Previous Page Next Page 
అన్వేషి పేజి 20

 

    
    ఆ రాత్రే శవజాగరణ చేశాము. మరునాడు శవదహనం తో ప్రారంభమైన ప్రేత కర్మ పన్నెండవ నాటికి జరిగి యధాతధంగా ముగిసింది.

 

                               *    *    *    *


    పన్నెండవ నాడు దేవాలయం లో నిద్ర చేసి మళ్ళీ తెల్లవారగానే వచ్చారు మా అత్త మామలు.
    పిన్నిని ఆస్తితో సంబంధం లేదని పత్రం రాయమని కూర్చున్నారు.
    ఆమె స్థితి హృదయ విదారకంగా ఉంది. కక్కయ్యా, పిన్ని వాళ్ళని చివాట్లు పెట్టారు. "జరుగవలసిందేదో జరిగింది. ఇంకా తొందరెందుకయ్యా! ఆమె కిష్టమైతే ఎప్పుడైనా వ్రాస్తుంది. లేదా అసలు వ్రాయదు. మీ వాటం చూస్తె ఆమె రాయకుండా ఉంటేనే మంచిదని పిస్తోంది" అన్నారు.
    మామగారు మళ్ళీ నోరెత్తలేదు. "ఈ సంగతి తెలిస్తే నిన్ననే పోదుము" అని సణుక్కుది అత్తగారు.


    
                              *    *    *    *


    అంతా అయిపొయింది. నాన్న పోయి నెల రోజులు దాటింది. మా మామగారు వెళ్ళిపోయారు గాని, అత్తగారు కూతురు దగ్గరే ఉంది. నేను వ్యవసాయం పని మీద పల్లెకు వెళ్ళి అక్కడున్నాను.
    ఒకనాడు సైకిలు మీద పొలం దగ్గరున్న నా దగ్గరకు వచ్చి , "మీ పిన్నిగారికి చాలా ప్రమాదంగా ఉంది, రండి!" అన్నాడు ఒక మనిషి.
    నేను కంగారుగా ఎక్కడి వక్కడ వదిలేసి అతనితో పాటు అదే సైకిలు మీద బయలుదేరాను. దారిలో అతన్ని ఎన్ని ప్రశ్న అడిగినా వివరాలంతగా రాబట్టలేక పోయాను.
    వెళ్ళేసరికి అంతా ముగిసింది. వాకిలి అరుగు మీద ఒక వారగా పిన్ని శవం, అత్తగారూ, కుసుమా ఏడుస్తున్నారు. నన్ను చూసీమరీ శ్రుతి పెంచారు.
    "పోయింది, నాయనా , మీ పిన్ని పోయింది" అంటూ బావురుమంది అత్తగారు.
    "ఆమె నర్దం చేసుకోలేక పోయానండి! ఆమె దేవత. దేవతలలో కలిసిపోయింది." నన్ను వాటేసుకుని ఏడుస్తుంది కుసుమ.
    మామగారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన క్రితం రోజే వచ్చారట.
    నేను మా ఆవిడను వదిలించుకుని కాస్త దూరంగా  ఉన్నా కక్కయ్య వేపు నడిచాను. ఆయన్ను దూరంగా తీసుకెళ్ళాను.
    "నాకేదో అనుమానంగా ఉంది. కక్కయ్యా, ఆమె చావు సహజమైంది కాదని. ఆ పెదవులూ, గోళ్ళూ చూశావా నీలంగా --"
    "నీ ఏ అనుమానమూ అరుంధతిని తిరిగి తీసుకు రాదు. అనవసరంగా కుటుంబాన్ని రచ్చ కేక్కించకు. జరగవలసినదేదో చెయ్యి. నేను పోలీసుల నోరు మూశాను. ఇంకా ఆలస్యమైతే వారూ వీరూ పోగై తప్పుకోలేని పరిస్థితి వస్తుంది."
    "అసలు నీ అభిప్రాయం ఏమిటి?"
    "శాంతించు! అలా మాట ఇవ్వు, గొడవ చెయ్యనని."
    'అలాగే."
    "అరుంధతిది దుర్మరణం. ఇంకా వివరంగా చెప్పాలంటే హత్య!"
    "నేనేమనను? విధులన్నీ సక్రమంగా పూర్తీ చేశాను.

 

                               *    *    *    *


    కుసుమ తలిదండ్రులు వెళ్ళిపోయారు.
    కుసుమకు ఆ రాత్రి నుంచీ కలవరించడం ఎక్కువయింది. నిద్రలో ఏదో పీడ కలతో ఉలిక్కిపడి లేస్తుంది. మళ్ళీ నిద్ర పొతే ఏం కల వస్తుందో ననే భయంతో తెల్లవార్లూ వచ్చే నిద్రను ఆపుకుంటూ దయ్యంలా కూర్చుంటుంది.
    "నేనిక్కడుండలేను. అదొక దయ్యాల కొంప అయింది. నన్ను కొన్నాళ్ళ పాటు మా వాళ్ళింటికి పంపించండి." అంటూ ఏడ్చింది.
    లోకేశ్వరి కక్కి కూడా ఆ పనే చేయ్యమంది.
    కుసుమ ప్రయాణం నిశ్చయం చేశాను.
    అమెపెట్టే సర్దుకుంటూ ఉండగా ఒక కాగితం పై నా దృష్టి పడింది. అది పిన్ని దస్తూరి. తీసి చూశాను. సందేహం లేదు. అది పిన్ని తనకు ఆస్తి హక్కు లేదని వ్రాసి ఇచ్చిన కాగితం. 'ఇది వ్రాయించుకుని ఆమెను నమ్మించి......ఏం చేశారు?"
    "చెప్పు! నిజం చెప్పు. పిన్ని మరణం విషయంలో ఊరి వారి గుసగుసలు ఎంతవరకూ నిజం? చెప్పు?"
    కుసుమ భయపడిపోయింది. "చెప్పు, కుసుమా!" నిజం చెప్పు!"
    "నాకేమీ తెలియదు."
    "ఏమీ తెలియకపోతే ఎందుకలా భయపడుతున్నావు?" నిద్రలో ఆ ఉలికి పాటేందుకు? భయంతో ఈ ఇంటిని వదిలి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి దీనికి అర్ధం?"
    "మీ పిన్నీగారు ........ ఆత్మహత్య చేసుకుంది.
    "ఎందుకు? ఈ పత్రం రాసి ఇచ్చాక కూడా ఆమె భరించలేని , జీవించలేని పరిస్తితు లెం వచ్చాయి?"
    "నాకు తెలియదు."    
    "నిజం చెప్పక పోయావో -- నిన్ను చంపేస్తాను. చెప్పు?" నా అవతారం , ముఖ భంగిమలూ చూసి ఆమె భయంతో కళ్ళు పెద్దవి చేసింది.
    "లాభం లేదు. అరిచావో -- నిర్దాక్షిణ్యంగా చస్తావు. చెప్పు!"
    ఇక లాభం లేదనుకుందో ఏమో -- "మీ అనుమానం లోకుల అనుమానాలూ.....ని..జ...మే.... కాని ....అంతా అమ్మా, నాన్నా చేశారు. నాకేమీ తెలియదు." అన్నది.
    "పిన్నీ!" అంటూ ఆక్రోశించాను.
    "ఏమండీ! నన్ను క్షమించండి!" అంటూ పరుగున వచ్చి కాళ్ళ మీద పడింది కుసుమ. ఆమె కూడా విపరీతంగా ఏడుస్తుంది.
    "మిమ్మల్ని దక్కించుకోవాలని మా వాళ్ళెం చెప్పినా తల ఊపాను. నన్ను క్షమించండి! నా కన్యాయం చెయ్యకండి!" ఏడుస్తుంది.
    "చేసేదేదో చేసి కూర్చుని, "క్షమించండి!" అని ముగించటానికి ఇది నాటకమో, సినిమానో కాదు కుసుమా? జీ.....వి.......తం!!"
    "అయితే శిక్షించండి! ఏమైనా చెయ్యండి! జైలుకి పంపించండి పోనీ...."
    "ఎంత బాగా నటిస్తున్నావు!"
    "ఆ మహాతల్లి చచ్చి కూడా నన్ను సాధిస్తోంది.
    ఏదో నిశ్చయానికి వచినట్లు అన్నాను."ఇంక సాధించదులే ! బయలుదేరు!"
    "మీరు రారూ?"
    "రాను."
    "ఎప్పుడు వస్తారు?"
    "చెప్పలేను."
    "అయితే నేనూ వెళ్ళను!"
    "నీ ఇష్టం . మనసు పాడైంది. నేనూ కొన్నాళ్ళు ఎటైనా తిరిగి రావాలను కుంటున్నాను. ఒంటరిగా ఉండగలిగితే ఉండు!"
    "నేనూ వస్తాను మీతో."
    "వీల్లేదు."
    "మరి....! మా వాళ్ళ కేం చెప్పను?"
    "ఉన్నదున్నట్లు చెప్పు! వ్యవసాయం కౌలు కిస్తాను. వాళ్ళు డబ్బు, ధాన్యమూ నీకు అప్పగించే ఏర్పాటు చేస్తాను. శిస్తు కట్టి మిగిలింది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో!"
    "ఏమిటి మీ మాటలు? మళ్ళీ తిరిగి రానట్లు మాట్లాడుతున్నారే! జరిగిన దురంతం జరిగిందాకా నాకు తెలియదు. నిజం చెబుతున్నాను. నమ్మితే నమ్మండి! లేదా నా ఖర్మ.
    నేను మాట్లాడలేదు.
    "నన్ను ఒంటరిగా వెళ్ళమంటారా? మీతో తీసుకెళ్లరా? ఆఖరు సారి అడుగుతున్నాను. చెప్పండి"
    "వెళ్ళు! వెళ్ళు! వెళ్ళు!"
    కుసుమ వెళ్ళిపోయింది.
    వ్యవసాయం ఏర్పాట్లు ఆమెకు చెప్పినట్లు చేశాను. జనార్దనం కక్కయ్య గారిని మధ్యవర్తి గా ఉంచాను. లోకేశ్వరి కక్కి -- "ఎన్ని కష్టాలు నాయనా, నీకు!' అంటూ నన్ను కౌగలించుకుని ఏడ్చింది.

 

                               *    *    *    *


    శూన్య గృహంలో నేనొక్కడినీ మిగిలాను. మధ్య హాలులో ఒంటరిగా ఒక కుర్చీలో నేను.
    వేళకు కక్కి గాని, కక్కయ్య గానీ వచ్చి తీసుకెళ్ళి బలవంతాన ఇంత తినిపించేవారు.
    నాన్న తన గదిలో ఉన్నట్లే ఉంది. ఆయన దగ్గి నట్లు భ్రమ పడేవాడిని. వంట ఇంట్లో ఏ ఎలక పిల్లో చప్పుడు చేస్తే పిన్ని వంట చేస్తున్నట్లనిపించేది. కాని, ఇవేమీ నా గుండె చెదర నివ్వలేదు. నా ఆత్మీయులు నాతొ ఉన్నట్లని పించేది. కాని, కుసుమ గదిలోకి వెళితే ఒక నర రూప రాక్షసి స్పురించేది నాకు.
    పిన్నీ,  నీ కన్యాయం జరిగింది పిన్నీ!' ఈలాంటి ఆలోచన రాగానే ఒక చల్లని హాయి అయిన పులకరింత కలిగేది. ఆత్మీయుల ఒడిలో తల దాచుకుంటే కలిగే ఓదార్పు దొరికేది. పిన్ని నన్ను క్షమించిందనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
    అయినా నా అంతర్ఘోష అంతటితో తీరేది కాదు.
    నాకు శాంతి కావాలి. ప్రశాంతత కావాలి. ఈ పరిసరాలను , పరిస్థితులను మరిచి పోవాలి. ఎక్కడికో వెళ్ళాలి. ఇదంతా మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి. పునర్జన్మ అనుకోవాలి. అంతే!
    ఏ ఉద్యోగమో సంపాదించుకుంటే -- నా కాళ్ళ మీద నేను నిలబడవచ్చు. కానీ, మళ్ళీ ఏ పరిస్థితులోనూ ఇక్కడకు రాకూడదు. ఈ వ్యక్తులను కలుసుకోకూడదు. పూర్తిగా మరిచిపోవాలి.
    నాన్న బాంక్ బాలెన్సు ఈమధ్యనే నా పేర మారింది. డ్రా చేసి దాన్ని రెండు భాగాలుగా చేశాను. ఒక భాగం కుసుమ పేర జమ కట్టాను. మిగిలింది నేను ఉంచుకున్నాను. ఫరవాలేదు. నాలుగైదేళ్ళ పాటు నేను ఏ ఉద్యోగమూ చేయకపోయినా ఫరవాలేదు. కుసుమ చెక్కును రిజిష్టరు పోస్టు చేశానామెకు.
    కావలసినవి క్లుప్తంగా సర్దుకున్నాను.
    తాళం చెవి కక్కయ్య కిచ్చాను. కుసుమ వస్తే ఇవ్వమన్నాను. అయనా, పిన్నీ నన్ను అపాలనీ, మార్చాలనీ ఎంతో ప్రయత్నించారు.
    తాళం చెవి తన దగ్గరున్నట్లుగా , నేను వెళ్ళిపోయినట్లుగా కక్కయ్యను మామగారికీ, కుసుమకూ ఉత్తరాలు వ్రాయమన్నాను.
    "మీ ఇంటి కేదో శని పట్టిందిరా , నాయనా" అంటూ ఏడ్చింది కక్కి.
    ఆ రాత్రి పన్నెండు గంటలు దాటాక బయలు దేరాను నేను.
    అంతే! గిరిధారి అక్కడ అదృశ్యమయ్యాడు నూతన జీవితం ప్రారంభించే తావు వెదుక్కుంటూ సుఖమూ, శాంతీ దూరమైన మానవుడుగా వాటిని అన్వేషిస్తూ బయలుదేరాడు.
    చివరకు ఇక్కడ తేలాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS