Previous Page Next Page 
మనం మిగిలేం పేజి 18


    నిజంగా ఈసారి తెల్లబోయినది మధు, సత్య, కొసరుగా కొద్ది కొద్దిగా విన్న సంపుటిలో సత్య తల్లిన్నూ.
    నేనెందుకు తీసిపోవాలన్న ఉత్సాహంలోనే రావు అందుకుంటూనే "వాడు డైరీలో వ్రాసుకున్నాడు - రావినూతలపాడులో పుట్టే నని; శాంత అనే అమ్మాయితో పెండ్లి అయ్యిందని. ఇది నిజమా? మరి ఆ సంగతో?" అన్నాడు.
    ఈ చెంపా, ఆ చెంపా వాయించినట్లయ్యింది ఆ ప్రశ్నలతో, వాటి క్రింద ఉన్న సత్యాలతోనూ.
    బుర్ర గోక్కున్నాడు మధు. సత్య తల దింపుకుంది.
    "మీరు జన్మలని నమ్ముతారా? పునరపి జననం, పునరపి మరణం అన్న నానుడిమీద నమ్మకం?" మధు అడిగేడు.
    ఇదే ప్రశ్న రావూ వేసేడు. ఆశ్చర్యం కలిగింది. ఎందువల్ల ఇదే తను అడగబడుతున్నది? ఏదో, ఎక్కడో ఓ రహస్యం వీళ్ళకు తెలుసు. అది చెప్పి నమ్మించలేమన్న పిరికితనం, చెపితే ప్రయోజనం లేని వట్టి వెర్రివాళ్ళ క్రింద జమ వేస్తారన్న భయం ఉంది. అందుకే తన్ను దొడ్డిదారిని తీసుకువెళ్ళుతున్నారన్న నిరుకూ కలిగింది. అది తను తల వంచితేనేకాని వాళ్ళు చెప్పరు.
    "నమ్ముతాను."
    "ఆ జ్ఞానం ఓ వ్యక్తికి ఈ జన్మ ఉండగా, శరీరంతో తెలుసుకోగలడు అన్న భావననూ మీరూహించగలరా?"
    "ఊహించడం ఏమిటి నాయనా! మన వైష్టిక కర్మ అంతా దేనికి? కర్మరాహిత్యం కోసం కాదూ?"
    "అయినంతమాత్రంలో?"
    "ఇది ఆధ్యాత్మికం. అదే సిద్దాంతం నమ్మగలిగితే కర్మ అన్నది, కర్త క్రియలమీద ఆధారపడి, ఇదివరకు నిల్వల క్రమంలో, అది హెచ్చడమో, తగ్గడమో జరుగుతుంది. వైష్టిక కర్మవల్ల అది హెచ్చకుండా, ఉన్న విలువకు చిల్లుపెడుతూ వెళ్ళడం ఓ సమయానికి సున్నా నిల్వ ఉండడం తథ్యం అవుతుంది.
    "ఆ సున్నా స్థానం పొందడానికే కదా మన కర్మ ఆశయం ఇందులో?"
    రావుమాత్రం ఈ గడుసుపిండం తన్ను వట్టి వెర్రివేపకాయ చేసేడు అనుకున్నాడు.
    "ఇది ఊహాతీతమైన సత్యం కావచ్చు. ప్రకృతి దాచుకున్న రహస్యం అనీ అనుకోవచ్చు. ఇక మరీ చూస్తే ఒక్కనాడు కర్మ నిలయం చేసుకోవడం ప్రారంభిస్తే, అది ఓ అతీత ఆధ్యాత్మికభావం ఇవ్వడం తథ్యమేమో అనుకోవాలి. పూర్తి అసత్యం అనుకోలేము. నమ్మక, అపనమ్మకాలమీద మనమే ఊగిపోతాము."
    "ఇది సంభవం అంటారా?"
    "ఎందుక్కాదూ? చరిత్రల్లో కథలు ఉన్నాయి. అవి పుక్కిటి పురాణాలని ఎందుకనుకోవాలి?"
    "అల్లా అంటే కర్మ సృష్టి ఎల్లా జరిగింది? దాని ప్రోత్సాహకు లెవ్వరు? ఇవన్నీ కొలతలు పెట్టి, జన్మల్ని ముడిపెడితే, ఎవరో, ఎక్కడి నుండి ప్రేరణో తెలియని శరీరం చేస్తే, అదే ముందు జన్మలకు ప్రాతిపాదిక అవడం ఔచిత్యం అంటారా?"
    "వాడు ఒట్టి నపుంసకుడన్న మాట. కర్మే సర్వస్వం అని నమ్మడంవల్ల, తను ప్రపంచానికి అంటీ ముట్టనట్లు ఉన్నాడని తనకోసం అనుకున్నా, కర్మ అనే ఓ జడత్వానికి బానిస అయి, అసలు వ్యక్తిత్వం కోల్పోయేడన్న మాట. అంతకంటే ఏమీ లేదు."
    ఎందుకో సత్య హృదయానికి అది హత్తుకుంది. కళ్ళు మిలమిల్లాడేయి క్షణికం. మధు మాత్రం గట్టి పిండం అనుకున్నాడు. ఒక్క రావు అర్ధం అయీ అవనట్లు ఉండిపోయేడు.
    "దీని ఫలితం?"
    "జీవితం రెండు గోడల మధ్య ఉంది. ఒకటి భౌతికం. అందులో లంపటాలు. అవి మలచసాధ్యం. రెండోది ఆధ్యాత్మికం. అంటే ఇటు ఆ లంపటాల్లో ఇరుక్కోకుండా, తనలో నిద్ర పోతున్న అహాన్ని రేకెత్తించి, ప్రయాణం చేయించడం. తిథులను దాటి అమవస పున్నము లను చూడడం.
    "ఈ రెంటికి శరీరం మధ్యవర్తి. ఒకటి క్రిందికిలాగుతూ బలవత్తరంగా ఉంటుంది. ఇక రెండోది లేచిందా, నిన్ను నిద్ర పోనివ్వదు. దాని ప్రయాణం ఓ అనంతంలోకి. శక్తిమయం. కాని ఒక్కటే తేడా. ఈ రెంటినీ కల్పే సాధనే శరీరం. అందువల్ల మన ఎగుడు దిగుడులు."
    "నిద్రపోనిచ్చే శక్తిమయాన్నే ప్రయాణం చేయిస్తే ......"
    "సమాధి అవుతుంది. అప్పుడు కాలం ఉండదు."
    "కాలానికి, కర్మకి సంబంధం?"
    "కాలం కొలమానం దీనికి. ప్రస్తుతంలో నువ్వు నాటిన బీజం ఎప్పుడు ఉత్పన్నమవ్వాలో అది నిర్ణయం చేస్తుంది. దాని ఫలితం ఎప్పుడు పొందాలో కూడా అదే చెపుతుంది. కాలం, కర్మ కలిసి రావాలంటారు. దాని అర్ధం ఇదేమో?
    "పైగా చిత్రాలు పునరావ్రుత్తం అవుతూ వుంటాయంటారు. దానికి మాత్రం కాలం అంచనాల్లో చెప్పే సిద్దాంతమే కదా?"
    సాముదాయికంగా అది ఎన్నో అపనమ్మకాలకు సమాధానం అయినట్లు ఉంది మధుకు. తను ఎప్పుడూ ఆలోచించలేదు.
    "అయితే ఈ కాలపురుషుని రహస్యం తెలుసుకోవచ్చంటారు?"
    "ఢంకామీద కొట్టి. కాని ఒక్కసారి ఆవగింజంతలో అరసగం తెలుసుకున్నారా, మీరు తట్టుకోలేరు. ఆ సత్యం నవనాడుల్నీ పూచి, జీవచ్చవం చేస్తుంది. ముమ్మరంగా గాలి వీచి ముక్కుపట్లు తప్పిస్తుంది. దానితో మనిషి పతనానికి కూడా నాంది అవుతుంది. ఎందుచేత నన్న ఆ ఉత్కృష్ట సత్యం నిలబెట్టుకోవడానికి, శరీరం విముఖత భరించుకోలేని బడబాగ్ని. అందువల్లే దాని శిక్ష అతి క్రూరంగా వుండనూవచ్చు."
    తట్టిలేపినట్లే సత్యకు సంభూతి అయితే "అంతే నంటారా?" అని బావురుమంది. ఇక మధు దాచుకోలేకపోయేడు.
    "రాజుకు ఆ వాసన ఎక్కడో తగిలింది. దాని అన్వేషణలో పడ్డాడు."
    "అయితే ఆ తాతగారి పోలికన్నమాట?"
    "ఏమిటండీ అది?" సత్య అడిగింది.
    "ఆయన శక్తేయుడు. కాని పైకి కావలసిన అవలక్షణాలు, అలవాట్లు వున్నాయి. తను పతనం చెందడం తప్పదన్నట్లుగా ఉండేవాడు. దుర్మార్గాలు చెయ్యడంలో అందెవేసిన చెయ్యి. అయినా పూజ దగ్గరమాత్రం నిప్పులా వుండే వాడు....." ఆ వరసలో ఎన్నో చెప్పేడు.
    "శాక్తేయంకూడా కర్మను హరిస్తుందా?"
    "అంతగా నేనెప్పుడూ తెలుసుకోలేదు. కొంతమంది దేవతలు మోక్షకారకులు అని అంటారు. తక్కినవి భౌతికాతీత శక్తి ఇవ్వడంతో, మానవుడికి అహంకారం ఇచ్చి, పతనానికి దారితీస్తాయి. అది చాలాచోట్ల నేను చూచేను."
    మధుకు వంశానుగతంగా వచ్చిన ఇలవేల్పు ఉంది. ఆమెను ఓ రోజు తనూ అర్చించాలని ఆశయం ఉంది. అది ఏనాడు అవుతుందో తెలియకపోయినా, కాంక్ష, నిశ్చయం ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు ఆలోచించేడు-ఈ మంత్ర తంత్రాలవల్ల జీవితాశయం ఏమిటి అని. ఈనాడు దశరథం చెప్పిన అంశాల్లో కొంత దారి కనపడ్డా అవన్నీ ఓ కలగూరగంప క్రింద రూపొందుతున్నాయి.
    "రాజు అనేవాడు తను ఎవరికోసమో వెతుక్కుంటున్నాడు. ఆవిడ ఎవరు? అనే కాంక్ష లోనే రావినూతలపాడు వెళ్ళేడు. కాని అక్కడ ఓ విచిత్రమైన రహస్యం బట్టబయలైంది. క్రిందటి జన్మవాసనలు విజ్రుంభించేయి. దాఖలా కన్పడింది. అది తట్టుకోలేకనే పునః ప్రపంచంలోకి పరుగెత్తేడు. ఇది సాధ్యమా?" మధు అడిగేడు.
    ఇంకా అడిగేది అవలేదన్నట్లు అన్నవతులో సత్య "వచ్చేటప్పుడే మేం ఊరి బయట వున్న శ్మశానంలోకి వెళ్లేం. అక్కడ తులసికోట నాటిన సమాధి వుంది. దానిమీద జననం, మరణం వ్రాసివున్నాయి. తండ్రి శోకం వుంది" అంది.
    "దీనికి తోడు రాజు అలిసిపోయి స్వేదతీరినట్లు, కొన్ని ఘంటలు అక్కడ కన్పడ్డట్లే, సత్య బహుమతిగా ఇచ్చిన పెన్ను దొరికింది."
    "నాకు వాడి గదిలో వ్రాసుకున్న పుస్తకం దొరికింది. అందులో విషయాలు నాకు అర్ధం కాలేదు. కాని రావినూతలపాడు తను జీవించిన స్థలం అన్నది మాత్రం వుంది."
    "అయితే అన్ని కేంద్రాలూ అక్కడికే తీసుకు వెళ్ళుతున్నాయి మనల్ని. నాకు స్నేహితుడు అవధానులుగారు వున్నారు. అక్కడకు వెళ్ళడం వల్ల కొంత సాధించగలుగుతాము. పైగా ఆయన నాకు సర్వశక్తులా సహాయం చేస్తాడు."
    "ఆ పెద్ద భవంతి ఉన్న అవధానులుగారా?"
    "అవును."
    "ఆయన కోడలే శాంత." చిన్నగా అని ఊరుకుంది సత్య.
    "ఆవిడిని కలుసుకొని, ఆతిథ్యం పొంది వచ్చేం. పైగా ఆయన నాకు పెత్తండ్రి."
    ఈసారి దశరథం తెల్లబోయేడు.
    "పద్దెనిమిదేళ్ళ క్రితం అవధానులుగారి కొడుకు చనిపోయేడు. అప్పటినుండి వైధవ్యం అనుభవిస్తోంది. ఉండుండి తన భర్త తనింటికి వచ్చేడని, మళ్ళీ పసుపుకుంకుమా ధరిస్తోంది."
    "అయితే....." సంశయాకులంగా దశరథం ఆగేడు.
    "కావచ్చు. కాకపోవచ్చు. కాలం నిర్ణయం చెయ్యాలి."
    "ఆవిడిని చూచే, మాట్లాడే, ఎందుకో మనస్సు వుండలేక పాదాభివందనం కూడా చేసే. వచ్చేటప్పుడే రవికలగుడ్డ చేతిలోపెట్టి పంపించింది."
    సత్య తల్లికి తల తిరిగిపోయింది. తను ఇంత కాలంలోనూ వింటున్నది కట్టుకథ కాదుకదా? లేకపోతే ఇల్లాంటివి జరుగుతాయా ఈ కలియుగంలో? ఎల్లా నమ్మాలి? నమ్మకుండా వింటున్న సంగతుల మద్య సత్యాలు ఉంటే ఎల్లా ఉండగలదు? మనస్సు మొద్దుబారుతూంది. పైగా తెలివి వచ్చిన సత్యలో ఉన్న సత్యం ఎక్కువగా బాధించి, కుమిలిస్తూంది.
    "ఆవిడ భావన?"
    "అతనే తన భర్త అంది."
    "ఆఁ!" అదె గదంతా ప్రతిధ్వనించింది. మౌనం తర్వాత పట్టమహిషి.
    చెమటలు కారుతుంటూనే, ఆయాసంలో ఉచ్చ్వాస నిశ్వాసాల వేగంలోనే, మాట సరిగ్గా రాని అలసటలోనే "రావుగారు వున్నారాండీ?" అని ఎవరో ప్రశ్నించడం వినిపించింది.
    అందరూ ప్రకృతిలో పడ్డారు. కళ్ళు పరుగెత్తాయి. రావు ముఖం మీద నెత్తురు చుక్క లేదు. ఎదురుగా కాంచనమాల నించుని ఉంది.
    "మీరు ఎక్కడ వున్నారో అనే వెతుకుతున్నా. ఆఖరుకు ఇక్కడకు వచ్చి వుంటారేమో అన్న ఊహతో ఉరుక్కుంటూ వచ్చే.
    "రాజు స్టేషన్ లో కన్పడ్డాడు. గుర్తుపట్టి పట్టుకున్నా. ససేమిరా రానన్నా, హోటలుకు తీసుకువచ్చే. గదిలో వున్నాడు. వీరయ్యను కాపలాపెట్టి వచ్చేను............"
    అందరూ జోళ్ళు తొడుక్కున్నారు. పరుగే వీధి గుమ్మం దగ్గర కన్నార్పకుండా ఉన్నది ఒక్క సత్య తల్లే అయ్యింది.
    అవి ఉరుకులు కావు, పరుగులే: కాళ్ళుకావు, మరలే అన్నట్లు హోటలు జేరేరు.
    బిక్కముఖంతో వీరయ్య గోడకు జార్లా పడ్డాడు. తన్ను కాఫీ తెచ్చి పెట్టమని ఎంతో ప్రాధేయపడ్డాడుట. వెళ్ళి తెచ్చేలోగా మళ్ళీ పరారైపోయేడుట.
    తల రెండు చేతులతోనూ పట్టుకుని, గోడకు బాదుకుని గగ్గోలు పెట్టినది కాంచనమాల ఒక్కర్తే అయ్యింది.
    "ఆయన దేవుడు. ఆ పాదాలు ఈ పాప పంకిల హస్తాలతో ఒక్కసారైనా కడగడానికి నోచుకోలేనిదాన్ని అయిపోయేను" అంటూనే ఏడ్చింది.
    సత్య పొదివిలోకి తీసుకునే గట్టిగా హత్తు కుంది మాలను. దుఃఖం, ఆవేదన.
    ఆ సృష్టి సత్యంలో ఉన్న ప్రబల ఉన్మత్తతే.
    తర్వాత రావే చెప్పేడు జరిగింది.
    ప్రతివాళ్ళ మనస్సుల్లోనూ కిల్బిషం తగ్గి గౌరవమే హెచ్చింది మాల ఎడల.

                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS