Next Page 
బ్రతుకు బొంగరం పేజి 1


                         బ్రతుకు బొంగరం
                
                                                        రావులపాటి సీతారాం రావు

                                    


    "వీణా! నీవు వట్టి మూగబోయిన వీణవేనా?  నీకు మాటలు రావా? చెప్పు, చెప్పు. అదంతా అబద్దమని , నీ వందరి లాగానే మాట్లాడ గలవని చెప్పు! చెప్పు వీణా!" రవిచంద్ర ఆమెను ఆవేశంతో ఊపుతూ అరిచాడు.
    కాని వీణ మాట్లాడలేదు. ఇప్పుడే కాదు, పుట్టినప్పటి నించి జీవితంలో ఎప్పుడూ ఇంతవరకు మాట్లాడలేదు. విధాత ఆమెకు గొంతు ఇవ్వకుండా గొంతు కోశాడు. అందమైన వీణను సృష్టించి స్వరాలు బిగించటం మరిచి పోయాడు.
    కుంగిపోతూ ఆమె భూమిలో తల దూర్చింది. అందరి జీవితాల్లో నూ వచ్చే అపూర్వమైన ఈ ఘట్టం కోసం అందరి లాగే తాను ఎదురు చూసింది. అయితే అందరికీ, తనకు భేదం ఉంది. అందరిలా తను ఆనందంతో కాదు భయంతో, ఆవేశంతో కాదు, ఆవేదన తో, అనుభవం కోసం ఎదురు చూసే అనుభూతి తో కాదు గుండెల్లో అన్ని ఏళ్ళ నించి పేరుకొని పోయిన విషాదం తోనే ఎదురు చూసింది.

                                   
    "మాట్లాడు , వీణా, నీవు మూగదానావు కావని చెప్పు." రవిచంద్ర పిచ్చిగా ఆమె ముఖంలో ముఖం పెట్టి అరిచాడు. అతనిప్పుడు చిరునవ్వుతో చిలిపిగా కబుర్లు చెప్పే రవిచంద్ర కాదు. నిజమా, అబద్దమా? తేల్చుకోలేక త్రిశంకు స్వర్గం లో ఊగిస లాడుతున్న సంశాయాత్ముడు . తాను కన్న బంగారు కలలన్నీ ధ్వంసమయిపోతావేమోనని. తన జీవితం పండిన కల అనుకున్న తన అనుభూతి విచ్చిన్నమై పోతుందే మోనని మ్ కుంగి పోతున్న రవిచంద్ర.
    ఆమె కన్నులు టపటప కొట్టుకున్నాయి. గాజు ఒకటి గలగల మని టప్పున విరిగిపోయింది అతని తాకిడికి.
    రవిచంద్ర కు కోపము, ఆవేశము, నిస్సహాయత, లోకంలో అందరి మీదక కసి -- అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. ఆమె వేపు భయంకరంగా చూస్తూ "నా గుండె బద్దలు చేయబోకు! నా జీవితం నాశనం చేయబోకు! ఇది నిజమైతే భరించ లేను. ఏమిటిది?" అన్నాడు.
    ఆమెకు ఉప్పెనలా దుఃఖం వచ్చింది. ఎలా తను చెప్పాలి? తనకు తన భావాలను వేలుబుచ్చే ఆయుధాన్ని భగవంతుడివ్వటం మరిచి పోయాడని ఎలా చెప్పాలి? తను మూగదాన్నని , తనకు మాటలు రావని ఎలా.........ఎలా చెప్పాలి?
    కొన్ని క్షణాలు గదిలో నిశ్శబ్దం విషాదం రూపంలో ప్రవహించింది.
    రవిచంద్ర అలిసిపోయాడు. అత్రతతో చూసిన రాత్రి ఇలా అవుతుందని భావించక పోవడం వల్ల అఘాతం తిన్నట్టయ్యాడు. మెల్లిగా వెళ్లి కిటికీ రెక్కలు తెరిచాడు. చల్లటి గాలి ముఖాన్ని కౌగలించు కుంది.
    వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. పందిరి మంచం మీద ఆమె ఏడుస్తుంది శోకదేవతలా! గదిలో అక్కడ పెట్టిన ప్రతి వస్తువు , ప్రతి అలంకరమూ ఏదో భయంకర సంఘటనకు నాంది చేస్తున్నట్టు అనిపించింది.
    రవిచంద్ర తనను తాను నిగ్రహించు కొని మెల్లగా ఆమె వద్దకు వెళ్లి ఆ అందమైన ముఖాన్ని రెండు చేతులలోకి తీసుకొని , "వీణా!' అన్నాడు.
    ఆమె నిస్సహాయంగా చూసింది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి.
    "నన్నిలా ఏడిపించకు. నాతొ మాట్లాడు. మాట్లాడు వీణా!"
    ఆమె కళ్ళు అతన్ని చూడడం మానేశాయి.
    "నీకు మాటలు రావా? నీవు మూగదానివా?"
    ఆమె నీరసించి నట్లు అతని చేతుల్లోంచి తూలి పడబోయింది. అతను వదల్లేదు. గట్టిగా పట్టుకొని "చెప్పు!" అన్నాడు.
    ఆమె తనను తాను కూడదీసుకుంది. నెమ్మదిగా ఒకసారి రవిచంద్ర ను పరకాయించి చూసి తల ఊపింది.
    అతని గుండె పట్టుకున్నట్ల యి పిచ్చి కోపంతో ఆమెను ఊపుతూ , "నిజంగా?' అని అరిచాడు.
    "నిజం!" అన్నట్లు ఆమె తల ఊపింది. అంతే! రవిచంద్ర కు ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది. ఆమెను అప్రయత్నంగా వదిలేశాడు. గభాల్న ఆమె అతని కాళ్ళ మీద పడింది. అతనికి ఆమెను చూసే ఓపిక లేదు. మెదడు లో తీవ్ర సంచలనం చెలరేగింది. తన ఆశలు, ఆశయాలు అన్నీ ధ్వంస మైనట్లు, తన బంగారు స్వప్నాలు తునాతునక లయినట్లు, తన జీవిత కధ ఏదో విపరీతమైన మలుపు తిరిగినట్లు అతను వాపోయాడు.
    రవిచంద్ర తడబడుతున్న అడుగులతో శోభనపు గది తలుపులు తెరవడంతో వీణ గుండె లో కూడా చీకటి తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి.
    చీకటిలో నడవ బోయాడు.
    ఎవరో దగ్గారు. అతను అప్రయత్నంగా ఆగాడు. వచ్చిన అయన బాల్కనీ లోని లైటు వేశాడు. అయన వీణ తండ్రి అనంతం గారు.
    రవిచంద్ర చీత్కారంతో ఆయన్ని చూశాడు.
    అయన భయంభయంగా రవిచంద్ర దగ్గిరికి వచ్చి చేతులు పట్టుకో బోయాడు. రవిచంద్ర కు జెర్రులు పాకినట్ల నిపించింది. విదిలించుకున్నాడు.
    "నన్ను...క్షమించు." అనంతం గారికి మాటలు దొరకలేదు.
    "దేనికి?' చర్రున అడిగాడు రవిచంద్ర.
    "నేను అన్యాయం చేశాను."
    "ఎవరికి?" అన్నాడు.
    "నన్ను కుంగదీయకు , నాయనా. చచ్చిన పాముని!"
    "నేనా? మిమ్మల్ని కుంగ దీయడమా? మనుషుల్ని కుంగదీసే నేర్పు నాకు లేదు. తెల్లని వన్ని పాలనుకుని నమ్మాను. మోసపోయాను."
    "అలా మాట్లాడకు. రవీ నీకేం మోసం జరగలేదు. వీణ మంచి పిల్ల. మాట తక్కువే గాని మర్యాద మన్నన......"
    "అనంతంగారూ!' బంగళా వణికి పోయింది. "నేనేమీ వినదలుచు కోలేదు! నన్ను విసిగించ కండి. గుండెల్ని పిండి చేసే విద్యలో మీరు ప్రవీణులని నాకు బాగా తెలుసు. నన్ను కాస్సేపు ఒంటరిగా ఊపిరి పీల్చుకోనివ్వండి."'
    అనంతం గారు చిన్న పిల్లాడిలా బావురు మన్నారు. "బాబూ, రవీ! నీకెలా చెప్పాలో నాకర్ధం కావడం లేదు. నన్ను ఈ పరిస్థితి నుండి రక్షించు. మోసం అనేది నీకు చేసినట్లయితే, అది ఏ పరిస్థితిలో చేశానో కొంచెం శాంతంగా ఆలోచించు. దీని తరవాత ఈడొచ్చిన పిల్లలు ఇద్దరు గుండెల మీద కుంపట్ల లాగా........"
    "అందుకని జీవితాన్ని నాకు కుంపటి చేశారు........."
    రవిచంద్ర గొంతు జీరబోయింది. అతి కష్టం మీద నిగ్రహించుకొని అక్కణ్ణించి వెళ్ళబోయాడు.
    అనంతం గారు , "బాబూ, క్షమించు, ఎలాగో ఈ ఒక్క తప్పుకూ. నా పరిస్థితిలో నిన్ను ఉంచుకొని ఆలోచించుకో. ఒక్కసారి......రవీ.రవిచంద్రా........" మెట్టు మెట్టుకు అడ్డు తగిలారు కిందికి దిగుతుంటే.
    "అలా ఆలోచించవలిసిన అవసరం నాకు లేదు. మిమ్మల్ని క్షమించేంత శక్తి అంతకన్నా లేదు.....నన్ను వదలండి....విసిగించకండి." చర్రున వెళ్ళిపోబోయాడు. అనంతం గారు అడ్డు పడడం మానలేదు.
    రవిచంద్ర విసుగు పరాకాష్ట నందుకున్నది. "అనంతం గారూ!" అంటూ చేయెత్తాడు.
    అనంతం గారు స్థాణువయి పోయారు. చటుక్కున ఆగారు.
    రవిచంద్ర క్షణం ఆలోచించాడు. సిగ్గుపడి చేయి దించి, "నన్ను మరీ పశువును చేయకండి" అని తటాలున పక్క గదిలోకి నడిచాడు.
    దారిలో అత్తగారు దీనంగా చూసింది. రవిచంద్ర కన్నెత్త లేదు. తన తండ్రి గది ముందు ఆగి "నాన్నా!" అన్నాడు.
    తలుపులు తెరుచుకున్నాయి. గదిలో తన తండ్రి.
    రవిచంద్ర కు భోరున ఏడవాలని పించింది. ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు. తరువాత అతి కష్టం మీద 'ఆ పిల్ల...........' అని మాత్రం అనగలిగాడు.
    తండ్రి "నాకు తెలుసు" అన్నాడు. రవిచంద్ర ఆశ్చర్యంగా తన తండ్రి వేపు చూశాడు. "ఏమిటిది? అందరికి తెలుసా? తనోక్కడికెనా తెలియనిది?' అనుకున్నాడు.
    "ఏమిటి మీకు తెలుసు?' అనుమానంగా అన్నాడు రవిచంద్ర.
    "ఆ పిల్లకు మాటలు రావని."
    ఫెళ్ళున చెంపదెబ్బ వేసినట్లని పించింది. ఎదురుగా తండ్రి క్షణ కాలం కనిపించటం మానేశాడు.
    "నాకు లగ్నం ఇంకొంచెం సేపట్లో అవుతుందనగా తెలిసింది. అసలు సంగతి తెలుసు కుందామని అనంతం గారిని పిలిచి కనుక్కున్నాను. అయన నిజం ఒప్పుకున్నాడు. అమ్మాయి మూగదన్న సంగతి చెప్పాడు. నేను కోపంలో రసాభాస చేయబోయే ముందు దీనాతి దీనంగా గుండెలు కరిగి పోయేటట్లు మాట్లాడాడు. రెండు చేతులు పట్టుకొని ఇవి చేతులు కావన్నాడు. హృదయ విదారకంగా ముందు జరగవలసిన అమ్మాయిల పెళ్ళిళ్ళ సంగతి చెప్పుకొచ్చాడు. అతని స్థానం లో నిలబడి నన్ను ఆలోచించు కొమన్నాడు. ఆ పరిస్థితులలో గత్యంతర మేమిటని నన్ను నిలదీశాడు. " రవిచంద్ర తండ్రి ఎందుకనో కదిలి పోయాడు. ఆ సన్నివేశం తిరిగి జ్ఞాపకం తెచ్చుకొని వింతగా మారిపోయాడు.
    రవిచంద్ర తండ్రి వైపు నివ్వెరపోయి చూశాడు.
    "అబ్బాయీ , ఎందుకనో ఆయన్ని చూస్తె జాలి వేసింది. పీటల మీద పెళ్లి చెడగొట్ట బుద్ది కాలేదు. ఏమీ మాట్లాడ లేకపోయాను." అయన చెప్పడం మాని కొడుకు వైపు చూశాడు.
    "ఇప్పుడు నన్ను చూస్తె మీకు జాలి వేయడం లేదా, నాన్నా?' సూటిగా రవిచంద్ర అడిగాడు.
    ముసలాయన ఇరకాటం లో పడ్డాడు. జవాబు దొరకకపోవడం వల్ల చుట్ట వెతుక్కొని ముట్టించి గుప్పున పొగ వదిలాడు.
    "ముందే నాకు చెప్పినట్లయితే ఎంత బాగుండేది?"
    రవిచంద్ర మాటలకు ముసలాయన ఇరుకున పడి బాధపడ్డాడు. కొడుకు వైపు బాధగా చూశాడు.
    "అమ్మ లేని లోటు నాకివ్వాళ బాగా అర్ధమయింది. అమ్మ ఒడిలో తల ఉంచుకొని , నా జీవితం ఇలా నవ్వుల పాలయినందుకు కరువు తీరా ఏడ్చే అవకాశ మన్నా ఉండేది. ఇప్పుడెందు కనో ఈ ప్రపంచం లో నాకెవరూ లేరని పిస్తున్నది. నా మంచిని కోరేవారు ఎవరూ లేరని పిస్తున్నది!" పేలవంగా నవ్వుతూ రవిచంద్ర అన్నాడు.
    ముసలాయన ఉలిక్కిపడ్డాడు. అయన తల్లడిల్లి నట్లయ్యాడు. ఏదో చెప్పబోయి, అశక్తుడయి నట్లుగా కుంగిపోయి, "రవీ" అని మాత్రం అనగలిగాడు.
    "నిజం నాన్నా! నేను ఒంటరి గాణ్ణి. ఈ పెళ్లి కాక పూర్వం నాకీ ప్రపంచంలో మీరు ఉండేవారు. పెళ్ళయిన తరవాత నేనొక్కడ్నే మిగిలిపోయాను."
    ముసలాయన పక్కకు చూస్తూ "ఆ పిల్ల ఎందుకనో నాకు మహాలక్ష్మీ అనిపించింది. చనిపోయిన మీ అమ్మ ఆమెలో కనిపించింది. కాని మాటలు రాని చాలా ఆలస్యంగా తెలిసింది. ఎందుకో విధి బలీయ మనిపించింది. పెళ్లి చేయించడానికి ఉద్యుక్తుడనయిన నాకు అపించే శక్తి లేదని ఆలస్యంగా తెలిసింది. అయినా, నీవు వీటన్నిటిని క్షమిస్తావని నాకేండుకనో ధైర్యం వచ్చింది. పెళ్లి జరిగింది."
    "నాకంత విశాలత్వం లేదు నాన్నా. మూగదానితో కాపరం చేసే ఓపిక నాకు లేదు. విధి బలీయమన్న నమ్మకమూ, నాకు లేదు. గుండెలో గాయం ఉంచుకుని, హాయిగా తిరిగే శక్తి నాకు లేదు" రవిచంద్ర తండ్రి ముందు మొదటి సారిగా, చివరిసారిగా చాలా పెళుసుగా మాట్లాడి విసురుగా బయటకు వచ్చాడు. తనకోసం కేటాయించిన గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS