Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 19


    ఉదయం పదిగంటలకల్లా మేకప్ తో సెట్ లో అడుగుపెట్టిన సుకృతి ఉలిక్కిపడింది అక్కడ రామన్ ని చూస్తూ.
    ఒకప్పుడు హీరోగా ఉన్నవాడు ఇప్పుడు నిర్మాతై సెట్ లో రమ్యశ్రీతో బాటు కూర్చుని జోక్స్ వేస్తున్నాడు. అతడు వచ్చింది రమ్యశ్రీ కాల్ షీట్స్ కోసమని సుకృతికి తెలీదు. తెలుసుకోవాల్సిన ఆగత్యంలేదు.
    అయితే సుకృతిని చూసి కూడా అతడు పట్టించుకోకపోవడం అణువంత బాధని కలిగించింది. అది కాదు. శరీరం డబ్బుతోబాటు అమ్మ తెలుగునీ బాగా నేర్పేసినందుకేమో రమ్యశ్రీని ఇంప్రెస్ చేసే ప్రోసెస్ లో తెగ రెచ్చిపోతున్నాడు.
    "షాట్ రెడీ అయ్యింది మేడమ్" శివ పిలిచాడు రమ్యశ్రీని సమీపించి.
    నిన్నటి అతడి ప్రవర్తన ఇంకా మరిచిపోలేదేమో నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది రమ్యశ్రీ.
    మరో రెండు నిమిషాల తర్వాత మళ్ళీ గుర్తుచేశాడు. అయినా ఆమెలో చలనంలేదు.
    కెమెరా మెన్ తో తర్వాత షాట్ గురించి చర్చిస్తున్న సుదర్శనరావు అక్కడికి తప్పంతా శివదే అయినట్టు గట్టిగా అరిచాడు "నిద్రపోతున్నావా..... పిలవడం చేతకాదూ."
    ఇబ్బందిగా చూశాడు శివ.
    ఆలస్యానికి కారణం శివ కాదని అతడికి తెలుసు. అయినా శివనే తిట్టాడు మళ్ళీ. "చేతకాకపోతే బయటికి నడవాలిగాని నా స్టాఫ్ యిలా అసమర్ధులైతే నేనసలు టాలరేట్ చేయను."
    నిన్నటి శివ సమర్ధత అసమర్ధత అయ్యింది. ఇప్పటి శివ  అసమర్ధత రమ్యశ్రీ సమర్ధతగా మారింది.
    శివ స్థితిని చూసి అప్పటికి అహం చల్లారిందేమో వెంటనే లేచి షాట్ లోకి నడిచింది రమ్యశ్రీ.
    "రడీనా" ఉత్సాహంగా అడిగాడు డైరెక్టరు.
    "ఎప్పుడో" భుజాలు ష్రగ్ చేసిన రమ్యశ్రీ "డైలాగేమిటి" అడిగింది శివని చూస్తూ.
    డైలాగ్ చదివి వినిపించడం అసిస్టెంటు డైరెక్టరు పనే అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుదర్శనరావు. రామన్ని విష్ చేసి డైరెక్టరు కోసం కేటాయించబడిన కుర్చీపై సెటిలయ్యాడు.
    "మేడమ్....." అంతసేపూ ఏమీ జరగనట్లుగా డైలాగ్ పేపరులోకి ఓ క్షణం చూసి చెప్పాడు "మీరు అలసటగా ఇంటికి తిరిగొచ్చారు. అప్పటికే తెలిసిపోయింది మీకు. మీరు నిజాయితీగా ప్రేమించినా, హీరో మాత్రం మిమ్మల్ని మీ డబ్బుకోసం ప్రేమించినట్టు నటించిన విషయం అర్ధమై గదిలో నుంచి వస్తున్న పనిపిల్లతో అంటారు బాధగా.....నేను ఓడిపోయాను సరళా అని."
    "అప్పుడు ఆ అమ్మాయేమంటుంది?" అడిగింది రమ్యశ్రీ యధాలాపంగా.
    "ఏమైందమ్మా అని అడుగుతుంది. దానికి రమేష్ డబ్బుకోసం తప్ప నా కోసం నన్ను ప్రేమించలేదంటారు.... కొన్ని నిజాలు ముందే తెలియడం మనిషి చేసుకునే అదృష్టం అంటుంది సరళ."    
    "ఓ పనిపిల్ల అలాంటి మంచి డైలాగు చెబుతుందా."
    "గ్రాడ్యుయేట్ అయిన సరళ తప్పనిసరి పరిస్థితిల్లో మీ ముందు పనిమనిషిగా చేరింది తప్ప సరళ అందరి పనిపిల్లల్లాంటిది కాదు."
    "అయితే మాత్రం....." తిక్కగా అరిచింది రమ్యశ్రీ. "అలాంటి మంచి డైలాగ్ ఆ పిల్లకి రాయడమేమిటి.....రైటరెక్కడ...." సంభాషణల రచయిత కోసం దిక్కులు చూసింది.
    ఇక్కడ జరుగుతున్నదేమిటో అప్పటికే గ్రహించిన సుదర్శనరావు జోక్యం చేసుకోలేదు. తను శాసించటానికి రమ్యశ్రీ కూడా తనలాగే నెంబర్ వన్ హీరోయిన్. అదీకాకుండా సుకృతితో  తాను ఓ రాత్రి గడిపినట్టు తెలిసిపోయిన రమ్యశ్రీ పొద్దుట నుంచీ మొహం మాడ్చుకుంది. రేపు నెలలో మొదలు కావాల్సిన తన పిక్చరులో నటించటానికి కాల్ షీట్స్ అడ్జస్టుకావేమో అంటూ పరోక్షంగా హెచ్చరిస్తూంది కూడా. ఇప్పుడు సుకృతి అనబడే ఓ మామూలు అమ్మాయి కోసం మంచి డిమాండ్ వున్న రమ్యశ్రీతో పేచీకి దిగలేడు.
    "ఏమిటిది రైటర్ గారూ" నోట్లో జర్దాపాన్ వేసుకున్న రైటర్ శ్యాంబాబుని చూస్తూ సీరియస్ గా అడిగింది రమ్యశ్రీ. "డైలాగ్ రాసే పద్దతి యిదేనా.....నాలాంటి ఇమేజ్ వున్న నటిని పట్టుకుని ఓ కొత్త అమ్మాయి వుపదేశాలిస్తుందా."
    "మీరు పొరపాటు పడుతున్నారు" వెంటనే జోక్యం చేసుకున్నాడు శివ. "ఇక్కడ మనం ఆలోచించాల్సింది పాత్రల ఔచిత్యాన్ని. పాత్రధారుల ఇమేజ్ ని కాదు."
    "నేను అడుగుతున్నది డైలాగ్ రైటర్ని."
    ఇరుకున పడిపోయాడు శ్యాంబాబు. "నిజమే."
    "ఏమిటి నిజం...." సీరియస్ గా చూశాడు శివ.
    "అదే....."
    "శ్యాంబాబుగారూ! మీరు రాసింది కిరాణాషాపులో పద్ధులు కాదు. సినిమాకి సంభాషణల్ని.....అవునా?" శివ నిలదీసేసరికి శ్యాంబాబు గుటకలు వేశాడు.
    "ఓ పని చేస్తేసరి" సలహా ఇచ్చింది రమ్యశ్రీ శ్యాంబాబుని చూస్తూ "ఆ డైలాగ్ కూడా నేనే చెబుతాను."
    "భేషుగ్గా వుంటుంది" సమర్ధించాడు శ్యాంబాబు "నేనదే అనుకుంటున్నాను."
    "ఇట్స్ స్టుపిడిటీ మిస్టర్ శ్యాంబాబూ!" శివ సహనాన్ని కోల్పోతున్నట్టుగా అన్నాడు. "మీరు ఆవిడ్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు తప్ప నిజాయితీగా మాట్లాడటం లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS