బ్రతుకు బాట
పి. సత్యవతి

పగలంతా ఎండ తీవ్రంగా వుండీ, వుండీ సాయంత్రానికి కైనా చల్లని గాలి తిరిగి, సేద తీరుస్తుందని ఆశ పడినప్పుడు , కారు మబ్బులు ముసిరి జడివాన కురిసినట్లయితే ఎలా వుంటుందో అలా అనిపించింది సుమిత్రకి. చిన్నన్నయ్య వ్రాసిన ఉత్తరం చదవగానే.......
ఆశా భంగాలనేవి బొత్తిగా అలవాటు లేని జీవితం కాకపోయినా ఈ సంఘటన ఆమె మనస్సుని బాగా కలచి వేసిందనే చెప్పాలి.
ఉత్తరం మడిచి టేబిల్ మీద పెట్టి వరండాలో కి వచ్చి మంచం మీద పడుకుని ఆకాశం కేసి చూడసాగింది సుమిత్ర.
గంపెడు ఉత్సాహంగా ఈ ఉత్తరం కోసం ఎదురుచూస్తున్నాడు పెద్దన్న మాధవరావు. ఇప్పుడు భోజనానికి వస్తాడు. రాగానే ఉత్తరం చూస్తాడు. అమ్మకి ఏమని ఇప్పుడు చెప్తాడు?
కొంచెం సావకాశంగా ఆలోచిస్తే చిన్నన్నయ్య వ్రాసిన విషయం తప్పేమీ కాదనిపించింది సుమిత్ర కి. ఆ ఆలోచన రాగానే ఆమె మనస్సులో ఇంతకూ పూర్వం కురిసిన జడివాన వెలిసి నట్లయింది. ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు వాటంతటవే మెదడులో కదులుతున్నాయి. కొంతసేపటికి తేలికగా ఫీలవుతూ కళ్ళు మూసుకుంది సుమిత్ర.
వివేచనా శక్తీ, సక్రమమైన ఆలోచనా విధానమూ, స్పందించగల హృదయమూ కల వాళ్ళని సమస్యలంతగా వేధించి బాధించవేమో ననుకుంది సుమిత్ర. తన వయస్సు కి ఈ మాత్రం వివేకం కలిగి వుండడం తన అదృష్టమేమోనని కూడా ఆమె కనిపించింది.
పెదవుల మీద చిరునవ్వు చెదరనీయకుండా, కళ్ళల్లో వెలుగు తరగనీయకుండా ఉత్తరం తీసుకుని వెళ్లి పెద్దన్నయ్య కిచ్చింది సుమిత్ర.
ఆంధ్రదేశంలోని అనేకానేక కుటుంబాలను పీడిస్తున్న ఏకైక సమస్య ఆడపిల్ల పెళ్లి. ఈ ఉత్తరంలో, తనపై గల బాధ్యత వదిలి పోగలదని , తన సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడుతూ, గర్వంగా చిరునవ్వు నవ్వుకుంటూ కవరు విప్పాడు మాధవరావు.
అన్నయ్య కి నమస్కారం.
నీ ఉత్తరం అందింది. డానికి జవాబు ఇలా వ్రాయవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను. సుమిత్ర పెళ్ళికీ, ణా వివాహానికి లంకె పెట్టి, కట్నం డబ్బు ఆ చేత్తో తీసుకుని ఈ చేత్తో యిచ్చేసి, పెళ్ళిళ్ళ కయ్యే ఖర్చు కలిసి వచ్చేలాగు చూడడం అవివేకం అని చెప్పడానికి విచారంగా వుంది. వ్యక్తులుగా సుమిత్రకి, నాకూ, నీకూ మనందరికీ ఉద్దేశ్యాలూ, ఆదర్శాలూ ఉండడంలో తప్పు లేదు. నేను రాధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకో బోతున్నాని అదివరకే సూచనగా చెప్పాను. ఈ సంగతి తెలిసీ మీరు రాజమండ్రి సంబందం చేసుకోమని వ్రాయడం సాహసమే. సుమిత్ర విషయం లో మీకెంత బాధ్యత వున్నదో నాకూ అంతే వున్నదని తెలుసు. అందుకనే పదిహేడేళ్ళ సుమిత్ర కి యిప్పుడే పెళ్లి చేయడం మంచిది కాదని చెబుతున్నాను. అమెని కాలేజీ లో చేర్పించండి. ఖర్చు నేను భరిస్తాను. పెళ్లి కయే కట్నం ఇప్పుడప్పుడే ఒక్కసారిగా నేను యివ్వనూ లేను-- మరీ తొందరైతే ఇంట్లో నా భాగం అమ్మి పెళ్లి జరిపించండి. నేను కాదనను.
ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించండి. నా పెళ్లి ఇరవై నాలుగో తేదీన. ఇది కులాంతరం కనుక మీరు రాలేరని తెలుసు. వస్తే చాలా సంతోషం.
రఘుపతి.
చెళ్ళున చెంప మీద చరిచినట్లైంది మాధవరావు కి. ఆవేశంతో ముఖం ఎర్ర బడింది. రెండు నిమిషాలు కుర్చీలో ప్రతిమలా కూర్చుండి పోయాడు.
ఇంతలో అతని అర్ధాంగి ఇందుమతి మంచినీళ్ళ గ్లాసుతో అక్కడికి వచ్చింది.
"జరిగిందేదో జరిగింది-- ముందు భోజనానికి లేవండి" అన్నది.
"వెళ్లి భోం చెయ్ అన్నయ్యా! ఇప్పుడేమీ వాదోపవాదాలు వద్దు' అమ్మ అసలే దిగులుపడి పోయింది. మనం గట్టిగా మాట్లాడు కుంటు వుంటే ఆవిడ పరిస్థితి మరీ అన్యాయం అవగలదు-- ' అన్నది సుమిత్ర.
"ఎలా వుంది ఆవిడ?' అన్నాడు మాధవరావు కుర్చీ లో నుంచి లేచి గట్టిగా నిట్టురుస్తూ--
'ఉత్తరం చదవగానే వొళ్ళంతా చెమట పట్టేసింది. గుండె దడ వచ్చింది. తలకాయ తిరుగుతోందని పడుకుంది.' అన్నది సుమిత్ర నెమ్మదిగా.
"పోనీ నేను విశాఖ పట్నం వెళ్లి వచ్చేదా?' అన్నాడు మాధవరావు ఏదో నిర్ణయించు కున్నట్లు.
"అనవసరం -- అతడి నిర్ణయం ఏనాటికీ మారదు-- మీరు వెళ్లి అవమానం పొంది రావడం పిచ్చితనం' అన్నది ఇందుమతి గట్టిగా.
'అదీ నిజమే' అనుకున్నాడు మాధవరావు-- నిజానికి ఈ రోజుల్లో పదిహేడేళ్ళ పిల్లలకి పెళ్లి తొందరేం లేదు-- కానీ అమ్మ కోరిక సుమిత్ర పెళ్లి చూడడం . మూడేళ్ళుగా ఆవిడ క్షణ క్షణం కలవరిస్తోంది సుమిత్ర పెళ్లి కోసం.
ఆడపిల్లలకి మెట్రిక్ వరకూ చదువు చాలని ఆవిడ దృడ విశ్వాసం. అందుకనే గత రెండేళ్ళు గా రఘుపతి నచ్చ చెప్పినా ఆవిడ సుమిత్ర ని కాలేజీ కి పంపడానికి వొప్పుకోలేదు-- సుమిత్ర యింట్లోనే వుండిపోయింది.
కట్నం తీసుకోడమనేది చాలా పెద్ద నేరంగా పరిగణించే రోజులు యింకా రాలేదు. అలాంటి వ్యక్తులూ తక్కువే. మనం యిచ్చేటప్పుడు తీసుకుంటే మాత్రం తప్పేమిటి అనేది మాధవరావు అభిప్రాయం. ఆదర్శాలు వల్లిస్తూ కూర్చుంటే సమస్యలు తీరవు-- ఏదో ఒక విధంగా పరిష్కారాలు సాధించుకుని జీవితాన్ని సుగమం చేసుకోవాలి గదా అని తను రఘుపతి కి రాజమండ్రి లో ప్లీడరు గారమ్మాయి సంబంధం చూశాడు. ఆమ్మాయి బాగుంటుంది. పి.యు.సి చదివింది. కట్నం ఎనిమిది వెలిస్తామన్నారు.
సుమిత్ర కి కుదిరిన హైదరాబాదు సంబంధమూ మంచిదే. కుర్రాడి కి స్టేట్ బ్యాంకు లో నాలుగొంద లోచ్చే ఉద్యోగం. పల్లెటూళ్ళో ఇల్లూ కొంచెం పొలమూ వున్నాయి. అరువేలిస్తే సరిపెట్టుకుంటా మన్నారు. ఈ రెండు పెళ్ళిళ్ళూ ఒకేసారి చేస్తే ఖర్చు కలిసి వస్తుందని ఆశపడ్డ మాట అబద్దం కాదు. తనకి తల్లితండ్రు లిచ్చిన అపారమైన ఆస్తి పాస్తులేమీ లేకపోగా తండ్రి పోయినప్పటి నుంచీ తల్లినీ, చెల్లె లినీ ఆదరించి తమతో సమానంగా చూసుకొనడం అనేది కూడా చాలా కష్టమే తనకి. అయినా తాను వాళ్ళని వదులుకోలేదు. అదిచాలు తన మంచితనానికి. ఇందుమతి మౌనంగా భోజనం వడ్డించింది. మాధవరావు మాట్లాడలేదు. సుమిత్ర తల్లి మంచం దగ్గర కూర్చుని ఏదో నవల చదువు కుంటోంది. కొడుకు భోజనం చేసి యివతలకి వచ్చిన అలికిడి విని, మంచం మీద నుంచీ లేచి వచ్చింది అన్నపూర్ణమ్మ గారు.
'ఉత్తరం , చదివావుగా?' అన్నది మహా తుఫాను రావడానికి నాందీ సూచనగా.
"ఊ!' అన్నాడు సాధ్యమైనంత నిర్వికారంగా వుండడానికి ప్రయత్నిస్తూ.
"నన్ను విశాఖపట్నం తీసుకు పో మాధవా! వాణ్ణి పెట్టవలసిన చివాట్లు నాలుగు పెట్టి వాడికీ నాకూ వున్న సంబంధం తెంపుకు వస్తాను-- నాకు వొక్కడే కొడుకను కుంటాను--' అన్నదావిడ బొంగురు పోయిన కంఠంతో.
"ఊర్కోండి అత్తయ్యా--' అన్నది ఇందుమతి అనునయంగా.
"సంబంధం త్రెంచు కోడానికి అంత దూరం పోయి హైరానా పడక్కర్లేదమ్మా! ఒక్క ఉత్తరం వ్రాసి పడేస్తే చాలు' అన్నది సుమిత్ర , నవల మూసి వేస్తూ......
"స్వయంగా వెళ్లి గట్టిగా చివాట్లు పెడితే కాదంటాడటే వాడు! నా ,ముఖం చూసైనా కరిగి పోడా?'
సుమిత్ర నవ్వింది.
'కరిగిపోయే మనస్సు కలవాడికి ముఖం చూసి కరగాల్సిన పని లేదమ్మా-- వాడి సంకల్పం వేరు. డానికి చాలా బలం ఉంది. ఎంతమంది ఎన్ని అన్నా వాడు చేసేపనికి వెనుదీయడు. అదే వాడిలో వున్న గొప్పతనం' అన్నది.
"అది గొప్పతనం అని నువ్వు సమర్ధిస్తున్నావా సుమిత్రా?' అన్నాడు మాధవరావు కోపంతో.
'మన సమర్ధనలతో, నిరసనలతో వాడికి పని లేదన్నయ్యా!! ఇహ మనం హైదరాబాదు సంబంధం' అంటూ కలలు కనడం ఆపుకుని ప్రాక్టికల్ గా ఆలోచించడం మంచిది --' అన్నది సుమిత్ర స్థిరంగా --
'అవును ఎవరికి వాళ్ళే పెద్దవాళ్ళయి పోయార్రా మాధవా! మన సలహాలు దేనికి వీళ్ళకి! మనం పిచ్చివాళ్ళం -- రేపు, దీని కింకా రెండేళ్ళు పెళ్లి చెయ్యక పొతే ఇది కూడా ఏ కులం వాడ్నో కట్టుకు పోగల సమర్ధురాలు !' అన్నది అన్నపూర్ణమ్మ గారు కటువైన కంఠస్వరంతో.
"అనవసరంగా ఆవేశ పడకమ్మా, వాడు చెప్పినట్లు ఈ ఇల్లు అమ్మేసి డానికి పెళ్లి చేస్తాను- మనం ఎంత వాపోయినా, ఏం చేసినా విధి లిఖితం ప్రకారం జరుగవలసిందే కదా!' అన్నాడు మాధవరావు సిగరెట్ వెలిగించుకుని నిదానంగా ---
