Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 19


    కల్యాణి అంతకంటే తీవ్రంగా, తిరస్కారంగా చూసింది. "ముందా అమ్మాయిని వదలండి. ఆ అమ్మాయి యెవరణుకొంటున్నారు! మర్యాదగా వదలండి ఆఖరికి.....చివరికి నా కూతురులా చూసుకుంటున్న అమ్మాయిమీదే...." కల్యాణి యెగిసి పడుతున్న గుండెలతో అంది.
    రంగారావు క్రూరంగా నవ్వాడు. "నీ బ్రతుక్కి నీవూ నాకు నీతులు చెప్పడమేనా? కూతురట. కూతురు. నాకు పుట్టిన కూతురు కాదుగా ఫరవాలేదు. వెళ్ళు, వెళ్ళక్కడనించి" కసిగా-హేళనగా కఠినంగా అన్నాడు యేహ్యంగా ఆమెను చూస్తూ రంగారావు.
    కల్యాణి మొహం నల్లబడింది. చటుక్కున సుజాతవంక చూసింది. ఆ మాటవిని ఆశ్చర్యంగా చూసింది సుజాత యిద్దరి వంక. పులి నోట్లో చిక్కుకున్న మేకపిల్లని గుర్తు తెచ్చే సుజాతని చూస్తుంటే కల్యాణి అలా ఆమెని వదలి వెళ్ళలేకపోయింది. తనకి జరుగుతున్న అవమానం సంగతి యెలా వున్నా తన దగ్గిరవున్న సుజాతని రక్షించడం ముఖ్యం!
    "నే నెలాంటిదాన్నో యిప్పుడెందుకు లెండి. ఆ అమ్మాయిని వదలండి. అయినింటి పిల్ల. అభం శుభం తెలియని అమ్మాయి. నామీద కోపంతో అమ్మాయి బ్రతుకు నాశనం చెయ్యకండి. ఈ అమ్మాయిని వదలండి. లేకపోతే చాలా దూరం వెడుతుంది వ్యవహారం" అంటూ తీక్షణంగా బెదిరించింది.
    ఇంక లాభంలేదనుకొన్నాడు గాబోలు - విసురుగా సుజాతని ముందుకు నెట్టి కల్యాణి వంక ఛీత్కారం చేస్తూ "థూ...." అని విసురుగా వెళ్ళి మంచంమీద పడుకొన్నాడు రంగారావు.
    కల్యాణి గబగబ సుజాత చెయ్యిపట్టుకు లాక్కెళ్ళినట్టే తన గదిలోకి తీసికెళ్ళింది. అప్పటివరకు భయంతో నోట మాట రాక బిక్కచచ్చి పోయినట్టున్న సుజాత. చేతుల్లో మొహం కప్పుకొని కుర్చీలో కూలబడింది అవమానంతో, సిగ్గుతో, దుఃఖంతో.
    అలసిపోయినట్లు ప్రక్కమీద వ్రాలి, చీర చెంగుతో మొహం తుడుచుకొంటూ "అవును, అసలు నీవు యిప్పుడాయన గదిలోకి ఎందుకు వెళ్ళావు?" జాలిగా సుజాతని చూస్తూ అడిగింది కల్యాణి.
    సుజాత కొంగుతో కళ్ళనీళ్ళు వత్తుకొంటూ, "ఐస్ తెమ్మని పిలిచారు. నాయరు మానేశాక యీ మధ్యదేనికో దానికి పిలుస్తుంటే వెడుతూనే వున్నాను. ఈరోజు ఇలా......ఇలా అవుతుందని నాకేం తెలుసు..."బెరుకుగా అంది.
    "అందుకే నాయరు మానేస్తే యిబ్బంది అన్నాను. ఎవరినయినా మగవాడిని ఓ కుర్రాడినన్నా పెట్టుకోవాలి ఆయన పనులకి నీవు వీలయినంతవరకు ఆయనున్నప్పుడు గదిలోకి వెళ్ళకు. పనిమనిషి వున్నప్పుడు కాఫీ అది దానితో పంపుతూండు" అన్నది కల్యాణి.
    "ఆ.....అలా చెయ్యండి, వంటవాడు అక్కరలేదు. ఆయన పనులు చూడడానికి మాత్రం ఓ కుర్రాడిని పెడితే చాలు. ఆయన గదిలోకి ఇంక వెళ్ళాలంటే భయం వేస్తూంది, అసలు అసలు యీ మధ్యనల్లా ఆయన అదోలా నాతో మాట్లాడినప్పుడే....." సుజాత ఆగింది సందేహిస్తూ.
    "ఏమిటి? ఏం జరిగింది?" ఆత్రుతగా అడిగింది కల్యాణి.
    "ఏంజరగలేదనుకోండి. మొదట్లో అసలు ఆయన నాతో మాట్లాడే వారు కాదు. కాని ఓ పదిహేను రోజులనించి అస్తమానూ దేనికో దానికి గదిలోకి పిలిచి కల్పించుకుని మాట్లాడడం, క్రిందికి వంటింట్లోకి కూడా వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారు. అదోలా చూడడం....." ఇంక చెప్పలేక వూరుకుంది సుజాత.
    "మరి నా కెందుకు చెప్పలేదు ముందే!"
    "ఏం చెప్పను? ఎలా చెప్పను? మీరేం అనుకుంటారోనని....."
    కల్యాణి దీర్ఘంగా నిట్టూర్చింది. "బావుంది. సరే, కాస్త జాగ్రత్తగా వుండు, ఎవడయినా మనిషి దొరికేవరకు. ఏమిటో ఆ త్రాగుడు. ఆ మైకంలో యేం చేసేదీ ఆయనకి వళ్ళు తెలిస్తేనా? సరే, వెళ్ళు" అంది కల్యాణి కళ్ళు మూసుకుంటూ కళ్ళమీద చేతులుంచుకుని.
    నల్లబడ్డ ఆమె మొహం చూస్తుంటే యీ సంఘటన, భర్త ప్రవర్తన, అయన మాటలు ఆమె మనసుకి యెంత బాధ కలిగించాయో సుజాతకి అర్ధమయింది. అర్ధంకానిదల్లా రంగారావు కల్యాణిని అన్న మాటలే! డాక్టరుగారిని ఆమెలాంటి వ్యక్తిని ఆయన నీ బ్రతుక్కి నీవూ నాకు నీతులు చెప్పడమేనా? అనడంలో అర్ధం యేమిటో సుజాతకి అంతుబట్టలేదు! ఆవిడ బ్రతుకేమయింది? అంటే ఆమె నీతిలేనిదనా? ఆమెకి జీవితంలో మచ్చ వుందనా ఆయన చెప్పడం! కల్యాణిలాంటి సహృదయురాలిని, సంస్కారిని, అంత మంచి వ్యక్తిని ఆయన అలాంటి మాటలు అనడం సుజాతకి కష్టం అనిపించింది. కాని, కల్యాణి ఆ మాటలని ఖండించకు అనడం, మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. చెయ్యని నేరాన్ని మోసేటప్పుడు వచ్చే కాస్తపాటి ఉద్రేకం కూడా ఆమెలో కనిపించలేదు. అంటే ఆయన మాటలని వప్పుకున్నట్లా! అంటే-అంటే కళ్యాణి.....ఛా! ఛా! ఆమెని గురించి హీనంగా అనుకోడానికే సుజాత మనసు ఒప్పుకోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS