Previous Page Next Page 
ఆరాధన పేజి 19


    "లేదు. మీరు వెళ్ళడం నాకు తెలుసు."
    "ఎలా?"
    ఆమె నవ్వింది, పాప చిన్నగా ఏడ్పు మొదలెట్టింది.
    "వ్రేలెడు లేదు......తడుపుకుందని తెలుసు."ఆమె ముద్దుముద్దుగా మందలించి పాపకు గుడ్డ మారుస్తోంది.
    మంజును స్పెషల్. ప్రైవేట్ గదిలో పరుండ బెట్టారు. ఖాన్ తల్లిగారు ఇంటికెళ్ళారు. పాపను తదేకంగా చూస్తూ దగ్గరగా కూచున్నాడు కుమార్!
    మూర్తి - ఖాన్ వచ్చారు.
    "డాక్టర్ అన్నపూర్ణ వచ్చారా!"
    "లేదు- కానీ తెలీదా? ఒక లంబాడీ మనిషిని తెచ్చారు. నాటు మంత్రసాని ఏం చేసిందో గానీ గర్భసంచి బైటి కొచ్చింది చాలా పెస్టిక్అయింది.....చాలాసేపు అక్కడేవుండి లాభం లేదని వెళ్ళిపోయారు. పాపం ఆమెకు తను బ్రతకదని తెలుసు..."
    అందరు లోపలికి వెళ్ళారు. మంజు నిద్ర పోతోంది.
    పాప అప్పుడే బొటనవ్రేలు జుబుకుతోంది!
    "పాపను చూసినప్పటినించి మా అమ్మకు నా పెళ్ళి ధ్యాస ఎక్కువైపోయింది"
    సరిగ్గా సమయాని కొచ్చారు మా కెంతో ధైర్యం కలిగింది.....అన్నట్లు కుక్క బాగా కొరికిందా?
    "ఏ కుక్క"?
    కుమార్ అతడి చేతుల వైపు పరీక్షగా చూచాడు ఏ కట్టూ లేదు-మందు రాసిన చిహ్నం అంతకన్నా లేదు. ఖాన్, మూర్తి ముసిముసిగా నవ్వుకుంటున్నారు.
    కుమార్ కు ఏమీ అర్ధం కాలేదు. ఇద్దరివైపు మార్చి మార్చి చూస్తున్నాడు. మూర్తి ప్రారంభించాడు. "కాన్పు గది బైట నిన్ను ఆ పరిస్థితిలో చూచి జాలేసింది. ఏం చెయ్యటమా అని ఆలోచించాము. అంతలోకి కేసు వచ్చింది. వెంటనే థియేటర్ లోకి రావలసినదిగా నాకు సర్జన్ కబురుచేశారు, నీకు చేతినిండా పనికలిస్తేనే గానీ నీ మనసు ఆందోళన నించి నివృత్తి చెందదు. ఆపరేషన్ లో నిమగ్నమైతే నీకు మంజులను గూర్చిన చింత ఉండదు. అందుకని ఏవో నెపాలు చెప్పాము అంతే.....థియేటర్ లో అంత సేపున్నావు. ఇక్కడైతే క్షణమొక యుగంలా గడిపేదికాదూ- నీకు.....మరి....వస్తాము."
    వెళ్తున్న తన స్నేహితులవైపు ఆరాధనా పూర్వకంగా దృష్టి సారించాడు. ఇంతలోకి క్రొత్తగా చేరిన ఇద్దరు డాక్టర్లు - ఒక లేడీ డాక్టరు పాపను చూడటానికి వచ్చారు.
    అందరూ వెళ్ళిపోయాక కుమార్ పాపవేపు చూశాడు తను ఎందరిని చూడలేదు: ఎందరిని ఈ గడ్డమేద వేయలేదూ! ఈనాడు పాపలోని ప్రత్యేకత ఏమిటి? ఈ పాప అందరి మల్లే లేదే! పాప తమ పాప- తన స్వంత పాప...తమ ప్రేమ చిహ్నం-

                             *    *    *

    ఆదివారం సాయంత్రం స్నేహితులకు ముగ్గురికీ ఆఫ్, మంజుల మంచాన్ని చాటు చేస్తోంది స్క్రీన్. వాళ్ళు ముగ్గురు ఆ సాయంత్రం అక్కడ సమావేశం కావాలనుకున్నారు. ఇద్దరు కుర్చీల్లో కూచుని ఏదో వాగుతున్నారు. పాప జ్యోతులాటి కళ్ళు తెరచి లోకాన్ని "చూడాలి" అన్న ప్రయత్నం చేస్తోంది. మంజు పొత్తిళ్ళలోని పాపను తనివితీర నిమురుతూ. పాప గుప్పిటతో తన వ్రేలిని పట్టుకోగానే అమితానందం పొందింది.
    కళ్యాణి నిమిషాలమీద గౌన్లు తయారుచేసి తెచ్చింది ఆ పాప జన్మ అందరికీ ఆనందం కల్గించింది.....అక్క చెల్లెండ్ర కిద్దరికీ తమవాళ్ళకి తెల్పాలని ఎంతో ఆత్రంగా వుందిగానీ తండ్రి కోపాన్ని జడసి రాయలేక పోయింది.    
    భాస్కర్ ధైర్యంజేసి...."మా వదినె గారైన సౌభాగ్యవతి మంజుల గార్కి పుత్రిక జన్మించటం వల్లను..." అంటూ రాశాడు ఎలాగైతేనేం వర్తమానం అందించారు. తల్లికైనా ఆ ఆనందం సంతృప్తీ వుండక పోతుందా?
    మంజు ఆలోచిస్తోంది ఖాన్ తల్లి రోజూ ఆ వేళకి భోజనం తయారుచేసి తెచ్చిపెట్టేది. ఆనాడు ఇంకా రాలేదేం చెప్మా-అని ఎదురు చూస్తోంది. రేపు తొమ్మిదవరోజు ఇంటి కెళ్ళాలి.... పెద్ద ఆయా స్నానానికి కావలసిన సరంజామా ఏవేవో ఆకులు తయారు చేస్తోంది. ఖాన్ నౌకరు కారేజి పట్టుకొచ్చాడు. ప్రశ్నల కవకాశం కల్పించకుండానే వాడన్నాడు "సార్ అమ్మగార్ని రైలెక్కించటానికెళ్ళారు. తండ్రి గార్కి కులాసాగా లేదుట ఉత్తరం వస్తే వెళ్ళారు.
    "తొందరగా భోం చెయ్యమని చెప్పారమ్మా"
    "చాలా సుస్థీగా వుందటనా?"
    "లేదు సార్ - అమ్మగారు లేకపోతే ఏమీ వసతిగా లేదట. రైలెక్కించి వెంటనే వస్తామన్నారు డాక్టర్ బాబు."
    మంజు అన్నం తినబోతే సహించలేదు. మాట మాత్రంగానైనా తనతో అనివుంటే....హృదయపూర్వకంగా ఒక్కసారైనా ఆమెకు కృతజ్ఞతలు తెల్పలేదు ఒక మాతృమూర్తిగా గౌరవించాలనుకున్నారు. పట్టుచీర రవికె తెమ్మని కల్యాణికి డబ్బు కూడా ఇచ్చారు.....ఎంతో చెప్పాలనుకుంది...పాపం...ఆమె వెళ్ళిపోయింది. వెళ్తూవెళ్తూ ఒక్కసారి చెప్పి వెళ్ళి వుంటే తనకింత బాధగా వుండేది కాదు.....మంజు ఆలోచనతో సరిగా పరిగెడుతున్నాయి కుమార్ ఆలోచనలు.
    అన్నం కెలుకుతోంటే మనోగత భావాలను కనిపెట్టి కుమార్ ఎంతో దిగులుపడ్డాడు. ఎలాగో అతి ప్రయత్నంతో తిన్నాననిపించుకుంది.
    "రేపటినించి భోజనం మేము పంపిస్తాము." మూర్తి నిశ్శబ్ధాన్ని భంగపర్చాడు.
    "ఎందుకూ-రేపు ఇంటి కెల్తున్నాముగా-ఐనా-స్నానం అయ్యాక పత్యాలేమిటి? ఆరోగ్యం సమంగా వుండి జీర్ణించుకునే శక్తి వుంటే ఏవైనా తినొచ్చు...ఏమంటారు?"
    "ఆ మాట నీ నోటినించి రావటం సంతోషమే. నిజమే ఫారిన్ లో సమస్తం తింటారు? నీకేం అభ్యంతరం లేకపోతే అలాగే కానియ్" కుమార్ అన్నాడు.
    వాళ్ళు అరగంటదాకా కొన్ని కేసులను గూర్చి మాట్లాడుకుంటున్నారు. అంతలోకి డ్యూటీ నన్ను ఆవేపుగా వచ్చి మూర్తినిచూసి "డాక్టర్...డాక్టరమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారట. వార్డ్ బోయ్ మీ రాకను చూసి ఇక్కడే ఉంటారని వస్తున్నాడు..."
    "డాక్టర్ అన్నపూర్ణా"
    "ఔను డాక్టర్"
    మూర్తి బైటికి రాగానే వార్డ్ బోయ్ ఎదురయ్యాడు' సార్....అమగారి శాంతి జబ్బుతో ఉంది...'
    మూర్తి పెద్ద పెద్ద అంగలేస్తూ అన్నపూర్ణా క్వార్టర్ చేరాడు. ఆమె ఒడిలో తలపెట్టుకుని శాంతి నిశ్చలంగా పడుకుని వుంది. మూర్తికి ఆమె చూడగానే ఆశ్చర్యమూ జాలి వేసింది. మూర్తిని చూచి వ్యధత హృదయంతో అంది "మావాడు త్వరగా బాగవ్వాలని పాములమందు కార్బన్ నైట్రేడ్ క్లోరైడ్ ఎక్కువ వేసేశాడు ఇలా స్మారకం కోల్పోయింది. నాడి చాలా తగ్గు స్థాయిలో ఉంది నాకేం పాలుపోవటంలేదు." దీర్ఘంగా అనిపించింది. స్టెతస్కోప్ తో పరీక్షించాడు. ఆమె కిటీ తెరచి గుండె కొట్టుకుని రక్తం సరిగా ప్రసరించేందుకు ఇంజక్షన్స్ గ్రుచ్చాడు. తనకు అంత బాధ తెలియదు. కుక్కలకు ఎలా ఇంజక్షన్ ఇవ్వాల్సింది సర్జన్ మాదప్ప ఓ మాటు తమ "బ్రౌనీ'కి ఇస్తుంటే చూచాడు ఇద్దరు ఆప్ డ్యూటీ నర్సుల కృత్రిమ శ్వాసం కల్గిస్తున్నారు.......అన్నపూర్ణ దాని పేరు పదేపదే పలుకుతూ ఆమె తన డన్ లప్ కుషన్ మీద తలపెట్టి ఒళ్ళంతా నిమురుతోంది. ఆమె ముఖం కళా విహీనమైన నిర్జీవంగా వున్నట్లుంది. వైద్యం చెయ్యటానికి చేతులాడటం లేదు!        
    ఇక లాభం లేదు. మూర్తి ఒక చీటిమీద ఏమిటో బరికి వార్డ్ బోయ్ కిచ్చాడు వార్డ్ బోయ్ డ్యూటీ డాక్టర్ దగ్గరకు తీసికొని వెళ్ళాడు. ప్రాణ వాయువు సరంజామా కోసం వ్రాయబడిన చీటీ అది. అతడు విషయాన్ని కనుక్కుని అయిష్టంగానే ఇచ్చాడు. ఒక కుక్కకోపం ఇంత హంగామా జరుపుతున్నారా? అత్యంత ముఖ్య మైన ప్రాణ వాయువు మనుష్యుల కే కొన్ని పర్యాయాలు లభ్యంకాదు. అలాంటిది ఒక జంతువు కోసమా-!    
    అతను క్రొత్త డాక్టరు. "శాంతి" సంగతి ఏమీ తెలియదు. డాక్టరు అన్నపూర్ణకు దానిపైగల మమత-ఇంతా-అంతా అని చెప్పలేము.
    ఒక తల్లికి-బిడ్డకూ గల సంబంధం ఎంత నిష్కృతమైనదో - ఎంత సన్నిహితమైనదో అలాంటి ప్రేమ అది. శాంతి - అంటే అందరికీ ఇష్టం అది పెద్ద డాక్టరమ్మ యింట్లో రాజభోగాలనుభవిస్తోందంటే - చలికాలంలో ఉలెన్ తొడుగుమీద చలికి కుట్టిన మఖమల్ ధరించిందంటే - ఆమె చేతిమీదుగా పాలుత్రాగి ఆహారం తింటుందంటే -ఎవరూ ఆశ్చర్యపొరు కారణం-అది అమ్మగారి-బిడ్డ విశ్వాసంతో సేవచేసే జంతువు.
    మూర్తికి కుక్కలంటే ప్రత్యేకభిమానం వుండటంవల్ల అన్నపూర్ణ, హృదయాగత భావాలను తృటిలో అవగాహనం చేసికోగల్గాడు.
    ప్రాణ వాయువు గొట్టంద్వారా ఊపిరి తిత్తుల్లోకి పంపాడు మూర్తి. కొద్దిగా తెప్పరిల్లినట్లనిపించింది. ఆమె సజల నయనాలను తుడుచుకుంది మూర్తి కొద్దిగా చలించిపోయాడు? అరగంటసేపు మౌనముద్ర వహించి వేచి ఉన్నారు. కుక్క కోలుకుంటోంది. గుండెకాయ కొట్టుకోటం మరింత స్పష్టమైంది.
    నిద్రపోకుండ జాగ్రత్త చేయాలి ఉషారెక్కించటానికి మందులిచ్చి మూర్తి లేచాడు ఆమె కూడా లేచి నుంచుంది ముఖంలోవి ఆశారేఖల్ని - ఆందోళనా రహిత చూపుల్ని చూసి మూర్తి మనసు కుదుటబడింది.
    "వస్తాను డాక్టర్..."
    "అలాగే - మీకు చాల కృతజ్ఞతలు" ఆమె సాగనంపుతూ అంది.
    దానికేం లెండి.....శాంతి అంటే మా అందరికి యిష్టం.....నేను డాక్టర్ మంజుల గదిలో కుమార్ దగ్గరుంటాను! అవసరమైతే కబురు చేయండి.
    "అలాగే"
    మూర్తి కుమార్ దగ్గరకెళ్ళగానే ప్రశ్నించాడు కుమార్ "ఎలావుంది. పేషెంట్స్". "కోలుకుంటోంది.....కుమారి .....డాక్టర్ అన్నపూర్ణను చూడాల్సింది. ఎంతగా కుమిలిపోయిందో-తనలో తాను లేదు.....అశక్తురాలై పోయింది!"
    "వింతగా లేదూ? ఎంతటి కష్టమైన కాన్పు అయినా సరే - ఎంతటి అపాయకరమైన కేసైనా సరే గుండె నిబ్బరంతో ధైర్యంగా ట్రీట్ చేయగల ఆమె ఇంతలా బీరువై పోయిందంటే ఆకుక్కపై ఆమెకుగల ఆవ్యాజానురాగం తెలుస్తోంది. అది బిడ్డతో సమానం- దానికే అపాయం రాకూడదు. డాక్టర్ అన్నపూర్ణను ఆ విధంగా చూడలేను."
    "హల్లో ఖాన్ దూసుకుంటూవచ్చి కుర్చీలో కూలబడ్డాడు.
    "అమ్మగార్ని ఒక్కసారి ఇటు తీసుకోని రాకుండానే పంపించేశారు" తేరి అవతలినుంచి నిష్ఠూరంగా మాట్లాడింది మంజు.
    ".....  లేకపోయింది.......అందుకని" తేల్చిపారేశాడు.
    మేట్రస్ మంజును పలకరించటానికి వచ్చింది ఖాన్ ని చూచింది. "సాయంత్రం మీ యింటికి ఎవరో వచ్చారు. రెండువేలు ఇవ్వాలిటగా మీకు? ......నన్నడిగారు.....కలిశారా?"
    "లేదు......రేపొస్తాడులెండి"
    "ఏమిటి?" "రెండు వేలా?" "ఎక్కడి నించి?" "ఎవరిస్తున్నారు? కాబోయే మామ గారి ప్రజెంటేషన్' కాదుగదా? అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపించారు.

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS