Previous Page
అన్వేషి పేజి 21

 

                                   31


    అపర్ణా, ఇది నా కధ! ఇప్పుడు ఏం చెయ్యమంటావు చెప్పు? మళ్ళీ ఆ కూపం లోకి పోయి పడమంటావా? అలా కాకపోతే నీ సాన్నిధ్యంలో నూతన జీవితం ప్రాంభించమంటావా? ఏది న్యాయం? ఈనాడు నా జీవిత గ్రంధంలోని పుటలన్నీ నీ ముందు తెరిచాను. మీరు నాకిచ్చే సలహా ఏమిటి?"
    అపర్ణ ఒక భారమైన నిట్టుర్పు విడిచింది.
    "ఈలాంటి కధ ఏదో మీ వెనకాల ఉందని నాకు తెలుసు! అందుకే నేను తటస్థంగా ఊరికే ఉండి పోయాను. మీరు మీ జీవితాన్ని వదిలేసి ఎక్కడి నుంచి వచ్చారో తిరిగిఅక్కడికి వెళ్ళండి! అదే న్యాయం! అదే నేను మీ కిచ్చే సలహా!"
    "అపర్ణా!"
    "స్వామీ!"
    క్షణ కాలం ఒకే అనుభూతి తో రెండు శరీరాలూ పెనవేసుకున్నాయి. క్షణం అయ్యీ కాకముందే విడిపోయాయి.
    "ఇదే మొదటిది. ఇదే చివరి సమాగమం" అన్నాడు గిరిధారి.
    "నేను పాడతానని మీకు తెలుసు! కాని, నన్నెప్పుడూ పాడమని అడగలేదు. ఇప్పుడు నేనే గొంతు విప్పి పాడతాను." వింటూ సాగిపొండి!"
    "అలాగే, అపర్ణా! పాడమని అడగటానికి సమయమూ, సందర్భమూ రాలేదు. నన్ను క్షమించు. నీ కిష్టమైన పాట పాడు. నేను జీవించినంత కాలమూ నా హృదయం లో మారుమోగుతుందది."
    "అపర్ణ పాడటం మొదలు పెట్టింది. అది అష్టపది.
    "సావిరహే , తవదీనా.........
    గిరిధారి ఏనాడో తను నిద్రా, మెలకువా కాని సమయంలో ప్రభాత వేళ విన్న ఆలాపన గుర్తు వచ్చింది. అతను మెట్లు దిగి సాగి పోతున్నాడు. పాతాళం లోని నాగకన్య సప్త స్వరాలు అలాపిస్తున్నట్లు పాట దూరమవుతుంది. సెలయేటి మలుపుల్లా మెలికలు తిరిగి పోతుంది. కలహంపీ నాదంలా విన్న కొద్దీ వినబుద్ధి అవుతున్నది.
    దూరమై, అంతకంతకూ దూరమై అతనికి వీడ్కోలు చెబుతున్నది.
    సువ్యక్తమైన నిర్ణయాలతో అన్వేషణ పూర్తీ అయిన మానవుడు గమ్యం తెలుసుకొని తిరుగు ముఖం పట్టాడు.
    "బాబూ!"
    "పోతరాజు!"
    "సంగీతమయ్య ఫిడేలు ఆ బావి దగ్గర కరెంటు స్తంభాని కేసి పగుల కొట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకూ ఇక్కడుండాలని లేదు."
    "అదే పొరపాటు! నేను చేసిన పొరపాటు అదే! నేను నా పొరపాటు గుర్తించాను. నీవు అది చేయకు! మంగాలు నాకు తల్లి! నాకు పునర్జన్మ నిచ్చింది. ఆ అభిమానంతో నేను నీకు సలహా ఇస్తున్నాను. నా మాట విని వీవు పెళ్ళి చేసుకో! ఈ తోటను నమ్ముకో! ఏం, అలా చేస్తావుగా?"
    "మళ్ళీ పెళ్ళా, బాబూ!"
    "నా మాట విను, పోతరాజు! నాకు అంతా తెలుసు! మంగాలు చెప్పింది. నువ్వు నా మాట వింటే దాని ఆత్మ ఎంతైనా సంతోషిస్తుంది."
    "మీ దెంత నిండు గుండె , బాబూ! అట్లాగే మీ మాట ఇంటాను."
    "అపర్ణమ్మను కనిపెట్టుకుని ఉండు. నేను వెళ్ళి పోతున్నాను."
    "సుఖంగా ఉండండి, బాబూ! సెలవు!"
    నాలుగడుగులు వేశాడు గిరిధారి.
    "బాబూ!" అది కస్తూరి పిలుపు.
    ఆమె, కాంతమ్మగారూ వస్తున్నారు.
    "అమ్మా!" దూరం నుంచే పిలిచాడు. 'అక్కడే ఆగండి. సెలవు."
    నమస్కరించాడు.
    ఆమె రెండు చేతులూ ఎత్తి ఆశీర్వదించింది.
    "బాబూ!" కస్తూరి పరుగున వచ్చింది.
    "వెళ్ళిపోతున్నారా?"
    "అవును, కస్తూరీ!"
    "నన్ను తీసుకు పోతానన్నారు. " చిన్నపిల్లలా అన్నది.
    "నీవు చదువుకోవాలని  అలా అన్నాను. నీ నిరీక్షణ ఫలిస్తుంది. నీ భర్త వస్తాడు, కస్తూరీ! నా అంతరాత్మ చెబుతోంది. నీవు ఇక్కడే ఉండు. వెళ్ళేవరకూ అపర్ణ కు తోడుగా ఉండు."
    కస్తూరి ఏడ్చింది.
    "ఏడవకు కస్తూరీ! ఎవరి కేవరం -- ఎక్కడి నుంచి వచ్చామో , ఎక్కడికి పోతామో-- ఈ బ్రతుకు నాలుగు రోజుల సంత. అంతే! బాధ పడకు!"
    "ఎళ్ళాక ఉత్తరం వ్రాయండి , బాబూ!"
    "వ్రాయను కస్తూరీ! ఆ మాట అనకు. మనం విడిపోదాం. దైవం, కాలం కలిపితే తప్ప ఆ ప్రయత్నాలు మనకు మనమై చేయవద్దు. అదే అందరికీ మంచిది. నేను వెళుతున్నాను. ఆగిపో!"
    అతను కదిలాడు -- బ్రతుకులో వదిలేసిన భాగాన్ని తిరిగి కొనసాగించే సత్సంకల్పంతో , దుఖం లేని ఇంటి నుంచి చారెడు శాంతి బీజాలు సంపాదించాలనే వ్యర్ధ ప్రయత్నం మాని.
    బ్రతుకు పటంలో శాంతి వీచికలు. ప్రసరింప జేయమని తుది యత్నంగా దైవాన్ని అర్ధిస్తూ అతను సాగిపోయాడు.

 

                                                      32


    గిరిధారి చెప్పడం ముగించి భారంగా నిట్టూర్చాడు.
    "ఇదే అపర్ణ కధ! భయపడి పారిపోయిన నా జీవితంలోకి ధైర్య స్తైర్యాలు నింపి మళ్ళీ నన్నందులో ప్రవేశపెట్టిన అపూర్వ వ్యక్తీ అపర్ణ. సికిందరాబాదు లో మీరు చూసిన వ్యక్తీ ఆమె సోదరుడు నవనీత కృష్ణ. అతనితో ఉన్న వ్యక్తీ అతని భార్య!"
    నేను ఒక పత్రిక మీద కొన్ని పళ్ళు అమర్చి గిరిధారి వేపు అందించాను.
    "ఇప్పుడు తినలేను."
    'అయితే తీసుకెళ్ళండి!"
    "సూట్ కేసులో పొట్టలో ఉన్నంత జాగా కూడా లేదు. తినేస్తాను. మీరూ తినండి మరి."
    "అలాగే! మీరు హైదరాబాదు లో మా ఇంటికి తప్పక రావాలి. మా  వారు చాలా సంతోషిస్తారు. ఆయనకు స్నేహితులంటే చాలా ఇష్టం! వీలైతే మీ శ్రీమతి తో సహా రండి!"
    అతను అంగీకరించాడు. మా అడ్రసు ఇచ్చాను.
    "అదుగో, అదే కొండపల్లి ఖిల్లా."
    "విజయవాడలో పుట్టి పెరిగిన నాకు కొండపల్లి ఖిల్లా ను గురించీ, ఉండవల్లి గుహలను గురించి మీరు చెప్పాలా? అయితే ఇంతకూ అపర్ణ ఏమైనట్లు?"
    "కృష్ణ ఎక్స్ ప్రేషన్స్ మీరూ చూశారుగా? నేనేం చెప్పను! అపర్ణ శూన్యం లో కలిసి పోయింది. మన కిక లేదు' అన్నట్లుగా నా కర్ధమయింది."
    "అవును , నాకూ అంతే ననిపించింది."
    మాట లైపోయినట్లు ఇద్దరం మౌనంగా కూర్చున్నాం.
    'జీవితంలో మనసును సంచలిత పరిచే విషయాలను కళ్ళారా చూసిన సిద్దార్ధుడు సర్వమూ పరిత్యజించి తపస్సు చేసి జ్ఞానం సంపాదించి బుద్దుడయ్యాడు. మనసును అల్లకల్లోల పరిచిన పరిస్తితులకు దూరంగా పారిపోవాలని ప్రయత్నించాడొక మానవుడు. కాని ఎంత దూరం? ఎక్కడ చూసినా రకరకాల మనస్తత్వాల మనుషులు, అనుకున్నది అనుకున్నట్లు కాక అడ్డం తిరిగిన కధలు. అలాంటప్పుడు ఎక్కడైతేనేం? జీవితంతో రాజీ పడదలిచినప్పుడు 'అన్వేషి' అయిన మానవుడు ఎక్కడి నుంచి బయలుదేరాడో మళ్ళీ అక్కడికి చేరుకోవడమే ఉత్తమమైన కర్తవ్యంగా భావిస్తాడు.
    అతను చెప్పిన కధ విన్న తరవాత నాకిదే స్పురించింది. అదే మాట అతనితో చెప్పాను.
    "మీలో మంచి పరిశీలనాత్మక జిజ్ఞాస ఉంది." అంటూ అభినందించాడు నన్ను.
    చూస్తుండగానే కొన్ని నిమిషాల్లో విజయవాడ వచ్చింది. ఫ్లాట్ ఫారం మీద రైలాగగానే సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు గిరిధారి.
    తమ్ముడు చెప్పాడో ఏమో ప్రేమ, జయ, నళిని మొదలైన బృందం వాడితో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. నా సామాను తలా ఒకటి పుచ్చుకుని అల్లరి చేస్తూ బయటికి నడిచారు. వాళ్ళతో పాటు నేను.
    ఇప్పుడు వాళ్ళతో ఉన్నాను. మరి కాస్సేపటికి అమ్మా నాన్నలతో ఉంటాను. వారం రోజుల్లో శ్రీవారితో ఉంటాను. జీవితాలు అంతే! ఒకరితో ఒకరికి ఎన్నాళ్ళ ప్రాప్తమో అంతే! ఆ తరువాత ఎవరి కెవరో!

 

                                  (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS