ఇద్దరి చూపులు కలుసుకొన్నాయి క్షణం!
అతను వెళ్ళిపోయాడు.
"ఏదైనా పలకరించకూడదా?' అనుకొంది.
అతని ఫోటో వంక చూసింది.
చిత్రం! తను ప్రేమలో పడింది. తన భర్తనే ప్రేమిస్తున్నది.
స్నానం చేసింది. రెండు జడలు వేసింది. పిరుదుల క్రిందకు వచ్చాయి. మరికాస్త పెరిగాయి జడలు అనుకొంది. గులాబీరంగు జార్జెట్ చీర, అదే రంగు బ్లౌజ్ వేసుకొంది. ఒక చేతినిండా బంగారు గాజులు వేసుకొని, మరో చేతికి వాచీ పెట్టింది.
చాలా రోజులకు వచ్చిన వీణను చూడకూడదనుకొంటూనే చాలా సార్లు చూచింది జానకీదేవి.
చాటుగా వెళ్ళి యువరాజ్ ను ముద్దు చేసింది. పైన పడబోతే, "ఏయ్! చీర పాడవుతుంది. దూరంగా ఉండు" అని చెప్పింది.
"కాలేజీదాక వెళ్ళి వస్తా"నని బయలుదేరింది.
గేటు దాటింది. చల్లని గాలి నిండుగా పీల్చుకొంది. కాలేజీదాక ఎలా పోవటం? కారు మామగారు వేసుకెళ్ళారు.
రోడ్డుమీద ఏ రిక్షా అయినా దొరక్కపోదా అని రోడ్డు మీదకు వచ్చింది. సుందర్ కారు తెచ్చి ఎదురుగా ఆపాడు, కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.
"రంభ, ఊర్వశి, తిలోత్తమలను చూడలేదు. కాని, వాళ్ళు నీ కంటే అందంగా ఉంటారంటే ఒప్పుకోను" అన్నాడు.
అతను పొగుడుతూ ఉంటే ఈ రోజు వెగటుగా ఉంది.
"ఎక్కడికీ ప్రయాణం?" అన్నాడు.
"కాలేజీకి వెళదామని."
"నిన్ను దింపే భాగ్యం కలిగించు" అంటూ డోర్ తెరిచాడు.
ఎక్కి కూర్చుంది.
"వీణా!"
ఉలిక్కిపడింది ఆ గొంతులోని మార్పుకి.
"ఎక్కడికో ఏకాంతంలోకి ఎగిరిపోవాలని ఉంది."
నిజంగానే ఎక్కడికైనా తీసుకుని వెళతాడేమోనని భయం వేసింది వీణకు. నవ్వుతూ, "ముందు కాలేజీకి" అంది.
కాలేజీ ఆవరణంలోకి కారు వచ్చింది.
"థాంక్స్! మీరు వెళ్ళిపోండి. ఎంతసేపు అవుతుందో ఏమో!" అంది.
"మళ్ళీ వస్తా గంటలో" అని వెళ్ళిపోయాడు.
క్లోక్ రూము దగ్గర జుబేదాను కలుసుకొంది. క్లాసుమేట్సు పలకరించారు.
జుబేదా, వీణలు ఒకరి నొకరు ఆప్యాయంగా చూచుకొన్నారు. జుబేదా నాగలక్ష్మి గురించి అడగలేదు.
"కాలేజీలో చేరదామని వచ్చాను" అంది వీణ.
"నిజంగా? సంతోషంగా ఉంది. హాస్టల్ కి వచ్చేస్తావా?"
వెంటనే జవాబు చెప్పలేకపోయింది. "అతడి పెర్మిషన్ కావాలేమో!" వ్యంగ్యంగా అంది వీణ.
"నీకు అబార్షన్ అయింది కదూ? సోఫీ అదొక సంతోషవార్తలా చెప్పింది."
"ఎక్కడ ఉంది?"
"కొన్ని రోజులుగా కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్లిందో ఏమో!"
"జగదీష్ ఏమంటున్నాడు?"
"వస్తానని వ్రాశారు."
"అక్కడికి తీసుకొని వస్తావా?"
'అలాగే' అన్నట్లు తల ఊపింది జుబేదా.
ప్రిన్సిపాల్ ని వెళ్ళి కలుసుకొన్నారు.
మరో నెల పోతే జూనియర్ బాచ్ వస్తుంది. వారితో కలుపుతాము అని చెప్పారు ప్రిన్సిపాల్.
ఆ రోజు జుబేదా గెస్ట్ గా ఉండి హాస్టల్లో భోజనం చేసి అయిదు గంటలకు హాస్టల్ నుంచి వచ్చింది.
రాజీవ్ స్కూటర్ లో వచ్చాడు. రాజీవ్ ని చూడగానే వీణ గుండె వేగంగా కొట్టుకొంది.
వీణతో, "వచ్చాడే నీ బాడీగార్డు" అంది జుబేదా.'
పైకి నవ్వినా, లోపల 'నా రక్షకుడు' అని తలచింది.
"నాన్నగారు ఇంకా రాలేదు" అన్నాడు.
అంటే, కారు లేదన్న మాట. స్కూటర్ వెనక కూర్చుంది. మొట్టమొదటిసారి స్కూటర్ మీద కూర్చోవటం. సీటును పట్టుకొంది. కాస్త స్పీడు ఎక్కించగానే భయానికి రాజీవ్ నడుము పట్టుకొంది. వీణలోకి విద్యుత్తు ప్రవహించి షాక్ కొట్టినట్లయింది. వీపుమీదకు వాలిపోయింది.
వీపుమీద మెత్తటి స్పర్శ తగిలినా, ఏ భావమూ కలగనీయక రాయిలా ఉండిపోయాడు రాజీవ్.
గమ్యం చేరుకొన్నాక స్కూటర్ ఆపాడు. వీపు మీద వీణ అలాగే ఉండిపోయింది.
"వీణా!" చిన్నగా పిలిచాడు.
జవాబు లేదు.
"దొరా!" అంటూ దగ్గరలో ఉన్న నౌకరుని పిలిచాడు. స్కూటర్ పట్టుకోమని చెప్పి వీపుమీద ఉన్న వీణను ముందుకు లాక్కొన్నాడు. ఫెయింట్ అయి ఉంది.
'మైగాడ్! ఎంత ఆపద తప్పిపోయింది. పడిపోయి ఉంటే!' అనుకొంటూ ఎత్తుకొన్నాడు. ఎగ్జిబిషన్ లో కంటే తేలికగా ఉంది. హాలులో ఎవ్వరూ లేరు. యువరాజ్ పలకరింపుగా అరిచింది.
'వీడి కింకా కోపమే వీణ అంటే' అనుకొంటూ గదిలోకి వెళ్ళి పడుకోబెట్టాడు.
లక్ష్మి పరుగున వచ్చింది.
"ఫెయింట్ అయింది. ఎనీమిక్ గా ఉంది" అంటూ వీళ్ళతో ముఖం తుడిచాడు.
వీణకి మెట్లమీదే తెలివి వచ్చినా, అలాగే ఉండి పోయింది. రాజీవ్ వీళ్ళతో ముఖం తుడవగానే కళ్ళు తెరవక తప్పలేదు.
ఫామిలీ డాక్టరుకి ఫోను చేశాడు రాజీవ్. అవతల డాక్టరు నవ్వుతూ, "హార్ట్, లంగ్స్ చూసి చెప్పు! ఇంకా నే నెందుకు?" అన్నాడు.
స్టెత్ తో పరీక్షిస్తున్న అతని ముఖంలోకి చూసింది వీణ. ఆ చూపు రాజీవ్ కి ఇబ్బంది కలిగించింది.
పొద్దున్నే మెలకువ వచ్చింది వీణకు. నిద్ర పోతున్న రాజీవ్ ని చూసింది. ఇక నెల రోజులే కాబోలు తాను ఇక్కడ ఉండేది. తరవాత కాలేజీ, హాస్టలు. తన కిక్కడ స్థానం లేదా? హక్కు లేదా? కాని, జానకీదేవి ఎప్పుడు వదలించుకొందామా అని చూస్తున్నది. రాజీవ్ మనస్సు ఇప్పుడెలా ఉందో? తన వలన ప్రయోజనం ఏముంది? రజని ప్రేమిస్తున్నది. రెండు చేతులతో అందుకోవాలని చూస్తున్నది. రజనితో తిరుగుతుంటే తనలో ఈర్ష్య కలుగుతున్నది.
వెళ్ళుతూ వెళ్ళుతూ రాజీవ్ ఐరన్ టాబ్లెట్స్, టానిక్ ఇచ్చి వెళ్ళాడు.
లక్ష్మికి తాను కాలేజీలో చేరమన్నట్లు చెప్పింది వీణ.
చదువు పూర్తి చేయటమే మంచిదని ఆమోదించింది ఆమె.
వెళ్ళిపోవటానికి రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఓ సాయంత్రం జగదీశ్, జుబేదాలు వచ్చారు.
జుబేదా ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. తోటలోకి తీసుకువెళ్ళారు.
టిఫిన్ ఇవ్వాలని వీణ లోపలికి వచ్చి ట్రేలో స్వీట్స్ సర్దింది. పనివాడు లేడని తెలిసిన రాజీవ్ డ్రింక్స్ పట్టుకొని వచ్చాడు.
తిరిగి వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పటికి ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోయి ఉన్నారు జుబేదా, జగదీష్ లు, అధరామృతం గ్రోలుతున్న వారి కన్నులు ప్రేమాతిశయంతో మూతలు పడి బయటి ప్రపంచాన్ని గుర్తించలేదు.
వెనక్కి వెనక్కి వచ్చి తిరిగి లోనికి వెళ్ళింది వీణ. ఈ దృశ్యం జుగుప్సను కలిగించలేదు. శరీరం సన్నగా వంక్తం మొదలుపెట్టింది. ఏమాత్రం ఉద్రిక్తతకు తట్టుకోలేకుండా ఉంది. మైకం వస్తున్నది. ట్రే బల్లమీద పెట్టి తనుకూడా బల్లమీదకు ఒరిగి పోయింది.
వీణనే గమనిస్తున్న రాజీవ్ తన చేతిలోని ట్రే బల్లమీద పెట్టి వీణను పట్టుకొన్నాడు.
అతని కౌగిలిలో కరిగిపోవాలని ఆ మైకంలో అనుకొంది.
"రాజీవ్!" అంటూ పలవరించింది.
"వీణ ఇంకా మానసికంగా బాధపడుతున్నది. తరుచూ ఫెయింట్ అయిపోతున్నది. తన స్పర్శతో మరీ కృంగి పోతుంది. హిస్టీరియా మొదలైంది. వీణకు దూరం అయిపోవాలి' అని ఆ క్షణం తలచాడు రాజీవ్!
ఆ మరుసటి మధ్యాహ్నం జానకీదేవి, రాజీవ్ స్నేహితుల పెళ్ళికి వెళ్ళారు.
లక్ష్మి పూజలో ఉంది. వీణ, యువరాజ్ లు తోట లోకి వెళ్ళారు. నీటి తొట్టెలో కాళ్ళు పెట్టి ఆడిస్తూ ఉంది వీణ, వీపుకు తగులుతున్నాడు యువరాజ్.
"రాజా! రెండ్రోజుల్లో నేను వెళ్ళిపోతున్నాగా! నన్ను మరిచిపోవు కదూ, యువరాజ్!" అంది.
వీపుమీది స్పర్శ మెడమీదకు వచ్చింది. మెడను నిమురుతున్న దో చెయ్యి. తిరిగి చూచింది.
"సుందర్!" అంది.
అతని కళ్ళు అరుణిమ దాల్చి చేతులు వణుకుతుండగా వీణను కిందకు వంచుతున్నాడు.
ఆశ్చర్యం నుంచి తేరుకొని ముందు పైకి వంగుతున్న అతణ్ణి వారిస్తూ లేచి నిలుచుంది.
వీణను బిగికౌగిలిలో ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు సుందర్. పొంచి ఉన్నాడు సమయం కోసం. అరిచినా పిలుపు అందదు.
బలంగా నెట్టివేస్తూ, "యువరాజ్!" అని అరిచింది.
ఏ మూలనుంచో పరుగున వచ్చింది. క్షణం సుందర్ వైపు చూచి ఉరికి చెయ్యి పట్టుకొంది. ఆ పట్టు విడిపించుకోవటం కష్టం! జేబులో చెయ్యి పెట్టి పిస్టల్ తీశాడు సుందర్. వీణ గబుక్కున ఆ చెయ్యి పట్టుకొంది.
"వద్దు, సుందర్! వద్దు! యువరాజ్! వెళ్ళు! వెళ్ళు" అంది గాభరాగా.
యువరాజ్ పోలేదు. పట్టు వదలలేదు.
సుందర్ భయానికి ట్రిగ్గర్ నొక్కాడు. పక్కకు లాగేసింది పిస్టల్ ను వీణ. కాని, గుండు యువరాజ్ కు తగిలింది. ఎగిరి నీళ్ళలో పడింది. నీళ్ళంతా రక్తమయం. అప్పుడే తిరిగి వచ్చిన రాజీవ్, జానకీదేవిలు పరుగున అరుస్తూ తోటలోకి వచ్చారు.
సుందర్ ఈలోగా చెయ్యి గట్టిగా పట్టుకొని మరో దారి గుండా పరిగెత్తి పోయాడు హాస్పిటల్ కి.
వీణ చేతిలో పిస్టలు! యువరాజ్ పడిపోతున్నాడు. ఆ దృశ్యాన్ని చూచిన రాజీవ్ మనస్సు విరిగి పోయింది. నీళ్ళలో పడిన యువరాజ్ ను ఎత్తుకొని పరుగు తీశాడు.
జానకీదేవి అరవటం మొదలు పెట్టింది- "నోరు లేని జంతువుని చంపావు. రేపు నన్ను, నా కొడుకుని చంపుతావు. పగ పట్టావు, తల్లీ, మా మీద, నీవు నా ఇంట్లో ఉండకు, ఫో!" అంటూ,
వీణ మెదడు స్తంభించి పోయింది. యువరాజ్ తన మూలంగా చనిపోయాడా? "యువరాజ్! రాజా!" అనుకొంటూ ఉన్న వీణకు జానకీదేవి మాటలు ఒక్కటీ వినిపించలేదు.
పిచ్చిగా పరుగెత్తి వస్తున్న వీణను చూచి రాజీవ్ కారులో ఉన్నవాడల్లా దిగి, వీణ కెదురుగా నిలుచుని, పిస్టల్ లాగేసుకొని చెంపమీద ఒక్క దెబ్బ వేశాడు కసిగా! చెంపను పట్టుకొని నిలుచుండిపోయింది.
యువరాజ్ ను హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు రాజీవ్. అదృష్టవశాత్తు గుండు తొడలోనుంచి దూసు కొని పోయింది. కట్టు కట్టించుకువచ్చాడు. యువరాజ్ కి ప్రమాదం తప్పిందని తెలిసి అందరూ గాలి పీల్చుకొన్నారు. వీణతో ఎవ్వరూ మాట్లాడలేదు. భోజనంకూడా పంపలేదు.
డ్రాయింగ్ రూము పక్క గదిలో యువరాజ్ ను పడుకోబెట్టారు. అప్పుడప్పుడూ మూలుగుతూనే ఉంది. డ్రాయింగ్ రూములో రాజీవ్ పడుకొన్నాడు ఆ రోజు. వీణకు యువరాజ్ ని చూడాలని ఉంది. మెల్లిగా దిగి వచ్చింది.
యువరాజ్ కూర్చుని ఉన్నాడు రొప్పుతూ.
దగ్గరగా వచ్చి "యువరాజ్!" అంది చెవిలో.
వీణను ముద్దు చేశాడు. యువరాజ్ ను బుజ్జగిస్తూ ఏడ్చింది. "నేను వెళ్ళిపోతాను" అంది.
పన్నెండు గంటల వేళలో డ్రాయింగ్ రూములోని ఫోను మోగింది. ఫోను ఎత్తాడు రాజీవ్. రజని కోపంగా అరుస్తున్నది. నిద్రలో అర్ధం కాలేదు మొదట. రజని వీణను నిందిస్తున్నది. "యువరాజ్ ను ఉసి కొల్పి సుందర్ ను కరిపించింది" అని, "అది నీ వైఫ్ కాదు, రాక్షసి" అని అంటున్నది రజని.
"యూ షటప్!" అని ఫోను పెట్టేశాడు. తల పట్టుకొని కూర్చున్నాడు. సుందర్ అక్కడ ఎందుకున్నాడు?
'వీణను అడగాలి' అనుకొని గదిలోకి వచ్చాడు. గదిలో వీణ లేదు. గుండె ఆగినట్లైంది. బైట్లన్నీ వేస్తూ, "వీణా! వీణా!"అని వెదకటం మొదలు పెట్టాడు. లక్ష్మి, బాలాజీగారు, జానకీ, పనివాళ్ళు- అందరూ లేచి గాభరాగా డ్రాయింగ్ రూములో చేరారు.
యువరాజ్ గదిలోకి తొంగి చూశారు బాలాజీగారు. లైటు వేశారు. యువరాజ్ పడకలో వీణ నిద్ర పోతున్నది. వీణకు కాపలా కాస్తున్నట్లు యువరాజ్ కూర్చుని ఉన్నాడు.
"చిన్నపిల్ల! జానకీ! నీవు కష్టపెట్టేస్తున్నావు ఆ అమ్మాయిని" అంటూ సానుభూతి చూపించారు బాలాజీగారు.
* * *
తన సామాను సర్దుకుంటూ ఉంది వీణ. రాజీవ్ ఆ గదిలోనే ఉన్నాడు. "వీణ హాస్టల్ కు వెళ్ళిపోతున్నది. తన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నది' అనుకొన్నాడు. ఎలా ఉంచాలో అర్ధం కాలేదు. 'కొన్ని రోజులు దూరంగా ఉండటమే మంచిది' అని తలచాడు.
