"అహఁ! ఏమీలేదు. మీ స్నేహితురాలికి తెలిసిన విషయాలు మీదాకా రాకుండా ఉండిఉంటాయా?" నవ్వాడు.
తనూ నవ్వింది. "అనూరాధ ఉద్దేశ్యం మీద మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది.
"అంటే?"
"రాధ అతను తిరిగి మెడిసిన్ లోకి వెళ్ళాలని ఆశిస్తూంది."
"ఓ...అదా! మీరేమనుకుంటున్నారు?"
"నేను మిమ్మల్ని అడిగితే మీరు నన్ను అడుగుతారేం? నాకు ఎందుకో అది సరియిన పనిగా తోచదు. అయినా ఆ విషయాలు నాకు ఎక్కువగా ఏం తెలుసు?"
"నాకు మీలాగే అనిపించింది. నిజానికి ఇది మెడిసిన్ కి సంబంధించినది కాదు, మనస్సుకు అయినా నేనే రాధతో మాట్లాడుదామనుకుంటున్నాను. అదంటే చిన్నపిల్ల. ఇలాటి విషయాలలో అనుభవం లేనిది. కాని కృష్ణమూర్తి గారుకూడా అతన్ని ప్రోత్సహిస్తున్నారంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది."
"కృష్ణమూర్తిగారా! అంటే మీ డాక్టర్ గారు కదూ?"
"ఆఁ! ఆయనే. అనుభవమున్న డాక్టర్. ఎంతో తెలివయినవారు. అటువంటిది ఆయనే ఈ విషయాలలో చర్య తీసుకుంటున్నారంటే మరీ ఇదిగా ఉంది."
"అనూరాధా ఆశించటంలో కొంచెం అర్ధం ఉంది. ఆయన కేమిటి అంత కుతూహలం?"
"అదే అర్ధం కాకుండా ఉంది. అయినా రాధమాత్రం? ..."
"బావుంది. అది నే చెప్పాలా?" అంది నవ్వి.
"ఏమో? ఆడవాళ్ళు అవగాహన చేసుకున్నట్లు మేము చేసుకోలేము. అయినా నాకు వాళ్ళు చేస్తున్న పనిమీద ఏమాత్రం ఇష్టం లేదు. చిన్నప్పటినించి ఎంతగానో, డాక్టరు కావాలని ఆశించిన నాకే 'ఇది ఎందుకు ఎన్నుకున్నానా?' అని బాధపడ్డ క్షణాలున్నాయి. ఈ పని చేస్తున్నప్పుడు ఆత్మసంతృప్తి, కుతూహలం ఉండాలి. అవి లేనప్పుడు ఇది చేయడం కష్టం. అందుకే నేను శ్రీనివాస్ ను గౌరవిస్తాను. అతను ఇష్టమయ్యో, లేకో ఒక పని చేశాడు. అందుకు తనకు సామర్ధ్యం లేదని తెలుసుకున్నప్పుడు దానికి దూరంగా ఉండ ప్రయత్నించాడు. కాని పరిస్థితులమూలంగానో, పరిచయస్థులమూలంగానో అతనికి ఎదురు దెబ్బలు తగిలాయి. అటువంటప్పుడు అతణ్ణి తిరిగి ప్రోత్సహించడం మంచిది కాదని నా ఉద్దేశ్యం. ఏ పని అయినా, ఎవరికి వారు నిర్ణయించుకోవాలిగాని ఎదటివారిమీద ప్రేమతో, గౌరవంతో, జాలితో వారికోసం త్యాగాలు చేస్తే కలకాలం అవి నిలవవు. చేసిన పని సఫలం కాకపోతే ఏ మనుష్యులకోసం ఈ త్యాగం చేస్తున్నారో, వారిమీద విలవకూడా తగ్గుతుంది. అదే నాకు శ్రీనివాస్ లో ఆశ్చర్యం కలిగించే ప్రవృత్తి. తండ్రిమాట తీసిపారేసి తనకు నచ్చిన ఏ ఇతర వృత్తి ఎన్నుకున్నా ఎంతో రాణించేవాడు. అతని భవిష్యత్తు ఇలా అడ్డు తగలటానికి కారకులయిన వాళ్ళ నాన్నగారిమీద చీమంత గౌరవం తగ్గలేదు. అది అందరిలోనూ ఉండదు. అదే మరొకడయితే మా నాన్నమూలంగా నా జీవితమంతా చెడిందనుకునేవారు."
"మీ కింతగా ఈ పని ఇష్టం లేనప్పుడు సరాసరి కృష్ణమూర్తిగారితోనే ఎందుకు చెప్పకూడదు?"
"నాకు అలాగే అనిపిస్తుంది. కాని ఆయన నాకంటే ఎంతో పెద్దవారు. అనుభవమున్నవారు. ఆయన కివన్ని తెలియవని ఎలా అనుకోను? అదీగాక బొత్తిగా ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన మొహంమీద మీరు చేస్తున్న పనేం బాగాలేదు అని ఎలా చెప్పడం? ఏమయినా ఈ విషయం మా నాన్నతోను, రాధతోను మాట్లాడాలనుకుంటున్నాను."
24
మొత్తంమీద కృష్ణమూర్తిగారి వాత్సల్యపూర్వకమయిన కృషి, అనూరాధ అభిమానంతో ఇచ్చే సలహాలు మెల్లిగా శ్రీనివాస్ మీద పనిచెయ్యడం మొదలు పెట్టాయి. వరదల సుడిగుండాల్లాంటి మనోవేదనలనుండి తప్పించుకుని, నిశ్చలంగా, నిర్మలంగా పారుతున్న ఏటిలో తిరిగి రాయి విసిరినట్లయింది. నీటిలో సుళ్ళులా, సముద్రపు అలలలా అతని ఆలోచనలు లేపసాగాయి. తనకు కావలసినదేదో వెతుక్కుని, ఎండమావులలాంటి ఆశలను అరికట్టి, స్థిరపడబోతున్న శ్రీనివాస్ కు తిరిగి సమస్య ఎదురయింది. నా అనే ప్రతి ఒక్కరికి దూరం కావాలనుకున్నా అనుకోకుండా అనూరాధతో పరిచయం ఒక అనుబంధంగా మారింది, ఆ స్నేహం చిగిరించి పుష్పించే సమయంలో శ్రీనివాస్ ఎవరో తెలియడంతో అతనిలో ఉన్న అనూహ్యమయిన బలహీనత పోగొట్టాలన్న కోరిక అనూరాధ అంతరంగంలో రోజురోజుకు పెరగసాగింది. మొదటినుండి చూపిస్తున్న ఆ స్నేహలతకు ఒక ఆలంబన, అవసరం కలిగింది.
కృష్ణమూర్తి గారికి చేస్తున్న పని సరి అయినదో, కాదో అన్న ఆలోచనకు తావివ్వకుండా చేసింది ఆయన వాత్సల్యం. కొన్నేళ్లుగా ఆయనలో పెరుగుతున్న మమత, మరుగుపడ్డ ఆత్మీయత పంచుకునేందుకు ఒక్కరైనా లేకపోవడంతో, శ్రీనివాస్ తన బిడ్డ అని తెలియడంతో ప్రేమానుబంధాన్ని తెంచుకోలేకపోయారు. తన స్వంతకొడుకు తన వృత్తిలో ఆరితేరేందుకు అవసరమయిన కృషి ఎంతఅయినా చెయ్యాలనిపించింది. విడదీయరాని రక్తసంబంధం, తెలియచెప్పలేని బాంధవ్యం వదులుకోలేని అనుబంధాలయ్యాయి.
ఇద్దరి అభిమానంతోను, రెండు రకాల వాత్సల్యం శ్రీనివాస్ ఊహాపథానికి అడ్డు తగిలింది. దేనికయితే అతను దూరం కావాలని ప్రయత్నించాడో దానికి చేరువయిపోతున్నాడు. ఏ కారణంచేత అతనిలో అశాంతి స్థావరం చేసుకుంటుందని భయపడ్డాడో దానినుండి పారిపోలేకపోయాడు. తిరిగి అనుభవించలేని మనోవేదనతో అశాంతితో అనుకోకుండా ఆ ఊరు చేరిన శ్రీనివాస్ ను అనూరాధ పరిచయం దివ్యానుభూతులతో, అందమయిన ఆలోచనలతో ముంచెత్తింది.
ఈ పని ఏమాత్రం హర్షించలేకపోయినది కృష్ణమోహన్ ఒక్కడే. రాజశేఖరం గారికి చూచాయగా తెలిసినా, తనదాకా వస్తేగాని తనంతట తను జోక్యం కలిగించుకోవటం భావ్యంగా తలచలేదు. కాని శ్రీనివాస్ విషయంలో కొంత పక్షపాతం వహిస్తున్నది రాధ అన్న అనుమానం కలిగిందేకాని కృష్ణమూర్తి గారి బాధ్యాతకూడా ఉందని అనుకోలేదు. ఆ విషయం కృష్ణమోహన్ ద్వారా విని ఆశ్చర్యపోయారాయన.
తను వైద్యవృత్తి ప్రారంభించడం అనేది అసంభవం అనుకున్న శ్రీనివాస్ ఆలోచనలు 'ఆలోచించాలి' అనేచోట మజిలీచేసి, ఆచరణలో పెట్టడమా? మానడమా? అన్న మీమాంసలో కొట్టుకుపోయేవరకు వచ్చింది.
సంధ్యాదేవి చక్కదనాల చుక్కలా వేంచేసి, పరువాల పడుచులా వెనక్కి తగ్గింది. చీకటి చీర కప్పుకుని, మబ్బుల నీలాకాశాన్ని నల్లబరిచింది. సూర్యుని బాలకిరణాలలో, సాయంత్రపు చల్లని పలచని వెలుతురులో మరుగునపడే నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్నాయి.
సన్నజాజిపందిరికింద వాలుకుర్చీలో, టేబుల్ లైటు వెలుగులో పుస్తకం చేతిలో పెట్టుకుని కూర్చుంది అనూరాధ. చేతిలో పుస్తకం ఉన్నా, చల్లని గాలులలో సన్నజాజి పరిమళంలో అంతరంగం అందమయిన ఆలోచనలలో విహరిస్తున్నది.
ఆ సాయంత్రం జీవితంలో నూతనాధ్యాయానికి నాంది పలికిన సమాగమం కలో, నిజమో అన్న అనుభూతి దాటిపోలేకుండా ఉంది. ఆ సాయంత్రం సముద్రపుఒడ్డుకు రమ్మని అడిగాడు శ్రీనివాస్. తీరా అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడాలో తెలియలేదు. రాధను ఎన్నో అడగాలని, ఎంతో చర్చించాలని ఆలోచించుకున్న అతనికి ఆ రోజు ఎక్కడ మొదలుపెట్టాలో తెలియనంతగా మౌనం ఆవరించింది.
మామూలు కబుర్లు సాగుతూంటే, అంతలో వారి ముందు తెల్లని చీరతో వనకన్యలా ఓ అమ్మాయి అందంగా పక్కనించి నడిచిపోయింది, ఒక యువకునితో కలిసి వెడుతున్న వారివంక చూస్తూ, "అనూరాధా!" అని పిలిచాడు.
"ఊఁ."
"వాళ్ళు చాలా బాగున్నారు కదూ?"
చిరునవ్వుతో అతని ముఖంలోకి చూచింది. అప్పటికే అతని కళ్ళు ఆమెలో భావాలు వెతుక్కోవాలని అత్యాశగా చూస్తున్నాయి. మాటల్లో వ్యక్తంకాని తత్తరపాటుతో అతని నయనాలు చలిస్తూఉంటే కళ్ళు కిందికి వాలిపోయాయి అనూరాధకు.
* * *

అతను ఆప్యాయంగా ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని మృదువుగా ఉంగరం కదిలిస్తూ అన్నాడు:
"అనూరాధా, నన్ను పెళ్ళి చేసుకుంటావా?"
".................." వెంటనే సమాధానం ఇవ్వలేదు.
"మీరు తిరిగి మెడిసిన్ లోకి వెడతారా?" అంది కొంతసేపయ్యాక.
"అనూ..." సుదీర్ఘమయిన నిట్టూర్పు విడిచాడు. కొద్ది నిమిషాలు అనంతరం "వెడతాను, అనూ. కాని ఒంటరిగా కాదు, జీవితంలోకి జంటగా, నీతోపాటు వెడతాను. కాని నువ్వనుక్షణం నాతో ఉండాలి.'
"తప్పకుండా, శ్రీనివాస్ అదే నా కోరికకూడా."
"ఎందుకు, అనూరాధా, నీకింత అత్యాశ. నాకు లేని నమ్మకం నీ కెలా కలిగింది?నేనంటే నీ కెందు కింత అభిమానం?"
"అలా మాట్లాడతారేం?" ఆ రోజు నేను జ్వరపడ్డానంటే మీరెందుకంత కంగారుపడ్డారు? మీకు ఇంతవరకు లేనిది కలిగించాలనే నా ఆశ. మునుపెన్నడూ ఎరగని సుఖసంతోషాలు మీకు కలగాలనే నా కోరిక."
"ఏమో, నాలో ఏం చూచి నువ్వీ బాధ్యత వహిస్తున్నావో నా కర్ధం అవడం లేదు."
"మీలో ఏం చూడాలి? నా అవసరం ఉన్న వ్యక్తి నాకు కావాలికాని, ముక్కుమొహం ఎరగని వ్యక్తి నాకు ఎందుకు? ఒకరికి అవసరపడటంలోనే ఆనందం ఉంది."
శ్రీనివాస్ ముఖం ఆనందంతో విప్పారింది. అదొక విచిత్రానుభూతి. జీవితంలో మునుపెన్నడు ఎరగని, మరెన్నడు కలగబోని అనుభూతి."
"నా కెంతో సంతోషంగా ఉంది ఈ రోజు. నాకిప్పుడేమనిపిస్తూందో తెలుసా? నిన్నొక్కసారి గట్టిగా హత్తుకుని నాలో ఐక్యం చేసుకోవాలనిపిస్తూంది" అన్నాడు చిలిపిగా, కింద ఇసుకలో వేలితో రాస్తూ. అతనివంక చూచి, కింద ఇసుకలో రాసిఉన్న పేర్లు చూచింది. 'అనూరాధ....అనురాగసుధ." మనసులో మళ్ళీ చదువుతూ అతనివైపు చూచి చిరునవ్వు నవ్వింది. అది ప్రేమసామ్రాజ్యాన్ని గెలుచుకున్న పట్టమహిషిదో, ఓటమే ఎరగని విజేతదో! ఆ నవ్వులో విజయచిహ్నంతోపాటు ఒక గర్వవీచికకూడా కదలాడింది.
* * *
"అనూ..."
ఉలిక్కిపడింది. అందమయిన ఆలోచనలనుండి అమాంతం బయట పడింది. సర్దుకుని లేచి నుంచుంటూ, ఎదురుగా ఉన్న తండ్రిని చూచింది.
"ఏం నాన్నా?"
"అహఁ. ఏమీలేదు. నీతో మాట్లాడదామని. చదువుకుంటున్నావల్లే ఉందే!"
"పెద్దగా ఏమీలేదు. కూర్చోండి."
చుట్టూ పరికించి చూచి "ఇక్కడకాదు. పైన గదిలోకి వెడదాం" అన్నాడు.
పైకి వెళ్ళి మాట్లాడేఅంతటిదయితే, ఏదో ముఖ్యమయినదే అనుకుంటూ తండ్రిని అనుసరిస్తూండగానే ఒక్కసారి గుండె జల్లుమంది! 'ఏ పెళ్ళి సంబంధం గురించి అయినా కాదుగదా?'
"ఏం నాన్నా?"
"ఏం లేదు. నీతో శ్రీనివాస్ ను గురించి మాట్లాడదామని..."
తేలికగా నిట్టూర్చింది.
"నేను వింటున్నవి నిజమయినవో, కావో అని,"
"ఏమిటవి?"
"అదే అతను మళ్ళీ ప్రాక్టీసును గురించి ఆలోచిస్తున్నాడని..."
"నిజమే నాన్నా. తిరిగి మరొకసారి ప్రయత్నిస్తారుట."
"నాకు ఆశ్చర్యంగా ఉంది."
"అంత ఆశ్చర్యానికేముంది ఒక డాక్టరు ప్రాక్టీసు పెట్టడంలో?"
"ఇందులో నీ ప్రోద్బలం ఉందా?"
"ఆయన స్నేహితుడు. అసలు లేకుండా ఉంటుందా?"
"అసలు లేకుండా ఉండకపోయినా, అతిగామాత్రం ఉండటం మంచిది కాదు."
"అదేమిటి, నాన్నా, నువ్వూ అన్నయ్యలాగే అంటావు?"
"అవును, రాధా స్నేహితులుగా మేమూ కాస్తో, కూస్తో తెలియచెప్పాము. కాని 'అది అసంభవం' అన్న వ్యక్తి అందులోకి దిగబోతున్నాడంటే దానిలో ఇతరుల ప్రోత్సాహం లేకుండా ఉంటుందా?"
"ఆయన డాక్టరయి, చిన్న చిన్న కారణాలతో వెనక్కి తగ్గుతున్నారంటే ప్రోత్సాహం అవసరం కాదా?"
"ప్రోత్సాహం అవసరమే. నిర్ణయంమాత్రం ఇతరులది కాకూడదు. అతను చెయ్యబోయే పనులలో కష్టనిష్ఠూరాలు భరించవలసింది అతను. అందుకే ఆ గమ్యానికి చేరేందుకు వెయ్యవలసిన ప్రతి అడుగు అతని కృషిమీదేగాని, ఇతరుల ఒత్తిడి మూలంగా ఉండకూడదు."
"........."
"అమ్మాయ్, నీకు తోచిన సలహా నువ్విచ్చావు. అతని అభివృద్ధికి దోహదం ఇవ్వవచ్చుగాని, అతని అభిప్రాయాలకు బాధ్యురాలివి మాత్రం కావద్దు."
