Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 19


    "మన వాడికి లేరూ!" అంటూ రెండు వేళ్ళు చూపించాడు.
    "మీరు చిన్నగా ఉన్నారు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలా. అప్పుడే పెళ్ళి చేసుకొన్నారేం?" అన్నాడు.
    "పది అన్నారు కాదు!"            
    "మన వాళ్ళు ఆరు గజాల చీరలు కట్టి వయస్సు పెంచుకొంటారు. మీరే స్కర్టు, బ్లౌజు వేసుకొంటే ..."
    అంతలో పనివాడు టీ పట్టుకొచ్చాడు.    
    టీ అందుకొని వీణకు ఇచ్చాడు. అంతసేపూ సిగరెట్ తాగుతూనే ఉన్నాడు. సిగరెట్, టీ మార్చి మార్చి తాగాడు.        బయట కారు హారన్ వినిపించింది.
    పైకి లేస్తూ, "అందరూ వెళ్ళుతున్నారు. మీ రొకసారి రండి మా ఇంటికి. నమస్తే!" అన్నాడు
    పైకి లేస్తూ, "నమస్తే!" అంది.
    "వ్వాట్! పెళ్ళికి ముందే మనవాడు..... వాడలాంటి పని చేస్తాడని నా కెప్పుడో తెలుసు!"
    వీణ చూపులు కిందికి వాలాయి.
    "పూర్ చైల్డ్! ఐ పిటీ యు! బై!" అంటూ తిరిగి చూసుకొంటూ వెళ్ళాడు.
    మళ్ళీ హారన్ వినిపించింది.
    లా కిటికీలోనుండి తోటలోకి చూసింది. రాజీవ్ ఒక అమ్మాయితో తోటలోనుండి వస్తున్నాడు.
    పెద్ద సిగ, పొడుగ్గా ఇంచుమించు రాజీవ్ అంత ఉంది ఆ అమ్మాయి. చక్కని ఎయిర్ హోస్టెస్ లా నడుస్తూ ఉంది.
    ఆ అమ్మాయి పక్క ఠీవిగా ఉన్నాడు రాజీవ్.
    అతను ప్రతి ఒక అమ్మాయిని ఆకర్షిస్తాడు! తను...?
    ఆ రోజునుంచి సుందర్ తరుచుగా వస్తూ వీణతో ఎక్కువ సేపు మాట్లాడుతూ నవ్విస్తూ ఉన్నాడు.
    చాలా రోజులకు నవ్వుతున్నది వీణ. తనతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు! సుందర్ రాక కాస్త రిలీఫ్ ఇచ్చింది వీణకు.
    ఒక్కసారి లక్ష్మి వీణ దగ్గరకు వచ్చి, "వీణా! ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్ళి రాకూడదా?" అంది.
    మూగ వహించిన వీణతో, "చూడమ్మా! బాబు సరిగ్గా ఇంటికే రావటం లేదు. అయిపోయినదానికి ఈ పగ దేనికి?పంతాలు, పట్టింపులతో బంగారు కాలం దాటిపోతే మరి రాదు! వాడు పసివాడితో సమానం. వాడు పరాయి వాడిలా ఇంటికి దూరం అయిపోయాడు. ఈ ఇంటిని కళకళలాడేలా నీవే చేయగలవు. మా తప్పులు క్షమించమ్మా!" అంటూ వీణ రెండు చేతులు అంది పుచ్చుకొంది.
    "అమ్మా!"
    ఇద్దరూ ఉలిక్కిపడ్డారు రాజీవ్ పిలుపుతో.
    కన్నీటిని దాచుకోవాలని చూచింది లక్ష్మి.
    "ఈ ఇంటికి పరయిదాన్ని నేను. మీకు భారం అని తెలుసు- నేను ఇక్కడ ఉండక తప్పదు మరి. ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాను. మీరు దిగులు పడవద్దు" అంటూ వెనక్కి తిరిగింది వీణ.
    "వీణా! తప్పుగా అర్ధం చేసుకొంటున్నావు. నిన్ను ఎవరు వెళ్ళమంటారు!" అంది లక్ష్మి.
    "అమ్మా!" లక్ష్మి భుజంమీద చేతులు వేసి ఆమె గదిలోకి తీసుకొని వెళ్ళాడు రాజీవ్.
    ఆ సాయంత్రం తోటలోనుంచి వచ్చిన వీణకు బల్లమీద టానిక్సు, 'గర్భిణీ స్త్రీ తీసుకోవలసిన జాగ్రత్తలు' అనే పుస్తకం కనిపించాయి. విసిరి కొట్టింది బయటికి.
    వీణ మనస్సు పరిపరి విధాల పరిభ్రమిస్తూ ఉంది.
    ఈ జీవితం ఇక చాలు అనుకొంది. డెలివరీలో ప్రాణం పోకూదదా? అప్పు డెవరికీ బాధ ఉండదు. విధిని తిట్టుకొంటారు. నాన్నమ్మ భర్తను, కొడుకుని పోగొట్టుకొన్నట్లే నన్ను పోగొట్టుకొన్నా ననుకొంటుంది. నాగలక్ష్మిని చూచి చాలా రోజులయింది. రాజీవ్ అంటే నాగలక్ష్మికి ఎంతో ప్రేమ ఉన్నట్లుంది. ఆపేక్షగా చూస్తూ ఉండింది వచ్చేముందు.
    కింద నవ్వులు వినిపించాయి. సుందర్ వచ్చాడులా ఉంది. అందరినీ నవ్విస్తూ ఖుషీగా ఉంటాడు.
    సుందర్ చెల్లెలు రజనీకూడా వస్తుంది. రాజీవ్ తో కబుర్లు వేస్తుంది. రాజీవ్ ఎప్పటికైనా తన వాడే నన్నట్లు ప్రవర్తిస్తుంటుంది. తను వెళ్ళిపోయాక రాజీవ్ ని పెళ్ళి చేసుకుంటుంది. అలా అనుకొంటే మనస్సెందుకో కలుక్కుమంది.
    ఈ ఇల్లు, ఈ తోట- ప్రతి వస్తువు అలవాటయ్యాయి. ఈ కొద్ది రోజులకే ఏదో బంధం ఏర్పడింది. యువరాజ్ తో ఆటలు...
    జ్వరం వచ్చినట్లు ఒళ్లంతా నొప్పులు. కింద బీరువాలో ఏదైనా మాత్ర దొరకక పోతుందా అనుకోని మెట్లమీదకు వచ్చింది.
    పోస్టు మన్ ఇచ్చిపోయిన టెలిగ్రామ్ అందుకొని సుందర్ ఏదో జోక్ వేస్తూ విప్పాడు.
    "నాగలక్ష్మి డైడ్!?" అని బిగ్గరగా చదివాడు.
    "అమ్మా!" గావుకేక పెట్టింది వీణ. మొదటి సారిగా 'అమ్మా' అంటూ పిలిచింది నాగలక్ష్మిని.
    మెట్లపైన ఉన్న వీణను చూచి రాజీవ్ వీణను చేరుకొన్నాడు. ఆ క్షణంలో తూలిపోతున్న వీణకు ఆసరాగా నిలుచున్నాడు.
    రాజీవ్ భుజంపై వాలి, "అమ్మా! అమ్మా!" అంటూ విలపించింది వీణ.
    అంతవరకూ నవ్విస్తున్న సుందర్ వెళ్ళిపోయాడు.

                                 *    *    *

    పసుపు కుంకుమలతో చివరి ప్రయాణానికి సిద్దం చేశారు నాగలక్ష్మిని.
    ప్రాణం పోయాక ఆ ఇంటి గడప దాటింది నాగలక్ష్మి. అప్పుడు చూశారు ఆ గ్రామంలోని వారు.
    కొడుకు చావుకు తట్టుకోగలిగిన ఓంకారి నాగలక్ష్మి చావుతో శక్తిని కోల్పోయినట్లయి స్పృహ తప్పి పడి పోయింది. నాగలక్ష్మిని దహనస్థలానికి తీసుకెళ్ళాడు సహదేవ్.
    వెళ్ళిపోతున్న నాగలక్ష్మిని చూచి, "అమ్మా!" అంది వీణ.
    శరీరం అంతా కదిలిపోయింది. కడుపులోనుంచి రక్తం చిమ్మినట్లైంది. దుస్తులంతా రక్తమయం. దుఃఖంలో తన కేమి జరిగిందో తెలుసుకోలేని స్థితిలో ఉంది వీణ. వీణను ఎత్తుకొని గదిలో చేర్చాడు రాజీవ్.
    చచ్చినవాళ్ళ కోసం కాలం ఆగదు. ఆగని కాలంతో బ్రతికి ఉన్నవాళ్ళు నడవవలసిందే. నాగలక్ష్మి వెళ్ళిన రోజే కృష్ణారావు ఇంటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళి పోయాడు. సహదేవ్ తన నివాసం ఆ ఇంటికి మార్చుకొన్నాడు. రాజీవ్ వెళ్ళిపోయాడు. సెలవు లేదు. హౌస్ సర్జన్సీ ముగించుకోవాలి. విదేశాలకు వెళ్ళాలను కొంటున్నాడు. ఏదో పరీక్ష కూడా పాస్ అయ్యాడు. ఇవన్నీ సహదేవ్ మాటల్లో అంటే తెలిసింది వీణకు.
    "నీవు వెళ్ళమ్మా! టికెట్ నేను కొని ఇస్తాను" అన్నాడు.
    అబార్షన్ అయిన తరవాత రాజీవ్ ముఖం చూడలేక పోయింది. మునుపటి వీణలా ఉంది. చచ్చిపోయిన అమ్మమీద కంటే దూరం అయిన రాజీవ్ మీదకు మాటిమాటికి మనస్సు పోతున్నది.
    తను విసిరికొట్టిన అతని భుజమే తను ఏడవడాని కుపయోగించింది. సుందర్ తో కబుర్లాడింది, నవ్వింది. తోటలో షికార్లు చేసింది, చేసుకొన్న భర్తను వదిలేసి, తను కష్టంలో ఉన్నా, "సుందర్ ఏమయ్యాడు? అందరూ కారు వద్దు అంటూ ఉన్నా, నిమిషంకూడా వ్యర్ధం చేయకుండా కడసారి చూపు అందుకో నిచ్చాడు. అందరిలో అవమానించింది. కాని, ఎప్పటి కప్పుడు ఆదుకొంటూనే ఉన్నాడు రాజీవ్! అతన్ని చిత్రించుకోసాగింది మనస్సులో.

                                 *    *    *

    సినిమానుంచి వచ్చాడు రజనీ, రాజీవ్ లు. జానకీదేవి దగ్గర ఉండి భోజనం వడ్డిస్తున్నది. భోజనాలు అయ్యాక తన గదికి వస్తున్న రాజీవ్ తో వచ్చింది రజనీ. మెట్లమీదనే ఆగి గుడ్ నైట్ చెప్పాడు రజనీకి.
    కళ్ళలో కళ్ళు ఉంచి, "గుడ్ నైట్, రాజ్!" అంది.
    వీరి స్నేహానికి జానకీదేవి ప్రోత్సాహముంది. రోజూ రజనీని ఫోను చేసి రప్పిస్తూ కొడుక్కి దగ్గర చేయాలని చూస్తున్నది.
    గదిలోకి వచ్చి లైటు వేస్తూ, 'ఇప్పుడు వాళ్ళ ఊరిలో వీణ ఏమి చేస్తుంటుందో' అనుకొన్నాడు.
    ఎప్పటిలా తన గదిలో ఆ పడకమీద పడుకొని ఉంది వీణ. శ్వాసను బట్టి నిద్ర పోతున్నదని తలచాడు.
    తన రాక అతనిలో ఏ మార్పును తెస్తుందో చూడాలని ఆశించిన వీణ ప్రయాణపు బడలికతో, ఇన్ని రోజులు కరవైన నిద్రలో మునిగిపోయింది.
    తలుపు వేసి వీణ వైపే కళ్ళార్పకుండా చూశాడు రాజీవ్. వీణ తనది. కాని, తాకేతాహత్తు కోల్పోయాడు. అల ఎందుకు జరగాలి? వీణ ఇంకా పసిదే! కోపాన్ని, ద్వేషాన్ని, దుఃఖాన్ని-ఏదీ దాచుకోలేదు. అతని డాక్టరు కళ్ళకి ఎనీమిక్ గా కనిపించింది.
    ఆదమరిచిన నిద్రలో పైట తొలగి ఉంది.
    ఆమె పడకలో పడుకోవాలనిపించింది ఆ క్షణం!
    ప్రాచీన కవులు వర్ణించిన విధంగా ఉంది తన ప్రియమైన వీణ. నాలుగు భాగాలు తెల్లగా ఉన్నాయి. ఆమె ఒంటి రంగు, కళ్ళు, పళ్ళు, కాళ్ళు! శరీరంలో మరి నాలుగు భాగాలు నలుపు-పొడుగాటి కేశములు, కనుబొమ్మలు, కనురెప్పలు, కంటిపాప, పెదాలు, జిహ్వ, చిగురు, చెక్కిలి-ఆ నాలుగు భాగాలు ఎరుపు.
    విశాలమైనవి నాలుగు భాగాలు. కళ్ళు, వక్షఃస్థలము, ఫలభాగం, కటివలయం. గుండ్రమైనవి నాలుగు భాగాలు. అవి తల, మెడ, చేయి, కాళ్ళు. మందంగా ఉండేవి నాలుగు- వీపు క్రింది భాగము, తొడలు, పిక్కలు, మోకాళ్ళు. సున్నితమైనవి మరోనాలుగు- కనుబొమ్మలు, ముక్కు, అధరాలు, వేళ్ళు. మరి నాలుగు చిన్నవి- చెవులు, చేతులు, పాదాలు, రొమ్ములు. ముఫ్ఫై రెండు సుగుణాలతో ఏ వంకా లేని ఈ స్త్రీ కోరిక కలిగించదూ!
    పక్కకి వెళ్ళి నిలుచున్నాడు.
    తను ప్రేమించే ఈ అందమైన వీణ మనస్సులో తన మీద అసహ్యం, పగ రగుల్కొంటున్నాయి. సన్నగా కదిలే ఆ పెదాలు "ఐ హేట్ యు" అన్నట్లుగా ఫీల్ అయి ఒక్క అడుగు వెనక్కి వేసి, ఒక్క అంగలో వెళ్ళి తన డబుల్ కాట్ మీద వాలిపోయాడు. లైటు ఆర్పటానికి ధైర్యం చాలలేదు రాజీవ్ కి.

                              *    *    *

    తూర్పు తెల్లబడింది. స్నానం చేసి దుస్తులు వేసుకొని బూటు లేసుముడి వేసుకొంటూ మరోసారి వీణ వైపు చూశాడు. ఆమె అతనినే ఎంతోసేపట్నుంచీ చూస్తూ ఉంది. అతనిలోని ప్రతి కదలిక ఆమెలో ఏవో కొత్త భావాలు కలగజేస్తున్నాయి.
    రెప్పలు వాల్చింది.
    వెళ్ళిపోతూ మరోసారి చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS