Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 19

       పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చాక రాజమండ్రి జైలుకి ట్రైనింగ్ కి పంపారు. అక్కడికి వెళ్ళి జాయిన అవబోయేముందు స్టూవర్ట్ పురం వెళ్ళాను. నా తండ్రి జాడలేదు. ఏదో కేసులో మళ్ళీ ఆయన్ని ఇరికించారనీ, ఏ పోలీస్ స్టేషన్ లో వున్నాడో కూడా తెలీదనీ అక్కడివారు చెప్పారు. అక్కడ పరిస్థితులు ఏమీ బాగా లేవు. మారదామన్నా మారనివ్వని పరిస్థితుల్లో అక్కడివారు తిరిగి దొంగలుగా మారదామన్నా మారనివ్వని పరిస్థితుల్లో అక్కడివారు తిరిగి దొంగలుగా మారిపోతున్నారు. నా తండ్రి ఆచూకీ కోసం ఎంక్వయిరీ చేయవలసిందిగా ఐ.జి.కి అప్లికేషన్ పెట్టి తిరిగి రాజమండ్రి వచ్చాను. ఎక్కువ ప్రయత్నించే అవసరం లేకపోయింది. నా తండ్రి నాకు రాజమండ్రిలోనే కలిశాడు.    
    ఉరితీత ఖైదీల గదిలో....    
                                                              *    *    *    
    అంత షాకు నేను నా జీవితంలో ఏనాడూ అనుభవించలేదు. ప్రపంచమంతా నా కళ్ళచుట్టూ గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. నా తండ్రి మరొక్కరోజులో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. బ్రతికినంతకాలం ఏమీ అనుభవించలేక బ్రతుకు చివర్లో కొంతకాలమైనా కొడుకు నీడలో సుఖమనుభవించాలనుకున్న నా తండ్రి ఆశ అత్యాశే అయింది. గాలికన్నా వేగంగా నేను కోర్టు చేరుకుని, కష్టంమీద జడ్జిమెంట్ కాపీ సంపాదించి చదివాను.    
    ఏమీలేదు అందులో.... డిఫెన్సు లాయర్ని కూడా కోర్టే నియమించింది ముద్దాయిని పకడ్బందీగా ఇరికించారు కేసులో మనసు కల్లోల సముద్రం కాగా గొంతు గద్గదం అవుతూంటే, "ఏమిటి నాన్నా ఇదంతా" అని అడిగాను. నవ్వి వూరుకున్నాడు. ఆ నవ్వులో సంవత్సరాల తరబడి జైలు గదుల్లో గడిపిన చీకటి వుంది.... పోలీసు లాఠీ కొట్టినప్పుడల్లా నోటినుంచి వచ్చే ఆక్రందనల దైన్యం వుంది.... జడ్జి ఉరిశిక్ష వేసినప్పుడు మొహంలో మెదలిన నిర్లిప్తత వుంది.    
    నాకేం చెయ్యాలో తోచలేదు. సమయం పన్నెండు గంటల కన్నా ఎక్కువ లేదు. పోలీసు ఉన్నతాధికారులను కలుసుకున్నాను. జడ్జీని కలుసుకున్నాను. నేను తిరగని చోటులేదు. కానీ ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు 'నలుగురు గార్డులని ఒక్క మనిషి ఎలా చంపగలడు' అని ఎవరూ ఆలోచించలేదు. కార్లో వెళుతున్న అమ్మాయి సాక్ష్యం ఏ విధంగా నిలబడుతుంది? అని డిఫెన్సు లాయరు వాదించలేదు. అంతా ఒక స్కీమ్ లా జరిగిపోయింది.    
    "ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు నాన్నా?" అని అడిగాను.    
    "చెపితే ఏం చేసేవాడివి బాబూ?" అన్నాడు. "....చదువు వదిలి వచ్చేవాడివి. నాలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టులచుట్టూ తిరిగేవాడివి. ఏమీ చేయలేక, చేసిన దానికి ఫలితం లేక నాలాగే నువ్వూ రాయిలా మారిపోయేవాడివి. ఇదంతా ఒక వల బాబూ ఈ వలలో ఓసారి పడిన చేప మరి బయటకు రాలేదు. గూండాలు, రాజకీయ నాయకులు, పోలీసులు కలసి జాగ్రత్తగా వేసిన వల ఇది. ఒకరికోసం మరొకరు నేరం చేస్తారు. వారి స్థానంలో మరొకర్ని పెడతారు?"    
    "ఎవరు...? ఎవరు చేశారు ఇదంతా?"    
    "తెలీదు బాబూ."    
    నా తండ్రికి తెలుసు.....చెప్పినా లాభం లేదని చెప్పటం లేదు. నేనన్నాను-"నాన్నా! నిజంగా నువ్వు దొంగతనం చేయదల్చుకుంటే దానికి గార్డులని చంపనవసరంలేదు. ఇంత భీభత్సం సృష్టించనవసరం లేదు. నీడకన్నా నిశ్శబ్దంగా నువ్వు ఆ గుడిలో ప్రవేశించగలవు. గాలికన్నా వేగంగా నగలతో సహా మాయమవ్వగలవు..... దీని వెనుకంతా ఎవరున్నారో చెపితే, నేను వాళ్ళ అంతు తేల్చే ప్రయత్నంలో పడతాననీ, ఆ ప్రయత్నంలోనే ప్రాణాలకి ప్రమాదమనీ నువ్వు నాకా విషయం చెప్పటం లేదు అవునా?"    
    నా తండ్రి సమాధానం చెప్పలేదు.    
    తెల్లవారింది.    
    తొలి పొద్దు సూర్యుడు ఆకాశాన్ని రక్తవర్ణంతో నింపుతూంటే, నా తండ్రి ఉరికంబం వైపు నడిచాడు. వెనుక పోలీసు అధికారి హోదాలో నేను వెంట నడిచాను. ఎంత విషాదభరితమైన సన్నివేశం! అది ఏ మనిషి జీవితంలోనూ తారసపడి వుండదు. ఒకప్పుడు ఇళ్ళకు రంధ్రాలు వేసిన చేతులే కావొచ్చు. కానీ తరువాత పొలం దున్నిన చేతులవి. చేతికొచ్చిన పంటని కళ్ళారా చూసుకోకుండానే చైతన్యం కోల్పోయిన చేతులవి. ఆ చేతులు పట్టుకుని వేలిముద్రలు వేయించవలసిన దౌర్భాగ్యం నాది. "గుడి గార్డులని చంపినందుకు సెక్షన్ 302 క్రింద నీకు ఉరిశిక్ష అమలు జరుపుతున్నాను" జడ్జిమెంట్ చదివి వినిపించాను. నా తండ్రి నిర్లిప్తంగా విన్నాడు.    
    "నీ ఆఖరి కోరిక ఏమైనా వున్నదా?" అడిగాను.    
    "నీకు చెప్పుకోవచ్చా బాబూ?"    
    "చె.... చెప్పండి నాన్నగారూ" కంటినీరు అదిమిపెట్టి అన్నాను.    
    "అక్కడందరూ దొంగలే. కానీ ఒకరైనా నిజంగా మారదామనుకునే వారుంటారు. వారికోసం అక్కడికి వెళ్ళుబాబు. నువ్వు అన్నావే- వాళ్ళ అంతు తేల్చే ప్రయత్నంలో ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకుంటానని! ఆ పగలూ కక్షలూ మనకొద్దు బాబూ వలని నువ్వెలాగూ ఛేదించలేవు. నాలాటి అమాయక చేపలు ఆ వలలో పడకుండా రక్షించు. అదే నా చివరి కోరిక."    
    నా పెంపుడు తండ్రయిన సర్వోదయ నాయకుడు చెప్పిన భాష్యం కూడా అదే. పగకన్నా కరుణ గొప్పదనే భాష్యానికి జీవితానుభవాన్ని జోడించి నా కన్నతండ్రి చివరి కోరిక అది.    
    "తప్పక వెళతాను నాన్నగారూ!"    
    నేను మాట్లాడిన చివరిమాట అది. తూరుపు సూర్యుడ్నిమేఘం కమ్మింది. నిజాన్ని అబద్దం మింగినట్లు వెలుగుని చీకటి కమ్మింది. నా తండ్రి మొహానికి నల్లటి ముసుగు తొడిగారు. నేను దగ్గిరుండి తాడుని పరీక్షించాను. చేతులకీ బొటన వేళ్ళకీ తాడుకట్టి బంధించారు.    
