Previous Page Next Page 
ఆరాధన పేజి 18


    అతను ఆమె దగ్గరుంటే ఎవరు ఏమీ అనలేరు. ఇదేమీ విడ్డూరమైన విషయంకాదు...కాని కుమార్ కు ఎందుకో సిగ్గనిపించింది. బాధ తగ్గిన తరువాత మంజు గోముగా అంది "అంతా ఏమనుకుంటారు.....మీరుంటే నాకు ధైర్యం...కానీ..." ఆమె హస్తాన్ని మృదువుగా నొక్కిబైటికి నడిచాడు.
    చేతులు వెనక్కు కట్టుకుని - మనస్సంతా మంజుమీద వుంచి పరధ్యాన్నంగా అటు ఇటు తిరుగుతున్నాడు.
    మంజుకు నొప్పులు ఇంకొద్దిగా అధికమైనట్లు-గదిలోంచి వచ్చే మూల్గు తెల్పుతోంది. మొదటి కాన్పు - ఆలస్యం కావచ్చు-అంతా చదువు కున్నారు. ఇతర్లలో చూచారుకానీ-తన మంజు ఇంక బాధపడ్తోంటే భరించలేక పోయాడు.
    ఒక్కసారి తొంగి చూశాడు. మంజు తలను అటు ఇటు ఊపుతోంది, ఈ బాధ సహించలేను అన్నట్లుంది. ఇక చూడలేక ఇవతలికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఎవరెవరో గదిలోకి వస్తూ పోతూ వున్నారు.
    మంజుకు - ఆ సమయంలో అందరూ - ముఖ్యంగా అమ్మ జ్ఞాపకాని కొచ్చారు. ఆమె తనకు సామీపంలో ఉంటే సగం బాధ మర్చిపోయేది. తను ఒంటరిదై పోయింది.......ఇదంతా ఒంటరిగా భరించాలి.......తనకేమైనా అయితే కడసారిగా ఎవ్వరిని చూడలేదు. ఎవ్వరితో మాట్లాడ లేదు.....తనకు ఆ గదిలో ఎవ్వరూ లేరు.... అందరూ పరాయివారే.
    వేదన అధికమౌతోంది. నుదురంతా చెమటతో తడిసింది....నోరంతా ఆరిపోయి నాలుక పిడచకట్టింది. ఒక్కక్షణం బాధతో కళ్ళు మూసుకుంది. చల్లని చెయ్యి- మృదువుగా అమృత మయమై వుంది మంజు నుదుటిమీద స్వేదబిందు వులను తుడుస్తోంది ఒక హస్తం. మరొక హస్తం ఆమె హస్తాన్ని గట్టిగా పట్టుకుంది. మంజుకు ఆ క్షణంలో ఎనలేనిశాంతి లభించింది కళ్ళు తెరచింది. ఎదురుగా ఖాన్ తల్లి.
    "అబ్బాయి ఇప్పుడే చెప్పాడు.....కొద్దిగా నోరు తెరువమ్మా.....కాఫీ చుక్కలు పోస్తాను."
    మంజు తన బాధనంతా మర్చిపోయింది. ఆమె ముఖంకేసి ఆరాధనా పూర్వకంగా చూస్తోంది. చెదరిన తల -నలిగిన చీరతో ఆమె మరీ అందంగా అగుపించింది. ఆమె చెంచాతో కాఫీ పోసింది. రెండు చెంచాలు పోసింధో లేదో మంజు తిరిగి తన బాధలో పడిపోయింది-
    ఆమె మౌనంగా మంజు హస్తాన్ని గట్టిగా పట్టుకుంది వుంది. ఆ చేతిలోని మాహాత్మ్యం ఏమిటో - ఏ వింతశక్తి ఉన్నదో - సగం బలాన్ని పుంజుకుంది మంజు మంజుకు ఎక్కడ లేని తృప్తి కల్గింది. ఇక ఫరవాలేదు ఈ అఘాతాన్ని సులభంగా దాటవేయగలదు. ధైర్యంగా "అమ్మా" అని స్వతంత్రంగా అరవగల్గుతోంది.
    తెల్లవారింది....
    ఒక్కసారి ఆమె బైటికెళ్ళి కుమార్ ను పలుకరించింది. కుమార్ స్తబ్దుడై ఆమెకేసి చూస్తున్నాడు. "మరేం భయంలేదు.....ఇంత బాధ పడకుండా కొడుకులు, కూతుళ్ళు ఎలావస్తారు? కోడళ్ళు, అల్లుళ్ళు ఈరికే వస్తారా బాబూ....వస్తాను..... ఇంటికెళ్ళి రాకూడదూ.." ఆమె ఎక్కువ మాట్లాడకుండానే వెళ్ళిపోయింది.
    ఔను ఒక్కసారి ఇంటికి వెళ్ళివస్తే మంచిది.
    అరగంటలో స్నానం చేసి టిఫిన్ తిని వచ్చాడు.
    డాక్టర్ అన్నపూర్ణ గబగబ వచ్చింది. "బాధ భరించలేను- క్లోరో ఫార్మ్ ఇమ్మంటోంది...ఏమంటారు?"
    డాక్టర్ కదూ- అన్నీ తెలుసు - మీ అభిప్రాయం!"
    "నా కిష్టం లేదు."
    "నాకుకూడా, బిడ్డకు అపాయం కాదా?"
    "మంజులకు - బిడ్డకు ఈ మత్తు పనికిరాదని తెలుసుగా-ఐనా చాలా పోరు పెడ్తోంది....ఎలా?" ఆమెకేం తోచటంలేదు.
    "సాధారణంగా ఏమైనా వుందా? చాల నొప్పిగా వుందా? ఏమంటారు?" అసాధారణత ఏమీలేదు. తల అగుపిస్తోంది....అంతా సవ్యంగా వుంది. బిడ్డ బైటికి రావటం ప్రకృతి పై ఆధార పడి వుంది.....మరేం కంగారు లేదు. గంట పట్టవచ్చు-లేదా ఐదు నిమిషాల్లో అయిపోవచ్చు. డాక్టర్ అన్నపూర్ణ లోపలికెళ్ళింది.
    ఖాన్ తల్లి మంజుతో అంటోంది' ఒద్దమ్మా - నేనున్నానుగా! ఇంకా రెండే రెండు నొప్పులతో అయిపోతుంది....నీ యిష్టం వచ్చినట్లు కేకలేయ్" మంజు ఎదురు తిరుగుతుంది "ఎప్పటినుంచో రెండు నొప్పులంటారు....గంటనించీ అదే మాట...'
    "ఈసారి నిజంగా.....లెక్క పెట్టుకో" ఆ బాధలో మంజుకేం తెలియటం లేదు. నొప్పులకు అతీతంగా అదో లోకంలో ఉన్నట్లుంది.
    డాక్టర్ అన్నపూర్ణ వీళ్ళ సంభాషణ ను వింటూ లోలోపల ఆమె నభినందించింది. మంజుకు ధైర్యాన్ని "పోస్తూంది" అనుకుంది.
    బైట కుమార్ కు ముళ్ళపై కూర్చున్నట్టుంది.
    మూర్తి వచ్చి క్షణం కుమార్ కేసి చూసి అంతా "అవగాహనం చేసుకున్నాడు. సర్జన్ మాదప్ప రమ్మంటున్నారు. నాకు వ్రేలు తెగింది....ఆపరేషన్ లో సాయం చేయలేను. డాక్టర్ రెడ్డి రాత్రి ఒక ఆపరేషన్ చేసి అలసివున్నారు."
    "అరె...ఏం ఆపరేషన్? ఇప్పుడు ఏదీ లేదనుకున్నానే-"
    "ఇప్పుడే వచ్చింది. ఒకావిడ మెట్టుమీదినుంచి పడిందట. ప్రక్క టెముక విరిగింది..."
    కుమార్ కు వెళ్ళటానికి సుతరాము ఇష్టంలేదు. అందరిమీద కోపం వస్తోంది. మంజు మూల్గుతన గుండెల్లో చొచ్చుకునిపోతోంది.
    ఖాన్ లేడూ?..... చికాకు పడ్డాడు.
    "లేకేం....వాళ్ళ కుక్కతో ఆడుతుంటే బొటనవ్రేలు కొరికిందట. పెద్ద గాయం కాలేదు గానీ..."
    "ఆపరేషన్ చేయటానికి తగడు.....ఔనా..."
    కుమార్ తటపటాయించాడు. తను అక్కడ నుంచుని ఏం చెయ్యాలి. అణుమాత్రం నొప్పిని తీసెయ్యలేడు కదా! గోళ్ళు గిల్లుకుంటూ కూచునేకంటే -ఒకరిబాధను తగ్గించగల్గితే - అంతకన్నా కోరదగినదేముంది?
    "వస్తున్నాను....పద...."
    కారిడార్ లో సగం దూరం ఇద్దరూ మౌనంగా కలిసివెళ్ళి తరువాత విడిపోయారు.
    వెళ్ళకముందు అన్నాడు మూర్తి "సిస్టర్ చెప్పింది. అంతా నార్మల్.... మరేం కంగారు పడకు."
    చేతులు కడుక్కుని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళటానికి తయారై నెమ్మదిగా తలుపులు త్రోశాడు. అందరూ సిద్ధంగా వున్నారు.
    సర్జన్ మాదప్పకు సైగతోనే నమస్కృతు లందజేశాడు.
    ఇంకా హృదయంలోని ఆందోళన తగ్గలేదు.
    నెమ్మదిగా వచ్చి తన స్థానంలో నుంచున్నాడు. సర్జన్ మాదప్ప గుడ్డ తొలగించాడు. ఆమె ఎముకలు ఎన్ని విరిగాయో గానీ-రెండు మాత్రం పొడుచుకుని భయంకరంగా బైటికి దూసుకొచ్చాయి. రక్తం ఎక్కిస్తున్నారు-బ్లడ్ ప్రెషర్ చూపి-నాడిచూచి 'రెడీ అన్నాడు అనెస్తటిస్ట్.
    సర్జన్ మాదప్ప ఓరగా కుమార్ వైపు చూశాడు. కుమార్ గతం మర్చిపోయాడు, దీక్షగా ఆపరేషన్ చేయవలసిన చోటు చూస్తున్నాడు. క్షణంలో రూపాంతరం పొందాడు. ఒక ప్రసవించే స్త్రీ భర్త బదులు అక్కడ అనన్య సామాన్యమైన గొప్ప శస్త్రచికిత్సకునికి కుడి భుజమైన డాక్టర్ కుమార్ గా మారిపోయాడు.
    నర్సు చిన్న కత్తి అందించింది.
    ఆ నిమేషం అది అతని చేతిలో తటస్తంగాఉంది. ఆక్షణమే అందరూ భగవంతుని ధ్యానిస్తారు కూడా.
    సర్జన్ మాదప్ప చర్మాన్ని కోశాడు....రక్తపు జీరను త్వరగా అద్దుతున్నాడు కుమార్.    
    ఆపరేషన్ పూర్తయ్యేసరికి దాదాపు పదకొండు గంటలు కావస్తోంది. ఆఖరి కుట్లువేసి-ఆమెను మంచంలో కదలకుండా పడుకోబెట్టి అన్ని సదుపాయాలు కల్పించటం కుమార్ పని. ఆ రోజు మాత్రం. పూర్తయ్యాక చర్మాన్ని కప్పి కుట్టువేస్తూ సర్జన్. మాదప్ప డాక్టర్ మీరు వెళ్ళొచ్చు అన్నాడు. కళ్ళు మాత్రమే ఆగుపిస్తున్న వస్త్రధారణలో కుమార్ కృతజ్ఞతతో నిండిపోవటం గమనించి సర్జన్ మాదప్ప తన పనిలో నిమగ్నమయ్యాడు.
    కుమార్ బైటికొచ్చాడు. గబగబ గడ్డలువిప్పి చేతులు కడుక్కుని పరుగెత్తినట్లే కాన్పుగది సమీపించాడు.    
    ఆయా ఎదురొచ్చింది-కానీ సమీపానికి రాకముందే ప్రక్కగదిలోకి వెళ్ళింది. అందరు పని తొందరలో ఉన్నారు. మధ్యలో ఎవ్వరిని ఆపి అడుగలేకపోయాడు. ఏదో సిగ్గు, అభిమానం!    
    అతి ప్రయాసతో శాంతించి కాన్పుగది సమీపించాడు.
    ఎక్కడలేని ప్రశాంతత - నిశ్శబ్దంగా వుంది ఒక్క క్షణం కుమార్ గుండెలు ఆగిపోయాయి. తలుపు త్రోశాడు.
    బల్లమీద మంజు నిశ్చలంగా పడుకుని ఉంది.
    రెండడుగులు లోపలికి వేశాడు. అప్పటికిగాని అతనికి అందరూ అగుపించారు కారు. గోడకు వేసిన కుర్చీలో ఖాన్ తల్లిగారు కూచుని ఉన్నారు. ఆమె ప్రక్కలో పాపలను పడుకోబెట్టే క్రచ్ లో పాప వుంది.    
    అలికిడికి - అక్కడ శుభ్రం చేస్తున్న తోటి ఇటు తిరిగింది. దాని ముఖంనిండా నమ్మే 'బంతిపూవు లాంటి పాప -బాబూ - అంటూ ఖాన్ తల్లి లేచి నుంచుని పాపను చేతుల్లోకి తీసుకుంది.
    కుమార్ పాపను చూస్తున్నాడు. ఆ అనుభూతి అతనిలో విద్యుత్తును ప్రవహింపచేసింది. పాపను చూస్తుంటే అంతకు ముందెన్నడూ ఎరుగని వాత్సల్యం. అనురాగం-వన్నె చిన్నెలతో హృదయంలో అంకురిస్తోంది. ఏదో మహత్తర శక్తి తన్ను పరవశుడ్ని చేస్తోంది.
    "తల్లీ-" అని చూపుడు వ్రేలుతో బుగ్గను సుకుమారంగా తాకాడు. గులాబి రేకును స్ప్రుశించినట్లు, పాలరాతి పైని హిమబిందువును తాకినట్లు మంచి ముత్యపు సరులను సవరించినట్లుగా అనుభూతి పొంది - ఆనందాతిశయంలో భార్యవైపు మళ్లాడు.
    మంజు కళ్ళు తెరుచుకుని చూస్తోంది. ఆ కళ్ళలో మాతృ ప్రేమ ప్రతిఫలిస్తోంది. ఎన్నటికి వలె అరుణిమ దాల్చిన సన్నటి లేత పెదిమలపై చిరు దరహాసం నాట్యం చేస్తోంది. ఆ ఆకర్లాంత విశాల నేత్రాల్లో ఏదో గర్వం! ధీమా!
    "మంజూ" అంటూ ఆమె ముంజేతిపై చేయి వేశాడు. ఏదో తప్పుచేసిన వాడివలె దిగులుగా అన్నాడు "పాప ఎప్పుడు పుట్టింది?"
    "పది - ముఫ్ఫై ఎనిమిదికి."
    "ఆ క్షణంలో ఇక్కడ ఉండలేక పోయాను. మంజూ-చాలా సీరియస్ కేసొచ్చింది.....ఇక్కడ నాకు స్థానంలేదు.....సర్జన్ మాదప్పకు సహయం చేయను వెళ్లాను.....కోపం లేదు కదూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS