Next Page 
ప్రేమించు ప్రేమకై  పేజి 1


                        ప్రేమించు ప్రేమకై

                                                                                కె. రామలక్ష్మీ

                      
    పాల్స్ లో ఒకవార బల్ల దగ్గిర కూర్చుని ఇంత ఆనందంగా ఉందేమిటి నాకు? అని ఆలోచించు కుంటుంది లలిత. ఇంకా రష్ ఎక్కువగా లేదు. సాయంత్రం ఐదు గంటలు కావస్తుంది.
    అప్పటికే లోపల చీకటిగా ఉండి సన్నని వెన్నేలలాగా కాంతి వేదజిమ్ముతున్నాయి దీపాలు. చుట్టూ అద్దాలుమ చక్కని వర్ణ చిత్రాలు ఆ చిరు వెల్గులలో ఎంతో అందంగా ఉన్నాయి. ఆ దీపాలూ ఆ వెల్గూ ఆ హోటలూ అన్నీ లలిత జీవితంలో ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచు కున్నాయి.
    అక్కడే తొలిసారి ఏకాంతంగా పరాయి వాడైనా తన గౌరవం కాపాడిన మోహన్ తో కాలక్షేపం చేసింది. ఇప్పుడా మోహన్ రాకకోసమే ఎదురు చూస్తుంది. వస్తానన్న టైము దాటిపోయింది. అదేం అంత వింత విషయం కాదు గాని ప్రేమించిన వ్యక్తీ పట్ల ప్రతి చిన్న విషయం ఆలోచనలకి దారి తీసి ఊపిరి సలపనివ్వదు. ఐన ప్రతి ఐదు నిమిషాల ఆలస్యం లోనూ తనవారి కేదో అయిపోతుందేమో అని ప్రాణం కొట్టుకోవడం ప్రేమ ప్రేరేపించే వింతల్లో ఒకటి కాబోలు.

                
    సరిగ్గా ఆరునెలల క్రితం తొలిసారి మోహన్ తో పరిచయం అయింది లలితకి. సాయంత్రం రద్దీ టైము. బస్సులో జనం వేలాడుతున్నారు. ఒక పక్క వర్షం పట్టుకుంది. ఎక్కబోతున్న బస్సు కాస్తా కదలడంతో క్రింద పడింది లలిత. ఎవరో తక్షణం చేయి అందించి లేవదీశారు. బస్సు కోసం వేచి వున్నవాళ్ళంతా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. లలిత చీరంతా బురదై పోయింది . చేయి అందించిన వ్యక్తీ మటుకు నొచ్చుకున్నాడు. "అయ్యో, ఇలా రండి -- ఎదుటి హోటల్లో కి వెడదాం . క్లీన్ చేసుకుందురు గాని' అంటూ తన ప్రమేయం లేకుండా రోడ్డు దాటించాడు. అదే తొలిసారి పాల్స్ లోకి అడుగు పెట్టడం. సాధ్యమైనంత వరకు చీర శుభ్రం చేసుకుని వచ్చి అతని ఎదురు గుండా కూర్చుంది లలిత. కాఫీ ఆర్డరిచ్చాడతను. ఒకరి పేర్లు ఒకళ్ళు తెలుసుకోవడం అప్పుడు సహజమే కదా!
    "నాపేరు మోహన్. నా వృత్తి సినిమా,' నవ్వుతూ అన్నాడు అతను.
    "నా పేరు లలిత. ఇక్కడే వో కంపెనీ లో పనిచేస్తున్నాను." అని చెప్పింది లలిత. 'మా మేనత్త తో ఉంటున్నాను. ఆవిడే నాకన్నీ. నాకింకేవరూ లేరు" అని కూడా చెప్పింది లలిత.
    "అయ్యో పాపం. చాలా లోన్లీగా ఉండి ఉండాలి మీకు. అయినా ఉద్యోగం చేస్తున్నారుగా చాలామంది స్నేహితులే ఉండాలే' అన్నాడు మోహన్.
    "లేదండీ, మా అత్తయ్యదదో తరహా. అంచేత నాకు స్నేహితులు కూడా తక్కువే" వివరించింది లలిత.
    వద్దన్నా వినకుండా ఇంటిదాకా వచ్చాడు ఆరోజు మోహన్. జరిగినదంతా చెప్పాడు. అలాగా నాయనా, పోనీలే ఏదో సమయానికి పిల్లని కాపాడావు' అందే గాని 'మళ్ళీ రా' అని మటుకు ఆహ్వానించలేదు అత్తయ్య' అందుకే కోపం వచ్చింది లలితకి. ఏం మనిషి ఈ అత్తయ్య. 'మళ్ళీ అతగాడ్ని చూడ్డం పడుతుందో పడదో అన్న బాధ అత్తయ్య మూర్కత్వం....వీటిని గురించి అలోచించి ఏడ్చి ఏడ్చి నిద్రపోయిందా రాత్రి.
    కాని ఆమె తలపోసినట్టు ఆమె హీరో నాసి రకం కాదు. కొంచెం గట్టి ప్రాణమే. అత్తయ్య ని చూసిన మోహన్ "అయ్యో ఇంత అందమైన అమ్మాయికా ఇలాంటి గార్డియన్' అనుకున్నాడు. ఏమైనా సరే లలితని చూసే తీరాలని నిర్ణయించుకున్నాడు. అలాగ్గానే మరునాడు ఆఫీసు లోంచి లలిత అడుగు బయట పెట్టగానే -- ఎదురుగా వెళ్ళాడు చిరునవ్వు ముఖంతో.
    ఈ రెండవసారి కలుసుకోవడమే మిగిలిన కలయికలకి నాంది అయింది. అప్పుడప్పుడో అర్ధగంట పార్కు ల్లోనూ, కాఫీ హోటళ్ళ లోనూ కాలక్షేపం చేస్తూ మోహన్ పర్సు ఘనంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనాలు పాల్సు లో చేస్తూ స్నేహాన్ని వృద్ది చేసుకున్నారు. 'ఇలా స్నేహంగా ఉండడం లో తప్పేముందీ? ఇదేం పాతరాతి యుగం కనకనా? ' అంటూ అందంగా నవ్వే మోహన్ ఆ క్షణం లో ప్రపంచపుటంచులకి రమ్మన్నా వెళ్లేదే లలిత!
    దీనిలో తప్పేం లేదు. ఇది జీవితం. ఇన్నాళ్ళూ నేను బ్రతికి లేను. ఇప్పుడ ఇతర కన్నెలలాగా స్వేచ్చ ను చవి చూస్తూన్నాను అనుకుంది లలిత.
    ---గడచినా ఆరు మసాలనీ తలచుకుంటూ మోహన్ కోసం ఎదురు చూస్తుంది లలిత. ఈ ఆనంద కరమైన స్థితి శాశ్వతం గా ఉంటుందా? లేక కలగంటున్నానా? అని ఏ క్షణాని క్షణమే లలిత అనుకోక పోలేదు. మోహన్ కే కనక ఇంకొంచెం నిలకడైన ఉద్యోగం ఉంటేనా! తక్షణం పెళ్ళి చేసుకుందును. అత్తయ్య ఒప్పుకున్నా లేకున్నా ఫరవాలేదు అనుకుంది. తను మొండి కేస్తే అత్తయ్య మటుకు ఏం చేయకలదు? కాని మోహన్ కి అప్పుడూ అప్పుడూ వస్తుందే గాని డబ్బు నిలకడగా రాదు. అదే బెంగ లలితకి.
    అప్పుడే తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు మోహన్. లలిత హృదయం గమ్మత్తుగా కొట్టుకుంది. క్రిందటి సారి చూసినప్పటి కంటే ప్రతిసారీ అందంగా కన్పిస్తున్నాడామే కళ్ళకి మోహన్. ఈ ఊళ్ళో ఇతని లాంటి వ్యక్తీ మరొకడు ఉండడు అనుకుంది. తన జీవితంలో తటస్థ పడినది ఈ వ్యక్తీ ఒక్కడే అనీ, తనకా విషయంలో అసలే అనుభవం లేదని ఓ క్షణం కూడా ఆలోచించలేదు లలిత. ఈ వ్యక్తీ లలితకి సర్వస్యం కావాలన్నదే ఆమె ఏకైక కోరికగా మారింది. ఎంత అందంగా బట్టలు వేసుకుంటాడు! ఎంత హుందాగా నడుస్తున్నాడు -- అనుకుని చిరునవ్వుతో అతని ముఖంలోకి చూసింది.
    లలిత కంటే ఏమాత్రం జీవితం తెలిసిన వాళ్లకేనా మోహన్ ని చూడగానే నిజం తెలుస్తుంది. అందమైన ప్యాంటు, చక్కని బూట్లు , మెత్తని సిల్కు షర్టు ...జీవితం కంటే ఈ వ్యక్తీ వేషం కొంచెం విసృతమే అనిపించక మానదు. రోజూ బ్రతికే మనిషి అలా ఉండడం కష్టం. లలితకిదేం తెలియదు. తెలుసుకోవాలన్న కోర్కె కూడా లేదు. హృదయాన్ని కళ్ళలో నింపుకుని అతని కేసి చూస్తుంది. గత ఆరు మాసాలుగా కలగంటున్న ఆ ముఖం , ఆ ముఖం లోని అందమైన కళ్ళు విశాలమైన నుదురు, చక్కగా వంగిన జుట్టు ...మైమరిచి చూస్తుంది లలిత.
    వస్తూనే ఎదుటి కుర్చీలో చతికిలపడ్డాడు మోహన్.
    "చాలా ఆలస్యం చేశానా? క్షమించు లలితా' కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
    "లేదు, లేదు నువ్వేం ఆలస్యం చెయ్యలేదు మోహన్. నేనే త్వరగా వచ్చాను.' నవ్వుతూ అంది.
    "నీ ఫోను వచ్చేసరికి నా ఆనందం యేమని చెప్పను. నిజంగానే డ్రాగన్ ఊరుకి వెళ్ళిందా? వారం రోజులు మనిష్టం అన్నమాట.' లలిత చేయి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు మోహన్.
    తన అత్తయ్య ని అలా అన్నందుకు చిన్న పుచ్చుకున్నా లలిత లైట్ గా నవ్వేసింది.
    "అర్జెంటు గా రమ్మని టెలిగ్రాం వచ్చింది. విశాఖపట్నానికి దగ్గిర ఓ పల్లెటూళ్ళో ఉన్నాయి అత్తయ్య పొలాలూ అవీ' చెప్పింది.
    "మరి నీకు కాపలా?'
    "తెలిసిన అవ్వగారిని అట్టే పెట్టింది.'
    'ఆ అవ్వగారు కధలు గాని మోయదు కదా?'
    'స్నేహితురాలితో సినిమాకు వెడుతున్నానని చెప్పాను. నమ్మినట్టే తోచింది. అయినా సాయంత్రం పెందరాడే వెళ్ళిపోదాం.' అంది మనస్సులో పిరికితనాన్ని దాచుకుంటూ.
    "పిరికీ! అందుకే మీ అత్తయ్య రాజ్యం ఏలుతుంది. నీలా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లలు చూడు ఎంత సరదాగా ఉంటున్నారో." వేళాకోళం చేశాడు మోహన్.
    "అమ్మా నాన్నా పోయిన దగ్గిర నుంచీ అత్తయ్యే నన్ను పెంచింది . చదువు చెప్పించింది. నాకు జ్ఞానం వచ్చిన దగ్గిర నుంచీ ఆవిడ తప్పించి ఎవరూ తెలియదు."
    'అందుకేగా భక్తిగా ఉంటావు. సరే ఏం తిందాం . నువ్వు చెప్తావా? నేను అర్దరివ్వనా?'
    "నువ్వే చెప్పు' అంది లలిత. తను చెప్తే అతని దగ్గిరేముందో తెలియదు. తీరా అతని చేత ఎక్కువ ఖర్చు చేయించానెమో అనే బెంగ పీకుతుంది. అందుకే అలా అంది లలిత    "పీచ్ మల్భా తిందాం" అన్నాడు హుషారుగా.
    "వద్దు ఎందుకు లెమన్ డ్ తాగి వెళ్ళిపోదాం' అంది లలిత.
    "ఫరవాలేదు ఈవేళ డబ్బుందిగా' అంటూ ఆర్డరిచ్చాడు మోహన్.
    "నాకే కనక ఏమాత్రం డబ్బున్నా ఈ రోజే నిన్ను పెళ్ళి చేసుకుందును. మీ అత్తయ్య ఏమన్నా సరే' అన్నాడు మోహన్ - వైటర్ చెవిని పడకుండా గొంతు తగ్గించి.
    "మోహన్ ఏ మాత్రం ఆస్తీ కూడా లేదా? నీ రాబడి తప్పించి' దీనంగా అడిగింది లలిత. ఏమాత్రం వెనక ఆసరా ఉన్నా ఎవరినీ లక్ష్య పెట్టకుండా పెళ్ళి చేసుకుందుకు లలిత సిద్దమే. అప్పుడు అత్తయ్య కి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు నని లలిత భావన.
    "ఉంది. కాని అదే మంత చెప్పుకో తగ్గది కాదు. నా భార్యని హోదా లో ఉంచడాని కదెం సరిపోదు లలిత'

    "హోదా ఎవరికి కావాలి? హాయిగా ఉంటె చాలదా?"
     'చాలదు. నీలాంటి భార్యని సామాన్యంగా ఎలా ఉంచడం?' ప్రేమగా లలిత కళ్ళలోకి చూస్తూ అన్నాడు మోహన్.
    "నా కవెం అక్కరలేదు. ఏదో హాయిగా వెళ్ళ పుచ్చకల్గితే చాలు. అత్తయ్య నాచేత అందుకేగా ఉద్యోగం చేయిస్తుంది."
    "ఎందుకు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికా?' ఆశ్చర్యంగా అన్నాడు మోహన్.
    "అలా అని కాదు. కాని ఒకవేళ ఏదైనా అవసరం అయితే బెంబేలు పడిపోకుండా ఉండడాని కని."
    "పోనీలే ఆమాత్రం ఉద్యోగం చేస్తున్నావు. కనకనే మనం కలుసుకోవడం పడింది. అత్తయ్య తరవాతేనా ఆస్థి వస్తుందిగా!"
    "రాదు, రాదు. నాకేం రాదు మోహన్. అంతా ఆమె పెంపుడు కొడుకు లాంటి వాదోకాయనున్నాడు ఆయనగారికి వెడుతుంది. నాకు పెళ్ళి చేసుకునే దాకానే ఆధారం. తరవాత భర్తే 'చెప్పింది లలిత.    
    "నిజంగానా! అంత డబ్బుండి, నిన్ను చిన్నతనం నుంచీ పెంచి నీ కివ్వకుండా ఉంటుందంటే నేనలా నమ్ముతాను లలితా. నీ ఆస్థి కోసం నిన్ను ప్రేమిస్తున్నానని అనుకుని చెప్తున్నావు అవునా?'


Next Page 

WRITERS
PUBLICATIONS