'రోజా! ఆగు.' ఎంతో సరళంగా ఉన్నాయి అతని మాటలు.
ప్రభాకరం మాటలలోని మృదుత్వానికి ఆశ్చర్యపడుతూఆగింది రోజా. ఆమె ఎంత ధైర్యంగా వున్నట్లు నటిస్తూ ఉన్నా ఆమె గుండెలు గుబ గుబ కొట్టుకుంటూనే వున్నాయి. ఆమె పరిస్థితిని గమనించిన ప్రభాకరం 'భయపడకు రోజా! నిన్నేమీ చెయ్యను. నీవు ఒక విధంగా నాకు మేలుచేశావు. నీవిలా ప్రవర్తించి నా కళ్ళు తెరిపిళ్ళు పడేట్లు చేశావు. మొదట్లో నీ అసభ్య ప్రవర్తన చూసిన నాకు నీ పీకనులిమెయ్యాలన్నంత కోపం వచ్చింది. కాని తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను.
అతని ముఖం నిర్మలంగా ఉంది. అతనిని చూసిన రోజా మనసు కుదుట పడింది.
'ప్రభాకర్? నన్ను మన్నించు.' తల దించుకొని అంది రోజా.
'నేనెంతటి వాణ్ణి....? ఆ భగవంతుడే నిన్ను క్షమించాలి. శలవు! బ్రతికి బాగుంటే మళ్ళీ కలుస్తాను.' అని క్లబ్బుకు విడిచి పిచ్చిగా ఎటో వెళ్ళి పోయాడు ప్రభాకరం.
* * *
క్లబ్బు వదిలి వెళ్ళిన ప్రభాకరం పిచ్చిపిచ్చిగా తిరిగి ట్యాంకుబండు చేరు కున్నాడు. అతను అక్కడికి చేరేసరికి నలువైపులా చీకట్లు ముసురుకున్నాయి. ఎక్కడగా జనం లేని చోట ఒక బెంచీపై కూర్చుని ఆలోచనలో పడ్డాడు. అతని చిన్నప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తుకు రాసాగాయి. 'దుడుకు తనం, కొంటెతనంతో నాన్నగారిని అమ్మను యింతకాలం హింసించాను. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల నుండి మంచి, మన్నన, పెద్ద వయసులో అండ దండలు కోరుకుంటారు. అనేవీ నేను యివ్వలేకపోగా నా ప్రవర్తనతో నేను వారిని హింసించాను మానసికంగా వారిని ఎన్నో చిత్రహింసలపాలు చేశాను. నేను క్షమార్హున్నికాను. నా శ్రేయస్సు, నా సత్ప్రవర్తన కోపం ఎంతో పరితపించిన శారదను నిర్దాక్షిణ్యంగా యింటి నుండి తరిమేశాను. పాపం ఎన్ని అవస్థలు పడుతుందోఏమో? ఆమెకు నేను ఎంతో అన్యాయం చేశాను. నానేరాన్ని తన నెత్తిన వేసుకుని మౌనంగా యిల్లు వదిలి వెళ్ళిపోయింది. పల్లెత్తి ఒక్క మాటైనా అనలేదు. శారదను రోజాతో పోల్చి చూస్తే పక్కకు నాగలోకానికి ఉన్నంతతేడా కనుపిస్తుంది, విచిత్రమైన మనుష్యులు. ఒకరు మరొకరి కోసం ఎటువంటి త్యాగాన్నైనా చేస్తారు. ఎన్నో అపనిందలు భరిస్తారు. తమ జీవితం నిరాధారంగా మారుతున్నా వెనుకంజ వేయరు. అటువంటి కోవకు చెందినది శారద. తాము చెడిపోతూ మరొకరిని బాగు చేయాలని ఉద్దేశపడడంలో త్యాగముంది. ఇతరులను చెడగొడుతూ తాము బాగుపడడంలో కనీసం స్వార్ధమైనా ఉంది. తాము చెడిపోతూ యితరులను చెడగొట్టడంలో ఏ ఉద్దేశ్యముందో నాకు తోచడం లేదు. ఆ కోవకు చెందినది రోజా. రోజా డబ్బున్న యువకులను తన వలలో వేసుకుంటూ తన నాశనానికి, ఆశ్రయించిన ఆ యువకుల పతనానికీ కారకురాలవు తూంది. ఆమె జీవితంలో నేను ఎన్నో వాడినో? నా తర్వాత ఎందరో? శలభము దీపశిఖలో పడి దీపాన్ని ఆర్పుతుంది. తనూ మరణిస్తుంది.
'పరీక్షలు నెలలోపే ఉన్నాయి. ఇక జాగ్రత్తగా చదువుతాను. నాన్నగారికిఅమ్మకు ఎటువంటి బాధా కలిగించను. పాపం నీరజ కూడా నా ధాటికి తట్టుకోలేకపోయింది. నేను ఎంతమందిని మానసికంగా బాధపెట్టాను. శారద, నీరజ లలో పోలికలున్నాయేమిటి? మళ్ళీ ఆ పోలికలు గుణాలలో లేవు. శారదెక్కడ? నీరజెక్కడ? ఆ అణకువ ఆ వినయ విధేయతలు, చదువుపై ఆ శ్రద్ధ నీరజ ఎన్ని జన్మలెత్తి మాత్రం పొందగలుగుతుంది? పాపం శారద చదువుతుందో లేదో? అమానుషంగా ప్రవర్తించి ఆమె భవిష్యత్తుకు అడ్డుగోడగా నిలిచాను. పట్టుదల గలది. ఎలాగైనా సాధిస్తుంది. స్కాలర్ షిప్ తో సగం ఖర్చులు వెళ్ళిపోతాయి. ఎంతైనా యిబ్బందే! చదువు మాని ఉద్యోగం చేస్తుందో ఏమో? శారదను తలచుకుంటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. తక్కువ అవకాశాలమధ్య యిబ్బంది పడుతూ ప్రతి సంవత్సరం డిస్టిన్ క్షన్ లో ప్యాసౌతూ ఉంది. ఎన్నో అవకాశాలున్న నేను వాటిని దుర్వినియోగపరుస్తూ చదవలేక, క్రమంగా ప్యాసవక నా తల్లిదండ్రులకు భారంగా తయారయ్యాను. నా నడవడి మార్చుకుంటాను. శారద ప్రవర్తనను ఆదర్శంగా తీసుకుంటాను.'
తన వాచీ చూసుకున్నాడు ప్రభాకరం. లేచి నెమ్మదిగా నడక సాగించాడు. అతను యిల్లు చేరేసరికి రాత్రి పది దాటింది. అన్నపూర్ణమ్మగారు అతనికోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆమెను చూసిన ప్రభాకరం గుండె చెరువైంది. ఎముకల గూడులా తయారైన ఆమె స్థితికి తనే కారణమని ఊహించుకొని ఎంతో బాధపడ్డాడు.
'అమ్మా....! నా కోసం యింతసేపు కాచుక్కూర్చున్నావా? నిన్ను ఎంత హింసిస్తున్నాను. ఆ పాపం ఊరికే పోదు. అంతకు నాలుగింతలు అనుభవిస్తాను.'
'బాబూ అటువంటి మాటలనకు. నీకోసం నేను కాచుక్కూర్చోకపోతే యింకెవరున్నారు? ఈ యిల్లు కోడలితో ఎప్పుడు కళకళలాడుతుందా అని ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నాను. నాయనా! నీతోటి వాళ్ళు చదువులు, వివాహాలు పూర్తిచేసుకొని ఎంతో కులాసాగా గడుపుతున్నారు. ఆ కుటుంబాలు నోచుకున్న సంతోషాన్ని మేము నోచుకోలేదా బాబూ?' కంట తడి పెట్టారు అన్నపూర్ణమ్మగారు.
'అమ్మా....! ఈ పాపిష్టివాడి కోసం కంటతడి పెడుతున్నావా? అందుకు నేను అర్హున్నికాను. మిమ్ములను హింసిస్తూ రాత్రింబవళ్ళు మీకు మనశ్శాంతి లేకుండా చేశాను. నా పాపాలకు నిష్కృతి లేదమ్మా!' కళ్ళు ధారలు కట్టి వర్షంలా కురిపిస్తున్నాయి. పశ్చాత్తాపంతో నిండిన ఆ ముఖం పవిత్రమైన కన్నీటితో తడిసిపోతూ ఉంది.
'బాబూ! ఏమిట్రా! ఈరోజు మా కష్టసుఖాలు నీకు గుర్తుకు వస్తున్నాయేమిటి? చాలు బాబూ .... ఈ మాత్రం మార్పైనా మాకుచాలు.' అని సగంతిని ఆపేసి అన్నాన్ని తినిపిస్తూ అతని తలను ప్రేమతో నిమరసాగారు అన్నపూర్ణమ్మగారు.
తను పనులు పూర్తి చేసుకొని పడుకోవడానికై వెడుతూ మంచినీళ్ళు త్రాగాలని వంటింట్లోకి వచ్చిన శ్రీపతి గారికంట ఈ దృశ్యం పడింది. ప్రభాకరంకోసం ఎదురుచూస్తూ ఆ వంటింట్లోనే ఎన్నిసార్లో నిద్రపోయే అన్నపూర్ణమ్మగారిని లేపి తీసుకువెళ్ళడం మామూలుగా జరుగుతూ ఉండేది. అటు వంటిది ఈరోజు ప్రభాకరం భోజనం చేస్తూ ఉండడం. తనభార్య తినిపిస్తూ ఉండడం; ఇద్దరికళ్ళూ తడితో చెమ్మగిలి ఉండడం శ్రీపతిగారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మంచినీళ్ళు త్రాగి విచారవదనంతో ప్రభాకరాన్ని చూస్తూ అతనిలో మార్పు రావాలని వేయి దేవుళ్ళను ప్రార్ధిస్తూ తన గదివైపు నడిచారు. వారలా విచారంతో నడిచివెళ్ళడం ప్రభాకరానికి ఎంతో బాధను కలిగించింది. మౌనంగా తన భోజనం ముగించి తన గదికి వెళ్ళి పోయాడు.
* * *
వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎండా కాలమంతా దినకరుని తీవ్రతకు తపించి పోయిన ప్రాణులన్నింటికీ హాయి చేకూరింది. ఆ సంవత్సరం వర్షాలు త్వరగా ప్రారంభమయ్యాయని అందరూ సంతోషపడుతున్నారు. పల్లెవాసులు పట్నవాసుల కన్న ద్విగుణీకృతమైన సంతోషంతో పొంగిపోతున్నారు. వారి జీవనాధారమే వర్షం కదా మరి!
ప్రభాకరం రిజల్స్టు వచ్చాయి. ప్యాసయ్యాడు. అతను ప్యాసవడం అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనితోపాటు మిగతా వారుకూడా ఆశ్చర్య పడవలసి వచ్చింది. మార్కులుగూడా మరీ అంతహీనంగా కాకుండా మధ్యరకంగావచ్చాయి. ప్రభాకరంలో వచ్చిన మార్పుకు శ్రీపతి గారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకొని నలుగురిలో తిరగ్గలుగుతున్నారు. ప్రభాకరం చదువుపై శ్రద్ద చూపగలుగుతున్నాడే గాని ఆ దుడుకుతనం, ఆవేశం తగ్గలేదు.
ఒకరోజు హాలులో కూర్చుని పేపరు చదువుకుంటున్న శ్రీపతిగారి వద్దకు వచ్చాడు ప్రభాకరం.
'నాన్నారూ! నాకిక్కడ చదువు కోవాలని లేదు-'
'ఏం జరిగింది బాబూ?' పత్రిక పై నుండి దృష్టి మళ్ళిస్తూ అన్నారు శ్రీపతిగారు.
'ఏం లేదు నాన్నారూ! పాతస్నేహాలు..." మాట పూర్తి చేయకలే పోయాడు.
శ్రీపతిగారు ఆలోచనలో పడ్డారు. 'అవును ... ప్రభాకరం యిక్కడ ఉండి చదువుకోవడం మంచిదికాదు. ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటే మంచి క్రమశిక్షణ అలవడుతుంది. హాస్టలు జీవితం క్రమబద్ధంగా కూడా ఉంటుంది.'
'నాకు బెనారస్ యూనివర్శిటీకి వెళ్ళి చదువుకోవాలని ఉత్సాహంగా ఉంది. మీరే మంటారు.'
ప్రభాకరం మాటలకు ఆలోచనలనుండి తేరుకొని 'అలాగే బాబూ! కాని నిన్ను వదిలిపెట్టి రెండు సంవత్సరాలు ఎలా గడపగలము? మంచో చెడో? నీవు మాకళ్ళముందుంటున్నావు. అంతే చాలు. నీ సత్ప్రవర్తన వల్ల ఈ కొద్ది కాలం లోనే అమ్మ ఎంతో కోలుకుంది. ఆమెకు వెనుకటి ఆరోగ్యం కలిగింది. ' సంతోషపడుతూ అన్నారు శ్రీపతిగారు,
'నాన్నగారూ! అజ్ఞానంతో యింత కాలం మిమ్ములను ఎంతో బాధపెట్టాను ఎలాగో ఈ రెండు సంవత్సరాలు వోపిక పట్టండి. అమ్మను ఒప్పించే బాధ్యత మీదే!' తప్పదన్నట్లు తండ్రిముఖంలోకి చూస్తూ తన పై వారికిగల అవ్యాజానురాగాలకి ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రభాకరం.
'అలాగే బాబూ.' కుమారునిలో క్రమంగా వస్తూన్న మార్పుకు ఆనందంతో పొంగిపోతూ అన్నారు శ్రీపతిగారు.
* * *
8
శాంత శారదలిద్దరూ వేసవి శలవు లలో యింటికి వెళ్ళివచ్చారు.
ఇద్దరూ ఫస్టుక్లాసులో ప్యాసయ్యారు. సత్సాంగత్యంవల్ల మసిబొగ్గైనా మాణిక్య మౌతుందనుకోవడానికి శాంత ఫస్టుక్లాసులో ప్యాసవడమే నిదర్శనం. నూటికి నలభైమార్కులకన్న ఎక్కువరాని శాంతకు అరవై మార్కులపైగా రావడంతో రామం సంతోషంతో పొంగిపోయాడు. శారద రాష్ట్ర మంతటికి ద్వితీయస్థానంతో ప్యాసైంది. శాంత కోరినడబ్బు యిచ్చి చదవబోయేది ఫైనలియరినీ, చాలా జాగ్రత్తగా చదవాలనీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ఉత్తరాలు వ్రాస్తూ ఉండాలనీ, యింకా ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించాడు రామం.
ఆరుమాసాలు గడిచిపోయాయి. క్రిస్మస్ సెలవులు మొదలయ్యాయి. శారదతో స్నేహం కలిసిన తర్వాత శాంత సినిమాలు చూడడం తగ్గించింది. శారద అసలే చూడదు. విలాసాలు, ఆడంబరాలు ఆమెకు అసలే గిట్టవు. శాంత అంతకుముందు వారానికి కనీసం ఒకటిరెండూ చూస్తూ ఉండేది. ఇప్పుడు అంత తరచుగా వెళ్ళడంలేదు. ఒకవేళ వెళ్ళినా శారదను అడిగి ఆమెను ఒప్పించి వెళ్ళవలసి వస్తుంది. శాంత శారదతో చెప్పకుండా ఏ చిన్నపనికూడా చేయడం లేదు. శారద అంతటి చనువు, అధికారం శాంతపై సంపాదించుకుంది. పైగా ఈసారి యింటినుండి వచ్చేటప్పుడు లక్ష్మయ్యగారు, రామం యిద్దరూ శాంతను జాగ్రత్తగా చూసే బాధ్యత శాంత సమక్షంలోనే శారదకు ఒప్పజెప్పారు. శాంత చిన్నబుచ్చుకోలేదు చిరునవ్వుతో శారద ముఖంలోకి చూసింది.
మంచి ఇంగ్లీషు పిక్చరేదైనా చూడాలనే కోరికతో ఆనాటి న్యూసు పేపరును తిరగవేయసాగింది శాంత. ప్లాజాటాకీసులో ఆడుతూన్న సినిమా ఆమెకు నచ్చింది, ఆ విషయమే శారదకు చెప్పింది.
'శాంతీ! ఇది ఫైనలియరు. నీవు జాగ్రత్తగా చదవడంలేదని నేననను. కాని దృష్టినిమాత్రం యితరత్రా ఏ వ్యాసంగాల మీదకూ మళ్ళించకుండా జాగ్రత్తపడు. ఇంతకు మించి నీకేం చెప్పగలను?'
'శారూ! నిజంగా నీవు నా ప్రక్కన ఉండబట్టే నేను జాగ్రత్తగా చదువుకోగలుగుతున్నాను. ఎన్నడూ కూడా వూహించని విధంగా నాకు క్లాసు వచ్చిందంటే అది నీ శిక్షణ మాత్రమే! నీవు వద్దంటే వెళ్ళడం మానేస్తాను.'
'అబ్బే...! అలా ఎందుకంటాను శాంతీ! నాపై నీకున్న ప్రేమతో అలా అంటున్నావు గాని నన్ను హేళన చేస్తున్నవారెందరులేరు? వనజ ఆ రోజు అందరిముందు ఎలా అవమానించింది నన్ను? అందరూ ముందుకు నడుస్తే నేను వెనుకకు నడుస్తానట! బి. సి. లో ఉండవలసిన నేను ఈ యిరవయ్యో శతాబ్దంలో ఉండడానికి తగనట!' ముఖం చిన్నబుచ్చుకుని అంది శారద.
'ఏడిసింది...ఆ కాలేజీ క్వీన్ కు మరీ అంత మిడిసిపాటా...? ఇప్పుడే ఫారిన్ నుండి దిగివచ్చినట్లు మాట్లాడుతుంది. ఆవిడసంగతెవరికి తెలియదు. ఆ ఫాషన్లు, ఆ వయ్యారం! శారూ! ఎవరు ఏమైనా అనుకోనీ, నేను మాత్రం నీవు గీచిన గీటు దాటను. అసలు నాకు ఎవరిపైనా గురికుదరదు. కుదిరిందంటే అది చెడదు. నేను చాలా ఖచ్చితమైనదాన్ని.'
'చాలా సంతోషం. నీకు నాపై అంతటి అభిమానం కలగడం నా అదృష్టం. నేగీచిన గీటు నీవు దాటాకపోవడమేమిటి? శాంతీ! నీ ఆదరాభిమానాలతో బ్రతుకుతున్నాను, చదువుకుంటున్నాను. నా స్నేహంవల్ల నీవు చెడిపోయావనే పేరు రాకూడదు. అరిటాకు ముల్లుపై పడినా, ముల్లు అరిటాకుపై పడినా నష్టం అరిటాకుదే! నేను నిన్ను పెడమార్గాలకు త్రిప్పుకున్నా నీ అంతట నీవు పెడదారి పట్టినప్పటికీ, అందుకు నేనే' బాధ్యురాలనౌతాను.' చిరునవ్వుతో అంది శారద.
'శారూ! ఎంతమాటన్నావే! మరెప్పుడూ ఆ విధంగా అనబోకు. నన్ను మందలించే అధికారం నీకెప్పుడూ ఉంటుంది. నాకు ఆవేశమెక్కువని నాన్నగారికి, బావకూ తెలుసు. అందుకే నా గార్డియన్ గా నిన్ను నియమించారు. వారే కాకుండా నేను కూడా ఆ అధికారాన్ని నీకిస్తున్నాను.' ముఖ కవళికలు గంభీరంగా మారుస్తూ అంది శాంత.
