అతని లక్ష్యం
గుళ్ళపల్లి సుందరమ్మ

'ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం
కేయూరహారోజ్వాలా'
అంటూ శ్రీ మీనాక్షి పంచరత్న స్త్రోతాల్ని వల్లించుకుంటూ దేముడు గదిలో. అన్నీ అమరుస్తున్న సుధ. స్నానాల గదిలో నుంచే 'రఘు' రావడం చూడ్డం తోనే , 'శ్రీ శ్రీ శ్రీ రఘునాధం బావ గారికి మా హృదయాభివందనాలు' అంది నవ్వుతూ.
'ఎందుకోసరమండీ, సుధాదేవి మరదలు గారూ' అన్నాడు. తడి తలని తువాల్తో తుడుచుకుంటూ రఘు, తనూ సుధ అన్న నాటక బాణీ లోనే.
'ఎందుకా తమరు ప్రధమ శ్రేణిని ఉత్తీర్ణులైనందుకు.'
"ఆ నిజం గానే ?' అంటూ రెండగల్లో బల్ల మీది పేపర్నందుకున్నాడు. ఈ సంతోష విషయాన్ని స్వయంగా చూసుకుని మరింత సంతోషించెందుగ్గాను రఘు.
'ఏం? నే చెప్పింది నిజవేనా?' అంది హెచ్చరిస్తూ సుధ.
'నిజవే సుధా! అమ్మయ్య అయితే నువ్వు చేసిన ప్రార్ధనలన్నీ ఫలించాయన్న మాటే' అన్నాడు సానుభూతి గా.
'పోనీయి. చిన్న బావకి మల్లె పూర్తిగా కొట్టి పారెయ్యకుండా. ఇంత పాటన్నా ఒప్పుకున్నావ్ నయవేలే నువ్వు. ఏదీ, కాస్తిలారా!' పురమాయించింది సుధ.
'నన్నా! ఎందుకూ' అంటూ పూజ గదిలో కొచ్చేడు రఘు.
'ఊ. భక్తితో లలితాంబకి నమస్కరించు మరి' అంటూ దేవీ పీఠాన్ని చూపించింది సుధ. నవ్వుతూ నమస్కరించబోయాడు రఘు.
'ఆ? ఆ? కాస్త అగు. పాడు మొహంతో దండం పెట్టొచ్చానా బావా? ఇందా బొట్టు పెట్టుకో ముందు' అంటూ దేవీ ప్రసాద కుంకాన్ని అందించింది సుధ.
'నువ్వే పెట్టేద్దూ.' అంటూ సుధ ముందుకి వొంగాడు రఘు. తన ఇష్టదైవాన్ని మనసారా మరోసారి తలచుకుంటూ , ఆ కుంకాన్ని అతని నుదుట ఉంచింది సుధ. తనలో తనే నవ్వుకుంటూ పటానికి నమస్కరించి , ఇంట్లో అందరి తోటీ ఈ విషయం చెప్పి, స్నేహితులకి తెలిపే నిమిత్తం హల్లో వున్నా ఫోను వద్ద కెళ్ళాడు రఘు.
'ఈ పైన ఏం చెయ్యదల్చావ్ రఘూ!' అన్నారు జపతపాలన్నీ పూర్తీ చేసుకున్నాక షర్టు తొడుక్కుంటూ , సావిట్లో కొచ్చిన శర్మగారు.
'మీరెలా చెప్తే అలాగే నాన్నా' అన్నాడు రిసీవరు పెట్టేసి తండ్రి కేసి వస్తూ.
'బావకి మెడిసిన్ చదవాలనుంది మావయ్యా.' అంది కుర్చీ పట్టుకు నిలబడున్న సుధ ఉత్సాహంగా.
'బావ మెడిసిన్ చదవాలని నీకుందా లేక బావకే వుందా?' నవ్వుతూ అడిగాడు రామం.
'ఇద్దరికీ వుంది.' తడువుకోకుండా బదులిచ్చింది సుధ.
'అయితే తప్పకుండా అందులోనే చేర్పించేయి బాబాయి.' హాస్యం కోసం, సీరియస్ గా మొహం పెడుతూ అన్నాడు రామం.
'ఆ! మూర్తి గారు మీ స్నేహితుడే కదు నాన్నా?' అన్నాడు వేణు.
'ఏ మూర్తి గారూ?'
'అదే నాన్నా, ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సి పాల్ .సత్యమూర్తి గార్లేరూ--'
'వో , అతనా. ఔను. మొన్నీ మధ్య కూడా ఎందుకో ఫోన్ చేశాడు కూడా. అయినా ఇలాంటి మొహమాటాల్తో , స్నేహం పెరట ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు.'
'అదేవిటి బాబాయి? స్నేహితుడన్నాక ఈపాటి సాయాని కెదురు చూడనంటే ఎలాగా? ఇంతకీ మనవేవన్నా , మార్కులు తక్కువొచ్చిన వాడి కిమ్మంటున్నావా? కాదంటే కాలేజీ కి చాలా రిజమెండేషన్ రోజులు గనుక, మనవాడి విషయం కూడా కాస్త గుర్తుంచుకో,మంటున్నాం . అంతేగా.'
'అంతే అనుకో? సరి సాయంత్రం మళ్లీ వోసారి గుర్తు చెయ్యి' అంటూ ఆఫీసు గదిలో కెళ్లి పోయారాయన.
'నువ్విప్పుడేక్కడికన్నా వెళ్లాలా రఘూ' అంటూ తనూ లేచాడు రామం.
'అక్కర్లేదు . ఏం?'
'అయితే ఆ స్కూటర్ తాళం చెవి ఇలా ఇవ్వు. నాకు బజార్లో పనుంది' అంటూ రఘు అందించిన తాళల్నందుకుని వెళ్ళిపోయాడు రామం.
'నువ్వు బహుశా ఇంజనీరింగ్ చదువు తానంటావేమో, నేను మెడిసిన్ తీసుకుందాం అనుకున్నా' అన్నాడు వేణు ఆలోచనతో.
'నీకు మెడిసిన్ లో ఇన్ ట్రిస్ట్ ఉందంటే , అలాగే మార్చుకోవచ్చు. దానికేం?' అన్నాడు రఘు.
'అమ్మయ్యో? వేణు బావే? డాక్టరు చదవడవె?' అంది గుండెల మీద చెయ్యి పెట్టుకుంటూ సుధ 'ఏం? నే డాక్టర్నయితే. ఎమౌతుంద్డెం?' కనుబొమ లెగరేస్తూ అధికార ధోరణి తో అడిగాడు వేణు.
'ఏమౌతుందా? ప్రాణం లేని సామాన్లు గనుక, అయ్యగారి కోపానికి అన్యాయంగా గురైనా, మళ్ళీ మరోసారి కొనుక్కోవడంతో తీరిపోతుంది గానీ, మరిక మెడిసినంటూ చదివితే ఎన్నెన్ని నిండు ప్రాణాలు అన్యాయంగా...'
ఇంతలో నవ్వాపుకుంటూ దొంగ కోపంతో చెయ్యేత్తుతూ వేణు లేవడంతోనే , సుధ తనూ బెదురుతూ లేవడంతో ఆ ఖంగార్లో సుధ ఊసు కాలు కింద పడి పోయి ఒంటి కాలి మీద నిలవలేక ఒణికిపోయింది సుధ.
దబ్బున లేచి సుధ నాదుకుంటూ "అబ్బ ఏం పన్రా వేణూ!' అంటూ తమ్ముణ్ణి మందలించాడు రఘు. కర్ర సాయంతో దబదబా లోపలి కెళ్ళిపోయింది సుధ.
'సుధ అన్నది నిజం రఘూ, నా ముక్కోపి తనానికి నేనెంత మాత్రం డాక్టరు పనికి తగను. అందువల్ల నువ్వే మెడిసిన్ లో చేరు అంటూ' అంతలో ఎవరో స్నేహితుడు 'సైకిల్ బెల్' కొట్టి పిలవడం తో లేచి వెళ్ళిపోయాడు వేణు.
'బావా! తెర వెనకాల్నుంచి తొంగి చూస్తూ లో గుమ్మం లో నిలబడి పిల్చింది సుధ. 'ఎందుకూ' అన్నట్టుగా , మొహం ఎగరేశాడు రఘు.
'నన్ను గుడికి తీసుకెళ్తావా బావా?' 'నువ్వు తప్ప నన్నింకెవ్వరూ తీసుకెళతారని!' అని ప్రాధేయ పడుతున్నట్టుగా వుంది జాలిగా సుధ అడిగిన తీరు.
'అలాగే! అయితే మళ్ళీ దబ్బున తిరిగోచ్చేయ్యాలి. ఏం? అంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు రఘు. అతనికి అప్పుడు కదలాలని లేకపోయినా , సుధ కోరికని కాదన్లేక , అంత శ్రద్దగా చదువుతూన్న పుస్తకాన్నీ, మూసేసి లేచాడు రఘు.
'గుడి కేల్దాం ఒస్తావా అత్తయ్యా?'
గబగబా వంటింట్లో కెళ్లి అడిగింది సుధ.
'గుడికా . నువ్వా' ఆశ్చర్యంగా అడిగింది జానకి.
'అవునమ్మా. బావ కూడా ఒస్తానన్నాడుగా. ఫరవాలేదు ...అంది, తల్లి ఆశ్చర్యాన్ని అర్ధం చేసుకున్న సుధ తన గదిలోకి వెళ్తూ.
'అబ్బ! ఇంకా ఇలాగే వున్నావా అత్తయ్యా, అంటూ గునిసింది పూజా సామాగ్రి నంతా సజ్జలో అమర్చి సిద్దంగా పట్టుకొచ్చిన సుధ తన మేనత్త పార్వతమ్మ గార్ని చూస్తూ.
'నాదెం వుందే పద.' అంటూ, కట్టుకున్న పట్టుచీరేనే మరొకసారి మునిగోళ్ళ తో చక్క జేసుకుని, అద్దంలో చూసి కుంకుమ బొట్టుని మళ్ళీ సరిగ్గా పెట్టుకుని వెళ్లి కార్లో కూర్చున్నారు పార్వతమ్మ గారు. తిన్నగా, మహారాణి పేటలోంచి ఎత్తుపల్లాల్ని దాటించుకుంటూ.... దుండపర్తి లో నున్న, లలితాదేవి గుడి ముందుకి తీసుకెళ్ళి కారాపాడు రఘు.
కారు అద్దాల్ని పైకెత్తి , లాక్ చేసి , తాళాల్ని విలాసంగా తిప్పుతూ లోపలి కొచ్చిన రఘు , గుడి మెట్లెక్కలేక తడబడుతున్న సుధని చూడగానే దబ్బున ఒచ్చి చేయి పట్టి ఎక్కించాడు.
'తల్లీ , జీవితమంతా ఇలా అతని చేయూత ఆధారంతోనే, సుఖ సౌఖ్యాల్తో కాలం గడప గల్గె అవకాశం ఆ ఆమయకురాలికి ప్రసాదించగలవా తల్లీ?' అనుకున్నారు ఆ దృశ్యాలిని చూసిన పార్వతమ్మ గారు. మళ్ళీ ఆ వెంటనే అది సామాన్యమైన విషయం కాదనీ, అలా చేయ్యగల్గెందు కతని లో ఎంతో త్యాగబుద్ది మనో నిబ్బరం కావాలనీ అనిపించిందావిడకి.
ఆ గుడి చాలా చిన్నదే అయినా, దేవి మహిమ చాలా గొప్పది. అందువల్ల ఆ తల్లి వద్ద తమ తాపత్రయాల్ని మొర బెట్టుకుని శరణు జోచ్చేందుకు ఒచ్చేవారి తోటీ, మళ్ళీ అభీష్ట సిద్ది పొంది కానుకలు సమర్ధించుకుందుకు ఒచ్చేవారి తోనూ ఎప్పుడూ ఆ ప్రాకారమంతా కిటకిట లాడుతూ వుంటుంది.
'లలితాదేవి ,' ఉపాసకులైన ఒక స్వాములవారు తమ ఇష్ట దేవతయిన ఆ దేవి మూర్తిని , ప్రజా శ్రేయస్సు కోరుతూ , అక్కడ ప్రతిష్టించి, అంతటితో తమ కర్తవ్యం తీరిపోయిందన్నట్టుగా అ తరువాత కొద్ది కాలంలోని సిద్ది పొందారట. వయో వృద్దులైన ఆ స్వాములవారి సమాధి కూడా ఆ గుడి ఆవరణ లోనే కట్టబడి వుంది.
పార్వతమ్మ గారి క్కూడా ఆ దేవి యందు అపారభక్తీ. ప్రతి శుక్రవారం అక్కడ కెళ్ళి దర్శనం చేసుకోవడమే గాకుండా, పర్వదినాలప్పుడు శుభవార్తల్ని విన్నప్పుడూ కూడా 'ఇదంతా ఆ తల్లి చలవే' అనుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోస్తుండడం మామూలు ఆవిడకి. పార్వతమ్మ గారిలాగే లక్ష్మీ కళ తాండవించే పండు ముత్తయిదువయిన ఆ పార్వతమ్మ గార్ని ఓ ప్రత్యక్ష దేవత గానే, భావిస్తూ , మరి కొంచెం సేపాగైనా సరే ఆవిడ దర్శనం కూడా చేసుకుని మరీ వెళ్తూ వుంటారు.
'వూర్నించి మనవాళ్ళేవరో వచ్చి నట్లున్నారోదినా. పైన మావగారితో మాట్లాడుతున్నారు....' అంది కాళ్ళు కడుక్కు వొచ్చి, సజ్జను గుమ్మంలో పెడుతున్న పార్వతమ్మ గారితో జానకి.
'ఎవరూ , శ్యామలాంబోదిన గానీ వచ్చిందా.' అనుకుంటూ పార్వతమ్మ గారు హాలు వేపు వెళ్ళే లోగా 'ఏం వదినా , పొద్దున్నే పెత్తనాలకి బయల్దేరావ్ ఎక్కడి కేవిటి!' అంటూ, ఆవిడే ఎదురొచ్చారు.
'అబ్బే అబ్బాయి పరీక్ష ప్యాసయ్యాడని అలా గుడి వేపోసారి వేల్లోచ్చా, ఎన్నాళ్ళ కి మా మీద్దయోచ్చింది.' అన్నారు ఉయ్యాల బల్ల మీద ఆవిణ్ణి కూర్చోమని పక్కనే తనూ కూర్చుంటూ పార్వతమ్మ గారు.
'ఏం చేయ్యమన్నావ్ చెప్పూ. ఏదో అప్పుడూ అప్పుడూ వచ్చి ఏ కొద్ది రోజులో, అదీ ఏ పని మీదనో రావడం తప్ప . ఇంచూ, మించూ పదేళ్ళ బట్టి నాగపూర్ లోనే వుండి పోయాం కదా, ఏదో ఈయనా పెద్దవారై పోతున్నారు . ఎలాగా, అని అనుకుంటుంటే, దైవ కృప వల్ల నిరుడు అబ్బాయినే నాగపూర్నుంచి రాజమండ్రి కి బదిలీ చేశారు.
'దగ్గరగా వచ్చా కన్నా రావచ్చుగా?'
'అంతా విని మరీ అనూ. దేశం ఒచ్చినా వచ్చాం. చుట్టాల్తో ఇలా మునిగి తేలిపోతున్నావంటే నమ్మూ! మరి అదీ పిల్లల్తో చేసుకోవాలీ మరీ?' ఇప్పుడన్నా-- మా వదినేగారు , వాళ్ళూ కార్లోనే అన్నవరం వస్తుంటేనూ! ఆపేరు చెప్పి ఎలాగో బయల్దేరా.'
'అన్నవరానికి అట్నుంచే దారుందని ఎరగడు గానాల్నమ్మా. అత్తయ్యా...' అన్నాడు హాస్యంగా వేణు. ఆవిడ అభిమానంతో తెచ్చిచ్చిన చక్కిలాన్నీ నవుల్తూ.
'హారి నీ బొడ్డు పోక్కా! నన్నే వెక్కిరిస్తున్నావుట్రా!' అంటూ కాస్సేపు నవ్వేసి, వాళ్ల కోడలు పుట్టింట్లో ఈ ఊర్లో ఉంది. 'ఆ పిల్లని తీసుకేల్ధం కోసరం. ఇక్కడి దాకా వస్తున్నాం.' అంటేనూ! పోనీ ఆ వొంకన మిమ్మల్నీ వోమారు చూసి పోదావని నేనూ బయల్దేరా.'
'అయితే ఇది ఉండ్రాళ్ళ మీది భక్తీ గానీ విఘ్నేస్వరుడి మీది భక్తీ కాదన్న మాట నీకు,' అన్నాడు నవ్వుతూ మళ్లీ వేణు.
'నువ్వెలా అనుకున్నా సరేరా బాబూ. అయినా వీడికి మీ నాన్న పేరు పెట్టి నందుకు ఆ మాటకారి తనవంతా మా బాగా వచ్చిందోదినా .' అంది నవ్వుతూ ఆవిడ.
