Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 18

 

    జీవకోటి నిద్రపోయేవేళ- ఓంకారికి నిద్రపట్టక సిక్స్త్స్ సెన్స్ ప్రేరేపణతో మెల్లిగా మెట్లెక్కి పైకి వెళ్ళి వీణ గదిముందు నిలుచుంది. ప్రకృతి మౌనం వహించినట్లు ఆ గదికూడా మూగబోయింది. కాని, లైటు వెలుగుతూనే ఉంది. అమ్మలు జీవితం వంకరగా నడవకూడదు. చిక్కుపడిన నూలును అక్కడికక్కడే తెంపి వేసుకోక సరి చేసుకోవలసిందే. విధికి లొంగిపోకూడదు.
    "అమ్మలూ!" అతి మెల్లిగా పిలిచింది.
    నేలమీద పడుకున్న వీణ ఉలిక్కిపడి లేచింది. తలుపుతీసి నాన్నమ్మను చూసి ఆత్రతగా, "నాన్నమ్మా!" అంది.
    వీణ చేతిని తీసుకుని నిమురుతూ, "తల్లీ! నీవు కళకళలాడుతూ కలకాలం వర్ధిల్లాలి! నీవు సంతోషంగా ఉన్నావు కదా, తల్లీ!" అంది. ఆమె గొంతులో ఏదో అపనమ్మకం!
    అలాగే నాన్నమ్మను చూచిన వీణ ఆ క్షణంలో ఏదో నిశ్చయానికి వచ్చి తన అందమైన నవ్వు ప్రదర్శిస్తూ మెడను కావలించుకొని ఉధృతంగా వస్తున్న ఏడ్పును అరికట్టుతూ, "పిచ్చినాన్నమ్మా! నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను అదృష్టవంతురాలను. నిజం! నీ లాటి నాన్నమ్మ ఉంది. రాజీవ్ కు నే నంటే ఎంతో ప్రేమ! అక్కడ జానకీదేవి, బాలాజీగారు, లక్ష్మి, కుమార్, యువరాజ్-అందరూ మంచివాళ్ళే!" అంది.
    ఓంకారి నవ్వుతూ, "అమ్మలూ! నాగలక్ష్మిని పిలిచి నట్లు అందరినీ పేర్లు పెట్టి పిలవకూడదు. ఇంగ్లీష్ చదువులు చదివినా, మన హిందూ సంప్రదాయాన్ని మరువకూడదు. వారి వారి ధర్మాన్ని అనుసరించి భార్యా భర్త లిద్దరూ సమానులే! కాని, భర్త నీ కంటే అధికుడని తలంచి గౌరవించిన నాడే నీకు ఆత్మానందం కలుగుతుంది" అని తనను కౌగలించుకొన్న వీణనువిడదీస్తూ, "ఇక వెళ్ళు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన నాన్నమ్మను క్షమించు" అంది.
    "నాన్నమ్మా! నీ దగ్గర పడుకొంటాను" అన్న వీణను లోనికి పంపి తలుపు దగ్గరగా వేసి, తేలికైన మనస్సుతో తిరిగి వచ్చి నిద్ర పోయింది.
    అమ్మ, నాన్నమ్మలకు సందేహం కలగకుండానే ప్రవర్తించసాగింది వీణ.
    స్నానాల గదిలో కొత్త సోపు, ఇస్త్రీ టవల్ అన్నీ ఉంచింది. గిన్నెలో కుంకుడురసం తెచ్చి ఉంచింది. పనివాడితో గంగాళం నిండుగా వెచ్చని నీటితో నింపించింది. రాజీవ్ వస్తూండగా మెల్లిగా తప్పుకొంది వీణ.
    దైవకార్యం అంటూ మూడు రోజులు తల స్నానాలు తప్పలేదు.
    రాజీవ్ కి అన్ని పనులు చేయవలసి వచ్చేది. మరొకరికి పురమాయిస్తే ఓంకారి అడ్డు వచ్చి వీణతో స్వయంగా చేయించేది.
    తనకున్న కోపాన్ని ఓ మూలకు నెట్టింది వీణ.
    తన పనులు వీణ చేస్తూ ఉంటే కొత్తగా ఉంది రాజీవ్ కు.
    తలుపులు వేసుకొని గదిలో ఎవరంతట వారు ఏదో చదువుకొంటూ, ఎవరి ఆలోచనలో వారుండే వారు. కాఫీ టిఫిన్లు గదిలోకే తెస్తుంది వీణ.
    టిఫిన్ కొద్దిగా తింటే, "ఇంకాస్త తినండి! నాన్నమ్మ ఏమైనా అనుకొంటుంది" అంది.
    "నాన్నమ్మ కోపం తినాలనా! ఎందు కీ నటనలు? ఎందుకు చేయాలి?"
    "మీరు చేసిన తప్పుకు. రాజ్! మీకు భార్య ఉంటుంది, పేరుకు మాత్రమే! భార్యనుంచి కోరే ప్రేమ, మమతానురాగాలు మీకు అందవు! మీ స్వీట్ హోమ్ లో భార్యా పిల్లలు ఉండరు" అనాలనుకొంది కాని, "పిల్ల. ." మాట పూర్తిచేయలేక రెండు చేతుల్లో ముఖం దాచుకొంది. "నా కిష్టంలేని ఈ పాపాన్ని మోయలేను. ఎందుకలా చేశావు? నన్నెందు కిలా శిక్షిస్తున్నారు?" అంది.
    రాజీవ్ కిటికీ దగ్గరకు వెళ్ళి శూన్యంలోకి చూస్తూ నిలుచున్నాడు.
    అన్ని లాంఛనాలతో అత్తవారింటికి పంపారు వీణను. ఎంతెంతో సామాను మూతల్లోకి, పెట్టెల్లోకి సర్దుతూనే ఉంది ఓంకారి.
    "నాన్నమ్మా! ఇవన్నీ ఇప్పుడు వద్దు..." తల వంచుకుని, "రాజీవ్ కి .. .. ఓ! అయామ్ సారీ, నాన్నమ్మా! వారికి వేరేగా ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు తీసుకుని పోతాను. ప్రామిస్!" అంటూ చాలా చక్కగా నటించాను అనుకొంది ఓరగా రాజీవ్ ను చూస్తూ.
    నాగలక్ష్మి వీణ చేతిని రాజీవ్ చేతిలో ఉంచింది. ఓంకారి ఒక కవరు తెచ్చి వారి చేతుల్లో ఉంచింది. "మా కున్నదంతా నీకే ఇస్తున్నాము, బాబూ! లక్షలు కాకపోవచ్చు!" అంది.
    "క్షమించండి. కట్నంగా నే నేమి కోరుకోలేదు ఎన్నడూ. కట్నంకంటే మిన్న అయిన మీతో బాంధవ్యం కలిసింది. అదే చాలు" అంటూ వీణ చేతిలో ఉంచేశాడు.
    నవ్వుతూ చూస్తున్న సహదేవ్ దగ్గరకు వెళ్ళి, "అన్నయ్యా! నీది ఈ ఆస్తి! న్యాయంగా నీవే తీసుకోవాలి" అంది వీణ.
    వీణ మాటలకు అప్రతిభులై నిలుచుండిపోయారు నాగలక్ష్మి, ఓంకారీలు.
    "అత్తమ్మా! అమ్మలు చెప్పింది నిజం." కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతుండగా అంది నాగలక్ష్మి.
    సహదేవ్-"చెల్లెమ్మా!" అని ఆర్ద్రంగా అంటూ వీణ తలను హృదయానికి చేర్చుకొన్నాడు. ఆనందాశ్రువులను తుడుచుకొని ఆ పత్రాన్ని రాజీవ్ చేతిలో ఉంచాడు.
