పొతే నాకు ఓ సంతృప్తి" అంది. ఇంతలో పక్క పాకలోంచి ఎవరో పిలుస్తే వస్తన్నా" అని వెళ్ళింది. లోపల్నించి నాలుగేళ్ళ కుర్రాడు వచ్చాడు. అతన్ని చూడ్డంతోనే నా శరీరం విచిత్రానుభూతి పొందింది.
    సింహాచలం కొడుకు, నా........
    "బాబూ మాట" అన్నాను అతను దగ్గర కొచ్చాడు.
    దొంగలా అటూ యిటూ చూసి, వాడిని అమాంతం ఎత్తుకుని, నా హృదయానికి హత్తుకున్నాను. బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాను. బాబు హడలిపోయి, నాకేసి భయంగా చూశాడు.
    మరింత గాడంగా నా హృదయానికి హత్తుకున్నాను. ఆ సమయంలో నా హృదయానుభూతి వర్ణనాతీతం.ఇంతలో గుమ్మం వద్ద చప్పుడయ్యే సరికి గమ్మున అతన్ని దింపి, చొక్కా సర్దుకుని, పీట మీద కూర్చున్నాను. వరాలమ్మ గ్లాసుతో పాలు తీసుకొచ్చి "తాగండి బాబూ" అంది.
    వచ్చే ముందామె చేతిలో వంద రూపాయలుపెట్టి, "ఆరోగ్యం జాగ్రత్త" అని చెప్పి, బాబు చేతిలో మరో వంద పెట్టబోయాను. "ఛీ" అన్నాడతను.
    "తీస్కోరా , తప్పు" అందామె.
    "ఛీ, నాకొద్దు" అన్నాడతను.
    "బాబూ పెద్ద వాళ్ళిచ్చినది వద్దనకూడదు ,తీస్కోమ్మా"అంటూ డబ్బు జేబులో పెట్టి, "నీ పేరేమిటి" అన్నాను.
    "సింహాద్రి" అన్నాడతను.వరాలమ్మ పాల గ్లాసు తీసుకుని వెళ్ళిపోగానే మళ్ళీ సింహాద్రిని ఎత్తుకుని మళ్ళీ తనివితీరా ముద్దు పెట్టుకున్నాను. "బాబూ మా వూరు వస్తావా " అన్నాను. "అమ్మమ్మ చెపితే వస్తాను" అన్నాడు. మళ్ళీ ముద్దు పెట్టుకుని, దింపేసి, కాస్సేపు వరాలమ్మ తో మాట్లాడి రామనాధం గారింటికి వచ్చేశాను.

                              *    *    *    *

    రాత్రంతా ఊహించి ఓపధకం  వేశాను. ఆ పధకం ప్రకారం ఎలిమెంటరీ స్కూలుకు వెళ్ళి, మేష్టారిని కలిసి, నేను ఒకటవ తరగతిలో వున్న పిల్లలకు యిద్దరికీ స్కాలర్ షిప్పు లిస్తున్నట్టూ , వాళ్ళు ఎంత చదువు చదివినా నేనే చదివించేటట్టూ చెప్పి, "నెలకి వంద రూపాయలు యిస్తాను. ఇద్దర్నీ ఎంచుకోవాలి' అని చెప్పి క్లాసుకు వెళ్ళి, సింహాచలం కొడుకును, అనుమానం రాకుండా వుండడానికి మరో కుర్రాడినీ ఏరి, "వీళ్ళిద్దరి పేరా నెలనెలా వంద పంపుతాను." అన్నాను. మేష్టారు చాలా సంతోషించాడు. ఓ సంవత్సరానికి సరిపడే డబ్బు మేష్టారి పేరా రాసి , ఆయనకు కొంత కలిపి చెక్కు రాసి అయన కిచ్చి నూజివీడు చేరాను.
    నూజివీడు వచ్చిన రాత్రి చాలా సంవత్సరాల తరువాత నిశ్చింతగా నిద్ర పట్టింది.
    హాయిగా, సాఫీగా రెండేళ్ళు గడిచాయి.
    సింహాద్రిని పెంచుతున్న వరాలమ్మ చనిపోయినట్టూ, పోతూ, పోతూ "నా మనవణ్ణి ఆ స్కాలరిప్పిచ్చి నాయనకే యివ్వండి" అని తనను కోరినట్టూ మేష్టారు రాశారు.
    నా ఆశయం తీరింది.
    వాయువేగంతో గోపాలపురం వెళ్ళి సింహాద్రి  వెంటక రమణ ను తీసుకుని, మదరాసు చేరాను.
    మద్రాసు లో ఒక హోటల్లో మకాం చేసి, భాస్కరానికి ఫోను చేసి పిలిచి, నా గాధంతా పూసగుచ్చినట్టు చెప్పి, భాస్కరం రెండు చేతులూ పట్టుకుని, "భాస్కరం నా బాబుని నువ్వు పెంచాలి. వాడిని డాక్టరు చేయించాలని సింహాచలం కోర్కె. అది తీర్చాలి. లేకపోతె సింహాచలం వుసురు తగిలి నాకు రామం గూడా దక్కడు" అన్నాడు. నాలో అణిగి వున్న దుఃఖం తన్నుకుని వచ్చేసింది. వెక్కివెక్కి ఏడ్చాను. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS