రమేశ్ దిక్కుతోచక "అయితే ఇపుడేం చేద్దాం?" అన్నాడు.
"అన్నీ మరిచిపోయి, కొత్త జీవితం ప్రారంభించండి....."
రమేశ్ ఏమో చెపుదామని నోరు తెరచాడు. కాని, రత్న అతడిని మాట్లాడనీయక:
"మీరన్నీ మరిచిపోగలరు. అదేమంత అసాధ్యమైన పనికాదు. ఏళ్ళు గడిచిన కొద్దీ ఈ పాత ప్రకరణాలన్నీ అర్ధంలేనివిగా అనిపించవచ్చు. గడిచిపోయినదాన్నే తల్చుకుంటూ, భవిష్యత్తు లేదని భావించేటంత ముసలివాళ్ళు కాదుమీరు. మీ జీవిత మంతా ఇక ముందే ఉంది. ప్రయత్నిస్తే దీన్ని ఓ పీడకలగా భావించి మరిచిపోవచ్చు."
"పాతదాన్ని మరచిపోవాలంటే, కొత్తదేదైనా కావాలికదా?...... మీ కైతే ఆశా ఉంది...... కాని నాకు?"
"మీ చదువు, వృత్తి, సంసారం-వీటికన్నా ఏం కావాలి మీకు?"
"కాని అందులో నేను మనఃపూర్వకంగా కోరుకునేది ఒక్కటీ లేదు."
కోపంతో రత్న-మొహం కందగడ్డయింది. కనుబొమలు ముడివేసి గుప్పిలి బిగించి:
"నా చేత బాగా దెబ్బలు తినాలని ఆశగా ఉంటే అలా మాట్లాడండి. ఒక్కోసారి మీరు మరీ మూర్ఖంగా మాట్లాడుతారు. మిమ్మల్నేం చెయ్యాలో తోచటంలేదు-" అంది. అలా అంటూనే గడియారంవైపు చూసి "పదకొండున్నరయింది. ఇక పడుకోండి" అంటూ లేచింది.
"ఇంకా డాక్టర్ రాలేదే!"
"ఆయన ఎప్పుడొస్తారో ఏమో. మీరు పడుకోండి" అంటూ అతడి గదిలోకి వెళ్ళి పక్క సరిజేసి బయటకు వచ్చింది.
రమేశ్ పసిపిల్లాడికి మల్లే లేచి-వెళ్ళి పడుకున్నాడు.
రత్న చేతిలో ఓ పుస్తకం పట్టుకుని పడుకుంది. ఆమె కళ్ళవెంట అశ్రువులు ప్రవహిస్తున్నాయి.
రమేశ్ బొంబాయి వచ్చి ఒక నెలకు పైగా అయింది. రత్న-స్నేహాదరాలతో అతడికి రోజులు గడిచిపోతున్న విషయమే తెలియటంలేదు. కాని కొద్దిరోజులు ఉండి వెళ్ళటానికి వచ్చిన రమేశ్ ఎన్ని రోజులని ఉండగలడు? రత్న-ఇల్లు పరాయి ఇల్లని అతడికి ఏనాడూ అనిపించలేదు. కాని, తన్ను రోజురోజుకూ బలంగా బంధిస్తున్న వలను కత్తిరించి, వీలయినంత తొందరగా అక్కడినుండి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
ఒక సాయంత్రం రత్న, రమేశుడిని బాంద్రా బీచికి తీసుకుని వెళ్ళింది. ఆకుపచ్చరంగుతో ఎండినిల్చిన కొన్ని రాళ్ళను దాటి, విశాలంగా ఉన్న ఓ రాతి మీద కూర్చున్నారిద్దరూ.
నిర్జనంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి, తాము ఉన్నది బొంబాయి అనే విషయమే మరిచిపోయాడు రమేశ్.
అస్తమిస్తున్న సూర్యుడు బంగారపు పళ్ళెంలా కనిపిస్తున్నాడు. 'నీ శక్తెంతో చూపు' అన్నట్టుగా ఎగసిబడుతున్న అలలను అందుకోవాలని సూర్యుడు ప్రయత్నింస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. సూర్యుడు గిరగిరా తిరుగుతూ, అలలతో ఆడుకుంటున్నాడు.
రమేశ్ అన్నాడు?
"రత్నా, నాకు ఊరికి వెళ్ళటానికి అనుమతివ్వండి."
రమేశుడివైపు చూడకుండానే, అస్తమిస్తున్న సూర్యుడివైపే తదేకంగా చూస్తూ రత్న అంది:
"ఒక షరతుమీద మాత్రమే పంపగలను."
"ఏమిటది?"
"మీరు చదువు పూర్తి చేసి, డాక్టరయి, పెళ్ళి చేసుకోవాలి. ఇలా మాటిస్తే, రేపే వెళ్ళటానికి ఒప్పుకుంటాను."
రమేశుడు కొంచెం ఉద్రేకంతో "మీరు ఎంతో సుళువుగా ఆ మాట చెప్పేస్తున్నారు. కాని నాకదంత సుళువుగా అనిపించటంలేదు. మిమ్మల్ని అంత త్వరగా నేను మరిచిపోలేను. నన్ను మీరు అంత త్వరగా మరిచిపోగలరా?" అన్నాడు.
రత్న-మనసు ఒక్కక్షణం తటపటాయించింది: "ఏం చెప్పను? ఏం చెప్పను?" అని.
ఆఖరికి ఆమె మనసు ఒక నిశ్చయానికి వచ్చింది. నెమ్మదిగా:
"ఆఁ మీరు వెళ్ళిన మర్నాడే నేను మిమ్మల్ని మరిచిపోగలను."
"అదెలా సాధ్యం?"
"ఎందుక్కాదు? మిమ్మల్ని గుర్తుంచుకుని మాత్రం ప్రయోజనమేముంది? ఈ జబ్బుకు మరుపుకన్నా దివ్యౌషధం వేరేలేదు. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోలేదు. రేపు మీరు వెళ్ళిపోయినా, మళ్ళీ ఒక్కక్షణం కూడా మిమ్మల్ని తల్చుకుని బాధపడను....."
రమేశ్ కోపంతో "నాటకం చాలు రత్నా" అన్నాడు.
"నాటకమా!"
"అవును...... ఇన్నిరోజులూ నాతో మీరు నాటకమాడారు. నేను మీకంత చులకనైపోయానా?"
"నాదంతా నాటకం, అభినయం అని ఒప్పుకుంటే, మీరు నన్ను సులభంగా మరిచిపోగలరా?"
రమేశ్ కోపోద్రేకంతో "ఇహ చాలు, మీ నిజరూపం ఈ రోజు బయటపడింది" అన్నాడు.
రత్న మొహం వివర్ణమైంది, కాని, మృదువుగా:
"రమేశ్!" అంది.
కోపగించిన బిడ్డలా అమెవైపు వీపుతిప్పి కూర్చున్నాడు.
"మిమ్మల్ని నొప్పించావా రమేశ్?"
రమేశ్ పలుకలేదు.
రత్న మెల్లిగా అతడి భుజంమీద చెయ్యి వేసి:
"ఇటు చూడండి రమేశ్! నన్ను మరవటం మీ కెంత కష్టమో, మిమ్మల్ని మరిచిపోవటం నాకూ అంత కష్టంగానే ఉంది. కాని, జీవితంలో మళ్ళీ మనం కలుసుకోమేమో. మన జీవితాలు వేర్వేరు దిక్కుల్లో ప్రవహిస్తున్నాయి. అందుకే ఈ పిచ్చి వద్దంటున్నా. నిప్పులో చెయ్యిపెట్టి కాల్చుకోవటం మూర్ఖత్వం రమేశ్! కనుకనే ఇద్దరం ఒకర్నొకరు మరిచిపోవటానికి ప్రయత్నిద్దాం" అంది.
"ఎలా రత్నా! ఎలా?" రమేశుడి కంఠంలో ఆవేదన పొంగి పొరలింది.
"నాకు ఆశా ఉంది. మీకు....."
"నా కేముంది?"
"మీకు అన్నీ ఉన్నాయి....."
"కాని, నాకు రత్న కావాలి" అంటూ, రత్న-చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెను తనదగ్గరగా లాక్కున్నాడు రమేశ్. రత్న కాదనలేదు. కాని శాంతంగా:
"అగ్నిలో ఆజ్యం పోస్తే మంట ఎక్కువ అవుతుంది. మనిద్దరి మధ్యా లేచిన ఈ మంటను మనం నీళ్ళుపోసి ఆర్పడానికి ప్రయత్నిద్దాం" అంది.
రమేశ్ చటుక్కున ఆమె-చెయ్యి వదిలేసి లేచి నిల్చున్నాడు.
"పదండి ఇక్కడినుండి వెళ్ళిపోదాం" అంటూ ఆమెకన్నా ముందుగానే బయల్దేరాడు.
"ఏం" అంటూ లేచింది రత్న.
"చీకటి పడింది, నిర్జన ప్రదేశం. దొంగ లెవరైనా వస్తే....." అంటూ వేగంగా అడుగులు వేయసాగాడు రమేశ్. రత్న అతడిని అనుసరించింది. బస్ స్టాప్ దగ్గరకు వచ్చాక రత్న అడిగింది:
"ఎందుకలా పారిపోయి వచ్చారు?"
"దొంగల భయం నాకు. నాకన్నా వేరే దొంగలు అక్కడ లేదనుకోండి. నామీద నా కా క్షణంలో నమ్మకం లేకపోయింది. ఇంకో క్షణం మనం అక్కడే ఉంటే, మిమ్మల్ని ఏం చేసేవాడినో చెప్పలేను. అందుకే అలా పరుగెత్తుకుని వచ్చేశాను......."
రమేశ్ నిష్కపటంగా వివరించాడు.
కల్లా కపట మెరుగని అతఃది మొహాన్ని చూసి వాత్సల్యంతో అతడి చేయందుకుని మృదువుగా నొక్కి:
"నిజంగా మీ దెంత సహృదయం!" అంది.
"ఎందుకలా అంటారు?"
"మీరు ఊరికి వెళ్ళి చదువు పూర్తిచేసి పెళ్ళి చేసుకోండి. అందాక నాకు శాంతి లేదు. మీ జీవితం నావల్ల నాశనం కాకూడదు రమేశ్! నేను మీ దగ్గరికి రాకుండా ఉండాల్సింది. చాలా దూరంగా ఉండిపోవాల్సింది...."
రమేశ్ కొంటెగా "మీరు నాదగ్గర కెప్పుడొచ్చారు? ఇప్పుడు నానుండి ఓ అడుగు దూరంలోనే ఉన్నారు" అన్నాడు.
రత్న తన పక్కగా నడుస్తున్న రమేశుడివైపు చూసింది. ఒక అడుగు దూరంలో నడుస్తున్నాడు.
అతడి కళ్ళు మెరుస్తున్నాయి. ఉంగరాల జుత్తు రేగి నుదుటిమీదకు పడుతోంది. రత్నకు అతడి నుండి ఒక్క అడుగుకూడా దూరంగా ఉండలేననిపించింది. వెంటనే అతడి దగ్గరగా వచ్చి:
"లేదు! మీకు చాలా దగ్గరగా ఉన్నాను" అంది.
రమేశ్ ఆమెవైపు తిరిగి చూడకుండానే, కుడి చేతితో ఆమెను తన దగ్గరికి లాక్కుని, సర్వదా ఆమెను రక్షించేవాడిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు. అతడేమీ మాట్లాడకపోవటం చూసి రత్న:
"ఏమీ మాట్లాడరేం?" అంది.
"మాటల ఆవశ్యకత ఉందంటారా?"
"ఊఁ, మన మాటల శబ్దమైనా మనల్ని హెచ్చరించ నివ్వండి. నాకు వాగ్ధానం చేస్తారా?"
"ఇప్పటికి నన్ను క్షమించండి. మీరు నా దగ్గరగా ఉన్నారు. ఇది కలో, వాస్తవమో నాకు తెలియదు. కలే అయితే దీన్నే ఆఖరిదాకా ఉండిపోనివ్వండి."
రత్నకు మళ్ళీ అతడిని పలకరించే సాహసం కలగలేదు.
ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరచి ఉన్నాయి. నళిని రేడియో సిలోన్ వింటూ కూర్చుంది.
నళినిని చూడగానే రత్నకు తాను అపరాధి ననిపించింది.
"ఎప్పుడొచ్చావ్ నళినీ?" అంది ఆమెవైపు చూడకుండానే.
"అరగంటవుతోంది. దేశాయి గారింట్లో ఆశా ఉంటే, తాళం చెవి తెచ్చి, రేడియో పాటలు వింటూ కూర్చున్నా ఓ.......నమస్తే!" అంది నళిని అప్పుడే రమేశుడిని చూసినట్టు.
"డాక్టర్ రాలేదా?" నళిని అడిగింది.
"లేదు."
"ఎన్నింటి కొస్తారు?"
"పది గంటలకు ముందు రారు."
"నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. డాక్టర్ని పిలవమన్నారు. క్లినిక్ కు ఫోన్ చేశాను, అక్కడా లేరు. రేపు ఉదయం క్లినిక్ కు వెళ్ళేముందు అక్కడికి వచ్చి వెళ్ళమను."
చేతిలోని గాజులను తిప్పుతూ అంది నళిని. అందంగా, చక్రాకారంలో, అజంతా మాదరిలో వేసుకున్న ఆమె-ముడి ఆమె తెల్లటి మెడను, మింత బాగా కనిపింప చేస్తోంది. ముత్యాను గుచ్చిన నల్లటి పట్టుదారపు కుచ్చులు వీపుమీద పడి ఉన్నాయి.
ఎంతటి అందగత్తె నళిని!
కాని, ఏం లాభం? ఒక యువకుడిని ఆకర్షించలేని ఆమె అందం ఎందుకూ?
రత్న ముగ్దురాలై నళిని - సౌందర్యాన్ని చూస్తోంది.
తనదీ తప్పే. రమేశుడిని తమ ఇంట్లోకన్నా, నళిని ఇంట్లో అతిధిగా ఉంచి ఉంటే బాగుండేది,
రత్న రమేశుడివైపు చూసింది.
అతడు సంకోచంలో ఏమీ మాట్లాడటానికి తోచక అలాగే నిల్చున్నాడు. తనతో అంతగా మాట్లాడే రమేశ్, ఇంకెవరైనా వస్తే మూగ నోము పట్టేవాడు.
అంతలో ఆశా తుఫానులా పరిగెత్తుకుని వచ్చి నళిని కాళ్ళను పెనవేసుకుంది.
"అమ్మా! నళినక్కయ్య ఎంత బావుందో!"
నళిని పక్కన ఉన్న కుర్చీమీదకెక్కి, ఆమె బుగ్గలు, కంఠం-అన్నీ చేత్తో తాకి :
"అమ్మా! అక్కయ్య ఎంత బావుందో" అంది ఆశా.
కూతురి సంబరం, ఆనందం చూసి రత్న నవ్వుతూ:
"అంత అందంగా ఉన్నవాళ్ళను అంతగా తఃకరాదు; మాసిపోతారు వాళ్ళు" అంది.
"అవునా అక్కయ్యా?"
"లేదు ఆశా! ఏమీ కాదు."
వారి మధ్యలో ఏం మాట్లాడాలో తెలియక వంటరిగా నిలబడిపోయిన రమేశ్, వాళ్ళంతా మాటల్లో-పడటం గమనించి, చప్పుడు చెయ్యకుండా అక్కడినుండి జారుకున్నాడు.
రమేశ్ వెళ్ళిపోవదాన్ని గమనించి రత్న:
"ఆశా! నీ స్నేహితురాలు పిలుస్తున్నట్టుంది చూడు" అంటూ ఆశను బయటికి పంపింది.
రత్న, నళిని దగ్గరగా జరిగి నెమ్మదిగా!
"నళినీ! నీ కెందుకింత పట్టుదల?" అంది.
"అంటే?
"అదే, రమేశుడితో కాస్త కలిసి మెలసి తిరిగి..."
రత్న మాట పూర్తి చేయకమునుపే నళిని బద్ధకంగా వళ్ళువిరిచి "నా కేమంత ఆసక్తి లేదులే ఆ విషయంలో" అంది.
"ఏం?"
"నిజం చెప్పనా?" నళిని సూటిగా చూస్తూ అడిగింది.
రత్న-గుండె గబగబా కొట్టుకుంది. తమ 'ఊఁ' అంటే, నళిని ఏం చెపుతుందో?
తలవంచుకుంది రత్న.
"నా క్కాబోయే భర్త నన్నే మనస్ఫూర్తిగా ప్రేమించాలని కోరుకోవటంలో తప్పులేదనుకుంటాను. నా భర్త ప్రేమను ఇంకో స్త్రీతో పంచుకోవటానికి నేను సిద్ధంగా లేను."
"నువ్వు పొరబడుతున్నావు నళినీ....."
"ఇహ ఆ సంగతి వదిలేయి రత్నా. రేపు డాక్టర్ని మా ఇంటికి మరవకుండా పంపాలి. అన్నట్టు ఆశా ఏదీ" అని మాట మార్చింది నళిని.
తర్వాత తొమ్మిదింటిదాకా ఏవో కబుర్లు చెపుతూ కూర్చున్నారిద్దరూ. పొద్దుపోయినట్టే తెలియలేదిద్ధరికి. తొమ్మిది గంటలకు నళిని తన వాచీ చూసుకుని:
"ఇక వస్తాను" అంది.
"ఒక్కదానివే వెడతావా? రమేశ్ ను రానీ. తోడు వస్తారు."
నళిని నవ్వింది. ఆమె అందమైన పలువరుస ఎర్రటి పెదవుల వెనక తళుక్కుమంది.
నళిని మాటాడకుండా తన వ్యానిటీ బ్యాగ్ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది.
రత్న చాలాసేపటివరకూ కూర్చున్న చోటినుండి కదలలేకపోయింది. సుడిగాలిలో చిక్కిన ఎండుటాకులా ఆమె హృదయం అల్లలాడి పోయింది.
రెండు విభిన్న భావోద్వేగాల తాకిడికి తట్టుకోలేక పోతోంది రత్న.
రమేశుడి ప్రేమ, స్నేహప్రవాహంలో రత్న అసహాయురాలై ఏదో అవ్యక్త శక్తిచేత నెట్టబడుతున్నట్టుగా తేలిపోతోంది.
అటువంటి నిర్మలమైన ప్రేమను చవిచూసి ఎరుగదామె. భర్త ప్రేమ ఆమెకెన్నడూ లభించలేదు. శేషగిరి నూరు నయాపైసల డాక్టరు. అతడి దగ్గర ఏవిధమైన సభాకతకు కాని, స్నేహ, ప్రేమలకు కాని స్థానంలేదు. అతడి దృష్టిలో హృదయ మంటే దేహానికి రక్తాన్ని సరఫరాచేసే అవయవం మాత్రమే. ఎవరయినా హృదయం గురించి మాట్లాడితే, స్టెతస్కోపు చేతిలోకి తీసుకోవటమే తెలుసు వతడికి.
భావుకత హృదయ దౌర్భల్యానికి చిహ్నం. అదో రకమైన జబ్బు. ఆ జబ్బును ఏ విటమిన్ తో కూడా నయం చెయ్యలేం. ఒక్కసారి అది మానవుడిమీద దాడి చేస్తే, ఇక అతడు ఎప్పటికీ దాని ఆక్రమణ నుండి, దానివల్ల కలిగే అశక్తత, పరధ్యానం, నిరుత్సాహం-వీటినుండి తప్పించుకోలేడు. కనుకనే, ప్రతీ మనిషి ఆ జబ్బు తనకు తగలకుండా జాగ్రత్త పడాలి అనే సిద్ధాంతం అతడిది.
