Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 19


    అతని ఆలోచనల్ని పట్టించుకోకుండా "ఏయ్ అభీ... ఏమిటా పరధ్యానం..?" అంది విరజ.
    అసలు సంగతి చెప్దామనుకుని ఆగిపోయాడు విరజ చేతిని తన చేతిలోకి తీసుకుని ముందుకు కదిలాడు నవ్వుతూ.
    ఓ రాయిపైన కూచున్నారు. ఎదురుగా అలలు ఎగిసి ఎగిసి ముందుకు దూకి, వేగంగా... ఉధృతమై ముందుకువచ్చి వీళ్ళ పాదాలను తాకుతున్నాయి. గాలికి విరజ ముంగురులు ముఖంపై కదలాడుతున్నాయి. చప్పున దగ్గరగా లాక్కొని ముద్దుపెట్టుకోవాలనిపించింది. బలవంతాన ఆపుకున్నాడు.
    విరజ మాత్రం తదేకంగా సముద్రాన్ని చూస్తోంది. పాలనురుగులాంటి తెల్లని నురగ దగ్గరగా వచ్చి, వెనక్కి వెళ్ళిపోతుంటే గమ్మత్తయిన ఫీలింగ్.
    అభినయ్, విరజ దగ్గరికి ముంతకింద పప్పు అమ్మేకుర్రాడు వచ్చి... "సార్! ఇవ్వమంటారా?" అన్నాడు.
    "విరజా! నీ ఫేవరేట్ ఐటమ్. ఎంత కావాలో తిను" అన్నాడు.
    మరమరాలు, పల్లీలు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసిచేసిన ఆ మిక్చర్ అంటే విరజకు చాలా యిష్టం.
    ఇద్దరూ తింటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. "చూశావా అభీ....దూరం నుంచి సముద్రం ఎంత బాగా కనిపిస్తోందో.... అలలు ఎంత వేగంగా వస్తున్నాయో? ఈ సముద్రంలో బోట్ జర్నీ చేస్తూ, ఫస్ట్ నైట్ జరుపుకుంటే బావుంటుంది కదూ..." అంది మిరపకాయ బజ్జీ కొరుకుతూ.
    "అబ్బా! కారం" అంది ఒక్కసారిగా విరజ. అభినయ్ వెంటనే బ్యాగ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు.
    "చూశావా అభీ.....ప్రపంచంలో మూడింతలు నీళ్ళే  వున్నాయి. అంతెందుకు....ఈ సముద్రంలొ ఇంత నీరున్నా తాగడానికి పనికిరాదు కదూ.... అలాగే నాకు ఎంతమంది మందీమార్భలం, స్నేహితులనే హిపోక్రట్స్, బంధువులనే రాబందులూ ఉన్నానాకు ప్రేమ పంచేవాళ్ళు లేరు. ఇదిగో.... ఈ చిన్న బాటిల్ నీరులా... నువ్వు తప్ప!"
    ఓ అల వేగంగా వచ్చి వాళ్ళ పాదాలను తాగి వెనక్కి వెళ్ళింది. విరజ చీరకుచ్చెళ్లు కొద్దిగా పైకి జరిపింది తడవకూడదనే ఉద్దేశంతో.
    అభినయ్ కిందికి వంగి ఆమె తెల్లటి లేతపాదాల మీద ముద్దుపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఒడిలో తల పెట్టాడు.
    "ఏయ్... ఏమిటిది చిన్నపిల్లాడిలా!" అంది విరజ అతని తలమీద తన తలపెట్టి.
    "ఈ సముద్రం పోటెత్తి, ఉవ్వెత్తున ఎగిసి, మనల్ని తనలో కలిపేసుకుంటే బావుండు. నీతో పరిచయం అయిన మూడేళ్ళలో వందేళ్ళకు సరిపడా జీవితానుభూతిని స్వంతం చేసుకున్నాను. రేపటి భయంతో, అభద్రతాభావంతో ఎందుకింకా? ఈ క్షణమే యిలా నీ ఒడిలో....."
    "ఏయ్ అభీ... ఏమిటా ఎమోషన్?" అంది విరజ. ఎందుకో ఆ క్షణం విరజను వదలాలని అనిపించలేదు అభినయ్ కు.
    ఆ క్షణం తన భయం.... అభద్రత..... నిజం కాబోతున్నాయనే విషయం తెలియదు అభినయ్ కు.
    
                                * * *
    
    మూడ్రోజులూ మూడు క్షణాల్లా కరిగిపోయాయి. భీమిలీ, కైలాసగిరి, బోటు షికారు, ఒక్కటేమిటి.... అన్నీ తిరిగారు.
    రాత్రిపూట దక్షిణ్ లో డిన్నర్  తీసుకుంటున్నారు. డిమ్ లైట్ లో ఇంగ్లీష్ మ్యూజిక్ తో రెస్టారెంట్ అందంగా ముస్తాబయి వుంది.
    విరజనే ఆర్డర్ ఇమ్మన్నాడు. అభినయ్ కి ఇష్టమైన చికెన్ మంచూరియా, బటర్ చికెన్, స్టఫ్ డ్ కుల్చా చెప్పింది.
    "అన్నీ నాకిష్టమైనవే చెప్పావే.... నీకు నూడుల్స్ ఇష్టం కదా విరజా"
    "అవి రేపు తినొచ్చులే!"
    బేరర్ ఓ ప్లేట్ లో మల్లెపూలదండ తెచ్చి టేబుల్ పై పెట్టాడు. ఆ హోటల్ లోని ప్రత్యేకత అది. వచ్చిన లేడీ కస్టమర్ల కు పూలదండలు ఇస్తారు.
    "ఈ పూల సిస్టమ్ బావుంది కదూ!"
    "అవును మన హైద్రాబాద్ లో కూడా మొదలుపెడితే బావుండును" అన్నాడు అభినయ్ కూడా మెచ్చుకుంటూ.
    "ఐస్ క్రీమ్ మేడమ్" అన్నాడు వినయంగా స్టివర్డ్.
    "అభీ! నీకు వెనీలా ఇష్టం కదా! తీసుకుందాం" అంది.
    "వద్దు! నీ కోసం ఐస్ క్రీమ్ అయినా నీకిష్టమైన బట్టర్ స్కాచ్ తిందాం..." అన్నాడు.
    "వద్దు... వద్దు... వెనీలానే...." అని స్టివర్డ్ వైపు తిరిగి "టూ వెనీలా ప్లీజ్" అంది.
    "విరూ! కనీసం ఐస్ క్రీమ్...."
    "ఇంకేం మాట్లాడకు. నీ యిష్టమే నా యిష్టం" అంది అతని చేతిలో చెయ్యి వేస్తూ.
    
                                  * * *
    
    ఆరోజు ఈవెనింగే గోదావరిలో రిటర్న్ జర్నీ.... రిసెప్షన్ కు ఫోన్ చేసి వెకెట్ చేస్తున్నట్టు, బిల్ రెడీ చెయ్యమని చెప్పాడు.
    లగేజీ అంత నీట్ గా విరజే సర్దింది. ఇద్దరి బట్టలు కలిపి నాకే సూట్ కేసులో సర్దుతుంటే గమ్మత్తయిన ఫీలింగ్.
    "వచ్చే సంవత్సరం పాపవో, బాబువో కలిపి సర్దాలి" అనుకుంది మనసులో విరజ.
    హోటల్ రూమ్ వెకేట్ చేసి వచ్చేస్తుంటే ఇద్దరి మనసులో ఏదో తెలియని వెలితి. మూడు రోజులు ఆ గదిలో ఉన్న అటాచ్ మెంట్ అలాంటిది మరి.
    రాత్రిపూట కర్టెన్ పక్కకు లాగి, లైట్ల వెలుతురులో విశాఖ సిటీ అందాలు చూడ్డం. చినుకుల్లో నగర సౌందర్యాన్ని వీక్షించడం.... పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కు వెళ్ళడం, విధిగా రోజు ఈవినింగ్ బీచ్ కు వెళ్ళడం....
    ఇవన్నీ... ఇవన్నీ... గాన్ విత్ ద ఎండా? ఒక్కసారిగా అభినయ్ ని చుట్టేసి బావురుమంది.
    "ఏయ్ విరూ...! ఏమిటిది?"
    "ఏమో అభీ... నాకు యిక్కడ్నుంచి కదలాలని అనిపించడం లేదు. ఏ ఆలోచనా లేకుండా మూడ్రోజులు మూడు క్షణాల్లా కరిగిపోయాయి. మనకు యిక్కడ బ్రాంచి ఆఫీస్ ఉన్నా వెళ్ళలేదు. మనదైన ప్రపంచంలో విహరించాం. ఈ గదితో ఉన్న అటాచ్ మెంట్ యింకా నా జ్ఞాపకాల్లో తడిగానే వుంది" అంది ఎమోషనవుతూ....
    "ఈసారి ఇక్కడికి మనం భార్యాభర్తలుగా వస్తాం. నెక్స్ట్ వీక్ స్టేట్స్ నుంచి మన ఫ్యాక్టరీకి సంబంధించిన మిషనరీ తీసుకు రాగానే, పెళ్ళి ఎప్పుడనుకున్నావు? సెప్టెంబర్ పదకొండు. సరిగ్గా అదేరోజు ఉదయం ఫ్లయిట్ లో వస్తాను. ఈవినింగ్ మనం ఏ టాంక్ బండ్ దగ్గర అయితే కలుసుకున్నామో... ఆ టాంక్ బండ్ మీదుగా బిర్లా మందిర్ కు వెళ్ళి పెళ్ళి చేసుకుందాం.
    ఇక నుండి నెలకోసారి వైజాగ్ వద్దాం. ఒక్క మూడ్రోజులు యిక్కడే గడుపుదాం. మనకోసం... సరేనా...!" అతని చొక్కా గుండీ పీకి "సరే" అంది.
    "అదేమిటి గుండీ పీకి చెప్పావ్?"
    "నువ్వు మొదట గుండీ తీసేస్తేనే మరింత అందంగా, హ్యాండ్ సమ్ గా, లవ్లీగా వుంటావ్...." అంది.
    అప్పుడే డిసైడయ్యేడు అభినయ్. ఇంకెప్పుడూ షర్ట్ పైబటన్ ఓపెన్ గా వుంచాలని.
    "అవునూ... నీ బ్లౌజ్ పై హుక్ కూడా తీసే ఉంచితే బావు..."
    అతని మాట పూర్తి కాకుండానే విరజ విసిరిన పూలదండ అతని చెంపని తాకింది.
    విరజ ఉడుకుమోత్తనానికి అతనికి నవ్వొచ్చింది.
    బ్యాక్ టు సికింద్రాబాద్.
    ఆ రోజు ఈవెనింగ్ గోదావరిలో సికింద్రాబాద్ బయల్దేరారు.
    
                                  * * *
    
    "కాదంబరీ.... ఒసే కాదూ...." బామ్మగొంతులో నుంచి ఖంగు ఖంగుమని వినిపించింది. చీరకట్టుకుని సేఫ్టీపిన్స్ కోసం వెతుకుతున్న కాదంబరికి బామ్మ మాటలు చికాకు కలిగించాయి.
    "అసలే సేఫ్టీ పిన్స్" దొరక్క తను టెన్షన్ ఫీలవుతుంటే ఈ బామ్మ ఒకతి ప్రాణానికి.
    "ఏంటి బామ్మా!" అడిగింది తన గదిలో నుంచే.
    "ఇంకెంతసేపు చీర సింగారించుకుంటావే.... ఆఫీస్ టైం అవ్వడం లేదా?" అడిగింది బామ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS