Previous Page Next Page 
ఆరాధన పేజి 18

 

    'అనురాగం అన్న అతి పవిత్ర గ్రంధం లోది? మీకీ భాష అర్ధం కాదని మొదటే చెప్పానుగా! నేను కోల్పోయింది అనురాగ బంధాన్ని. మీరివ్వగలరా! చెప్పండి! హరికృష్ణ గారికన్నా అయిదు రెట్లు ఆస్తి వుంది ఒకప్పుడు. ఇపుడు అంతకు రెండు రెట్లు సంపాదించగలను. కానీ అమృతం కన్నా తీయనైనా డాక్టర్ గారి హృదయాన ఆశాంతి చెలరేగిందని తెలిసి అడుగు పెట్టాను.
    అదృష్టం వక్రించి అయన పిచ్చి వారయ్యారు.'
    'అవలేదు నువ్వే చేశావంటే --'
    'మీరెవరు అనడానికి?'
    'మేనమామను!'
    'అంతే! అంతకన్నా మరో మెట్టు ఎక్కలేదు మీబంధం! మరి ఇన్నాళ్ళూ ఏమయ్యారు? పిచ్చి ఎక్కక ముందు అయన కెందుకు పెళ్లి చేయలేదు? అయన ఆస్తి నుంచి ఎందుకు డబ్బు తీసికున్నారు? అందం లేదా? చదువు రాదా? హోదా తక్కువా? గుణం లేదా? ఆయనలో? మరి అన్నీ వున్న అయన ఏ లోపం వలన అవివాహితులుగా వుండి పోయారో చెప్పండి! ఏ మహానుభావుడు అయన జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపి వేశాడో చెప్పండి! ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి మీరు! మీరు తప్ప మరొకరు చెప్పలేని , రాణి ప్రశ్న యిది? ఎందుకో చెప్పమంటారా? మీరెంతో అనుభవజ్ఞులు.'
    రామనాధం గారు తెల్లబోయారు. తలమీది వెంట్రుకలు గాలికి వూగిసలాడుతున్నాయి మనస్సులోని వూహల్లా.
    'ఏమో! ఎవరికి తెలుసు! పెళ్ళంటే విముఖతేమో!'
    'సూటిగా చెప్పడం మీ అలవాటు అన్నారు!'
    ఉలిక్కిపడ్డాడా పెద్ద మనిషి. ఇబ్బందిగా కదిలాడు. సులోచానాల్ని తీసి ఉత్తరీయం తో తుడిచి మళ్ళీ వుంచుకున్నాడు.
    'ఇపుడు కాదని అనడం లేదుగా!? హరి మనస్సు లో ఏమున్నదో నాకెలా తెలుస్తుంది?'
    'మరి హరి మనస్సు లో అనూరాధను పదివేలిచ్చి వెళ్ళగొట్టవలెను అని వ్రాసి వుందా? చూశారా మీరు ఆ బోర్డును.
    విభ్రాంతుడయ్యాడా పెద్ద మనిషి. సూటిగా వేసిన బాణాలన్నీ తిరిగి తన మీదికే ప్రయోగించబడడంతో ఆయనకు నోట మాటే రాకుండా పోతోంది. ఏమాత్రం కాఠిన్యం వినదించకుండా మృదువుగానే ప్రశ్నించిందామె. సమాధానాలు చెప్పి తన వ్యక్తివాన్ని కించపరచుకోలేక సతమతమై పోతున్నాడాయన. ఆ త్యాగమయి చేయి జూచి అడిగింది అయన మరో జన్మలో కూడా యివ్వలేరు. కానీ మరోసారి తన అతి తెలివిని ప్రదర్శించాలను కున్నాడు.
    'సరే! నీ వాదన బాగానే వుంది. మరి ఇంకా యిక్కడ ఎన్నాళ్ళు వుంటావు? చట్టరీత్యా హరికృష్ణ ఆస్తికి నేనే వారసుణ్ణి . దీన్ని కాదనలేవు గదా!'
    'అది జరగని పని. అయన వచ్చేవరకూ ఎవరికీ హక్కు లేదిక్కడ. మీరు నాది సాహసమే అన్నా, ఉన్నమాట అనకుండా వుండలేను. ఆస్తికి గాదు మీరు వారసులు. దుర్మగాలకు వారసులు అంటే బావుంటుంది.'
    మరోసారి ఉలిక్కిపడ్డాడా పెద్దమనిషి. ఎదుట నిల్చి వున్న ఆమె వైపు చూశాడో క్షణం. మేడ మెట్ల దగ్గర కునికి పాట్లు పడుతున్న నౌకరు జోగులు నవ్వాపు కోలేక పోయాడా మాట విని. శకుంతలమ్మ గారి తెరిచినా నోరు తెరిచినట్టే వుండిపోయింది.
    'ఎంత దురుసుతనం? ఏం కధా?!' అనుకుంది లోలోన.
    'మీకు అంత అవసరంగా వుంటే కుటుంబంతో సహా తరలి రండి. మనస్సుకు నచ్చినన్నాళ్ళూ ఈ యింట్లోనే వుండండి. ఆ మాత్రం సాహసం చేస్తే హరికృష్ణ నన్ను మన్నించుతారన్న నమ్మకం వుంది.'
    పెద్దగా నవ్వాడా పెద్ద మనిషి.
    'ఏమిటమ్మాయ్ ? నువ్వంటున్నది? నా సొమ్ము నాకు దానం చేయడానికి కూడా 'సాహసం ' గీహాసం అంటూ హంగామా చేస్తున్నావే? కొన్నేళ్ళు హరికి గార్డియన్ గా వున్నది ఈ రామనాధమేనని తెలుసా?'
    'అంతేకాదు . అయన భవిష్యత్తు వెలుగులోకి రాకుండా అన్ని వైపులా నుంచీ అందమైన వలలు అల్లింది కూడా మీరే నని తెలుసు.'
    'ఏమన్నావ్'?' ఆగ్రహం నిలువెత్తున లేచి నిలబడింది.
    'అనూరాధ అన్న దాంట్లో తప్పేముంది బాబాయ్! ఉన్నమాటే అంది. అయినా మాయలకి, మంత్రాలకీ చింతకాయలు రాలే కాలం గాదిది.' శారద లోనికి వచ్చి కూర్చుంది అనూరాధ ప్రక్కనే.
    శారద మాట విని అప్రతిభులయ్యరాయన. శకుంతలమ్మ ఆశ్చర్యపోయింది.
    'శారదా! మంచి సమయంలోనే వచ్చావ్! ఆఖరిసారిగా చెబుతున్నాను. అనూరాధ ఈ యింట్లో వుండడానికి వీల్లేదు. హరికృష్ణ ఆస్తికి సంబందించిన కాగితాలన్నీ నా దగ్గరే వున్నాయి. ఒక్క బ్యాంకు అకౌంటు మాత్రమె నీ ఆహామాయిషీ లో వుంది. వాడు తిరిగి వచ్చినప్పుడు పైసాతో సహా అప్పగించు తాను. అంతవరకూ ఆ సంపద మీద ఈగ వాలినా సహించలేను.'
    'నిజమే! బాబాయ్! మీరు చాలా న్యాయంగా సంగ్రహించగలరు బావ సొమ్ముని. ఈగ ఎలా వాలుతుందసలు?! కనుమూసి తెరిచేంత లో ఖాళీ అయిపోదూ ఆస్థి అంతా!'
    'అక్కా! ఈ బెదిరింపులకి భయపడవలసిన పనేలేదు. నీరజ బ్రతికే వుందని మరిచిపోయారాయన. హరికృష్ణ గారు వచ్చేంత వరకూ ఎవరి అధికారాలూ అక్కరలేదు. నీరజే చూసుకుంటుంది. తోడుగా నువ్వున్నావు.'
    ఆ ఎత్తుల మారి మనిషి నిర్విన్నుడయ్యాడు.
    'మీకంత భయంగా వుంటే నాకెందు కింత బాధ! ఆ! సరే! పద! పదవే! మన చినబాబు , చంద్రాన్ని పంపించుదాం! వాడు గానీ, ఈ ఆటలకి స్వస్తి చెప్పడు.' అంటూ లేచి నిల్చున్నారాయన.
    'న్యాయం ఏనాడూ అట గాదు. అబద్దాలతో మేడలు కట్టినా అంతరంగాన హాయి వుండదు' అన్నది అనురాధ.
    అయన మాట్లాడకుండా నిష్క్రమించారు భార్యతో సహా.
        
                                                           10    
    శారద , చంద్రాన్ని గురించి వివరంగా చెప్పింది. 'తండ్రిని మించిన దుర్మార్గుడు . తేనే లోలికించుతూనే జీవితాలనే కబళించి వేయగల సాహసం వుంది అతనిలో. చదువూ, సంధ్యా లేకుండా కాలాన్ని గడిపి వేస్తున్నాడు. ఉత్త షోకుల రాయుడు.' జాగ్రత్త!' అన్నది చివరలో హెచ్చరించుతూ.
    'స్త్ర్రీ అంటే విలాస వస్తువు అనీ అతని అభిప్రాయం! మరి ఎలా మెలుగుతావో ?' మరోసారి హెచ్చరికను కదిలించింది.
    'అక్కా! అనూరాధ చుట్టూరా, వో మధురమూర్తి అల్లిన అనురాగ బంధం వుంది- పద్మవ్యూహం లా. భేదించడానికి అతను అభిమన్యుడు కాదుగా!'
    'అర్జునుడే రావాలంటావు!' నవ్వింది శారద.
    అనూరాధ కనులలో అనురాగం, సిగ్గుతో మల్లె మొగ్గే అయ్యింది.

                              *    *    *    *
    మద్రాసు లో మరో మూల వేదికించింది అనూరాధ ఆశను చంపుకోలేక. మధ్యాహ్నం! ఎండ అంత తీవ్రంగా లేదు వర్షం వచ్చే సూచనలు కన్పించుతున్నాయి అంబరాన. హల్లో కూర్చుని పేపరు చూస్తోందామే.
    'ఎక్స్ క్యూజ్ మి! మేడమ్! లోపలికి రావచ్చునా?' వో స్వరం మర్యాద వుట్టి పడేట్టు విన్పించింది.
    పేపరు మడుస్తూ తలెత్తింది అనూరాధ.
    సీమ నుంచి అప్పుడే దిగి వచ్చిన దొరలా, హుందా నిల్చుని వున్నాడో యువకుడు. నల్ల కళ్ళద్దాల్ని తీసి విలాసంగా చేతిలో వుంచుకున్నాడు. తెల్లని పాంటూ, షర్టూ! కొటూ! అతని హోదాని మరింత పెంచాయి.
    కొంచెంగా చిలిపితనం తొంగి చూస్తోందా కనులలో. రాజవంశం లో నుంచి వచ్చినట్లు ఠీవి గా నిలబడి వున్నాడు గుమ్మం లో.
    అతడే రామనాధం గారి సుపుత్రుడు చంద్రం అని గ్రహించింది అనూరాధ!
    'రండి! ఈ యిల్లు మీకు కొత్త గాదు.' లేచి నిల్చున్నది ఆమె.
    'రియల్లీ ఆయామ్ వెరీ గ్లాడ్ మీట్ యూ! ప్రఖ్యాతి గాంచిన నాట్యతార. అనూరాధ గారే ననుకుంటాను!' ఇంగ్లీషు లో నడిచి పోతోంది సంభాషణ.
    'క్షమించాలి! చంద్రం గారూ! నేనింకా తారను గాలేదు. దయచేసి తెలుగులో మాట్లాడండి. ఇంకా మాతృభాష అర్ధం చేసికోలేని పరిస్థితి రాలేదు' మృదువుగా వినదించిందామె స్వరం.
    'యస్! అల్ రైట్! మీరన్నట్టు తెలుగు నాక్కూడా ఎంతో అందంగా వుంటుందన్పించుతుంది. మీ అభిరుచి చాలా చాలా విలువైనది.' ప్రశంస దొర్లింది.
    'అమ్మను, అమ్మగా ప్రేమించడం లో గొప్పతనం వుందని నేననుకోను.'
    'గొప్పతనం అని నేనడం లేదే! మీ మాతృభాషాభిమానం నాకు నచ్చిందంటున్నాను.' మలుపు తిరిగింది సంభాషణ.
    'నాన్నగారు చెప్పే వుంటారనుకంటున్నాను. మద్రాసు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి తీరిక దొరికింది వెధవది! ఈ బిజినెస్ వుంది చూడండి! మనిషిని పీల్చి పిప్పి చేస్తుందనుకోండి!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS