రాత్రిపూట వసారా ప్రక్కనున్న గదిలో పడుకొంటుంది సంధ్య. పడుకొనేప్పుడు తలుపు లోపల గడియ వేసుకొమ్మని నర్సమ్మగారే చెప్పారు.
ఆరోజు అప్పుడప్పుడే కునుకుపడుతూంది సంధ్యకు. నర్సమ్మగారు పెద్దపెద్దగా కేకలు వేయడంతో నిద్ర చెదిరిపోయింది. దిగ్గునలేచి తలుపు తెరుచుకొని బయటికి వచ్చింది. కాని కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయినట్టుగా అయింది.
సింహం వివస్త్రంగా ఉన్నాడు. అనాచ్ఛాదితమైన అతడి ఊబశరీరం భయంకరంగా, అత్యంత జుగుప్సాకరంగా ఉంది. తల్లి చీరపట్టి లాగుతూ, ఆవిణ్ణి కావలించుకోబోతున్నాడు.
సింహాన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తూ, తిట్టిపోస్తూంది నర్సమ్మగారు. "నిన్ను కాట్లో పెట్టగదరా! కన్నతల్లి అన్న ధ్యాసకూడా లేదురా నీకు? నిన్ను నరికి పోగులుపెట్టా! నిన్ను ఒంటిబొంగు పాడెకట్టా!"
అతడికి ఆడధ్యాస తిరుగుతుందన్న సంగతి సంధ్యకు తెలుసు.
సింహాన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తూంటే రెట్టించిన బలంతో తల్లిని పట్టుకొంటున్నాడు. ఇంచుమించుగా ఆవిడ చీరంతా లాగేశాడు.
"మొద్దల్లే అలా నిల్చున్నావేమే? కత్తిపీటో కత్తో తీసుకురా వీడిని నరికి పోగులు పెడతాను. పొడిచి పొడిచి చంపేస్తాను. వెధవ. నా కడుపున చెడబుట్టాడు. ఎంత పాపం చేసుకొన్నానో! తల్లినే మానభంగం చేసే కొడుకుని కన్నాను."
సంధ్య తెలివితెచ్చుకొని, నర్సమ్మగారు కుక్కల్ని అదిలించడానికి మూలకుంచిన కర్రతీసుకుని సత్తువకొద్దీ సింహం కాళ్ళకు విసిరింది.
సింహం బాధతో సంధ్యవైపు తిరిగాడు.
ఆడివ కాస్త సందు చిక్కగానే చీర చుట్టేసుకొని, సంధ్య చేతిలో కర్ర అందుకొని, సింహాన్ని పశువుని బాదేసినట్టుగా బాదేసింది. సంధ్య సాయంతో అతడిని గదిలోకి త్రోసేసి తలుపు గడియపెట్టేసింది. "దరిద్రపుముండాకొడుకు. కాస్తలో తప్పిందే వీడి చేతిలో మానభంగం!" ఆవిడ ఆయాసంగా కూలబడిపోయింది. "చంటివెధవని గొడ్డుని బాదేసినట్టుగా బాదేశాను గాని వాడి బాధకూడా అర్థం చేసుకోతగ్గదే. భగవంతుడి కొంటెతనం కాకపోతే వెర్రిబాగుల పిల్లవాడికి ఈ యవ్వనం ఎందుకివ్వాలి?" ఆవిడ దుఃఖ స్వరంతో అంది.
"పాపం! చస్తాడో, బ్రతుకుతాడో చూడకుండా కొట్టావు అత్తమ్మా! సింహం లోపల ఏడుస్తున్నట్టున్నాడు!" సానుభూతిగా అంది సంధ్య.
"అవునే! ఒళ్లు తెలియలేదు నాకప్పుడు. ఈ చేతులతోనే అల్లారు ముద్దుగా పెంచి, ఈ చేతులతోనే చచ్చేట్టు కొట్టాను!" నర్సమ్మగారు ఏడవసాగింది.
"ఒకసారి తలుపుతీసి అతడిని ఓదార్చు, అత్తమ్మా! అతడి బాధ కొంత తగ్గుతుంది."
"వద్దొద్దు! ఈ రోజంతా వాడలా ఉండాల్సిందే. లేకపోతే కన్నతల్లి మీదికే కామాంధుడై వస్తాడా?" ఆవిడ మళ్ళీ కాఠిన్యం తెచ్చుకొంది. "సంధ్యా! నా బాధ చూస్తున్నావుకదే? వీడికి ఎవరూ పిల్లనివ్వడంలేదు. వాడికి పెళ్ళిచేస్తే తప్ప ఈ కప్పుక్రింద మేమిద్దరం తల్లీ కొడుకులంగా కాపురం చేయలేం. నన్నూ నా కొడుకునీ నువ్వే రక్షించాలే. నువ్వు తప్ప నాకెవరూ కనిపించడంలేదు" ఆవిడ సంధ్య చేతులు పట్టుకొంది.
"నేనేం చేయగలనత్తమ్మా?" సంధ్య విస్మయంగా అడిగింది.
"వాడిని పెళ్ళిచేసుకో. వెర్రిబాగుల వెధవే అనుకో! కాని, నువ్వు ఎంతచెబితే అంత. కాడు పిలుస్తున్నదాన్ని నేను. ఇవాళో రేపో! ఇక ఇదంతా నీదే అవుతుంది."
"నేను.... నేను సింహాన్ని పెళ్ళిచేసుకోవాలా? అమ్మా, నాన్న లేక నీ పంచన పడ్డాననేకదూ, నువ్విలా అడగగలుగుతున్నావు?" సంధ్య ఉక్రోషంగా అంది.
"మా సింహానికి ఉండే లోపాలు మా సింహానికి ఉన్నాయి. వాడు వెర్రి వెంగళప్ప. నిజమే! కాని, కావలసినంత ఆస్తి ఉంది. సంప్రదాయం, కులం, మర్యాద ఉన్నాయి. నువ్వు స్వరూపవతివి తప్ప నీకింకేమున్నాయి చెప్పు? అమ్మా నాన్నలేరు. కులం లేదు. సంప్రదాయం లేదు. నిన్ను చేసుకోడానికి నీలాంటివాడైతేనే వస్తాడు"
"ఏం లేకపోయినా సింహానికి భార్యగా పనికి వస్తానంటే నేను...... నేను చులకనయ్యాను నీకు, అత్తమ్మా?"
