మాట్లాడ్డం ముగించి ఆమె సోఫాలో నీరసంగా కూర్చుంది. అతను మెల్లిగా, "ఏమిటి కారణం వసంతా?" అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
"మీ వొదినని రమ్మని చెప్పడం మరిచి పోకు-సాయంత్రం తొందరగా వొచ్చీ..."
అతను వెళ్ళిపోయాడు.
సాయంత్రం అనుకోకుండా ఆమెకూడా బయలుదేరింది స్టేషనుకి. ఇంకా గంట వ్యవధి ఉన్నా హౌరాబ్రిడ్జిమీద జామ్ కి భయపడి అతను ముందరగానే బయలుదేరాడు.
స్టేషన్ కి చేరేసరికి ఇంకా అరగంట వ్యవధి ఉంది.
సామాను కంపార్టుమెంటులో పెట్టించి కొత్త సూట్ కేస్ చూసి, "అదేమిటి?" అన్నాడు గోపాలం.
"బట్టలు-చిల్లర వస్తువులు- మీ చెల్లెలికీ, వొదినకీ"
"థాంక్స్" అన్నాడు ఇంకేమీ అనలేక.
ఐదు నిమిషాలు కూర్చుని. "ఇంకా ఇరవై నిమిషాలు పైగా ఉంది టైము, నువ్వు వెళ్ళు అన్నాడు గోపాలం, ఆ నిశ్శబ్దం అంత రొద మధ్యా అతనికి ఇబ్బందిగా ఉంది.
"తొందర లేదు" అంది వసంత.
"నేను ఆదివారం వస్తాను కారు పంపించు" అన్నాడు సంభాషణ పొడిగించడానికి గోపాలం.
"అలాగే కాని, లలితతో మాత్రం మరీ మరీ చెప్పేనని చెప్పు."
"నువ్వూ రావలసింది..."
"అవును కాని- నీకు తెలుసును."
నాకేమీ తెలీదు అనుకున్నాడు గోపాలం.
"మీ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూస్తాను-నువ్వూ కొంచెం జాగ్రత్తగా వుండు.......ఈ మధ్య మరీ నీరసించేవు"
"అలాగే-"
లోపల వేడిగా ఉంది బయటికి వెళ్ళిప్లాట్ ఫారమ్ మీద అటూ ఇటూ తిరగ సాగేరు, జన సమ్మరం ఎక్కువగా ఉంది. ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తూంటే ఒక కంపార్ట్ మెంట్ దగ్గర చిన్న అమ్మాయీ, ఇంకా చిన్న అబ్బాయీ కనిపించేరు.
ఆమె చేతిమీద అతనిచెయ్యి బిగుసుకుంది. వాళ్ళిద్దరినీ చూస్తూ అతను నిలబడిపోయాడు.
అవును. ఆమె ఆరోజు మెమోరియల్ లో...
తనవేపు క్షణ,మాత్రం చూసి నవ్వింది.
వొంగి, "నీ పేరేమిటి?" అన్నాడు ఇంగ్లీష్ లో.
"లల్లీ."
మరుక్షణం లల్లీ తమ్ముడితో ఇతరమైన విషయాల్లో ములిగిపోయింది.
మరో నిమిషం వాళ్ళవేపు చూసి సాగిపోయాడు గోపాలం. నియోసి లైటు కాంతిలో ఆమె ముఖంలోకి చూశాడు.
విచిత్రంగా కనిపిస్తోంది ఆమె ముఖం.
నాలుగైదుసార్లు అటూ ఇటూ తిరిగాడు-రైలు బయలుదేరే టైమయిపోయింది.
వసంత వెళ్ళిపోయింది. రైలు కదులుతోంది. నెమ్మదిగా, పాయింట్స్ దాటుకుంటూ.
రైలు ఖరగ్ పూర్ చేరేవరకూ అతను వసంతని గురించే ఆలోచిస్తున్నాడు. ఒకసారి సూట్ కేస్ తీసి చూశాడు. రెండు చీరెలు, బ్లౌజ్ పీసెస్, టెరెలిన్ చొక్కాలు రెండు, రంగుల పెట్టెలు, స్కూల్ బేగ్-
కిటికీలోంచి బయటికి చూశాడు....చిన్నచిన్న ఊళ్లు ఎన్నో!- దీపాలు నిమిషం కనిపించి వెనపకడిపోతున్నాయి. మళ్ళీ- దీపాలు...
వసంతలాగ....క్షణం ఆమె నవ్వుతోన్న గులాబి... మళ్ళీ క్షణం ఏదో...
ఖరగ్ పూర్ లో అన్నం తిని పడుకోవటానికి ప్రయత్నించేడు. అంత పెందరాళే పడుకొనే అలవాటు లేదు. పుస్తకం ఏదీ పడసుకోలేదు.
సూట్ కేస్ తీసి చూశాడు- గడియారం లోపల పెట్టేందుకు, మీదనే ఆ రోజు తాను కొనుక్కున్న పుస్తకం వుంది. మనస్సు దాని మీద నిలవలేక పోయాడు. ఆ క్షణం వసంత దగ్గరగా వుంటే ఎంత బాగుండును! అనుకున్నాడు.
చాలాసేపు పడుకొని ఆలోచించసాగాడు. చివరకి నిద్దరవొచ్చింది. నిద్ర పట్టేముందు లల్లీ నవ్వు జ్ఞాపకం వొచ్చింది అంధకారంలో జ్యోతిలాగ.
22
అతని కోసం వెంకట్రామ్ కారు పంపేడు స్టేషన్ కి. ఆయన తొలిరోజు మద్రాసు వెళ్ళి నట్టు డ్రైవరు చెప్పేడు.
తిన్నగా అన్న ఇంటికి వెళ్ళేడు. ఈ కొంచెం కాలంలోనూ ఎంతో కొత్తగా వుంది ఊరు.
చిన్న పందిర.
లోపల అంతా పనుల్లో ఉన్నారు. బాబు తనని చూసి అమ్మకోసం పరిగెట్టేడు. పెళ్ళి వేరే ఇంట్లో ఏర్పాటయింది.
బాబుని ఎత్తుకుని, సరళని పలకరించి వొదిన కోసం లోపలికి వెళ్ళేడు.
"నీకోసమే ఎదురు చూస్తున్నానయ్యా....వసంతని తీసుకురాలేదేం?" అంది.
"రాలేదు- ఉత్తరం రాశాను కదూ?"
"రాయడమేమిటి?- తీసుకురావాల్సింది... చుట్టాలందరూ విడిదిలోనే ఉన్నారు-పద, కాఫీ తాగు అన్నట్టు, అన్నం తిన్నావా?"
"తిన్నాను, కాఫీ ఇయ్యి, అన్నయ్య ఏడీ?"
"విడిదిలో ఉన్నారు. సామాను లోపలిగదిలో పెట్టు... దిగు బాబూ- బాబయ్యకి కాఫీ ఇద్దాం...
కాఫీ తాగి తనూ విడిదికి వెళ్ళేడు.
అక్కడా అంతా హడావుడిగా ఉంది, అందర్నీ పలకరించి మళ్ళీ ఇంటికి వచ్చాడు. అలసటగా ఉంది.
కొంచెం సేపు కుర్చీలోనే పడుకున్నాడు.
సాయంత్రం లేచేడు - ముహూర్తం రాత్రి.
ఎవరి పనుల్లో వాళ్ళున్నారు.
స్నానం చేసి బయటికి బయలుదేరేడు. అక్కడా అక్కడా తిరిగి బీచ్ చేరుకున్నాడు.
సముద్రం చూసేసరికి ఒక్కసారి ప్రాణం లేచి వొచ్చింది. అవి నీల తరంగాలూ, మెరుస్తోన్న నీల తరంగాలూ, మెరుస్తోన్న తరంగ శిఖరాలూ, ముత్యాల హారాలాగ నురగల్లో ఒక్కసారి అతన్ని ఆనంద శిఖరాలకి ఎత్తేయి.
నడిచి నడిచి మఠం అవతలికి చేరుకున్నాడు ఇసకలో కూర్చోగానె ఒక్కసారి ఇంటికి వొచ్చి నట్టనిపించింది.
చాలాసేపు తనివితీరా అక్కడ కూర్చున్నాడు సముద్ర సౌందర్యం కళ్ళతోతాగేస్తూ. కాలగమనమె తెలియలేదు తనకి.
సూర్యాస్తమయం అవుతుంటే తనూ వసంత అక్కడ కూర్చున్నరోజులూ, అప్పటి సంఘటనలూ జ్ఞాపకం వొచ్చాయి, ఈ నాడు ఆమె తన దగ్గర ఉంటే ఎంత బాగుండును!
ఆ ఇసకలోనే, ఆ చోటనే....
శమ్మీ జ్ఞాపకంవొచ్చింది. మొట్టమొదట శమ్మేయే వసంతని తన దగ్గరికి తీసుకొచ్చింది. నవ్వుకున్నాడు.
ఈ ప్రశాంతతలో, ఈ విశాల సముద్ర సమక్షంలో వసంత మళ్ళీ మళ్ళీ అతనికి జ్ఞాపకం వొచ్చింది. నిన్న సాయంత్రమే ఆమె దగ్గర తానున్నట్టూ, ఆమె చెయ్యి తన చేతిలో ఉన్నట్టు అనిపించలేదతనికి. ఎన్నాళ్ళో ఐ పోయినట్టని పించింది.
మనస్సుని నీడల్లోంచి వేధిస్తూన్న ఒకప్రశ్న ఇవేళ బయటికి వొచ్చింది. నిన్న వసంత ఎందుకు ప్రసన్నురాలైంది? వారంనించి తన లోకాల్లోకి రాని మనిషిలో నిన్న హఠాత్తుగా మార్పు ఎందుకు వొచ్చింది!
తనతో ఆమె ఎందుకు రాలేదు?
ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది టాక్సీలో?
అక్కడ ఏం జరిగింది?
ఈమధ్య ఎందుకని వేదన ఆమెలో?
నిన్న మళ్ళా ప్రశాంతత ఎలాగ వొచ్చింది?
అనేక జవాబులు వొస్తున్నాయి మనస్సులోకి పరిస్థితుల్నిబట్టి బహుశా ఆమెలో ఏమీ గర్హించదగ్గిర రహస్యం లేకపోవచ్చును. బహుశా ఆమె వీటన్నిటికీ సంతృప్తికరమైన జవాబు ఇవ్వగలదు.
ఆమె జవాబిస్తే అది నిజమే అవుతుంది: కాని, ఆమె అ ఆమాటే చెప్పదు. తనకి ఆమెకీ మధ్య దూరం లేదని తాననుకున్నాడు. కాని మాటి మాటికి తన భావనలని అసత్యాలు చేస్తూన్న ఎన్ని సంఘటనలు!
తమ మధ్య ఉన్న ఈ దూరం ఏమిటి? ఆమె సృష్టించినదే అది అంతా తాను ఎంత ప్రయత్నించినా ఈ దూరం పోలేదు. ఆమె అంత కన్న దగ్గరగా రాలేదు.
దూరాన్నించి తనని తాను చూసుకుంటే ఆ మాటలన్నీ స్పష్టంగా ప్రశ్నలు వేస్తున్నాయి తనని. జవాబులు తనదగ్గర లేవు.
-ఆ రోజు- మొట్టమొదట వసంతని తాను కలుసుకున్న రోజు ఆమెకి ఎంతకోపం వొచ్చింది తన ప్రశ్నకి?
ఆ తరవాత ఎన్నాళ్ళు ఆమెకోసం ఈ పరిసరాల్లో తాను ఆశగా ఎదురుచూసి నిరాశ పడ్డాడు!
సూర్యాస్తమయం ఐపోయింది పూర్తిగా.
ఇసక వెచ్చగా ఉంది.
ఆ రోజు శశిరేఖ తనకి ఎంత దగ్గిరగా కూర్చుంది? ఇక్కడే!
ఆరోజు తనకి ఆమె చివరికి మిగిలిన ఆశాశకలం లాగ కనిపించింది...
క్రమంగా ఆమె తనకి ఎందుకు దూరం ఐపోయింది?
