ఇది చాలు భోజరాజు కొన్ని రోజుల పాటు ఆ సంఘటనను ఆహారంగా మార్చుకోటానికి.
* * * *
"చెప్పు రాయుడు!"
అప్పటికే రోజు కన్నా మరో అర సీసా ఎక్కువ తాగేసిన భోజరాజు మహదానందంగా అడిగాడు ముందు కూర్చుని మందు సేవిస్తున్న రాయుడిని.
"నువ్వు పబ్లిసిటి ఇస్తావా, లేక నన్ను దండోరా వేయించమంటావా?"
రాయుడు, పెద్దగా చలించలేదు. అంతకన్నా ప్రశాంతంగా అన్నాడు- "మీ ముందు తాగుతూ మీ ప్రత్యర్ధి గురించి మాట్లాడటం కాదు కాని భోజరాజుగారూ! వయసులో ఉన్న ఓ అబ్బాయి, అమ్మాయి ఎక్కడో కలుసుకుని మాట్లాడుకున్నారే అనుకొండి. అందులో తప్పేముందంటారు?"
"నువ్వు ఒట్టి పిచ్చి సన్నాసివి రాయుడు! వాళ్ళు వట్టిగా కలుసుకోవడం నిజం కావచ్చు. కాని గట్టిగా కలుసుకున్నారని అంటే బొజ్జన్న కొండ గుహలో కొన్ని గంటలు గడిపారని ఊరు , వాడా పుకారు లేపిస్తాను."
"ఘోరం భోజరాజుగారూ!" రాయుడు నిజాయితీగా వారించబోయాడు. "మీరలా చేస్తే కిన్నెరకు నష్టం లేదు. ఎందుకంటే వీర్రాజుగారికి కిన్నేరంటే ప్రాణం కాబట్టి. కాని సింహాల పోట్లాటలో కుందేళ్ళ నలిగినట్టు వీర్రాజు కోపానికి ఆ రాఘవ బలైపోతాడు."
"అద్గాదే !" ఉత్సాహంగా అన్నాడు భోజరాజు.
"అది నాకు అవకాశమవుతుంది. అధికారంలో ఉన్న పార్లమెంటు మెంబర్ గా పోలీసుల అండతో వీర్రాజును లోపలకు నెట్టించి ఓ చిన్న గెలుపు సాధిస్తాను."
ఊరంతా సద్దుమణిగిన వేళ భోజరాజు పధకం వింటూ భోరున ఏడవడానికి సిద్దంగా ఉన్నట్టుంది ఆ రాత్రి.
రాయుడికి మాణిక్యమ్మ గుర్తుకొచ్చింది.
* * * * * * * *
పల్లెలో పోస్టాఫీసు పక్కనే ఉన్న పెంకుటిల్లు.
ఇంటి పనులన్నీ పూర్తి చేసిన మాణిక్యమ్మ అపరాత్రి కావస్తున్న ఇంకా నిద్ర పోకుండా పుస్తకం చదువుతున్న రాఘవ దగ్గరకు వచ్చింది.
"పడుకోరా రఘురాముడూ!"
రాఘవాలో చలనం లేదు. ఇంగ్లీషు నవల మంచి పట్టులో ఉందేమో చాలా ఏకాగ్రతగా చదువుతున్నాడు.
"ఒరే రఘురాముడూ!" పట్టి కుదిపేసింది.
"నిన్నేరా!"
"అబ్బబ్బ!" విసుక్కున్నాడు రాఘవ. "దాశరధ నందనుడు, రఘు రాముడూ అంటూ ఆ కేక లేమిటి? నువ్వు పడుకోవచ్చుగా?"
"ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి?"
"దానికేం డోకా లేదు, నువ్వు పడుకోవే బామ్మా!" నచ్చచెప్పబోయాడు. "మరో అరగంటలో పూర్తీ చేస్తాను."
"ఇక నువ్వు బాగుపడవు!" అనేసి వెళ్ళలేదు. అతడి పక్కనే ఓ స్టూలు మీద చతికిలబడింది.
"అదికాదే, అక్కడికి నేనేదో అపరాత్రి దాకా బేవార్సుగా తిరిగొస్తున్నట్టు రంకేలేస్తావెందుకు? చదువుతున్నది పుస్తకమేగా?"
"నా మాట వినరా!"
వచ్చింది నిజంగా నిద్రపొమ్మని చెప్పటానిక్కాదని రాఘవకు భోధపడింది.
"ఒప్పేసుకో."
"సరే!" బామ్మ మొదలు పెట్టె టాపిక్ ను తప్పించుకోవడానికి కన్నట్టు నవారు మంచం కేసి నడవబోతుంటే చెయ్యి పట్టుకుంది.
"మళ్ళీ ఇదేమిటి?"
"అదేరా! బగులువాడ సంబంధం. ఈరోజు సాయంకాలం కూడా కబురు పెట్టించాడు నూకరాజు. పిల్ల కుందనపు బొమ్మలా వుంటుంది. నీ పేర్న మూడెకరాలు రాసి, అనకాపల్లిలో వున్న పెంకుటిల్లు కట్నంగా నీకిస్టానంటున్నాడు."
"ఇప్పుడు నా పెళ్ళికి తొందరేమొచ్చిందే?"
"ఓరి బడుద్దాయి! తొందర నీకు కాదు, నీకి సేవలు చెయ్యలేక చస్తున్న నాకు!"
చనిపోయిన తన కొడుకు గుర్తు కొచ్చినట్టు కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. "వాడూ ఇంతేగా! ఓ పట్టాన దేనికైనా ఒప్పుకునేవాడా? చివరికి సంబంధం సిద్దమయ్యాక కూడా రేపు మాపూ అంటూ ముందుకు తోస్తుంటే తప్పనిసరై గన్నేరు కాయలు తిన్నాను కావాలని అప్పుడు కదా మీ అయ్యా మీ అమ్మను కట్టుకున్నది."
"ఆ తర్వాత నువ్వెలా బతికావ్? అదే గన్నేరు కాయలు తిన్నాక"
"ఏముంది? మీ తాత గగ్గోలు పెట్టి అమాంతం నన్ను పైకేత్తుకుని అనకాపల్లి తీసుకుపోయాడు. అక్కడ గదా డాక్టర్లు కాపాడింది!"
"అదిగో ! అబద్దం చెబుతున్నావ్!" సీరియస్ గా అడ్డం పడ్డాడు. "కిందటి సారి చెప్పినప్పుడు అసలు ఆ రాత్రి ఆస్పత్రిలో డాక్టర్లే లేరన్నావు తిరుపతికి మొక్కుకునే సరికి బతికానన్నావ్?"
"ఓరి మొండి వెధవా! తిరుపతికి మొక్కుకున్నాకే ఆస్పత్రికి డాక్టర్లు వచ్చారన్నాను."
"అక్కడికి ఆ ఏడుకొండల స్వామి డాక్టర్లను నిద్ర లేపి పంపించినట్టు!"
"అలా ఎగతాళి చేస్తే పళ్ళు రాలగొడతానోరే! ఆ శ్రీనివాసుడంటే ఏమనుకున్నావ్?"
"ఎవరూ......డాక్టర్ శ్రీనివాసులా?"
"కాదురా ......ఆ తిరుపతి శ్రీనివాసుడు. " మనవడు పళ్ళు రాలగోట్టే అంతగా రెచ్చిపోయింది. "అసలే ఆపద మొక్కులవాడేమో......"
"బామ్మా! ఆ రోజు జరిగింది నాకు అంతా తెలుసులేవే!" బామ్మ కళ్ళలోకి సీరియస్ గా చూస్తూ అన్నాడు -- "నాకు తాతయ్య చెప్పాడు."
"ఏమిటి?"
"మా నాన్నను పెళ్ళికి ఒప్పించాలని నువ్వు గన్నేరు కాయలు నూరుకు తిన్నావు. గన్నేరుకాయలే తిన్నానని స్పృహ తప్పి పడిపోయావు గాని, నువ్వు నూరుకున్నది రేగిపళ్ళట కదా!"
