అప్రయత్నంగా విశ్వనాద్ చేతులు అతడ్ని చుట్టాయి.
సీతమ్మ వారిద్దర్నీ చూసి తేలికగా నిట్టూర్చింది.
* * *
నెల రోజులు గడిచాయి.
ఈ నెల రోజుల్లోనూ జరిగిన చెప్పుకోదగ్గ విశేషం -- ఉదయ పూర్తిగా మామూలు మనిషి కావడం.
గులాబీ నర్సింగ్ హోం లోనే ఇది పెద్ద సంచలనం కలిగించింది.
కులభూషణ్ కు జరుగుతున్నది కలో, మాయో తెలియడం లేదు.
ఇప్పుడుదయ , సీతమ్మ కూడా ఇంట్లోకి మారిపోయారు.
ఉదయకు కొత్త జీవితం ప్రారంభమయింది. ఇది ఊహించని కొత్త జీవితమామెకు!
ఉదయ తండ్రి ఆమెను చూడ్డానికి వచ్చాడు.
'అత్త చల్లని నీడలో మృతులు కూడా పునర్జీవితు లౌతారనడానికి నేనే ఋజువు. నేనిప్పుడు పునర్జన్మ నేత్తాను. ఇప్పుడు నేను పూర్తిగా అత్త మనిషిని. నీకూ నాకూ సంబంధం లేదు' అని తండ్రికి స్పష్టంగా చెప్పేసింది ఉదయ.
"నేను నిన్ను తీసుకు వెళ్ళాలని రాలేదమ్మా! నీలో జీవకళను చూసి ఆనందించాలని వచ్చాను. నీ అత్తకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాను." అన్నడామే తండ్రి.
'అత్తకు నువ్వు చెప్పాల్సినవి కృతజ్ఞతలు కావు' అంది ఉదయ నిష్టూరంగా.
'నిజం చెప్పావు ' అంటూ సీతమ్మ కాళ్ళ మీద పడ్డాడు ఉదయ తండ్రి.
సీతమ్మ అతడ్ని లేవదీసి "నాకు క్షమార్పణలు వద్దు. నన్ను నువ్వు నష్ట జాతకురాలను కోకుండా ఉంటే చాలు" అంది.
ఉదయ తండ్రి తన తప్పులన్నీ ఒప్పుకుని వెళ్ళిపోతూ "నా కూతుర్ని నేనే నీకు అప్పగించాననుకో" అన్నాడు.
కులభూషణ్ ఉదయను ఏకాంతంలో కలుసుకుని "నువ్వు నిజంగానే పూర్వ జన్మ నేత్తావు. మన పెళ్ళి గత జన్మలో జరిగిందనుకో. నీ కొత్త జీవితంలో నీకు నచ్చిన వరుడి నెన్నుకో " అని చెప్పాడు.
"నీవే నాకు నచ్చిన వరుడి నెందుకు కాకూడదు ?" అంది ఉదయ.
కులభూషణ్ ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు.
అప్పుడామె లేతపసుపు చీరలో అదేరంగు రవిక ధరించి ధన్యలక్ష్మి లా కనబడుతోంది. ఆమె ముంగురులు గాలి లేకున్నా కదలాడుతూ ఆమెకు వీపన వీస్తున్నాయి. ఆమె శరీరంలో ఒక మెరుపు, కనులలో తేజస్సు.
కానీ ఆ కనులు నిశ్చలంగా కూడా ఉన్నాయి. ఈమె నిజంగా తనను ప్రేమించడం ప్రారంభించిందా అన్న అనుమానం అప్పుడతడికి కలిగింది.
"నువ్వు నన్నే పరిస్థితుల్లో పెళ్ళి చేసుకున్నావో నాకు తెలుసు....'
"ఏ పరిస్థితుల్లో జరిగినా పెళ్ళి పెళ్ళే!....' అంది ఉదయ.
అప్పుడామె కనులలో రవంత విషాదాన్ని కులభూషణ్ గుర్తించాడు.
"మన పెళ్ళి శాస్త్ర ప్రకారం జరుగలేదు. అయినా నువ్వు దాన్ని పెళ్ళను కుంటున్నావు. అదే పద్దతిలో ఇప్పుడు మనం విడాకులు తీసుకుందాం....' అన్నాడతడు.
ఉదయ కనులు రెపరెప లడాయి.
అయినప్పటికీ ఆమె ఇప్పుడు రాలిపోతున్న చిగురుటాకులా లేదు. వృక్షంలో కొత్త జీవాన్ని నింపుకున్న లేత చిగురుటాకులా ఉంది.
"మనం విడాకులు తీసుకోడ మెందుకు ?"
"కొద్ది నెలలైతే ఫర్వాలేదను కున్నాను కానీ నీ నూరేళ్ళ జీవితంలో నాకు స్థానం లేదు' అన్నాడు కులభూషణ్.
"నేనంటే నీకిష్టం లేదా -- నేను నీకు నచ్చలేదా ?"
"నిన్ను పొందే అర్హత నాకు లేదు"
ఉదయ ఆలోచనలో పడింది.
"నువ్వు నీ విస్సీబావను పెళ్ళి చేసుకో " అన్నాడతను మళ్ళీ.
'అలోచించి నా నిర్ణయం చెబుతాను. కానీ ఒకవేళ నేను నీకు భార్యగా ఉండిపోవాలని నిర్ణయించుకుంటే కాదనవు కదూ!"
కులభూషణ్ నిట్టూర్చి -- "తోలి నుంచీ నువ్వు విశ్వనాద్ భార్యవు. అందువల్ల నా మనసులో నీకెప్పుడూ స్థానం లేదు. నీ జీవితం అశాశ్వతమని తెలియడం వల్ల విశ్వనాద్ భవిష్యత్తు నాశించి మన వివాహానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు పరిస్థితులు మారాయి. విశ్వనాద్ తిరిగొచ్చాడు. నీకు నూరేళ్ళ అయిష్షు వచ్చింది. మన మధ్య జరిగినదేవ్వరూ నమ్మరు. ఇద్దరం కలిసి విశ్వనాద్ - కన్యాయం చేస్తున్నామను కుంటారు. మనం దంపతులుగా కొనసాగాలంటే ఈ పెళ్ళి మరోసారి విశ్వనాద్ జరిపించాలి. ముందతడి పెళ్ళి జరగాలి -- ఆ తర్వాతనే మన పెళ్ళి !" అన్నాడు.
'అంటే?"
"ముందు విశ్వనాద్ పెళ్ళి జరుగుతుంది. అది జరిగేక నువ్వింకా అవివాహితగా ఉంటే అప్పుడు మన పెళ్ళి అంతే!'
'భూషణ్! నువ్వు చాలా గొప్పవాడివి " అంది ఉదయ.
"ఏముంది నాలో గొప్పతనం....?'
"నేను భారత స్త్రీని. కొన్ని సంప్రదాయాలను నేనంత సులభంగా వదులుకోలేను. కాదనలేను. ఆ సంప్రదాయాలు నేను నీ భార్య నంటున్నాయి. నా మనసెప్పుడు ద్వైదీభారంతో ఊగిస లాడుతోంది. మన పెళ్ళి పెళ్ళి కాదని నాకు తెలుసు. కానీ నువ్వు అవునన్నావంటే నేను కాదనలేను. అప్పుడు పెళ్ళి కొప్పుకున్నందుకు , ఇప్పుడది పెళ్ళి కాదన్నందుకూ కూడా చాలా చాలా థాంక్స్ !" అంది ఉదయ.
'అయితే నువ్వింకా గోప్పదానివి ఉదయా!?" అన్నాడు కులభూషణ్.
ఏమిటన్నట్లు చూసిందామె.
"నువ్వు నా భార్యనని స్పురించేక నేను మరో స్త్రీ ని తాకలేకపోయాను. వారే స్వయంగా వచ్చి నన్ను పిలిచినా ---నా చెవుల్లో నీ హెచ్చరిక వినబడేది. తాత్కాలికమే అయినా ఆ వివాహం నాలో గొప్ప మార్పు తెచ్చింది."
ఉదయం ముఖం ఎర్రబడింది. 'అయితే నేను శాశ్వతంగా నీతో ఉండి ఈ మార్పును నిలబెట్టాలేమో !" అందామె నెమ్మదిగా.
"వద్దు, నీవు పవిత్రురాలివి నేను అపవిత్రుడిని ' అని అతడు వెళ్ళిపోయాడు.
* * *
గులాబీ నర్సింగ్ హొంలో బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లు మరో ఇద్దరున్నారు. తమ ప్రాణాలు నిలబెట్టు కునేందుకు వారెంతైనా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నారు.
కులభూషణ్ తన పరిశోధనలలో ఉదయకు నయం చేశాడన్న వార్త నర్సింగ్ హోం లో ప్రచారమైంది.
నర్సింగ్ హోం చీఫ్ ఏడుకొండలు.
అయన డాక్టర్ కాదు. కానీ డాక్టర్ల యనకు సలాములు చేస్తారు.
గులాబీ నర్సింగ్ హోం లో అపాయింట్ మెంట్ ఉన్న డాక్టర్లకా ఊళ్ళోనే విలువ పెరుగుతుంది.
ఏడుకొండలు డాక్టర్లనెలా ఎన్నిక చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ అయన పేరున్న డాక్టర్ల కోసం ప్రాకులాడుతాడు. డాక్టర్ల టాలంట్ ను అంచనా వేయడంలో అయన కాయనే సాటి.
సమర్ధుడైన నిర్మాత అధ్వర్యంలో రాణించే సినీ దర్శకుల్లా అయన నర్శింగ్ హోం లోని ప్రతి డాక్టరు రాణిస్తాడు. ప్రతిభ గల డాక్టర్ల నాయన యువరాజుల్లా చూసుకుంటాడు. వారత్యశాపరులైతే తప్ప అయన కారణంగా అసంతృప్తి ఉండకూడదు. అయినప్పటికీ కొందరాయన్ను వదిలిపెట్టిన సందర్భాలున్నాయి.
గులాబీ నర్సింగ్ హోం లో పని చేయటం డాక్టర్స్ కో అదనపు యోగ్యతా పత్రం. అయితే పనిచేసి మానేసిన వారికంటే పని చేస్తున్నవారికే ప్రవైటు ప్రాక్టీసు ఎక్కువ. అందువల్ల సాధారణంగా ఎవరూ నర్సింగ్ హోం ను వదలరు.
కులభూషణ్ హౌస్ సర్జన్ గా ఉండగా ఏడుకొండలతడ్ని కలుసుకుని తన నర్సింగ్ హోం లో చేరమన్నప్పుడంతా అది అతడి అదృష్టమన్నారు.
అతడి డాక్టరు జీవితం ఆ నర్సింగ్ హోం లోనే ప్రారంభమయింది. అతడి శ్రద్దా సక్తులు గమనించి అక్కడే పరిశోధనలు కూడా ఏర్పాటు చేశాడు ఏడుకొండలు.
ఏడుకొండలు తరచుగా కులభూషణ్ ని అతడి పరిశోధనల గురించి అడిగి తెలుసుకుని ప్రోత్సహిస్తుండేవాడు.
"మీ ప్రోత్సాహం నాకు చాలా విలువైనది. అదే లేకుంటే ఈ పరిశోధనలు గురించి నేను విదేశాలు పోవలసి ఉండేది" అన్నాడు కులభూషణ్ ఒకసారి.
ఏడుకొండలు నిట్టూర్చి -- "విదేశాల్లో పరిశోధనలు మన దేశ వాసులకు సాయపడవు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఎలాంటి జబ్బు లోస్తున్నాయో చూసి ఇక్కడే పరిశోధనలు గావించాలి ' అన్నాడు.
ఆయనకు -- ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉండేవారు.
అన్న క్యాన్సరు తో పోయాడు. చెల్లెలు ధనుర్వాతంతో పోయింది. తమ్ముళ్ళు ఇద్దరూ తీవ్రమైన యాక్సిడెంటు గురై సమయానికి సరైన వైద్య సహాయమందక మరణించారు. పెళ్ళి చేసుకుంటే భార్యకు బ్లడ్ క్యాన్సర్.
ఏడుకొండలికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. అయన తన తెలివితేటలతో వ్యాపారంలో బాగా రాణించాడు.
ఎంత సంపాదించి ఏం లాభం?
నలభై ఏళ్ళ వయసుకాయనకు నా వాళ్ళంటూ ఎవరూ మిగల్లేదు.
అయన మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.
గులాబీ నర్సింగ్ హోం పెట్టాడు.