    "అటెన్షన్."    
    పోతూన్న ప్రాణానికి గౌరవ సూచకంగా మేమంతా శ్రద్దగా నిలబడ్డాం. 'ఓ రాజకీయమా! నీకు మా సపోర్టు వుంటుంది'- అన్నట్టు మా పోలీసుల తుపాకులు నేలమీద దృఢంగా వున్నాయి. 'ఓ గూండాయిజమా! నీకు మా జోహార్లు' - అన్నట్టు జైలర్లు తలవంచుకు నిలబడ్డారు.    
    నేను కర్చీఫ్ ఎత్తి పట్టుకున్నాను.    
    రామస్వామి మెడకు తాడు తగిలించారు. ఈ చెయ్యి క్రిందకు దిగకుండా ఏ శక్తి ఆపగలదు? ఏ రాజకీయ నాయకుడు ఏ ఎన్నికల నిధి కోసం ఆ నగలు కొట్టెయ్యాలనుకున్నాడో....ఏ ధనవంతుడు తన ఇనప్పెట్టెలో మరో యాభై లక్షలు నింపుకోవటానికి గూండాల సాయం తీసుకున్నాడో....శాంతికి చిహ్నమైన నా తెల్ల రుమాలు క్రూరంగా ఒక నిర్దోషి ప్రాణాలు తీస్తోంది.    
    నా చెయ్యి క్రిందకి దిగింది.    
    లీవర్ కదిలింది.    
    టప టపా కొట్టుకుంటున్న కాళ్ళు- పక్షి రెక్కల చప్పుడు- ఇది ప్రాణం పోతున్న ధ్వనికి సంకేతమా? జగన్నాధ రథచక్రాల క్రింద నలిగే ధర్మపు ఫెళఫెళారావమా?    
    ఓ సూర్యుడా! ఆగిపో, ఇదిగో నా దేశం ఇక్కడ ప్రాణాలు డబ్బుకి అమ్ముతారు. ఇక్కడ మనుష్యులు పదవి కోసం, డబ్బుకోసం సాటి మనుష్యుల్ని కొనుక్కుంటారు. సత్యాన్ని వెలికితీయటం కోసం పోలీసులు కొడతారు. నేరం వప్పుకోలేని నిర్దోషి మరణిస్తే అది లాకప్ డెత్ అంటారు. దొంగతనం వప్పుకుంటే, మరొక పెద్ద లూటీ కోసం నాయకులే ప్రోత్సహిస్తారు. వాళ్ళ అండదండల్తో, దొంగల్నే తమ కుడిభుజాలు చేసుకుంటారు. వప్పుకాకపోతే నా తండ్రిని చేసినట్టు సమాధి చేస్తారు. వాళ్ళు చేసే మారణహోమానికి సమిధలుగా ఉపయోగించుకుంటారు...    
    "ఇది అలక్ నందా నా కథ. ఇప్పుడు చెప్పు. ఎక్కడో గుళ్ళో దొంగతనం జరిగితే, దానికి ఈ స్టూవర్ట్ పురం దొంగల్ని తీసుకువచ్చి తన్నడం సమంజసమా?"    
    అలక్ నంద మాట్లాడలేదు. ఆమె ఇంకా ఈ ఘాతుకమైన కథ తాలూకు ప్రభావాన్నించి తేరుకోలేదు. రాణా ఆమెవైపే చీకట్లోకి చూస్తున్నాడు.    

                                           10    
    రెండు రోజుల గడిచాయి.    
    గుడి దొంగతనం గురించిన ఆధారాలేవీ బయటపడలేదు. స్టూవర్ట్ పురం దొంగలు ఆ దొంగతనం చెయ్యలేదని తెలుసు. చాలా గొప్ప స్కీమింగ్ తో, మంచి ప్లాన్ వేసి చేశారు ఈ దోపిడీ స్టూవర్ట్ పురం వాళ్ళయితే ఈ విధంగా ఉండదు. తాళాలకి డూప్లికేటు తయారు చేయడం, వేలిముద్రల విషయంలో జాగ్రత్తపడటం, పోలీసు కుక్కలకి వాసన తెలియకుండా ప్రికాషన్స్ తీసుకోవటం లాటి పనులు వాళ్ళు చేయరు. వాళ్ళవి మోటు పద్దతులు.    
    ఇంత సైంటిఫిక్ గా చెయ్యరు. అయినా పోలీసులు వాళ్ళనే లాకప్ లో పెట్టారు. పోలీసులు పై అధికారులకి సంజాయిషీ చెప్పుకోవాలి మరి. ప్రోగ్రెస్ రిపోర్టు వ్రాయాలి. అందుకని ఏదో ఒకటి చెయ్యాలి. ఎవర్నో బలి పశువుల్ని చెయ్యాలి.    
    రాణాకి ఒక్క విషయం అర్ధం కాలేదు.    
    సంవత్సరం క్రితం ఇదే దొంగతనం కోసం ప్రయత్నం జరిగింది. గార్డులనీ, పూజారి కొడుకునీ చంపేసేరు. (ఆ నేరం తన వారిమీద వేశారు- అది వేరే సంగతి) వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు.    
    కానీ-    
    కానీ-    
    మళ్ళీ దొంగతనం చెయ్యటం కోసం ఇంతకాలం ఎందుకాగారు? ఇదే దొంగతనం వెంటనే చేసి వుండవచ్చుగా! మొదటి నేరం ఎలాగూ తన తండ్రి మీదకు పోయింది. ఆ వైపునుంచి భయమేమీ అక్కర్లేదు వాళ్ళకి. ఒకసారి రక్తం రుచి చూచిన పులి ఇంతకాలం ఎందుకాగింది?    
    అదే అర్ధంకాని ప్రశ్న.    
    ఒక ప్రయత్నం జరిగాక ఇంత విలువైన ఆభరణాల్ని చూస్తూ ఎవరూ ఇంతకాలం వూరుకోరు. ఈ దొంగతనం ఎవరు చేశారో ఆ రహస్యం బయటపడాలంటే ముందు ఈ విషయం తెలియాలి. వాళ్ళు ఎందుకు వూరుకున్నారు ఇంతకాలం!

    రాణా ఈ కేసు విషయమై ఈ విధంగా ఆలోచిస్తూ వుండగా, మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో భరత్ అతడి దగ్గిరకి వచ్చాడు. అతడి మొహమంతా ఉద్విగ్నంగా వుంది.    
    "మీతో అర్జంటుగా మాట్లాడాలి."    
    ఇద్దరూ వెళ్ళి హోటల్లో కూర్చున్నారు.    
    "చెప్పండి" అన్నాడు రాణా.    
    "నా ఉద్యోగం పోయింది."    
    రాణా అదిరిపడి అతడివైపు చూశాడు. భరత్ మొహంలో దిగులేమీ లేదు. దానికన్నా ఎక్కువగా, ఏదో చెప్పాలన్న తపనే కనపడుతూంది.    
    "ఎలా పోయింది? ఎందుకు పోయింది?"    
    "అరవింద్ చౌరసియా...." అన్నాడు భరత్. "....మా పత్రిక యజమానితో మాట్లాడాడు. చౌరసియాకి కూడా షేర్లున్నాయట. పోలీస్ లాకప్ లు, క్రిమినల్ కేసులు వున్నవాడిని ఎలా ఇంకా ఉద్యోగంలో వుంచారని అడిగినట్టున్నాడు. అసలు కారణం అదికాదు. 'ప్లాట్ ఫాం బ్రతుకులు' వ్యాసం అయినా దాని గురించి నాకేమీ బాధలేదు. జర్నలిస్టుకి వేరే ఉద్యోగం దొరకటం పెద్ద కష్టమేమీ కాదు. నేను ఇప్పుడొచ్చింది మీకు నా ఉద్యోగం గురించి చెప్పటంకోసం కాదు. దేవాలయం నగల గురించి."    
    రాణాకి మరింత ఆసక్తి ఎక్కువైంది. ముందుకు వంగి, "నగల సంగతేమిటి?" అని అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS