Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 19

   
    
    చురుక్కుమన్నా తమాయించుకుంది.....అసలు ఇంతవరకూ ప్రశంశలే తప్ప విమర్శలు వినని మధూళీకి ధన్వి విమర్శ మింగుడుపడలేదు......విమర్శిస్తాడని ముందే తెలుసు. కానీ, ఇంత హీనంగా అనికాదు.

 

    "మీరు మాట్లాడడం లేదు" అన్నాడు ధన్వి.

 

    "నేను వినాలని వచ్చాను."

 

    మధూళీ మోహంలో మారిన రంగుల్ని బట్టి ఆమె హర్టయినట్టు తెలిసిపోయింది సామ్రాజ్యానికి. "చెప్పానుగా మిస్ మధూళీ.....ధన్వి కాస్త కరుకుగా చెబుతుంటాడు."

 

    "నో ప్రాబ్లమ్.....ఐ టేకిట్ విత్ గ్రేస్."

 

    మధూళీ స్టేట్ మెంట్ ధన్విని యిబ్బంది పెట్టింది.

 

    "నేను చెప్పింది కేవలం నా అభిప్రాయం మాత్రమే" అన్నాడు మధూళీ ముఖకవళికల్ని గమనిస్తూ.

 

    "అది మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు"

 

    "ఎదగాలనుకున్న రచయిత్రిగా నేను ఏదన్నా వినటాన్ని యిష్టపడతాను."

 

    మధూళీ అలా అన్నది మంటతోనో, లేక మనస్పూర్తిగానో బోధపడలేదు ధన్వికి.

 

    "కొన్నింటిని యధాతధంగా అంగికరించడంతో అనవసరమైన సమస్యల్ని తప్పించుకున్న వాళ్ళమవుతాం" మరో అస్త్రాన్ని సంధించింది.....

 

    "అయితే నా అభిప్రాయం మీకు రుచించినట్టేగా?"

 

    ధన్వి ప్రశ్నించకుండా వుండలేకపోయాడు.

 

    "ఎందుకలా అనుకుంటున్నారు?"

 

    "మీరు బాధపడుతున్నట్టు తెలుస్తూనే వుంది కాబట్టి."

 

    ఆ నిజం కూడా ధన్విగుర్తించడం మధూళీకి నచ్చలేదు. "భాధ సమస్యగా మారేది మరోరకంగా పరిణమించినపుడు! విమర్శలకి తట్టుకోలేని వాళ్ళు అల్సర్స్తో.....అసహనం తెచ్చే బి.పి. తో.....శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటుంటారు."

 

    "గుడ్!" నవ్వాడు ధన్వి, "మీకు బయాలజీలో కూడా పరిచయముందని నిరూపించుకున్నారు."

 

    మధూళీకి చిర్రెత్తుకొస్తుంది.

 

    "మనం ఆరోగ్యాన్ని కోల్పోయేది మనం తినే ఆహారం బట్టి కాదు. మనల్ని తినే ఆలోచనల్ని బట్టి అని, శాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని మీరు కటువుగా ఎక్స్ ప్రెస్ చేశారు మిస్ మధూళీ.

 

    వాతావరణం వేడెక్కుతున్నట్టు గమనించిన సామ్రాజ్యం జోక్యం చేసుకుంది. "అక్కడికి మధూళీ బాధపడుతున్నట్టు నువ్వలా కామెంట్ చేయడం బాగోలేదు ధన్వి."

 

 

    "వెయ్యి పదాల వర్ణనకన్నా ఒక్క బొమ్మ చాలు విషయం అర్ధం చేసుకోవటానికి అంటాడు చైనా వాళ్ళు."

 

    ధన్వి కొటేషన్ వింటూ "ఇప్పుడు దేన్ని ఉద్దేశించి మీరీ మాటన్నారో తెలుసుకోవచ్చా?" అంది మధూళీ.

 

    "మీరు ప్లజంట్ గా లెరూ అనటానికి పెద్ద వర్ణన అవసరంలేదు. మీ ముఖం చూస్తే తెలిసిపోయింది అన్నది నా తాత్పర్యం."

 

    మధూళీ అందానికే అతడు స్పందించాడో, లేక రాయగల సమర్ధత ఉన్న ఓ అమ్మాయి అపరిపక్వతగా రియాక్ట్ కావడం సబబు కాదనుకున్నాడో ధన్వి కే తెలీదు."

 

    "యుసీ మిస్ మధూళీ...." సీరియస్ గా అన్నాడు. నేను మికేదో హితబోధ చేస్తున్నాననుకోకండి....ఎక్కడో చదివాను. పదిమందిని రచనల ద్వారా రంజింపచేయాలనుకున్న రచయితలు పచ్చగా పెరిగే చెట్లలా వుండాలని....వర్షాలు పడుతుంటాయి, తుఫానులోస్తుంటాయి.....రాళ్ళ దెబ్బలు తగులుతుంటాయి....అన్నింటికి తట్టుకోవాలి. అందమైన పళ్ళని, పూలని, ఇస్తూ ఉనికిని కాపాడుకోవాలి......టర్న్ యువర్ పెయిన్ ఇంటూ పోయిట్రీ."

 


    "మీరు నన్ను తక్కువగా అంచనా వేస్తే అది మీ దురదృష్టం మిస్టర్ ధన్వి......నా రచనల కన్నా నేను బలవంతురాల్ని."

 

    "అంటే మీ రచనలు మీకన్నా బలహీనంగా వుంటాయని మీరే ఒప్పుకుంటున్నారు."

 

    "ఏమైంది ధన్వికి......?ఎన్నడూ లేనిది ఈరోజు ఎందుకిలా రెచ్చిపోతున్నాడు? నిజానికి ధన్వి వాదులాడటంలేదు.....ఉదికిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు.....సామ్రాజ్యం కంగారుపడుతూ చూసింది యిద్దర్నీ.

 

    మధూళీని ఇంటికి పిలిచి తప్పుచేసిందా?

 

    ధన్వి గురించి ముందే చెప్పిందే!

 

    అయినా ఎందుకంతగా రియాక్ట్ అవుతుంది?

 


     "ఐ యామ్ సారీ మిస్ మధూళీ....."

 

    సామ్రాజ్యం క్షమాపణలు చెప్పడం మరింత అవమానకరంగా అనిపించడంతో. "నోనో ....నేను ఫీలవుతున్నానని మీరు పోరాబడుతున్నారేం?" అంది ఓటమిని అంగికరించలేనిదానిలా .

 

    "ఇది నేను పోరపడటమే అయితే నాకూ సంతోషమే. మధూళీ.......మీకు తెలిదు" ధన్వి ఎదురుగా వున్నాడని కూడా ఆలోచించలేదు. "ముక్తసరిగా తప్ప ఎక్కువగా మాట్లాడటం అలవాటు లేని ధన్వికి మిమ్మల్ని చూడగానే ఏమైందో....." నోరు జారావని ధన్వి ముఖకవళికల్ని గమనించేదాకా సామ్రాజ్యానికి అర్ధం కాలేదు.

 

    మరో అరక్షణంలో బయటికి వెళ్ళిపోయేవాడే!

 

    "సారీ...." అంది సామ్రాజ్యం ధన్విని సమిపిస్తూ.

 

    "అనుకోకుండా స్లిప్ అయ్యాను."

 

    అయినా మొండిగా వెళ్ళేవాడే!

 

    "ఎదుర్కోగలిగే శక్తిలేని వాళ్ళని విడిచిపెట్టడం బెటర్ సామ్రాజ్యంగారూ!"

 

    మధూళీ స్టేట్ మెంట్ విని టక్కున ఆగిపోయిన ధన్వి, ఇప్పుడు సరాసరి మధూళీకి అభిముఖంగా వున్న చైర్ ని ముందుకు జరిపి మళ్ళీ కూర్చున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS