శ్రద్దగా విని, "బలే" అన్నారు వెంకట్రామ్ "ఆమెని కొంచెం హద్దులో ఉండమని చెప్పండి - వసంతకి ఇతరులు బుద్ధి చెప్పే అవసరం రావడం విచారకరం" అన్నాడు గోపాలం.
కొంచెం సేపు ఆలోచిస్తూన్నట్టు ఆగి, "ఆ మాటే నేను నీతో అనాలి గోపాలం. ఆమె ముందర నీ భార్య, తర్వాత నా పిల్లను....ఆ హక్కూ నీదే, ఆమె పూచీ నీదే- కాదూ?" అని అడిగారు.
అవిష్టంగా "అవును. మీరు చెప్పినది నిజం" అన్నాడు గోపాలం. ఆ మాట మనసారా అన్నాడు- కాని, తన బాధ్యత ఎలాగ నిర్వర్తించాలో, తన హక్కుని ఎలాగ నిరూపించాలో అతనికి తెలియలేదు. క్రమంగా వసంత అంటే ఒక భయం కలుగుతూంది. ఆమెచేత విధేయురాలిగా పని చేయించే ధైర్యం అతనికి లేదు.
ఆ మాటలన్నీ చెప్పలేక, మిగిలిన విషయాలు చర్చించి వసంత వొచ్చేదాకా కాలం గడిపేడు గోపాలం. ఆ తరవాత ముగ్గురూ సినిమా చూసి, గ్రాండ్ హోటలో డిన్నర్ తీసుకున్నాక అతను వసంతని తీసుకుని ఇంటికి వొచ్చేశాడు.
రాత్రి పది ఐంది.
అరగంట చదివి నిద్ర వొస్తే దీపం ఆర్పి పడుకున్నాడు గోపాలం. అటు వసంత మాటి మాటికీ కదుల్తోంది- నిద్ర పోలేనట్టు.
"నిద్రరాడం లేదా" అన్నాడు గోపాలం.
"లేదు-"
కొంచెం ఆలోచించి, "ఇవేళ ముఖర్జీ భార్య కనిపించేరు..." అన్నాడు గోపాలం.
ఆమె కళ్ళు తెరవకుండానే. "ఊఁ?" అంది.
"రేపు వొస్తామని చెప్పమన్నారు."
"రానీ.
"నీకు క్షమాపణ చెప్తారుట."
ఈ సారి పూర్తిగా కళ్ళు తెరిచి అతనివేపు తిరిగింది వసంత. "వాళ్ళు క్షమాపణ చెప్పవలసిన పని ఏమీ చెయ్యలేదు. ఇంకేం చెప్పేరు?" అంది.
"ఆ సాయంత్రం జరిగినది, రాయ్ సంగతి"
కొంచెం ఆగి. "ఏమనిపించింది నీకు?" అంది వసంత.
"బాధ -"
"ఏమని?"
"ముఖ్యంగా, నీ కోసం-"
"ఇంక?"
"మనకోసం.... ఆ రోజు నువ్వెంత బాధ పడ్డావో నాకు తెల్సును- మరిచిపోలేదు."
మోచేతులమీద లేచి అతని గుండెలమీద ముఖం పెట్టింది వసంత. "గోపాలం... నీ మీద నాకు కోపం వొస్తుంది. వెను వెంటనే నువ్వంటే అభిమానం పుట్టుకొస్తుంది" అంది, ఆలోచనగా.
"ఎందుకని?"
"అలాటి ప్రశ్నలు వేస్తావని"
ఆమెని నెమ్మదిగా దగ్గరగా తీసుకున్నాడు గోపాలం. అమెలోనే తన ప్రపంచం అంతా ఉందని అతనికే తెలుసును. ఈ సాన్నిహిత్యంలో ఆమె తనకీయగలిగిన సంతృప్తికి హద్దు లేదు.
తనకి వొచ్చిన వెయ్యి అనుమానాలని దులిపివేసి ఆమెని గురించి క్షణికంగానైనా అపోహపడ్డందుకు తనకి తానే గర్హించుకున్నాడు గోపాలం. ఆ క్షణాల్లో ఆమె తనని ఎంత ప్రేమీస్తోందో అతనికి పూర్తిగా తలిసింది.
* * *
ఉదయం లేచేసరికి వసంత ఎదురుగా నిలబడి పరీక్షగా అతని ముఖంలోకి చూస్తోంది.
"ఏమిటి చూస్తున్నావు?" అన్నాడు కళ్ళు పూర్తిగా విప్పేప్రయత్నం చేస్తూ గోపాలం.
"ఎంతసేపు నిద్రపోగలవని- ఏడైంది లే..."
లేచి వొళ్ళు విరుచుకొని బాత్ రూం కి నడిచాడు గోపాలం. అతను వొచ్చేసరికి ఆమె రేడియో పెడుతూంది.
కాఫీ తాగి. "ఏమిటి సంగతి?" అన్నాడు మళ్ళా, ఆమె ప్రవర్తనలో ఏదో విచిత్రం కనిపించింది అతనికి.
చిరునవ్వు నవ్వి, "ఏమీలేదు, భీకరంగా వున్నావు. కనీసం గెడ్డం గీసుకో. నాన్నగారిని డమ డమ్ కు దిగబెట్టాలి. జ్ఞాపకం ఉందా" అంది వసంత.
ఆమె ఏమీ చెప్పదలుచుకోలేదు అని గ్రహించి తన పనుల్లో నిమగ్నుడయాడు గోపాలం. విచిత్రమైన మనిషి వసంత అనుకున్నాడు. కాని, ఆమె కళ్ళలో ఏదో ఉంది....ఏమిటి?
డమ్ డమ్ నుంచి తిరిగి వొచ్చేసరికి రెండు దాటిపోయింది. ఎయిర్ పోర్టులో వెంకట్రామ్ తననీ, వసంతనీ చెరో చేతిక్రిందా పెట్టుకుని. "మళ్ళీ జులైలో వొస్తాను. మిమ్మల్ని చూస్తాను అప్పటిదాకా..." అని ఆగిపోయారు.
"ఉత్తరం రాస్తాను నాన్నగారూ!" అంది వసంత.
"మంచి విశేషాలతో రాయి-ఏం? అన్నాడు వెంకట్రామ్.
నవ్వి. "అలాగే!" అంది,
అతను చిత్రంగా చూశాడు. ఇంతలో ఆయన వేసవికి కాశ్మీర్ వెళ్ళడం గురించి మాట్లాడ్డం మొదలు పెట్టారు. "వొద్దు, ఈసారి డార్జిలింగ్" అంది వసంత.
"అలాగే- ఆ కోరికా తీరుతుంది." అన్నారు వెంకట్రామ్ నవ్వుతూ.
ఫ్లయిట్ టైమ్ ఐపోయి సెలవు తీసుకుని ఆయన వెళ్ళిపోయేరు- టికాఫ్ దాకా వుండి తిరుగుముఖం పట్టారు గోపాలం. వసంతా.
దారిలో తెగ ఆలోచిస్తోంది వసంత.
"ఏమిటంత తెగ ఆలోచిస్తోంది వసంత.
"ఏమిటంత ఆలోచన?" అన్నాడు గోపాలం.
"ఏమీలేదు-"
"ఏదో వుంది-"
"నాకు తెలీదు"
ఇంకేమీ అనలేదు ఎవ్వరూ. వెళ్ళేసరికి ముఖర్జీ. భార్య ఉన్నారు. వాళ్ళతో చాలా ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళని ఊరడించింది వసంత.
మూడయాక వెళ్ళిపోయారు వాళ్ళు,
అతను నిద్రపోయాడు. లేచేసరికి ఐదుదాటింది. అతను లేచేసరికి ఆమెలేదు.
"ఎక్కడికి వెళ్ళింది?" అని అడిగాడు సర్వెంటుని.
"తెలీదు టాక్సీలో వెళ్ళేరు నాలుగ్గంట్లకి"
"ఒంటరిగానా?"
"అవును"
వెయ్యి అనుమానాలు వొచ్చాయి మనస్సులోకి ఇంత హటాత్తుగా ఎక్కడికి వెళ్ళింది వసంత? తనకి తెలియని వ్యవహారాలు మరీ ఉన్నాయి ఆమెకి.
నిన్నరాత్రి వెన్నెలలాగ కనిపించిన వసంత ఈరోజు చీకటిలాగ కనిపిస్తోంది అతనికి.
ఎక్కడికి వెళ్ళింది వసంత? టాక్సీలో ఎందుకని?
నిర్ధారణ చెయ్యలేని ఏదో తీవ్రమైన అసంతృప్తి అతన్ని బాధించింది. ఇంట్లో ఉండలేక మైదాన్ కి బయలుదేరేడు.
నడిచినడిచి విక్టోరియా మెమోరియల్ లోకి వెళ్ళి ఒక బెంచీమీద కూర్చున్నాడు.
మాధవరావు ఎంత హాయిగా ఉన్నాడు?
మళ్ళీ వాళ్ళింటికి ఒకరోజు వెళ్ళాలి. అనుకున్నాడు గోపాలం. ఆ ఒంటిగది ఇంట్లో నిర్వచనీయమైన ఏదో ఆనందపు వెలుగు, సుఖశాంతులు అక్కడ ఉన్నాయి.
శాంతలో ఏముంది?
బహుశా తనకి కనిపించని, అతనికి కనిపించేది ఏదో ఉంది. లేకపోతే మాధవరావు ముఖంలో అంత ఆనందం ఎలాగ వొస్తుంది? ప్రతిక్షణమో అతనిలో. ఆమెలో, ఆ మమకారాల చిహ్నాలు ఆపలేనట్టు ఎలాగ బయటికి వొస్తూంటాయి?
చాలాసేపు వాళ్ళని గురించీ తనని గురించీ ఆలోచించేడు గోపాలం.
హఠాత్తుగా చిన్న అమ్మాయి అతను కూర్చున్న దగ్గరకి వొచ్చి బెంగాలీలో ఏదో చెప్పడంతో అతను ఈ లోకంలోకి వొచ్చేడు.
ఆ పిల్లకి ఆరేళ్ళకప్ప ఉండవు. బొద్దుగా, ముద్దువొస్తోన్నట్టుంది. ఏమిటమ్మా! అన్నట్టు చూశాడు. తనకి బెంగాలీ అసలు తెలీదు.
ఆమె మళ్ళీ ఏదో అంది, ఎదురుగా ఉన్న కొలనులోకి చూపెడుతూ. కొంచెం పరీక్షచేసి గమనించేడు- ఆమె తన తమ్ముడితో ఆడుకుంటూన్న బంతి నీళ్ళలో పడిపోయింది.
అట్టేదూరంలేదు- కాని, నీళ్ళలోకి వెళ్ళాలి. ఆశగా ముద్దుగా చూస్తోంది చిన్నపిల్ల.
లేచి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని బెంచీ మీద నిలబెట్టి జోళ్ళువిప్పి నీళ్ళలో నాలుగడుగులు వేసి బంతిని అందుల=కున్నాడు గోపాలం.
ఆనందంగా కేరింతలు కొడుతూంది అమ్మాయి.
వొచ్చి చేతులు రుమాలుకి తుడిచి, తడిబంతిని నాలుగుసార్లు గచ్చుమీదకొట్టి మళ్ళీ చేతులు శుభ్రం చేసుకుని ఆమెని రెండు చేతుల్లోకీ తీసుకొని బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు గోపాలం.
ఆ అమ్మాయి రెండో బుగ్గచూపెట్టింది.
అక్కడా ముద్దుపెట్టుకుని ఆమెని దింపేడు గోపాలం. బంతి తీసుకుని వెనక్కి చూడకుండా తమ్ముడి చెయ్యిపట్టుకుని వెళ్ళిపోయింది.
గొప్ప సంతృప్తి కలిగింది గోపాలానికి. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉంది!... ఎవరి పిల్లో! ఎంత అదృష్టవంతులు!
మళ్ళీ మళ్ళీ ఆమె వెళ్ళిన దిక్కుచూచాడు. ఆమె కనపడలేదు. కొంచెంసేపు కూర్చుని బయటికి నడిచేడు. ఇంకా బాగా చీకటిపడలేదు దీపాలు ఇప్పుడే వెలిగిస్తున్నారు.
ఆ చిన్నపిల్ల ముఖం జ్ఞాపకం వొచ్చినప్పుడల్లా చల్లటిదీపాలు వెలుగుతున్నాయి అతని మనస్సులో.
ఇల్లు చేరేసరికి వసంత లేదు.
తడిసిన వంట్లాం మార్చి, పంచి కట్టుకుని బాల్కనీలో కూర్చున్నాడు. మరోపదినిమిషాల్లో ఆమె వొచ్చింది. తాళం ఆమె దగ్గిర లేదు. తనే తలుపుతీశాడు.
నిశ్శబ్ధంగా ఆమె లోపలికి వొచ్చి తిన్నగా వెళ్ళి బాల్కనీలో కూర్చుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏదో ఆశాఘాతం ఆమె ముఖంలో ప్రస్ఫుటం అవుతోంది.
అతనూ అలాగే కూర్చున్నాడు. ఆమెతో మాట్లాడాలని అనిపించలేదు. అతను ఆకాశం లోకి మాత్రమే చూడసాగాడు. జీవితంమీద అసహ్యం పుట్టిందతనికి.
అతని మనస్సంతా చీకటిగా ఉంది. ఆ చీకటిమధ్య సాయంత్రం ముద్దుపెట్టుకున్న అమ్మాయి, శాంతా మిలమిల మెరుస్తోన్న నక్షత్రాలాగ అతనికి కనిపించారు. ఆ చిన్న అమ్మాయి పేరేమిటీ?
ఆ చీకటిలో అతనికి వసంత బాగా కనిపించలేదు.
* * *
21


అతను విశాఖపట్నం వెళ్ళేరోజు వొచ్చేదాకా వాసంత మళ్ళీ పూర్వపు మనిషి కాలేదు అతనూ కాలేదు.
ఉండీ ఉండి, నల్లటి అనుమానాలు.... మళ్ళీ తనమీద తనకే ద్వేషం ఆమెనలాగా అనుమానించినందుకు తనమీద తనకే కోపం ఆమెని గురించిన నిజం తెలుసుకోనందుకు ఆమెని గురించిన బాధ్యత ఏమీ తీసుకోనందుకు.
సాయంత్రం ప్రయాణం. ఉదయం ఆఫీసుకి వెడుతూంటే వసంత, "అక్కడికి ఏం పట్టుకెడుతున్నావు?" అంది.
"ఎక్కడికి?"
"మీ చెల్లెలికి- మీ వొదినకీ, అబ్బాయికీ-"
అతనికా విషయం అట్టే ఆలోచన కలిగించలేదు.
"ఏమీలేదు" అన్నాడు.
టెలిఫోన్ మోత విని రిసీవర్ ఎత్తాడు. ముఖర్జీ.
కుశల ప్రశ్నలయాక. "వసంత చెప్పింది మీరు ఇంటికి వెడుతున్నారని. ఆమె రేపు కంటెన్ లోనించి ఎందుకు విత్ డ్రా అయింది?" అన్నాడు ముఖర్జీ.
"ఏ కంటెన్?"
"రేపు క్లబ్ డేకి బ్యూటీ కంటెస్ట్."
"నాకు తెలీదు-ఆమెనే అడగండి."
రిసీవర్ ఆమెకి యిచ్చాడు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఈ కంటైన్ కోసం ఆమె ఎంత ఆతృతగా ఎదురు చూసిందో జ్ఞాపకం వుంది అతనికి.
కాని, ఎందుకు విత్ డ్రా ఐంది?
"లేదు....లేదు వొస్తాను- వొద్దు-
నెమ్మదిగా మాట్లాడుతోంది. అతనికి అర్ధం కాక, చూస్తూ ఉండిపోయారు.
