ఆ తరవాత జరిగిన వన్నీ జ్ఞాపకం వొచ్చాయి. ఆమెకీ, వసంతకీ మధ్య తాను ఊగులాడిన రోజులు...
నిజానికి తనకి అప్పుడు కావలిసినది శశిరేఖ నించి స్వేచ్చమాత్రమే. నిజంగా, అప్పుడు తనకి శశిరేఖ కోపం తెప్పించిందా? ఆమె తప్పు చేసిందా?
కప్పుకున్న పొరలపొరల భావాలని ఒలిచి పడేస్తోంది ఈ సాయంత్రం...
లేచి నిలబడ్డాడు. శశిరేఖ ఎక్కడఉంది? ఇక్కడికి వొచ్చిందా? ఆమెని గురించి తనకేమీ తెలీదు నిజంగా రామానంద్ ని పెళ్ళిచేసుకుని కలకత్తా రాలేదా?
లేదు. ఆనాడు తనది పొరపాటు ఆమె ఇక్కడే ఉండి ఉంటుంది. రామానంద్ కీ, ఆమెకీ చాలా దూరం.
కందిరీగలాగ ముసురుకుంటున్నాయి ఆలోచనలు. ఇసక దులుపుకున్నాడు. రోడ్డుమీదకి వచ్చి ఇంటివేపు బయలుదేరేడు.
ఎంత ప్రయత్నించినా ఆమె ఇంటిదారి పట్టకుండ వెళ్ళలేకపోయాడు. నడిచి ఆ ఇంటికి చేరెడు. బయట రోడ్డుమీద నిలబడ్డాడు.
లోపల దీపాలు వెలుగుతున్నాయి, ఎవరున్నారు లోపల? శశిరేఖ వచ్చిందా?
"ఎవరిల్లు కావాలి బాబూ?"
దారినపోతూ ఎవరో అడిగారు.
"ఏమీ వొద్దయ్యా!"
సాగిపోయాడు. ఇంటికి చేరుకుని నలుగురి లోనూ పడ్డాక కొంత మనసు కుదుటపడింది.
* * *
ఆ రాత్రి అంతా పెళ్ళి సందడిలో గడిచి పోయింది. తెల్లవారుఝామున వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు అతను లేచేసరికి చాలా ఆలశ్యం ఐంది.
కాలకృత్యాలు తీర్చుకుని పెళ్ళి పందిరిలోకి అతను వెళ్ళేసరికి ఏవో లాంఛనాలు జరుగుతున్నాయి. తనని చూచి అన్నయ్య వొచ్చేడు.
"బాగా నిద్రపోయావా?" అన్నాడు అతని పక్కనే కూర్చుని.
"ఆఁ..." అన్నాడు గోపాలం.
"ఉదయం ఆరుగంటలకు లలిత లేపింది నిన్ను - కాని నువ్వు నిద్రపోయావు."
తనకి బద్ధకం ఎక్కువైపోయింది అనిపించింది గోపాలానికి, ఉదయమే వొదిన మాట వినిపించగానే తెలివి వొచ్చే సంగతి జ్ఞాపకం వొచ్చి కొంచెం సిగ్గుపడ్డాడు. నిన్న తన ఉపయోగం ఏమీ లేకుండానే ఐపోయింది.
"అక్కడ ఎలాగ ఉంది?"
"బాగానే ఉంది......."
"వేసవి ఎలాగ ఉంది? ఇక్కడ కన్నా చల్లగా ఉందా?"
"ఉండదు. చెమట తెగపడుతుంది."
మాట్లాడుకోడానికి ఏమీ లేదనిపించింది గోపాలానికి, నిజానికి తనూ అన్నయ్యా ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. వొదినతో వేరు- ఆమె చనువు తీసుకుంటుంది. మాటలు చెప్తుంది. - తనచేత మాట్లాడిస్తుంది. ఆమె దగ్గర దాచుకునే మాటలులేవు - అన్న దగ్గర చెప్పేందుకు లేవు.
"వసంత కూడా వస్తే బాగుండును-"
"అవును - రాలేకపోయింది..."
చాలాసేపు కూర్చుని, "కొంచెంసేపు తిరిగి వొస్తాను" అని, వీధిలోకి వెళ్ళేడు.
ఏమీ గమ్యస్థానం అంటూ లేకుండా తిరిగి తిరిగి కాలేజీ దగ్గరకి వొచ్చి లోపలికి వెళ్ళేడు. రామ్మూర్తి కోసం చూసి, అతని రూముకి వెళ్ళేడు,
ఆహ్వానించి, "రా... నువ్వు వొస్తావని తెలిసింది- రామం చెప్పేడు... ఎలాగ ఉన్నావు? కాఫీ తాగుతావా?"
వద్దన్నా? కాఫీ తెప్పించేడు రామ్మూర్తి,
తాగుతూ, "కాలేజీ ఎలాగ ఉంది?" అన్నాడు గోపాలం.
"బాగానే వుంది..... నువ్వెళ్ళి పోయాక నీ బదులు మరో లెక్చరర్ దొరికేసరికి నెల గడిచిపోయింది. మంచివాడే దొరికాడనుకో - నీ లాగ మాత్రం కాదు. నీకు లెక్చరింగ్ లో నుంచి నేర్పు ఉండేది-"
ఆ మాట ముందెప్పుడూ చెప్పలేదు రామ్మూర్తి. ఇప్పుడు వింటూంటే ఎంతో సంతోషంగా ఉంది.
"నీ కంత మంచి ఉద్యోగం దొరకడాన్న కాని, లేకపోతే నిన్ను వెళ్ళనిచ్చేవాడిని కాదు...ఎప్పుడైనా నా మనస్సు మార్చుకుంటే వచ్చీ, నీ కోసం ఎప్పుడూ ఖాళీ ఉంటుంది."
సగం నవ్వుతూ, సగం సీరియస్ గా అన్నాడు రామ్మూర్తి, "థాంక్స్- జ్ఞాపకం ఉంచుకుంటాను," అన్నాడు గోపాలం- అదే ధోరణిలో-
కాలేజీలో ఉన్న మిగిలిన స్నేహితుల్ని కలుసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజంతా ఇంకేమీ తీరిక లేకపోయింది. అతనికి. పెళ్ళి వారు సాయంత్రం వెళ్ళిపోయారు.
మర్నాడు ఉదయం తన ప్రయాణం. ఆ రాత్రి అలిసిపోయి నిద్రపోయింది లలిత,
ఉదయం లేచాక, "ఇవాళ వెళ్ళిపోవాలా!" అంది లలిత కాఫీ, టిఫినూ ఇస్తూ.
"ఆఁ..."
నవ్వి, "వసంతని వొదిలి మూడురోజులు ఉండడమేకష్టం-ఏం!" అంది వొదిన.
"రేపు చేరుతానని చెప్పేను"
"అదేనయ్యా!.... నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది- మాట్లాడుకొనేందుకు తీరికే లేకపోయింది."
"నువ్వూ అన్నయ్యా రండి సెలవుపెట్టి."
"జాగ్రత్త....అలాగే చెయ్యగలం"
"తప్పకుండా చెయ్యండి-ఎప్పుడు వొస్తావు?"
"ముందర వసంతని అడుగు-"
హాస్యంగా అనలేదు లలిత.
'వసంతకూడా చెప్పమంది-మరీ మరీ"
ఈసారి అతన్ని పరీక్షగా చూసింది.
"గోపాలం, నిజం చెప్పు-ముందర వసంత అందా? లేక నువ్వా?- నిజం చెప్పాలి"
"వసంత..."
అర్ధమైనట్టు చూసింది లలిత. అతనికి ఏమీ బోధపడలేదు.
అన్నట్లు సూట్ కేస్ నేను నిన్న తెరిచి చీరలు తీశాను. చెప్పలేదేం?"
"సారీ మరిచిపోయాను"
పొంగి పొంగి నవ్వుతూ. "ఎంతమరుపు నీది!- ఇంకా మరుపుపోలేదా?" అంది లలిత.
మూర్ఖుడిలాగ చూశాడు అతను. అతనికే నవ్వు వచ్చింది. "మిగిలిన సామాన్లు తియ్యి..."
"తీశేను. అంటే, బాబు తీసేడు. ఉదయం వాణ్ణి కొత్త బుష్ షర్టు వేసుకుని వాడు తిరగడం చూడలేదూ?"
"చూసేను- జ్ఞాపకం రాలేదు."
ఈసారి నవ్వు మళ్ళీ ఆపుకోలేకపోయింది లలిత.
"వసంతతోనూ, అంతేనా?"
"నువ్వువొచ్చి చూడు వొదినా"
"మీ అన్నయ్యతో చెప్పు"
"చెప్తాను- తప్పకుండా రావాలి... నిజంగా అవసరం"
కొంచెం ఆగి, "అంటే వసంత నువ్వనుకున్నట్లు లేదనా?...." అంది లలిత.
"అవును" అన్నాడు అతను సందేహంగా.
"నిన్నుచూస్తే, ఆ మాటకి ఆశ్చర్యం కలగదులే. ఇంకోరోజు టైమ్ ఉంటే బాగుండును." అంది లలిత.
ఏదో అసంతృప్తి ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది- ఆమెకి తెలుసును- అనుకున్నాడు. గోపాలం.
మిగిలిన కొంచెంకాలమూ బాబుతో మాట్లాడి భోజనం చేసి వెళ్ళిపోయాడు. రైలు కదిలే క ఏదో వెలితి అతన్ని చికాకు పెట్టింది. వొదినతో ఎన్నో చెప్పాలనీ, ఆమె నాతో తన బాధలన్నీ చెప్పుకుని తేలిక పడాలనీ అనుకున్నాడు- కాని, ఏమీ కుదరలేదు.
చదివేప్రయత్నం చేసేడు- కాని మనస్సు నిలవలేదు. ఈ సరికి వసంత ఏంచేస్తూ ఉంటుంది?... రేపు ఉదయం వేగం వొస్తే బాగుండును- అనుకున్నాడు.


* * *
23
హౌరాలో అతను దిగేసరికి ఎనిమిధైంది.
వసంత స్టేషనుకి వొస్తుందని ఆశించిన గోపాలం ఆశాభంగం చెందేడు. తన కోసం కారు మాత్రం వొచ్చింది.
ఇంటికి చేరేసరికి వసంత నిద్రపోతూంది. వెళ్ళి నెమ్మదిగా తట్టి లేపాడు.
కళ్ళు తెరిచి, "ఇంకా నిద్రగా వుంది. పడుకోనీ" అని, ఒత్తిగిలి మళ్ళీ నిద్రపోయింది.
ఆశించిన ఆనందం ఆమెలో కనిపించక డ్రాయింగ్ రూమ్ లోకి వొచ్చేడు. ఏష్ ట్రేలో సిగరెట్టు పీకలు-
ఈ ఇంట్లో నౌకర్లెవరూ తనకి ఏమీ చెప్పరు...వాళ్ళ దృష్టిలో తానొక అతిధి- అదీ ఒకలాగ నిజమే అనుకున్నాడు గోపాలం.
కనీసం రెండు మాటలాడితే బాగుండును అనుకున్నాడు బెడ్ రూమ్ వైపు చూస్తూ.
పేపరు చదివి, ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
ఆఫీసులో కృష్ణన్ తన గదికి వొచ్చి "కంగ్రాట్యులేషన్స్" అన్నాడు.
"ఏమిటి సంగతి?"
"మిసెస్ గోపాల్ కి బ్యూటీ కంటెస్టులో సెకెండ్ ప్రయిజు వొచ్చినందుకు- మీ కు తెలీదా?"
"ఇప్పుడు తెలిసింది- మీ రేసేస్ ఎలాగ వున్నాయి?"
"మామూలే- కిందటి శనివారం రెండు వందలు గెల్చుకున్నాను"
"గుడ్."
"ఆ కిందటి వారం మూడు వందలు గుర్రాల కన్నా వేగంగా పరిగెట్టేయి.
"సారీ"
"ఇందులో ఆనందంలేదు, విచారం లేదు...అదో పెద్ద ఫిలాసఫీ - మీకు అక్కరలేని ఫిలాసఫీ'
వసంత గురించి ఆలోచిస్తూన్న అతనికి ఇదేమీ తలకెక్కడం లేదు పరధ్యానంగా కృష్ణన్ ఇచ్చిన సిగరెట్ తీసుకుని, ఈ నాలుగు రోజుల్లోనూ ఇంకేం జరిగిందో ఆలోచించసాగాడు.
రోజంతా పనిమీద మనసు పోలేదు. ఆరోజు స్టెలా డ్యూటీకి వొచ్చింది.
లాంఛన ప్రాయంగా ఉభయ కుశలాల అనంతరం! తన చేత త్వరత్వరగా పనిచేయిస్తోంది స్టెల్లా. నిజానికి నా జీతంలో సగం ఈమె ననే అనుకున్నాడు. కాని. అలాటి మాటలు బయట అనడం ఉద్యోగులకి శ్రేయస్కరం కాదు.
సాయంత్రం స్టెలాని పిలిచి, మీ పెళ్ళికి ఏమివ్వాలో కుదరక ఏమీ తేలేదు-దయచేసి ఏదో ఒకటి కొనుక్కోండి' అని యాభైరూపాయిలిచ్చాడు.
ఆమె చాలా నిరాకరించింది-కాని, అతను చాలా బలవంతం చేసి ఆమె కిచ్చేడు.
అదయాక చాలా తేలికపడ్డాడు- పొరపాటు చేసినా, సరిచేసుకున్నందుకు.
ఆఫీసు నించి కాలేజీకి వెళ్ళిపోయాడు.
అక్కడినించి ఇంటికి వెళ్ళేసరికి వసంత ఇంట్లోలేదు.
ఆశ్చర్యంవేసింది అతనికి. ఏమిటి జరుగుతుంది? విచిత్రమైన ఈమె నడతలో ఇంత త్వరగా మార్పులెందుకు వొస్తున్నాయి?
కనీసం ఇవాళైనా వసంత ఇంట్లో ఉండకూడదూ?
స్నానంచేసి కొంచెం కాఫీతాగి బయట కూర్చున్నాడు- ఏదో ఓ మార్గాన ఆమెని సరిదిద్దక పోతే, ఇంక ఇలాగ జీవితం గడవడం కష్టం.
