Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 18

 

    బరువుతో క్రిందికి జారిపోతున్న పెట్టెను ఎగదోసుకుంటూ భారంగా అడుగులు వేస్తున్న శేఖర్ ను చూసి జానకమ్మ "ఎవరన్నా సాయం చేయండే!" అంది.
    కళ తన అరచేతుల కేసి మరొక మాటు చూసుకుంటూ "నేను పట్టలేను బాబూ! నా చేతులు చూడు ఎలా కంది పోయాయో! అయినా ప్లాట్ ఫారం ఈ కొస నుంచి ఆ కొస వరకు ఇద్దరం పట్టుకుని మోసు కెళ్తే చూసే వాళ్ళంతా వీళ్ళ కింత పిసినారితనం ఏమిటని నవ్వుకోరూ?' అంది బుంగ మూతి పెడుతూ.
    శారద మాట్లాడకుండా పెట్టె ఇవతల పక్క హాండిల్ పట్టుకుంది. శేఖర్ వద్దంటూనే అవతల పక్క పట్టుకుని ముందరకు వెళ్ళాడు.
    అంతా ఇవతల కొచ్చేసరికి రిక్షా వాళ్ళు, జట్కా వాళ్ళు హోరా హోరీగా దెబ్బలాడుకుంటున్నారు. ఒకరి బేరం మరొకరు పాడు చేశారని తిట్టుకుంటూ, శేఖర్ ను చూడగానే పోట్లాట మానేసి మళ్ళా పరిగెత్తుకుని వచ్చి చుట్టూ ముట్టారు.
    "డాబా తోటకు వెళ్ళాలి.. ఏం కావాలోయ్?' అని అడిగాడు శేఖర్.
    "చెరొక అర్ధరూపాయి ఇచ్చేయండి బాబూ! రెండు రిక్షాల్లో తీసుకు పోతాం..." అన్నాడో రిక్షావాడు.
    అయిదుగురికి రెండు రిక్షాలెం చాల్తాయనుకున్నాడు శేఖర్. జానకమ్మ కూర్చున్న రిక్షాలో అవిడోక్కత్తికే స్థలం సరిపోదు. సన్నంగా ఉన్నా మాత్రం రిక్షాలో ఇద్దరు పెద్ద వాళ్ళకు మించి కూర్చోవటానికి స్థలం ఏం ఉంటుంది? తను జానకమ్మ పక్కన ఎలాగో అవస్థ పడి కూర్చున్నా ముగ్గరక్క చెల్లెళ్ళు ఒకే రిక్షాల్లో రావటానికి వప్పుకుంటారో లేదో?
    శేఖర్ అట్టే సేపు ఆలోచించక ముందే జట్కావాడు "అయిదుగురు మడుసులు, సామాను రెండు రిక్షా లేలా సరిపోతాయ్?.... నా బండేక్కండి బాబు.... అంతా ఒక దాన్లో నే కూకోవచ్చు" అన్నాడు.
    వాడి సలహా శేఖర్ కే కాదు, జానకమ్మ , అమ్మాయిల క్కూడా నచ్చింది.
    "ఎంత కావాలంటావ్?" అనడిగాడు శేఖర్.
    "పదణాలు ఇవ్వండి బాబూ!" అన్నాడు జట్కావాడు పెట్టె చేతిలోకి తీసుకుంటూ.
    "దగ్గిరే కదయ్యా-- అర్ధ రూపాయి కంటే ఎక్కువివ్వను.... వస్తేరా లేకపోతె మానీ!" అన్నాడు శేఖర్.
    "నాకు గిట్టుబాటు కాదు బాబూ! రిక్షాల్లో ఎల్తే మీకు ఇంతకన్నా ఎక్కువే అవుద్ది.... బెడ డబ్బుల కేటి బాబు అలా గీసి గీసి బేరమాడతారు? మీలాటి మకరాజులు దయించక పొతే మా బతుకులేలా బాబూ?' అన్నాడు బ్రతిమాలుతూనే ధోరణిలో బండివాడు.
    ఆ మాట నిజమే? రిక్షా వాళ్ళు ఎంత లేదన్నా ఆరణాలకు తక్కువ కట్టరు. అదీ గాక రెండు రిక్షాలు చాలవు.... జానకమ్మ ఇష్టపడితే బండి లోనే వెళ్తే బాగుంటుందనుకున్నాడు ఆర్ధిక శాస్త్రం అధ్యయనం చేసిన శేఖర్.
    "ఏమంటావత్తా?' అనడిగాడు జానకమ్మను చూస్తూ.
    "సామాను బండిలో పెట్టమను...." అంటూ జానకమ్మ బండి దగ్గరికి వెళ్ళింది. బండివాడు సామాను ముందు వేపు సర్ది బండి పట్టుకున్నాక జానకమ్మ రెండు చేతులతో బండి పట్టుకుని లోపలి కెళ్ళింది. అమ్మాయిలు ఎక్కాక వెనకాతల వూచ అడ్డంగా తగిలించి శేఖర్ బండి వాడి పక్కన కూర్చున్నాడు.
    తోవంతా బండి వాడు "పైకి రండి, బండి ఎనక బరువుగా ఉంది....' అంటూ పాట పాడుతూనే ఉన్నాడు. ఎంత జరిగినా ఇంకొంత జరగ మంటూనే ఉన్నాడు. మధ్యమధ్యలో గుర్రాన్ని కమ్చీ తో చెళ్ళు మానిపిస్తూ పరిగెత్తిస్తున్నాడు. కమ్చీ కర్రను చక్రాలకు తగిలించి టకటకా లాడిస్తూన్నాడు... సందు సండులన్నీ తిరిగి బండి ఇంటికి చేరుకుంది.
    గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తున్న జయమ్మ జానకమ్మ బండిలో నుండి దిగి దగ్గరకు రాగానే "వదినా? కులాసా?' అంటూ నవ్వుముఖంతో ఆప్యాయంగా పలకరించింది జానకమ్మ మీద చేతులేస్తూ.
    బండివాడు సామాను తెచ్చి ఇవతల వరండా లో పెట్టాడు. కళ తన నైలాన్ పర్సు లో నుంచి డబ్బు తీసి వాడి చేతిలో పెట్టబోతూ ఉంటె, "ఉండవే! వాడిస్తాడులే... ఇలారా!" అంటూ పిలిచింది జానకమ్మ.
    "ఏమే కళా! పరీక్షలు బాగా రాశావా? గీతా, ఉషా రాలేదేం?... చిత్రా! ఎలా ఉన్నావే?... ఒహో! శారద బాగా పోడుగయ్యిందే?' అంటూ వరసగా అందరినీ పలాకరించింది జయమ్మ.
    భౌ, మని కుక్క అరవటం విని అంతా అటు కేసి చూశారు. దాని పలకరింపు కాబోలు అది! తెలుపు, గోధుమ రంగు కలగా పులగం గా ఉన్న రంగు , మెడలో ఒక పటకా, దాని మీద 'ఎస్' అనే అక్షరం - మురికిగా కనబడుతున్న కుక్కను గొలుసుతో స్థంభానికేసి కట్టారు....
    "ఊర కోక్కను పెంచుతున్నావా బావా?" అని పగలబడి నవ్వింది చిత్ర. అంతా కిలకిల లాడారు.
    శేఖర్ కు కష్టమేసింది. అయినా పైకి నవ్వుతూ "వూరకుక్కని ఎవరు చెప్పారు?" అన్నాడు.
    "ఒకళ్ళు చెప్పేదేమిటి? దాని ముఖమే చెప్తున్నది...." అంది కళ వెక్కిరింతగా.
    "వో, వో! ఇది నా ఊర్వశీ!" అంటూ శేఖర్ కుక్క పిల్లను చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
    జయమ్మ నవ్వుతూ " వాడికాకుక్కంటే పంచ ప్రాణాలు. పొద్దున్న లేవగానే దానికి ముందు కాఫీ పోశాక గాని వాడు తాగడు..." అంది.
    "బావకు ఇంత భూత దయ ఉంటె కష్టమే అత్తా.... వూళ్ళో వూరకుక్కలన్నీ మీ ఇంట్లోనే చేరగలవు జాగ్రత్త!" అనీ కొంటెగా హెచ్చరించింది చిత్ర.
    శేఖర్ సామాన్లు తెచ్చి చావిట్లో ఒక మూలగా పెట్టాడు. అందరితో పాటు పెరట్లో కి దారి తీస్తున్న శారద ను చటాలున చెయ్యి పట్టుకు లాగుతూ "మాట్లాడకూడదా?' అనడిగాడు శేఖర్ మెల్లిగా.
    శారద కాస్త కోపంగానే జవాబు చెప్పింది.
    "నన్ను మర్చిపోయావు కాని ఏం మాట్లాడాలి....?"
    చిన్నతనంలో అక్కయ్యలతో పాటు తనూ చేరి బావతో కలిసి ఆదుకున్నది. చిన్నది కాబట్టి అందరూ కలిసి ఆటల్లో తననే ఎక్కువ ఎడ్పించేవారు. అందులో మరీని... అలాంటిది ఇప్పుడు అందరినీ జ్ఞాపకం ఉంచుకుని తన్ను మర్చి పొతే....?
    "మరి నువ్వు అమాంతం పెరిగిపోయి పరికిణీ ఓణీలతో చక్కని చుక్కలా తయారై వస్తే నేనెలా పోల్చుకోనూ?' అంటూ సంజాయిషీ చెప్పుకున్నాడు శేఖర్.
    శారద సిగ్గుపడి "ఫో బావా!" అంటూ పారిపోయింది....
    సుధాకర్ గుంటూరు వెళ్ళాక వాళ్ళ నాన్నగారు ఒకటి రెండు సార్లు పెళ్ళి మాట ఎత్తారు. కళ సంగతి చెబుదామని నోటి దాకా వచ్చింది కాని బావ గాడు జ్ఞాపకం వచ్చి నోట్లోనే దిగమింగుకున్నాడు సుధాకర్. వాడి కిష్టంగా లేనప్పుడు మనమెందుకు బలవంతం చేయ్యాలన్నట్టుగా ఆయనా వూరుకున్నారు తల్లి అడిగినప్పుడు కూడా సుధాకర్ తన మనసులోని సంగతి విప్పి చెప్పలేకపోయాడు.
    మెడ్రాస్ వెళ్ళినప్పుడు సుధాకర్ మనిషి, మనస్సు రెండింటినీ పట్టుకెళ్ళాడు. తీరా తిరిగొచ్చినప్పుడు ఒక్క మనిషి మాత్రమే వచ్చాడు. మనస్సు కళతో పాటు విశాఖపట్నం చేరుకున్నది. ఇదివరకెన్నడూ ట్రాన్సి స్టర్ పట్టుకు వదిలేవాడు కాదు. ఇప్పడు దాన్ని చూస్తె కళకు, తనకు వచ్చిన కలహం జ్ఞాపకం వచ్చి గుండె కలుక్కు మంటున్నది. ఆ కలహానికి ముగింపు చిరకాలపు ఎడబాటేనా? యాత్రికంగా పనులు చేసుకోవటం తప్పించి సుధాకర్ మునుపటి లా హుషారుగా ఉండలేక పోతున్నాడు. కళను గురించి గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు. కళను మర్చి పోలేడు, కళ బావ నంత కంటే మర్చి పోలేడు.... కళ కమ్మని కలైతే కళ బావ పీడ కల! ఆ కమ్మని కల ఇచ్చే ఆనందం కన్నా ఈ పీడ కల ఇచ్చే బాదే అదికంగా ఉంది.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS