Previous Page Next Page 
లోకం పోకడ పేజి 18


                                     14
    వేసవికాలం సెలవుల అనంతరం కాలేజీ లో సురేంద్ర చేరాడు. రమేష్ వెళ్ళిపోయాక సురేంద్రకు మనస్సు కలిసిన స్నేహితులు దొరకలేదు. ఇదివరకటి గదిలోనే ఒక్కడే ఉంటున్నాడు. ఎవరిని స్నేహం కలుపు కుందామనుకున్నా అతనికి నమ్మకం కలగటం లేదు. రామయ్య గారు ఏ లోటూ లేకుండా డబ్బు పంపిస్తున్నా సురేంద్ర కు ఏమిటో అసంతృప్తి. తండ్రి ఎన్నికలకు వ్యయం చేసే డబ్బు పడితే ఎంత చదువయినా చదువుకోవచ్చు. ఎన్ని కోర్సు లన్నా పూర్తీ చేయవచ్చు. రెండు సార్లు రెండు పాతికలు ఏభై వేలు ఖర్చు పెట్టాడు రామయ్య గారు. రాజకీయాలు రాజకీయవేత్త లను  ఎప్పుడూ రాపాడుతూనే ఉంటాయి. అందులో తల పెడితే ఆస్తులు పోనూ వచ్చు, ఆస్తులు రానూ వచ్చు. రామయ్య గారికి ఎన్నికల వల్ల ఆస్తులు పోనూ లేదు. రానూ లేదు. పంటలో వచ్చే అయివేజు మాత్రం ఖర్చవుతున్నది. పదివేలు అప్పు అయింది. ఈ పదివేలు రెండు మూడేళ్ళ లో తీర్చి వెయ్యవచ్చు. పార్టీ తత్త్వం ఆయనలో కొంత వరకూ జీర్ణించి పోయినా కేవలం పార్టీతోనే జీవితం సరదం చేసుకుందామనే తత్త్వం కలవాడూ కాదు. అయన అవకాశ వాది. అవకాశం ఉంటె సద్బినియోగ పరుచుకుంటాడు. లేని అవకాశం కోసం పాకులాడడు. ఎన్నికల్లో ఓడిపోయాననే విచారం లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే.
    ఈ సమస్యలన్నీ సురేంద్ర కు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ ఎన్నికల్లో పోటీ చెయ్యటం ఎందుకని సురేంద్ర ఉద్దేశ్యం. పులి కడుపున పిల్లి పిల్ల పుట్టిందని రామయ్య గారు మనస్సులో బాధపడతాడు. ఆయనకు ఎన్నికల సమస్య కన్నా కొడుకు సమస్య ఎక్కువయింది. ఎవరన్నా సురేంద్ర ప్రసక్తి తెస్తే, "వాడిది తల్లి పోలిక,' అంటాడాయన. తన ఆవేదనను మనస్సులోనే అణగ దొక్కుతూ , కొడుకు ఎక్కడ బాధపడతాడోనని ఎంత డబ్బు అడిగితె అంత డబ్బూ ఇచ్చేవాడు. అసలు ఎంత డబ్బు అడగాలో సురేంద్ర కు తెలిస్తేగా? ఈ కాలపు కుర్రవాళ్ళ తెలివితేటలే సురేంద్ర కు ఉంటె మూడు పూలూ, ఆరు కాయలూ కాయించే వాడు.
    "ఎవరయినా స్నేహితుణ్ణి నేను వెతికి చూపించనా" అన్నాడు సురేంద్ర తో రామయ్య గారు.  
    "అక్కర్లేదు నాన్నా. రమేష్ ను మించిన స్నేహితుడు నాకు దొరకడు. ఆ విషయం నేను ఆలోచించు కుంటాలే" అన్నాడు సురేంద్ర తండ్రితో.
    కాలేజీ లో గత సంవత్సరం చేరగానే అదృష్టం కొద్దీ రమేష్ తో స్నేహమయింది. రమేష్ తో ఉన్న తొమ్మిది నెలలూ ఎంతో సన్నిహితుల మధ్య ఉన్నట్లుగానే ఉంది. రమేష్ ఉద్యోగం లో చేరిపోయాడు. జీవితాన్ని తీర్చి దిద్దుకోగలవాడు. ఉత్తరాలతో ప్రేమించటం మొదలు పెట్టి, నాటకం తో ఆ ప్రేమకు మెరుగులు దిద్ది, మనస్పూర్తిగా మనస్సులు కలుపుకుని, ఇద్దరూ అంగీకరించి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సర మంతా ఎంతో సంతోషంగా గడిచి పోయింది. అదే గదిలో ఇప్పుడు రమేష్ లేని కొరత కొరత గానే ఉంది. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటే తలుచు కుంటున్నాడు సురేంద్ర.
    సంఘం లో కూడా తిరిగే అందర్నీ అర్ధం చేసుకోవడం అసాధ్యం. అంతః కరణ;లు కలిసి, అర్ధం చేసుకున్న వాళ్ళవరయినా ఉంటె మనస్సుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆత్మీయత లో ఉన్న ఆనందం ఎక్కడా లేదు. అలాంటి ఆత్మీయులు దూరమయితే పరమపద సోపాన పఠం లో పెద్ద పాము కరిచినట్లే.
    కాలేజీ టైము కావటం నుంచీ , మనస్సు సరిగ్గా లేకపోవటం నుంచీ హోటల్లో భోజనం చెయ్యకుండానే కాలేజీ కి వెళ్ళిపోయేవాడు సురేంద్ర. కడుపులో ఆకలి. ఏమిటో పోగొట్టు కున్నవాడిలా ఆదుర్దా. ఏదో తెలియని ఆవేదన. ఏమిటో వెతుకుతున్నట్లే ఉండేవాడు.
    కాలేజీ కి వెళ్ళగానే తన పేర ఒక ఉత్తరం వచ్చింది. ఆత్రంగా కవరు విప్పి చదివాడు. అది రమేష్ వ్రాసిన ఉత్తరం. సగం ప్రాణం లేచివచ్చినట్లయింది. మనస్సు కు ఎంతో సంతోషం కలిగింది. ఎన్నో ఆశలు దొర్లి పోయినాయి.
    సాయంత్రం సరాసరి గదికి వెళ్ళాడు . రమేష్ వ్రాసిన ఉత్తరం మరొకసారి తృప్తిగా చదువు కున్నాడు.
    "సురేంద్రా,
    "నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందని క్రిందటి ఉత్తరంలో క్లుప్తంగా వ్రాశాను. ఇక్కడ ఈ కంపెనీ లో అసిస్టెంటు ఎక్కువుంటెంట్ గా జాయినయినాను. జీతం ప్రస్తుతం నూట యాభై . ఇక్కడ అంతా కొత్తగా ఉంది. వసుంధర కు కొంచెం దిగులుగానే ఉంది. నాకూ నిన్ను వదిలి వచ్చాననే బెంగ. కాని ఎట్లాగో సరి పెట్టు కోవాలి గదా? ఉదయం పది గంటలకు కంపెనీ కి వెళ్లితే సాయంత్రం ఆరు గంటలకు రావడం. మా కొత్త కాపురం చూద్దువు గాని రారా!
    "ఆంధ్ర ప్రదేశ్ అవతరణ 1-11-56. ఇక్కడ ఇప్పట్నుంచే కోలాహలంగా ఉంది. దేశ నాయకులూ, పెద్దలూ అంతా ఇక్కడికి చేరుకుంటారు. ఈ శుభ సమయంలో నువ్వు కూడా నాలుగు రోజులు కాలేజీ కి సెలవు పెట్టి, తప్పకుండా రావాలి. ఇక్కడి వేడుకలూ, సందడీ ఉత్సవాలు చూద్దువు గాని. అక్కడి నుంచి నిన్ను వదిలి వచ్చిన తరువాత ఆప్యాయంగా మాట్లాడే స్నేహితులే దొరకలేదు.
    "ఇదివరకు వసుంధర నాకు స్నేహితురాలు. ఇప్పుడు నా శ్రీమతి. మా కొత్త కాపురం చూద్దువు గాని. తప్పక రావాలి. వెంటనే ఉత్తరం వ్రాయాలి సుమా!

                                                                                         ఆప్తమిత్రుడు,
                                                                                             రమేష్.
    ఆ ఉత్తరాన్ని నాలుగు సార్లు చదువుకున్నాడు సురేంద్ర. తప్పక హైదరాబాద్ వెళ్ళాలనే నిశ్చయానికి వచ్చాడు.
    కొంతమంది వ్యక్తులున్నారు. వాళ్ళు తెలివి కలవారే. తెలివి తక్కువ వారేమీ కాదు. తాము తెలివి గలవారమనీ, ఆలోచనా శక్తీ , మేధా కలవనీ వాళ్లకు తోచదు. వాళ్ళ జీవన జ్యోతి కోడి గట్టకుండా ఎగదొయ్యటానికి మరొక పుల్ల కావాలి, అప్పుడే ఆ జ్యోతి ప్రకాశించ గలదు.

                                *    *    *    *
    అక్టోబరు ముప్పైన బయల్దేరాడు సురేంద్ర. విజయవాడ స్టేషను లో ఎవరిని పలకరించినా హైదరాబాదు పోతున్నామనే వాళ్ళే. విద్యార్ధులు "పొట్టి శ్రీరాములు జోహార్" అంటూ ప్లాట్ ఫారమంతా తిరుగుతున్నారు.
    ఇంతమంది ప్రజా సమూహం ఆ రాత్రి బయల్దేరే రైల్లో ఎట్లా ఎక్కుతారో , ఎట్లా సర్దుకు కూర్చోవాలో సురేంద్ర కు అర్ధం కాలేదు. సురేంద్ర జీవితంలో హైదరాబాదు వెళ్ళటం అదే మొదలు. ఫలాని రైలుకు వస్తున్నానని ముందుగానే రమేష్ కు ఉత్తరం వ్రాశాడు సురేంద్ర. ఎట్లాగో శ్రమపడి టికెట్టు తీసుకుని తోక్కిసలాడుతూనే రైలెక్కాడు. మనిషి నిల్చునే సందు కూడా లేదు. అంతా ఆంధ్రప్రదేశ్ ను గురించీ, మద్రాసు, హైదరాబాద్ నగరాల్లో గల తేడాలను గురించీ రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అన్నీ వింటూ నిల్చున్నాడు సురేంద్ర. రైలు కదిలింది. "అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్" అంటూ విద్యార్ధులు మిన్ను ముట్టేటట్లు తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తుండగా రైలు సాగిపోయింది. ఆ కబుర్ల సందడి లో సురేంద్ర కు ఆ రాత్రంతా నిద్ర రాలేదు.
    మర్నాడు ఉదయం ఎనిమిదిన్నర కు ఇంత మంది జనంతో నూ బరువుగా నిట్టుర్పు విడుస్తూ సికిందరాబాదు స్టేషను చేరింది రైలు." 'ఆంధ్ర ప్రదేశ్ జిందాబాద్." "ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి " అంటూ నినాదాలు చేస్తూ అంతా రైలు దిగారు. సికిందరాబాదు స్టేషనంతా జనం నేల ఈనినట్లు గా ఉంది. ఆ జనం లోనే నెట్టుకుంటూ చేతి సంచీ తీసుకుని సురేంద్ర కూడా రైలు దిగాడు. పది నిమిషాలు అటూ ఇటూ చూశాక, "ఒరేయ్ సురేంద్రా! వచ్చావురా! ఎంతో ఆత్రంగా నీకోసం కాచు క్కూర్చున్నా!" అంటూ ఎంతో ఆప్యాయంగా కావిలించు కున్నాడు రమేష్. రమేష్ ను చూడటం తోనే సురేంద్ర కు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఇద్దరూ అతి కష్టం మీద స్టేషను లో నుంచి బయట పడ్డారు.
    బస్సులో ఎట్లాగో చోటు చేసుకుని ఎక్కారు. చార్ మినార్ చౌరస్తా లో ఇద్దరూ దిగారు. అక్కడి నుంచి ఓ వంద గజాల దూరం లో ఉంది రమేష్ ఇల్లు.
    "ఇదేరా మా ఇల్లు. రా, లోపలికి రా." అంటూ లోపలికి వెళ్ళాడు రమేష్. గుమ్మం లోనే ఆప్యాయంగా పలకరించింది వసుంధర.
    "కులాసాగా ఉన్నారా, అన్నయ్యా? మీరు వస్తారో, రారో అని అనుకుంటూనే స్టేషను కు వెళ్ళారు , మీరు రావటం మాకెంతో సంతోషంగా ఉంది.' అన్నది వసుంధర.
    వసుంధర తో మాట్లాట్టానికి సిగ్గు పడ్డాడు సురేంద్ర. అతనికంటికి వసుంధర కొంచెం ఎదిగినట్లూ కొద్దిగా ఒళ్ళు వచ్చినట్టూ కనిపించింది.
    ఇద్దరికీ కాఫీ ఇచ్చింది వసుంధర. స్నేహితులిద్దరూ ఆమాటా ఈ మాటా చెప్పుకుంటూ పన్నెండు గంటల వరకూ కాలక్షేపం చేశారు. మాటల సందర్భం లో వాళ్లకు ఆకలి కూడా తెలియలేదు. స్నేహితులతో ఉన్న ఆప్యాయతా, అనురాగాలూ, మనస్సులు కలిసిన మాటలూ అర్ధం చేసుకున్నది వసుంధర. అందుకనే వసుంధర కూడా బెరుకు లేకుండా వాళ్లతో మధ్య మధ్య మాట్లాడుతూనే ఉంది. వసుంధర మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పటానికి బిడియపడే వాడు సురేంద్ర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS