"అది వేరే సంగతి. మొత్తంమీద దీనివల్ల అనారోగ్యం కలుగుతుంది."
శాము దూడను చేతులతో ఎత్తుకుని, బయటికివచ్చి, "ఎంత బావుందో చూడు" అంటూ మీర కివ్వబోయాడు. దూడ అందానికి మురిసి పోతూ మీర చేతులు చాచింది. కాని దాని కాలి మీదున్న పేడ తోక, ప్రశ్నలకు అంటుకున్న పంచతం దాని వంటినుండి వస్తున్న జిగురు వాసనలను గమనించి అసహ్యంతో చేతులు వెనక్కి తీసుకుంది. అలా చేతులు వెనక్కు తీసుకోవటంవలన దూడ క్రింద పడింది. దూడ క్రింద పడటంచూసి అపశకునంగా భావించాడు శాము.
"మీరా......"
అనుకోకుండానే అతని కంఠంలో కాఠిన్యం ధ్వనించింది.
వంగి దూడను రెండు చేతులతోను ఎత్తుకుని, "అక్కర్లేకపోతే వూరికే ఉండలేకపోయావా?" అని కసురుకున్నాడు.
"దూడ అంత మురిగ్గా ఉంటుందనుకోలేదు నేను."
"మురికెక్కడుంది?"
"దాని కాళ్ళు, ప్రక్కలు చూడండి."
"నీ బిడ్డే అయితే అసహ్యించుకునే దానివా? ఈమాత్రం సహించలేనిదానివి, నీదేలాటి మనసు!" అంటూ దూడను క్రిందకి దింపాడు. దూడ చెంగు చెంగున ఎగురుతూ పారిపోయింది.
ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణంలోనే భర్తనుండి మాట పడాల్సిన సంఘటనతో మీర కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. అసలు ఒకరినుండి మాటపడే అలవాటులేని మీర అభిమానం దెబ్బతింది. మీర కళ్ళల్లో నీరు తిరగటం గమనించి శాము మెత్తపడ్డాడు. తను అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదనుకున్నాడు.
"మీరా ఏమనుకోకు. కోపంలో ఏదో అన్నాను." అంటూ దగ్గరగావచ్చి ఆమె చేతులను పట్టుకో బోయాడు. మీర రెండడుగులు వెనక్కివేసి,
"మీ చేతులు మురికిగా ఉన్నాయి. నన్ను ముట్టుకోకండి" అంది.
దారితప్పి తేనె గూటిలో ప్రవేశించిన శీతాకోక చిలుక తాను, అనిపించింది మీరకు. భర్త లోకమంతా, పాడిపంట, భూమి, పుట్రా అయితే, తన లోకమేవేరు. ఇవి రెండూ కలవటం సాధ్యమా?
మీర కను మరుగవగానే, శాము మురిగ్గా ఉన్న తన చేతుల నోమారు చూసుకుని, మీర వెళ్ళిన వైపే చూస్తూ నిట్టూర్చాడు. వెంకమ్మగారు దంపతులిద్దరికీ, అగ్రపు అరిటాకులు వేసి ముగ్గు పెట్టారు. భోజనానికి వచ్చేటప్పటి కింకా మీర కళ్ళల్లోని ఎరుపు అలాగే ఉంది. భోజనం చేస్తూ శాము అడిగాడు.
"అత్తయ్యా, నా భార్య ఎలా ఉంది?"
కూర వడ్డిస్తున్న వెంకమ్మగారు తలవంచుకుని కూర్చున్న మీరవేపు చూసి,
"లక్ష్మిలా ఉంది నాయనా."
"మీరు చూసేదాకా తృప్తిలేదు, నాకు మీరు ఆశీర్వదించాలి మమ్మల్ని."
"అంతకన్నా నాకేం కావాలి నాయనా? నూరేళ్ళు చల్లగా బతకాలి మీరు మీకు నామీదున్న విశ్వాసం వల్ల అంటున్నావుగాని......"
"మీమీద కాకపోతే ఎవరిమీద విశ్వాసముంచాలో చెప్పండి. తల్లిలేని నన్ను పెంచి పెద్ద చేసిందే మీరు? మీ తొడమీద పెరిగిన బిడ్ద నేను. నామీద మీకున్న ప్రీతి విశ్వాసాలు, మీ మంచితనాన్ని నిరూపిస్తాయి. ఎన్ని జన్మలెత్తితేమాత్రం మీ రుణం తీర్చుకోగలను?"
చనిపోయిన శాము తల్లిని తలచుకొని వెంకమ్మ గారి కొంగుతో కళ్ళద్దుకుని మాట మార్చారు.
భోజనాలవగానే, శాము హాలులోవున్న ఉయ్యాల మీద కూర్చొని,
"మీరా, తమలపాకులు పట్రా" అన్నాడు.
మీర తెచ్చిన కొద్దిపాటి ఆకులను చూసి.
"ఉహూ ఇవి చాలవు" అన్నాడు.
"మైసూరులో కొద్దిగానే వేసుకొనేవారుగా?"
"కాకపోతే అత్తవారింట్లో కట్ట తమలపాకులు కావాలని అడగమంటావా?" అంటూ లేచి వెళ్ళి ఓ కట్ట తమలపాకులు వక్కలు తెచ్చుకొని, పది నిముషాల్లో వేసుకోవడం పూర్తి చేశాడు.
"నువ్వు వేసుకో మీరా"
"ఉహూ, నాకు సయించదు."
"పోనీ తమలపాకులు వేసుకున్నవారు సయిస్తారుగా?"
మీర బదులు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది.
సాయంత్రం ఏం చేయటానికి తోచలేదు మీరకు. వంటా వార్పూ వెంకమ్మగారు చేసుకుంటున్నారు. గిన్నెలు తోమటం, ఇల్లు వూడవటం, పనులూ, పనిమనిషి చేస్తుంది. ఏమీ తోచక మీర 'పెవిలియన్ ఆఫ్ వుమన్' చేతికి తీసుకుంది. చదువుతూ, చదువుతూ, అందులోనే లీనమయింది. చేతిలోని పుస్తకం ఎవరో లాక్కున్నప్పుడే ఈ లోకంలో పడింది.
శాము పుస్తకం బల్ల మీద పడేసి "లే, మీరా" అన్నాడు.
"ఎక్కడికండీ?" ఇంకా పుస్తక ప్రపంచంలో విహరిస్తున్న మీర విసుగ్గా అడిగింది.
"మా పల్లె అంతా చూపిస్తాను. పద సాయంత్రం హాయిగా తిరిగిరాక, పుస్తకం పట్టుకుని కూర్చుంటారా?"
"నేను రాను"
"అలా అంటే వినేవాడిని కాను. ఇంక అయిదు నిముషాలలో తయారుగా ఉండు అంటూ" వెళ్ళిపోయాడు శాము.
"ఈ పల్లెలో ఏముంటాయి చూడ్డానికి?" అని గొణుక్కుంది, మీర. తన మాట వినకుండా పుస్తకం లాగి పారవేసినందుకు కోపంగావుందామెకు. కాని బదులు చెప్పటానికి ఇష్టంలేక లేచి తల దువ్వుకుంది వెంకమ్మగారు గుచ్చివుంచిన దండ తల్లో పెట్టుకుంది. చేతికి వచ్చి కట్టుకుని శాము ముందు నుంచుని "రెడీ" అంది.
ఇద్దరూ బయల్దేరారు. ఇంటినుండి సుమారు రెండుమైళ్ళు నడిచాక వాళ్ళ వరిచేలు వరసగా కనుపించసాగాయి. తరువాత చెరుకుతోటలు అన్నీ చూపించాడు. చేలల్లో రైతులు పని చేసుకుంటున్నారు. కొంతమంది నీళ్ళు వదులుతున్నారు. కొంత మంది కలుపు తీస్తున్నారు. తమ యజమాని, అమ్మగారు రావటం చూసి వాళ్ళంతా పనులు ఆపేసి వారివేపే చూడసాగారు. మీర సిగ్గుపడింది.
"ఇక వెడదాం రండి. వాళ్ళంతా ఎలా చూస్తున్నారో?"
"తమ కొత్త అమ్మగారిని చూడాలని కుతూహలం వాళ్ళకి."
"కానీ నాకు ఏదోగా ఉంది పదండి."
ఇద్దరూ వెనుతిరిగారు.
మట్టి ఇళ్ళ మధ్యనుండి వూళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇళ్ళలోని వాళ్ళంతా కిటికీలగుండా నూతన దంపతులను చూడసాగారు.
"వాళ్ళంతా ఎందుకలా చూడాలి?" అని విసుక్కుంది మీర.
"నీలాటి అందగత్తెను చూసి వాళ్ళ కళ్ళను సార్ధక పరచుకుంటున్నారు"
"ఇహ చాలు వూరుకోండి. ఎవరైనా వింటే నవ్విపోతారు."
అవధాన్లగారి అమ్మాయి వెంకు తలుపు దగ్గర నుంచుంది. వీరిని చూడగానే చేయి తట్టి,
"శామన్నా అమ్మ రమ్మంటుంది" అంటూ పిలిచింది.
శాము మీరవేపు తిరిగి "రా వెడదాం" అన్నాడు.
అవధానిగారి ఇంటి మట్టి గోడలకు వెల్ల వేశారు. అంత ఎత్తులేని తలుపులు, ఆ పెంకుటింటిని చూసి, "ఈ ఇంటిలో మనుష్యులు ఎలా నివసిస్తారా" అనుకుంది మీర. చిన్న చిన్న కిటికీలు గోడలనిండా రవివర్మని, లక్ష్మీ, సరస్వతి, శకుంతల, మోహిని, చిత్రపటాలు వేలాడదీశారు. వెంకు చాప పరచి, "కూర్చోండి" అని లోపలికి వెళ్ళింది. అవధానిగారి భార్య, సాతక్క, గ్లాసులో కాచిన పాలు, రాగిపిండి రొట్టె తెచ్చి వాళ్ళముందుంచారు.
"బీదవాళ్ళ ఆతిథ్యం కాస్త తీసుకోండి"
"వద్దు సాతక్కా. మధ్యాహ్నం ఫలహారంచేసే బయలుదేరాం."
"ఫరవాలేదు. కాస్త పుచ్చుకుంటే మాకు సంతోషం"
"తీసుకో మీరా" అని శాము సంకోచం లేకుండా రొట్టె తినటానికి ప్రారంభించాడు. మీర ఎప్పుడూ రాగి రొట్టె తిని ఎరుగదు. అతి ప్రయాసతో కొద్ది కొద్దిగా తినసాగింది.
వెంకు తన చిన్నతమ్ముడిని చంకలో వేసుకుని, బయటికి వచ్చింది. శాము వెంకూని ఏడ్పించాలని,
"సాతక్కా వెంకూ పెళ్ళెప్పుడు?" అన్నాడు.
"అవునయ్యా ఎక్క్దడైన సంబంధం వుంటే చెబుదూ అప్పుడే పదేళ్ళు దానికి" అన్నారు సాతక్క.
శాముకు వెంకూ అంటే ఎంతో అక్కర. చిన్నప్పటినుండి అతను ఎత్తుకుని ఆడించిన పిల్ల వెంకు.
"సంబంధాల గురించి మీకన్న ఎక్కువగా నాకేం తెలుసు. సాతక్కా?"
"తెలీకేం అంతా తెలుసు నువ్వు ఎన్నుకుని పెళ్ళి చేసుకున్న పిల్లను చూస్తే తెలీటంలా?"
వాళ్ళు మాట్లాడుకున్న విషయాల్లో మీరకు ఏ మాత్రమూ ఆసక్తి క్లుగాలేహ్డు. ఒక గంటయ్యాక ఇక వెడదామని శాము పైకి లేచినప్పుడు ప్రాణం లేచి వచ్చిందామెకు.
ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. బోరడు లాంతర్లు తుడిచి, నూనె పోసి వెలిగించాడు. ఇంత వరకు విద్యుద్దీపాల వెలుతురుకు అలవాటు పడ్డ మీర కళ్ళు, మసకబారినట్టనిపించింది. ఇల్లు చేరగానే సగంలో ఆపిన కథ పూర్తి చేయాలనీ మనసు లోనే అనుకుంటూన్న మీరకు లాంతర్ల గుడ్డి వెల్తురు చూసి, నిరాశే అయింది. కాని తప్పదు. ఆమె పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడక తప్పదు.