    "మళ్ళీ నాకే ఇస్తున్నారు." నవ్వుతూ ఓంకారి చేతుల్లో ఉంచి, "అవసరమైనప్పుడు మీ అమ్మాయికే ఇవ్వండి. ప్రస్తుతం మీ దగ్గరే ఉంచండి" అన్నాడు రాజీవ్.
    రాజీవ్, వీణలతో సహదేవ్ కూడా వచ్చాడు. సామాను సర్దుకోవటంలో వీణకు సహాయం చేస్తున్న సహదేవ్ ఒక పాకెట్ తీసి, "సోఫియా ఎవరు? నాన్నమ్మ ఇది ఇవ్వమంది" అన్నాడు.
    "అన్నయ్యా! దానితో నీవు మాట్లాడకూడదు. అదొక బ్లాక్ డెవిల్. అది ఎక్కడ ఉందో ఏమో! జుబేదాకు ఇవ్వు. దానికి చేరుస్తుంది" అంది వీణ.
    వారి సంభాషణ లోనికి వస్తున్న రాజీవ్ విన్నాడు.

                                *    *    *

    రాజీవ్ పెళ్ళికి గృహంలో చెలరేగిన ఉత్సాహావేశ ఆవేదనలు చల్లారి కాలంతో మామూలు మార్గంలో పడింది వారి జీవితం. వీణ రాక ఆ ఇంటిలో ఏ మార్పునూ కలిగించలేదు.
    జానకీదేవి గృహయాజమాన్యం- బంధుమిత్రులను ఆహ్వానించటం, సాగనంపటంతో ఆమె కేమీ తీరిక దొరికేది కాదు.
    లక్ష్మి గదినుండి బయటికి రావడం బహు అరుదు. పూజానంతరం దినంలో ఎప్పుడో ఒకసారి బయటికి వస్తుంది. కానీ, ఇంటిలో ఏ మూల ఏమి జరుగుతుందో ఆమెకు తెలుసు.
    వీణ, రాజీవ్ లు ఒక్క గదిలోనే కాలం గడుపుతున్నారు.
    ఏ రాత్రికి వచ్చి పడుకొంటాడో వీణకే తెలియదు. తన పడక కిటికీ దగ్గరనే ఉంటుంది.
    వీణ పడుకొని తోటలో కదలాడే ఆకుల వంక చూస్తూ ఉంది. సరిగ్గా కాలేజీకి వెళ్ళక నాలుగు నెలలైంది. రోజు రోజుకు పెరుగుతున్న కడుపు వంక చూచుకోను భయం వేసేది. మరలా కాలేజీకి పోవాలి. ఎప్పుడు పోవాలనేది ప్రశ్న.
    దుప్పటిని పట్టి ఎవ్వరో లాగినట్లైంది. తిరిగి చూచింది. తల దగ్గర యువరాజ్ ఉన్నాడు. అలాగే చెవులు పట్టి పక్కకి లాగింది. వాడి నోట్లో బాలు ఉంది. అంటే ఆడటానికి వచ్చాడన్నమాట!
    ముందు ఒకరంటే ఒకరికి పడేది కాదు. వీణ ఎక్కడ ఉన్నా కళ్ళతో వెంటాడేది యువరాజ్. తన నెవరో చూస్తున్నారనిపించేది. అటు ఇటు తిరిగి చూస్తే యువరాజ్! దాని నిశితబుద్ధికి నవ్వుకొనేది. కాని, జంతువులమీద ఉండే సహజ మమకారంతో యువరాజ్ ని దగ్గరకు తీసింది. తను ముద్దు చేయటం కోసమే చూస్తున్న వాడిలా దగ్గరకు వచ్చి కుయ్, కుయ్ మన్నాడు. చిరకాలంలోనే మచ్చిక చేసింది యువరాజ్ ను. ఎవ్వరూ చూడకుండా ఆడుకొనేవారు. తోటంతా తిరిగి వచ్చేవారు. ఇదివరకు టైమ్ ప్రకారం ఆహారం అందేది. కాని, ఇప్పుడు వీణ చిరుతిండ్లు అలవాటయ్యాయి వాడికి.
    వీరి స్నేహం రాజీవ్ కి తెలియదు.
    మూల మూలకు బాలును వేస్తే ఒక్క పరుగున తెచ్చి ఇస్తూ ఉంది యువరాజ్.
    వాడిని దగ్గరకు తీసుకుని తలమీద ముద్దు పెట్టుకొని, "ఇక ఫో!" అంది.
    పోనని మొండికేశాడు.
    చిన్న కర్ర తీసుకొని, "ఫోరా! వెధవా!" అని తరిమి వేసి తలుపులు మూస్తూండగా రాజీవ్ వచ్చాడు.
    యువరాజ్ దీనంగా రాజీవ్ వైపు చూడటం చూసి బాదేసింది రాజీవ్ కి. బుజ్జగించి పంపేశాడు.     
    'నిజంగా తాను కొట్టిందనే తలచా'డని వీణ అనుకొంది. 'అలాగే అనుకోవాలి' అనుకొంది.
    "మామయ్య.... మినిస్టరు మామయ్యా వాళ్ళంతా వచ్చారు. నిన్ను రమ్మంటున్నారు" అని చెప్పి వెళ్ళాడు రాజీవ్.
    మెట్లమీదకు వచ్చింది. కింద నవ్వులు వినిపిస్తున్నాయి. పోవటానికి మనస్కరించ లేదు. అందులో రాజీవ్ చెప్పాడు. తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది.
    మరి పదిహేను నిమిషాలకి వచ్చాడు రాజీవ్. కుర్చీలో కూర్చుని ఉంది.    
    "అమ్మ పిలుస్తున్నది. రా!" అన్నాడు, తలుపు దగ్గరే ఉండి.
    "నేను రాను."
    "వీణా! ?" కాస్సేపు అలాగే నిలుచుని వెళ్ళి పోయాడు రాజీవ్.
    మరి కాస్సేపటికి తలుపు మీద నాజూకుగా చప్పుడు చేసి, వెనువెంటనే లోనికి వచ్చాడో యువకుడు.
    పరిచయస్తుడిలా నవ్వుతూ వీణ కెదురుగా కుర్చీ లాక్కొని కూర్చుంటూ, "యూ ఆర్ మిసెస్ రాజీవ్!" అన్నాడు.
    "వీణ" అని పలికింది.    
    "మీరు ఇంత అందంగా ఉంటారనుకోలేదు. తెలుసుంటే పెళ్ళికి ముందే మీ పరిచయం కలిగించు కొనేవాడిని." ఎంతో కలుపుగోలుగా మాట్లాడేస్తున్నాడు.
    సిగ్గుగా నవ్వింది.
    "ఎంత స్వీట్ గా నవ్వుతున్నారండి!"
    తన అందాన్ని ఇంత బాహాటంగా ఎవరూ పొగడలేదు. ధైర్యంగా చెప్పనూ లేదు.
    "మీరూ?"
    "నేనూ....అహహ! మీ అందంలో పడి నన్ను నేను మరిచిపోయాను. మినిస్టరు మామయ్య కొడుకుని. పేరు సుందర్. యూనివర్శిటీవాళ్ళు ఇచ్చిన డిగ్రీ పుచ్చుకొని బయటికి వచ్చి, పెద్దలు సంపాదించింది, ఇప్పుడు మా నాన్న సంపాదిస్తున్నది ఎలా ఖర్చు చేస్తే బాగుంటుందో ఎక్స్ పెరిమెంట్సు చేస్తున్నా....నాకో అక్క, ఒక చెల్లి, ఒక్క అమ్మ ఉన్నారు."
    పకపక నవ్వుతూ, "ఎంతమంది అమ్మలు ఉంటారేం?" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS