అతను ఓసారి దీర్ఘంగా మూలిగి నీర్సంగా కళ్ళు మూస్కున్నాడు. ఆమె మాత్రం చక చకా నోట్లోకి బిస్కెట్లు ఎగరేస్తూనే వుంది. ఈటింగ్ కాంపిటీషన్ లో నిముషానికి ఎన్ని బిస్కెట్లు తింటారో అన్న పోటీలో పాల్గొన్నట్టు ఉంది ఆమె తినే పద్ధతి చూస్తుంటే.
మరో ప్రక్క ఒక పేషంట్ గబగబా మంచం దిగి స్కిప్పింగ్ చేస్తున్నట్టు గంతులెయ్యడం మొదలుబెట్టాడు.
ఆ దృశ్యం చూసి రాంబాబు, చిన్నారావ్ లకి చచ్చేంత ఆశ్చర్యం వేసింది.
"అదేంటి? ఆయనెందుకు షడన్ గా అలా గంతులెయ్యడం మొదలుపెట్టాడు....?" అడిగాడు బెడ్ ప్రక్కనే స్టూల్ మీద కూర్చున్న అతని భార్య.
"మందుని బాగా షేక్ చేసి తాగమని డాక్టర్ గారు చెప్పారట నాయనా! ఈయన ఓ మతిమరుపు పీనుగకదా నా ప్రాణానికి....మందుని షేక్ చెయ్యకుండా అలాగే తాగేశారట. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి మందు పొట్టలో బాగా కలవాలని వెర్రిగా అలా గంతులేస్తున్నారు" అందావిడ చికాకుగా.
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ కిసుక్కున నవ్వారు. ఆవిడ ఇద్దర్నీ చుర చురా చూసింది.
అదే టైంలో కమీషనర్ లింగారావ్ పూల బొకేలతో వార్డులోకి హడావుడిగా వచ్చాడు. కమీషనర్ ని చూడగానే రాంబాబు, చిన్నారావ్ లు లేచి కూర్చోబోయారు.
"అ హహ....మీరు పడుకోండి....పడుకోండి...." అన్నాడు కమీషనర్ లింగారావ్ రెండు మంచాల మధ్య వున్న స్టూల్ మీద కూర్చుంటూ.
"గుడ్ మార్నింగ్ సార్!" ఇద్దరూ కోరస్ గా అన్నారు.
"గుడ్ మార్నింగ్!" అని ఇద్దరి చేతుల్లో బొకేలు వుంచాడు.
"మా పాపని ప్రాణాలకి తెగించి కాపాడారు. మీ రుణం నేను జన్మలో తీర్చుకోలేను. అయినా మీకింత ధైర్యసాహసాలున్నాయంటే....నాకెంతో అద్భుతంగా వుంది. చేతిలో ఆయుధం లేకుండా గజదొంగ మంగుల్ని ఎదుర్కున్నారంటే....ఓహ్! అయినా మీకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?" కుతూహలంగా అడిగాడు కమీషనర్.
"అదేంటోసార్! ఎప్పుడూ ధైర్యంగా వుండే నాకు చిన్నప్పటి నుండీ అలవాటైపోయింది...." బుర్ర గోక్కుంటూ వెర్రినవ్వు నవ్వుతూ అన్నాడు రాంబాబు.
"నాకూ అంతే సార్....?" చిన్నారావ్ కూడా ఓ వెర్రి నవ్వు నవ్వాడు.
పోలీస్ కమీషనర్ మరో అయిదు నిముషాలు అక్కడ కూర్చుని వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీస్కోమనీ, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ వాళ్ళకి స్పెషల్ లీవ్ గ్రాంట్ చేయిస్తాననీ, వాళ్ళకి త్వరలో ప్రమోషన్ వచ్చేలా చూస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు.
"అసలు వాడెవడో జేబుదొంగ అనుకుని మనం వెంటపడితే, చూశావా మన ఇమేజ్ ఎంతగా పెరిగిపోయిందో....?" నవ్వుతూ అన్నాడు చిన్నారావ్.
"ఇంతకీ ఆ మంగులుగాడు కొట్టేసిన నీ పర్సులో ఎంత డబ్బుందేవిటీ?"
"ఆరు రూపాయల డెబ్బై అయిదు పైసలు" చెప్పాడు రాంబాబు.
"అంతేనా?" ఆశ్చర్యపోతూ అడిగాడు చిన్నారావ్. "మరి అంత తక్కువ డబ్బుతో బిర్యానీ, చికెన్ సిక్స్ టీ ఫైవ్, మందు ఇన్ని ఎలా కొనగలననుకున్నావ్?"
"నువ్వున్నావ్ గా?!" కూల్ గా సమాధానం చెప్పాడు రాంబాబు.
"ఆఁ!...." అంటూ నోరు తెరిచాడు చిన్నారావ్.
* * * *
మధ్యాహ్నం ఒంటిగంటయ్యింది.
రాంబాబు, చిన్నారావ్ లకి ఆకలి దంచేస్తోంది. ఆ వైపుగా వెళ్తున్న వార్డ్ బోయ్ ని పిలిచాడు రాంబాబు.
"ఏం బాబూ! మాకు భోజనం ఏర్పాట్లేమైనా వున్నాయా?" అడిగాడు వార్డ్ బోయ్ ని.
"పోలీస్ కమీషనర్ గారు హాస్పిటల్ సూపర్నెంటుకి ఫోన్ చేసి మీకు భోజనం పెట్టొద్దన్నారంట!" చెప్పాడు వార్డ్ బోయ్.
రాంబాబు, చిన్నారావ్ లు మొహమొహాలు చూస్కున్నారు. ఇద్దరి మొహాల్లో ఆశ్చర్యం! పొద్దున్నే వచ్చి పూలగుత్తులిచ్చి, తెగ పొగిడిపోయిన కమీషనర్, ఇప్పుడు తిండికూడా పెట్టొద్దని చెప్పాడేంటబ్బా!.... అనుకున్నారు.
"ఆకల్తో కడుపు మండిపోతుందయ్యా బాబూ! తిండి పెట్టొద్దంటే ఎలా? చికాకు నణుచుకుంటూ అన్నాడు చిన్నారావ్.
"అంటే మా హాస్పిటల్ భోజనం పెట్టొద్ద్దన్నారండీ! ఆయన ఇంటి నుండి క్యారియరు పంపిస్తున్నారట!" అనిచెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు వార్డ్ బోయ్.
రాంబాబు, చిన్నారావ్ ల మొహాలు వెలిగిపోయాయి.
పోలీస్ కమీషనర్ యింటి నుండి స్పెషల్ భోజనం!! కమీషనరే స్వయంగా చొరవ తీస్కుని పంపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కమీషనర్ అభిమానాన్ని పూర్తిగా పొందినట్టే లెక్క!
"అయితే మనకి ప్రమోషన్ రావడం ఖాయమే....!" అన్నాడు రాంబాబు.
"అవును....అవును!" బుర్రకాయ్ తొండలా నిలువుగా ఊపుతూ అన్నాడు చిన్నారావ్.
ఓ అయిదు నిముషాల తర్వాత మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ కమీషనర్ లింగారావ్ ఇంటి నుండి ఇద్దరికీ క్యారియర్ తెచ్చాడు.
క్యారియర్ లో రెండు రకాల స్వీట్స్, రెండు రకాల కూరలతో మంచి భోజనం వుంది. దాంతోపాటు కమలాపళ్ళు, యాపిల్ పళ్ళూ, ద్రాక్షపళ్ళు కూడా పంపించారు పోలీస్ కమీషనర్.
ఇద్దరూ సుష్టుగా భోజనం చేశారు. వచ్చిన మనిషి క్యారియర్ తీస్కుని వెళ్ళిపోయాడు.
మరు నిముషం వాళ్ళిద్దరి దగ్గరికీ బిలబిలమంటూ నలుగురు వ్యక్తులు వచ్చారు.
