ఆ ఉదయమంతా గందరగోళంగా జరిగిపోయింది. మధ్యాహ్నం కుసుమ శంకరం దగ్గరకొచ్చి అన్నది-
"నా పోస్ట్ కన్ ఫరమ్ చెయ్యటానికి ఆఫీసరు ప్రయత్నిస్తూన్నారట. అప్లికేషన్ ఇవ్వమన్నారు. ఇచ్చాను. వంట్లో బాగా లేదని చెపితే, రెండు రోజులు సెలవు గూడా ఇచ్చారు."
"ఇలాటి మంచి మనుషులు ఒక పట్టాన అర్ధంకారు." అన్నాడు శంకరం, ఆఫీసరు మంచితనాన్ని హర్షిస్తూ.
"వీలుంటే రేపు మా ఇంటికి వస్తారా. మీతో మాటాడాలి" అడిగింది కుసుమ.
"తప్పకుండాను" అన్నాడు శంకరం.
ఆనాటి సాయంత్రం నలుగురూ మిత్రులూ అద్దె ఇంటిలో సమావేశమయ్యారు. శంకరం జరిగినదంతా చెప్పాడు. ప్రసాదం విని, ఘొల్లున నవ్వేస్తూ.
"అయితే శాస్త్రిగాడి ఆట కట్టిందన్నమాట. గోవిందా......" అన్నాడు.
"ఆయనింత మంచివారని మనం ముందు అనుకోలేదు సుమా" అన్నాడు వాసు.
"మనం ఒక విషయం మరిచి పోతున్నాం. ఆఫీసన్న తర్వాత రక రకాల మనుషులుంటారు. భోజనం చేసేవాళ్ళూ, సిన్సియర్ గా పని చేసే వాళ్ళూ, పని దొంగలూను. మరి వీళ్ళందర్నీ ఒక దారిని పెట్టుకోవాలంటే ఆఫీసు చాలా వలలు పన్నవలసి వస్తుంది. భజన చేసే వాళ్ళని 'భేష్' అని సమర్ధించాలి. సిన్సియర్ గా పని చేసేవాళ్ళకి ఉత్సాహాన్నివ్వాలి. పని దొంగలని మందలించాలి. వీటన్నిటికంటే ముఖ్యం తన వ్యక్తిత్వం. ఎవరికీ ఏ హానీ చేయకుండా ఆఫీసు వ్యవహారాలు చక్కబెట్టుకోడం-అప్పుడే 'ఆఫీసరు', ఈ విధంగా చూచి నట్టయితే మన ఆఫీసరు చాలా తెలివి గలవాడు" అన్నాడు పతి.
"గొప్పగా చెప్పావ్" అన్నాడు ప్రసాదం.
"కాబట్టి.....ఈ శుభ సమయంలో శ్రీ శంకరంగారు మనందరికీ కాఫీలు పరకించే ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదిస్తున్నాం" అన్నాడు పతి.
"దాన్ని మేము బలపరుస్తున్నాం" అన్నాడు ప్రసాదం.
"ఆమోదించాం" అన్నాడు శంకరం.
"అయితే పదండి" అన్నాడు వాసు.
అందరూ నవ్వుకున్నారు. ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత, వాళ్ళకి ఈ రోజున ఆఫీసు స్వర్గంలా కనిపించింది. ఆఫీసరు దేవుడైపోయాడు. మనసారా ఆనందించారు.
అందరూ కలిసి హోటల్ కి వెళ్ళేరు. కాఫీలు తాగుతుండగా వాసుదేవరావు గభాలున లేని హోటలు గేటు దగ్గరికి వెళ్ళేడు. అతనికి పది అడుగుల దూరంలో అప్పుడే హోటల్ లాడ్జింగ్ లో నుంచి బయట పడిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.
ఆ వ్యక్తిని చూస్తూంటే-సందేహం లేదు. అతనే!
తను రిక్షాని పిలిచాడు. రిక్షాలో ఎక్కి వెళ్ళి పోయాడు.
వాసు కౌంటర్ దగ్గర కొచ్చి-
"ఇప్పుడు మీ లాడ్జింగ్ నుంచి బయట కెళ్ళి నాయన పేరేమిటి?" అనడిగాడు కౌంటర్ లో కూచున్న ఆసామిని. అతను వాసువైపు ఎగాదిగా చూస్తూ-
"పదమూడో నెంబరు గది" అన్నాడు హడావిడిగా.
వాసు బోర్డు దగ్గరికి వెళ్ళాడు. పదమూడో నెంబరుపైన తగిలించిన విజిటింగ్ కార్డు చదివాడు.
'రాజశేఖరరావు'
"రాస్కెల్........ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతావ్. చేతికి చిక్కావ్" అనుకున్నాడు కసిగా వాసుదేవరావు.
అంతలో శంకరం కౌంటర్ దగ్గర కొచ్చి బిల్ చెల్లిస్తూ-
"ఏమిటి భాయ్! అంత హడావిడిగా లేచావూ" అన్నాడు.
"ఉహు ...... ఏం లేదు. నాకు తెలిసి నాయన వస్తేనూ......"
"సరె......పదపోదాం."
అందరూ రోడ్డుమీద పడ్డారు. దార్లో ప్రసాదం ఒక ప్రతిపాదన పెట్టాడు.
"ఈ ఊళ్ళో చేనేత సప్తాహం బ్రహ్మాండంగా జరుగుతుందిట. కాబట్టి మనం ఆ యొక్క సప్తాహాన్ని చూడాలని ఉద్దేశ్యం"
"ఆల్ రైట్ ........పదండి మరి" అన్నాడు పతి.
దారి సప్తాహం వైపు మార్చారు. అది జింఖానా క్లబ్బు ఆవరణలో ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి, అక్కడ ఏర్పాటు చేసిన అందమైన ప్రతి షాపునీ పరామర్శిస్తూ బఠానీలు తింటూ నడుస్తున్నారు.
అక్కడ అందంగా అలంకరించిన స్టేజీపైన ఎవరో గాయని ఆర్కెస్ట్రాతో కమ్మని హిందీ (సినిమా) పాటలు పాడుతున్నది. మిత్రులు స్టేజీవైపు నడిచారు. ఆ పాటల్ని శ్రద్దగా వింటూన్నారు.
మధ్యలో వాసు అన్నాడు.
"నాకు కొద్దిగా పనుంది. నేను వెళ్ళాలి. మీరు నెంపాదిగా రండి."
మిత్రులు తలలూపారు.
వాసు బయట పడ్డాడు. గబా గబా రూం కొచ్చేడు. తలుపు తీశాడు. తన పెట్టె తెరిచి బట్టల అడుగునున్న ఒక డైరీ, ఒక ఫోటో తీసుకున్నాడు ఆ ఫోటో వైపు తీక్షణంగా చూస్తూ-
"నీ పాపం పండింది శేఖరం" అన్నాడు.
మళ్ళా పెట్టె మూసి, తలుపు తాళం వేసి ఆ హోటలు దగ్గరికి వచ్చాడు. లాడ్జింగ్ సెక్షన్ వైపు నడిచి 13 నెంబరు గది చేరుకున్నాడు. ఆ గదికి ఇంకా తాళం పెట్టి ఉన్నది.
కౌంటర్ దగ్గరకొచ్చి అడిగాడు.
"13 నెంబరు గదాయన రాజశేఖరరావు వచ్చాడా?"
అవతల ఆసామీ విసుగ్గా చూశాడు.
"ఆయన గది ఖాళీ చేసి అయిదు నిమిషాలయ్యింది."
వాసు దెబ్బ తిన్నాడు.
"ఎక్కడికి వెళ్ళాట్ట?"
"ఆ విషయం మాకేం తెలుస్తుంది చెప్పండి?"
వాసు హోటలు నుండి బయట కొస్తూ తనలో తాను గొణుకున్నట్టు-
"నువ్వెప్పటికైనా నా చేతికి చిక్కక మానవు శేఖరం. ఇది తథ్యం" అనుకున్నాడు.
* * *
సాయింత్రం ఆఫీసయిన తర్వాత శంకరం కుసుమ ఇంటికి వెళ్ళేడు. ఆవిడ నవ్వుతూ ఆహ్వానించింది. అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కుసుమ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇద్దరూ కాఫీ తఃగారు.
"ఆఫీసులో చాలామంది రాక్షసులున్నారు" అన్నది కుసుమ.
"................................."
"మీరు నాకు అప్పివ్వడం ఎవడో చూచేడు. వాడికది విడ్డూరంగా కనిపించి ఉంటుంది. కొంత ఊహించేడు. కథ తఃయారయింది. అది ప్రచారంలో పెట్టాడు. ఆ కథ విని తలలూపాయి చాలా గొర్రెలు. నోటి కొచ్చినట్టు వాగారు. నేనీ వాగుడికి భయపడి పోయేదాన్నికాను. అదే మరో అమాయకురాలైతే ఎంత క్షోభించేదో గదా! జీవితంలో చాలా దెబ్బలు తిని ఉన్నాను శంకరంగారూ! ప్రతి చిన్న దానికీ భయపడే దాన్నవుతే ఈ భయం బ్రతుక్కు ఎప్పుడో ముగింపు పలికేదాన్ని."
"వాళ్ళ మాటలు నేనూ విన్నాను."
"మంచి మనసు కాని వాడికి ప్రతిదీ వింతగా, అనుమానాస్పదంగా కనుపిస్తుందంటారు, ఇలాటి వాళ్ళు చాలామంది మన ఆఫీసులో ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే ఒక పక్క జాలీ మరో పక్క కోపంగా ఉంది" అన్నది కుసుమ.
"ఇలాటివి అసలు పట్టించు కూడదు"
కుసుమ పేలవంగా నవ్వింది.
"ఇదే కాదు. నేను చాలా విషయాలని పట్టించుకోలేదు. నన్ను సవాలు చేసిన సమస్యల్ని నవ్వుతూ అవతలకి నెట్టేను. క్షమించండి. ఉద్రేకంగా మాటాడుతున్నాను కాబోలు..........."
"..................................."
"చిన్నప్పటినుంచీ నా బ్రతుకు ఒక ప్రయోగంలా జరిగింది శంకరంగారూ! లేబరేటరీలో రసాయినిక ప్రయోగాలు జరుగుతాయి చూడండి.......ఆ విదంగానే......నా చుట్టూ అనేక విధాలైన పరిస్థితులు నా మనో నిబ్బరాన్ని పరీక్షించాయి. ఇప్పటివరకూ నా లోని సహనం చావనందుకు గర్వపడుతున్నాను. మొన్న మొన్నటి వరకూ మా అమ్మ బ్ర్తతికే ఉంది. ఆవిడ దేవత. ఆమె జీవితం ఒక ఎదురీత జీవితం బ్రతకటానికని అమ్మ మొట్ట మొదటిసారిగా చెప్పింది. ఈ సూత్రాన్ని ఆవిడ ఆదరించకపోతే, మా అమ్మ బ్రతికేదీ కాదు, నే నిలా తయారైయ్యేదాన్నీ కాదు. అమ్మ చిత్రమైన వలలో చిక్కుకుంది. మా ఊరు తిరువూరు, ఆ ఊళ్ళోనే అమ్మ పంతులమ్మ ఉద్యోగం చేసింది. మాది ఏమంత ఉన్న కుటుంబం కాదు. .............నా కథ చెప్పి మిమ్మల్ని విసిగించాలని నా ఉద్దేశ్యంకాదు. నే నెలాటి పరిస్థితిలో ఈ ఉద్యోగం చేస్తున్నానో, అర్ధం చేసుకునేపాటి సంస్కారంగల మీతో చెప్పుకుందామని ఎప్పట్నుంచో అనుకునే దాన్ని. అవకాశం లేక ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. ఇవ్వాళైనా మీతో చెప్పుకుందామనే తలంపుతో మిమ్మల్నిక్కడికి రావలసింధిగా కోరుకున్నాను. మీ కేమీ అభ్యంతరం లేక పోతే నా కధ వింటారనే ఆశిస్తాను" అన్నది కుసుమ.
"చెప్పండి" తన కుతూహలాన్ని ప్రదర్శించాడు శంకరం.
"అమ్మకి ఒక వ్యక్తితో పరిచయ మయ్యింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
ఇటు అమ్మ తరపు వారు, అటు నాన్న తరపువాళ్ళూ ఈ పెళ్ళికి వప్పుకోలేదుట. వాళ్ళ పెళ్ళి ఆటంకాల్తోనే జరిగింది. రెండు పక్షాలవారూ వెలివేశారు. సంవత్సరం గడిచింది. నేను పుట్టాను.
"చూడండి శంకరంగారూ మగ బుద్దు లెలా ఉంటాయో? అంతవరకూ 'పార్వతే నా ప్రాణం' అన్ననాన్న ఈ సంవత్సర కాలంలో మారిపోయారు. తన వాళ్ళందర్నీ రోజూ తలుచుకుంటూ, అందర్నీ దూరం చేసుకున్నాననే దుగ్దని బహిరంగంగా చాటుకునేవారుట. అమ్మ ఆయన మాటలన్నీ వినేది.
"ఎంతకీ తన వ్యధా, తన త్యాగం గురించే చెప్పుకునే వారేగాని, అమ్మనీ ఆమె సాహసాన్నీ ఆయన ప్రస్తావించేవారు కానే కారుట.
"ఒకనాడు నాన్నగారి తరఫున ఎవరో పెద్దలు మా ఇంటికి వచ్చారుట. ఆ రాత్రి అంతా నాన్న గారితో మాటాడారు. ఉదయమే వెళ్ళిపోయారు.
"ఆనాడు లగాయితూ నాన్న అమ్మమీద, తమ పెళ్ళిమీద, తమ సంసారంమీదా విసుక్కోడం ప్రారంభించారుట. ప్రతి చిన్న విషయానికీ అమ్మని దెప్పి పొడవడం, ఆమెను ఏడిపించడం నేర్చుకున్నారు. 'నీ గురించే మా వాళ్ళందరికీ దూరమై నరకం అనుభవిస్తూన్నాను, ఈ ప్రేమ పెళ్ళిలో ఇంత నరకం ఉంటుందని తెలుస్తే నిన్నసలు చేసుకునే వాడినేకాదు. నాకీ ఇంట్లో సుఖం లేక పోతోంది' అని ఆయన రోజూ అనేవారు.
