Previous Page Next Page 
అన్వేషి పేజి 19

                           

                                     

    "అదేమిటమ్మా-- జావ పారబోస్తున్నావు?"
    "గిరీ! నీ కెందుకీ వంటింటి విషయాలు" అందులో ఈగ పడింది.
    నేను నమ్మలేక పోయాను. ఏదో అనుమానం వచ్చింది. ఆమె చేతిలో గిన్నె లాక్కుని అంటి ఉన్నది రుచి చూశాను. ఉప్పుగా ఉంది.
    "ఏమిటది?"
    ఆమె మాట్లాడలేదు. కళ్ళు వాల్చుకుంది.
    "అర్ధమయింది, పిన్నీ."
    "దయచేసి గొడవ చేయకు, నాయనా!" అంది.
    వెళ్ళేసరికి అద్దం ముందు కూర్చుని ఉంది కుసుమ. ఒక్కమారు నా వంక చూసి, "ఇక ఉద్యోగ ప్రయత్నానికి నీళ్ళేగా" అన్నది.
    "అవతల నాన్నకలా ఉంటె--"
    "నిజమే! కళ్ళారా చూస్తూ ఒప్పుకోకుండా ఉండటానికి నేను మూర్ఖురాలిని కాను."
    "రక్షించావు!"
    "నేనంటే అంత భయమా మీకు?" అంటూ నవ్వి, "ఈమధ్య మీరెందుకో దిగులుగా ఉంటున్నారు?" అన్నది.
    నేను మాట్లాడలేదు. ఆమె దగ్గరగా వచ్చిన్ అన్నది:
    "మీకు తెలీయకుండా నేనొక పని చేశాను."
    "ఏమిటని అడగచ్చా!"
    "మా నాన్నకు ఉత్తరం వ్రాశాను. నాలుగు రోజులయింది.
    "అంతేకదా?"
    "అలా తెల్చేస్తారేం! మామగారు జబ్బు మనిషి! ఆయనుండగానే అన్నీ తెల్చేసుకుంటే నయం గదూ? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు."
    "నీకా అనుమానం ఎందుకొచ్చింది? అయినా తేల్చవలసిన విషయలేమున్నాయి? మనమేం జమిందార్లమా ఏమన్నానా?"
    "ఉన్నంతలోనే -- ఇప్పుడు సందేహిస్తే తరవాత వచ్చే గొడవలు ఒహ పట్టాన వదలవు."
    "ఏ గొడవలు?"
    "అదే -- మీ పిన్ని గారు మనోవర్తి అంటుంది. అదంటుంది, ఇదంటుంది." కుసుమ మాటలు పూర్తీ కానేలేదు. నా రెండు చేతులూ ఆమె చెంపలను ఎడా పెడా వాయిస్తున్నాయి. మొదటి రెండు దెబ్బలూ పళ్ళ బిగువున ఓర్చుకుంది గాని ఆ తరవాత -- "బాబోయ్! నాయనోయ్" అంటూ అరిచింది.
    పిన్ని పరుగెత్తుకు వచ్చింది. ఆమెను చూడగానే -- "ఏం చెప్పావు మహా తల్లీ! నన్ను చంపేస్తున్నారు. బాబోయ్! మామగారూ! ఓ మామగారూ, నే నింక బ్రతకను. మీ కన్నా ముందు నేనే పోతాను." అంటూ నడి హాల్లోకి పరుగెత్తుకు వచ్చింది. గుమ్మంలో పిన్ని కుసుమ నెట్టిన నెట్టుకు దూరంగా పోయి వంటింట్లోకి పోయే గుమ్మాన్ని ఆసరా చేసుకుని నిలబడింది.
    నాన్న గది గుమ్మంలోకి వచ్చారు.
    నా గది గుమ్మంలో నేను.
    వంటింటి గుమ్మంలో ఏం జరిగిందో అర్ధం కాని  పిన్ని.
    మధ్య హాలులో అఘాయిత్యం చేస్తూ అరుస్తున్న కుసుమ.
    ఆ సమయంలో వీధి గుమ్మంలో నుంచి ఆమె తండ్రి గారు వచ్చారు.
    ఆయన్ను చూడగానే -- "నాన్నా! నన్ను తీసుకెళ్ళు , నాన్నా! ఆమె ఉండగా నేనిక్కడ ఉండలేను. నన్ను చంపేస్తున్నారు , నాన్నా" అంటూ బావురుమంది.
    తండ్రి వెనకాలే వస్తున్న తల్లి -- "ఎవరే, తల్లీ నిన్ను చంపేది? నీకు కీడు తలపెట్టిన వాళ్ళు నాశనం కావాలి" అన్నది.
    కుసుమ తండ్రిని వదిలి ఆమెను కౌగలించుకుని ఏడవసాగింది. సామాను లోపల పెట్టి, చోద్యం చూస్తున్న రిక్షా వాడికి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి పంపేశాను. అతను వెళ్ళిపోయాడు.
    "ఏం నాయనా, అందుకేనా పిల్లను నీ చేతుల్లో పెట్టింది?" కన్నీళ్ళతో అడిగింది అత్తగారు.
    నేను మాట్లాడకుండా నా గదిలోకి వచ్చేశాను.
    "అవతల మొగుడు చావు బ్రతుకుల్లో ఉంటె -- ఏమిటమ్మా పిల్ల మీద నీ ఆరడి! సొంత అత్తగారి వైనా కాదు. ఇటువంటి బుద్దులు కాబట్టే ఆ దేవుడు నీకు తగిన రాత రాశాడు" అంటూ పిన్ని వైపు తిరిగిందావిడ.
    "నాకేమీ తెలియదు, వదిన గారూ!" అంటూ ఏమో అంటున్నది పిన్ని.
    "బావగారూ! మీరుండగానే ఇంత రభస! ఇప్పుడే ఇలా ఉంటె -- ఇకముందు -- చెప్పేదేముంది? మీరుండగానే ఎవరి ఏర్పాటేదో వారికి చేసేయ్యటం మంచిది." కుసుమ తండ్రి.
    "బావగారూ! ఏమిటి మీరంటున్నది?' నాన్న.
    "ఏముంది? లోకంలో జరిగేదే! మీరు పెద్దవారు. ఇంకెలా చెప్పను.?"
    "సరేలెండి! ముందు కాస్త కాళ్ళు కడుక్కుని మంచినీళ్ళు, కాఫీ యో తీసుకోండి! అనక తీరిగ్గా మాట్లాడుకుందాం! ఈలోగా నేను చావను లెండి! వెళ్ళమ్మా , కుసుమా! అమ్మా నాన్నల కేం కావాలో కనుక్కో. ఒకవేళ ఉన్నట్టుండి నేను గటుక్కుమంటే శవం వెళ్ళే దాకా మంచి నీళ్ళైనా తాగే వీలు ఉండదు." కసిగా అన్నారు నాన్న.
    "అయ్యయ్యో! యెంత మాట!"
    "అన్నగారూ! వస్తూనే కన్నకూతురు ఇలా ఎదుట పడితే ఎవరికైనా ఎలా వుంటుందో ఆలోచించండి!" అంది కుసుమ తల్లి.
    "పదమ్మా!' అంది కుసుమ. "రా, నాన్నా, కాళ్ళు కడుక్కుందువు గాని."
    "బాగానే ఉందమ్మా వియ్యాలవారి మర్యాద." కుసుమ తల్లి.

 

                                   29


    కొంచెం ఆలస్యమే అయినా వియ్యాల వారికి మర్యాదలు బాగానే జరిగాయి.
    మరురోజు మంచి విందు కూడా జరిగింది.
    సాయంత్రం మామగారు జనార్దనం కక్కయ్య ఇంటికి వెళ్ళారు.
    కాస్త అటూ ఇటుగా అత్తగారు కూడా అనుసరించారు.
    మళ్ళీ వాళ్లతో పాటు కక్కయ్య కూడా వచ్చారు. నాన్నను పరామర్శించారు. ఆ మాటా, ఈ మాటా అయ్యాక -- "ఆడపిల్ల నిచ్చుకున్నవాళ్ళు-- వాళ్ళు ఆరాట పడటం లో నాకేమీ తప్పు కనిపించటం లేదు, సుదర్శనం" అన్నారు.
    "ఏమిటి , జనార్దనం?"
    "అదే-- నీ ఆరోగ్యం సరిగా లేదు. అసలైతే ఉన్నదేమీ లేదనుకో కానీ-- అరుంధతీ . ఆమెకు చేసే ఏర్పాటు కాస్త రాతకోతల్లో బిగిస్తే ఉన్నది గిరిదారే కదా! ఏ చిక్కూ ఉండదు."
    "అదా సంగతి! ఇందుకన్న మాట మా వియ్యంకుడు వచ్చింది, నిన్ను తీసుకుని వచ్చింది?" అన్నారు నాన్న.
    "అంతే, బావగారూ!" అంటూ కుండలు బద్దలు కొట్టారు మామగారు.
    "నేను బ్రతికి ఉండగానే అరుంధతికి మనోవర్తి పెట్టమంటారు!"
    "ఛ! ఛ! ఆ పేరెందుకు?" అంటూ నొచ్చుకున్నారు కక్కయ్య.
    "పెరేదైతెనేం లే! విషయం అదేగా -- నేనా పని చెయ్యను. గిరి అరుంధతికి కూడు పెట్టడన్న భయం నాకు లేదు."
    పిన్ని కూడా విషయం వింటున్నట్లుంది. "కావాలంటే ఈ ఆస్తితో నాకేం సంబంధం లేదని పత్రం రాసి ఇస్తాను. ఆయన్ను విసిగించకండి! అసలే ఆరోగ్యం బాగాలేదు" అన్నది.
    "అది న్యాయం కాదమ్మా!" మామగారు గొప్ప న్యాయవాది లా అన్నారు.
    గదిలో ఉన్న నేను కూడా ఆగలేకపోయాను. ఏమీ ఎరగనట్లు ఏదో సవరిస్తున్న కుసుమను జబ్బ పట్టుకుని లేపి, "ఇదా నీవు పన్నిన వల" అన్నాను.
    ఆమె నిర్లక్ష్యంగా విదిలించుకున్నది.
    'అయితే నీకు కావాల్సింది ఆస్తి! నాతొ పని లేదా!"
    "నాతొ ఎందుకు వాదన-- వెళ్ళి ఆమె గారి తరపున వాదించండి."
    "తప్పకుండా వాదిస్తాను" అంటూ బయటికి వెళ్ళాను    "మామగారూ! మా కుటుంబం ఆస్తి వ్యవహారాలు మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాము. మీరు కల్పించుకోకండి!" అన్నాను.
    "అదెలా, నాయనా! మా పిల్ల నిచ్చుకున్నాక ఊరుకోగలమా చూస్తూ?"
    "అయితే ఏమంటారు?"
    "ఆమె కేదో ఇది అని ఏర్పాటు చేస్తే--"
    "ఛీ! ఛీ! ఏం మనుషులు మీరు!"
    "నేను మీ కెంత సమస్య అయ్యాను" అంటూ ఏడ్చింది పిన్నీ.
    "అరుంధతీ! నీవు లోపలికి వెళ్ళు!" అన్నారు నాన్న.
    "నాకు ఏమీ వద్దు! మీరేమిచ్చినా నాకు వద్దు!"
    "సరేలే వెళ్ళు! నాకు తెలుసు ఏం చేయాలో."
    ఆమె వెళ్ళగానే -- "గిరీ! నీవు కూడా ఇందులో కల్పించుకోకు" అన్నాడు నాన్న.
    కొంతసేపయ్యాక "నేనెప్పుడో విల్లు వ్రాశాను" అన్నారు.
    "ఏమని?" మామగారి ప్రశ్న.
    "నాకూ, గిరికీ సమాన వాటాలు. నేను పోయాక నా వాటా అరుంధతిది. దాన్ని సక్రమంగా చూస్తె దాని తరువాత గిరిది."
    "ఆ" అంటూ కళ్ళు పెద్దవి చేసి నోళ్ళు తెరిచారు.
    "అలా రిజిస్టరు కూడా చేశాను. ఇంకెవరూ ఏమీ చెయ్యలేరు."
    "అమ్మ నాయనోయ్!' అంటూ గుండెలు బాదుకుంది అత్తగారు.
    "అలా వీల్లేదు, బావగారూ! అది న్యాయం కాదు."
    కక్కయ్య నెమ్మదిగా జారుకుని వెళ్ళిపోయాడు.
    "ఇంకేముంది? అంతా అయిపొయింది" అన్నారు మామగారు.
    నాకా క్షణంలో నాన్నకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది.
    "మంచి పని చేశారు, నాన్నా!"
    "ఇంక బయలుదేరు -- వచ్చిన పనైందిగా" అన్నారు మామగారు.
    "అమ్మా, అరుంధతమ్మా, పోతున్నాం , తల్లీ! తండ్రీ కొడుకు లిద్దరినీ గుప్పిట లో బిగించావు . ఇంక నీ ఇష్టం వచ్చినట్లు ఆడు."
    అత్తగారి మాటలకు పిన్ని బయటికి వచ్చింది. బాగా ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి.    
    "ఏమండీ! మీరు చెప్పింది నిజమేనా?' నాన్న నడిగింది పిన్ని.
    "నిజమే!"
    "అది మర్పించండి! లేకపోతె మీ ఎదురుగానే తల బద్దలు కొట్టుకు చస్తాను."
    "వీల్లేదు."
    "ఎందుకు వీల్లేదు? నాకు వద్దంటున్నానుగా!"
    "కావాలని మాత్రం అడిగావా?"
    "మరెందుకు చేశారా పని?"
    "నా ఇష్టం"
    "ఎందుకమ్మా ఈ నాటకం? మా అల్లుడు గారు ముందే చెప్పారుగా మా ఆస్తి మా ఇష్టమని?" అంది అత్తగారు.
    "దయచేసి మీరు కాస్త ఆగండమ్మా! ఏమండీ, నేను చెప్పినట్లు చేస్తారా, లేదా?"
    "నాన్న ఆలోచనలో పడ్డారు. "ఏం, గిరీ" అన్నారు.
    "ఇందు కేవర్నీ అడగవలసిన పని లేదు. ఈవేళ ఇది జరక్కపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు." అంది పిన్ని.
    "సరే, నీ ఖర్మ! గిరీ, రేపు ఉదయం లాయరు గార్ని పిలువు. పాతది రద్దు చేసి కొత్తది వ్రాయిస్తాను."
    నేను మౌనంగా ఉండిపోయాను.
    అత్తగారూ, మామగారూ ఆనందించినట్లు ముఖాలే చెబుతున్నాయి.
    గదిలో కెళ్ళాను కుసుమ వేపు చూడలేకపోయాను.
    "ఈవేళ మీకు ఆస్తి విలువ తెలియటం లేదు. రేపు ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే తెలుస్తుంది." అన్నది.
    "కాస్సేపు నోరు మూసుకుంటావా? అంతా మీ ఇష్ట ప్రకారమే జరగబోతుంది గా?" కణతలను గట్టిగా నొక్కుకుంటూ అన్నాను.
    ఆమె నా మాట పాటించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS