"ఈ చీరలో సుబ్బులు ఎంత బావుంటుందను కున్నావు?' అన్నాడు.
"నువ్వు పెళ్లి కాకుండా చీర పట్టుకెళ్ళి సుబ్బులు కిస్తే మునసబు గారు రంకెలు పెట్టడూ?' అన్నాను.
"సరే. అయన కీ మధ్య దేవుడీ దయ వల్ల కళ్ళు కనిపించటం లేదు. మళ్ళీ కళ్ళు వస్తాయేమో అని భయంగా ఉంది. ఈలోగానే పెళ్ళయి పొతే , అనక ఆయనకి కళ్ళు వచ్చినా ఫర్వాలేదు" అంటూ చేతి ఉంగరం చూపెట్టి "మా సుబ్బుల్ది నాకిచ్చింది పెట్టుకోమని" అన్నాడు.
చీర కొని రంగదాసు ని బస్సు ఎక్కించి రావటానికి కారు స్టాండు కి వెళుతుంటే గవర్నర్ పేట సెంటర్ లో లింగరాజు కనిపించాడు. సారధి ప్రోత్సాహం మీద కొన్న మారిస్ మైనర్ అది.
"ఇంకా బేరం రాలేదా కారుకి?" అడిగాను.
"సారధి జ్ఞాపకార్ధం ఇది ఉంచేసుకున్నా" అంటూ బలవంతం చేసి నన్నూ, రంగదాసు నీ వాళ్ళింటి కి తీసుకు వెళ్ళాడు.
ఈ మధ్య చాలా రోజులయింది కల్యాణి ని చూసి, ఇంట్లో అడుగు పెట్టగానే కల్యాణి, "ఏమండోయ్ , సారధి గారు ఊళ్ళో నుంచే పారిపోయారు. మీరు ఊళ్ళో ఉండీ తప్పుకు తప్పుకు తిరుగుతున్నారు. మేమేమన్నా పెద్ద పులులం అనుకుంటున్నారా?" అంది.
కల్యాణి కాఫీ రంగు బోర్డరున్న తెల్ల వాయిల్ చీర కట్టుకుంది. నేను లింగరాజు ముఖం కేసి చూడనట్టు చూశాను. కల్యాణి మాటలు అర్ధం చేసుకో లేనంత మూర్ఖుడు కాదు లింగరాజు.
సారధి ని గురించి చాలాసేపు మాట్లాడు కున్నాం. కల్యాణి అందరి కంటే ఎక్కువగా సారధిని గురించి మాట్లాడింది. లింగరాజు మరునాడు మద్రాసు వెళుతున్నానని చెప్పాడు. రంగదాసు మా ఊరు తిరిగి వెళ్ళిపోయాడు. సారధి రాకుండానే, లేకుండానే తల్లితండ్రుల కర్మకాండ జరిగిపోయింది.
హెలెన్ మద్రాసు వెళ్ళిన తరువాత పదిహేను రోజులకు వ్రాసిన రెండో ఉత్తరం లో సారధి కనిపించాడని వ్రాసింది. ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో వ్రాయలేదు. తరవాత ఏడెనిమిది రోజుల కు హెలెన్ మరో ఉత్తరం వ్రాసింది. ఆదివారం ఉదయం మెయిలు లో విజయవాడ వస్తున్నాను. నువ్వు తప్పకుండా స్టేషన్ కి రావలసింది." అని వ్రాసింది.
ఆదివారం ఉదయం స్టేషను కి వెళ్లాను. ఆ ఉదయం మా ఇంట్లో భోజనం చేసి సాయంత్రం గుంటూరు వెళ్ళమని ఇంటికి తీసుకు వచ్చాను.
"మాలాంటి వాళ్లకి భోజనం పెడితే మీరు మైల పడిపోతారో, పోరో మీ ఆవిణ్ణి కనుక్కున్నారా?' అంది చలాకీగా హెలెన్.
"మా ఆవిడ అనుమతి తోనే నిన్ను ఆహ్వానించాను" అన్నాను. మా ఆవిడ వంటింట్లో సర్కస్ చేస్తుంది.
హెలెన్ సారధి సంగతులు యీ విధంగా చాలా చెప్పింది.
"కొన్నాళ్ళ పాటు పిచ్చిగా తిరిగాను సారధి కోసం. ప్రాణం విసిగి పోయింది. అంత మహా పట్నం లో సారధిని కనుక్కోవటం అసాధ్యమని నిరాశ చేసుకున్నాను. మా రాజు గారు నన్ను కేవలం కాలక్షేపానికి రంమాన్నాడు మద్రాసు. వాడు మరో ఏడు జన్మ లెత్తినా పిక్చరు తియ్యలేడని అందరికి తెలుసు. నాకూ తెలుసు. ఇంక గుంటూరు తిరిగి వచ్చేయాలను కున్నాను. మరునాడు ప్రయాణం పెట్టుకున్నాను. టీ నగర్ లో మా రాజు గారు నూట ముప్పై రూపాయలకు ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, నాతొ కాపరం పెట్టాలను కున్నాడు. నాకు ఒళ్ళు మండి పోయింది. ఒకనాడు నాలుగూ పెట్టాను. "తమరిక్కడిలా నెల్ల తరబడి నాలాటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారే అక్కడ గుంటూరు కొత్త పేటలో ఉన్న మీ ఆవిడ ఏమవుతుందో ఆలోచించారా?" అని అడిగాను.
"మా ఆవిడంటే నాకు డోకు" అన్నాడు.
"నువ్వంటే మరి నాకూ అంతే?" అన్నాను.
"కానీ, నువ్వంటే నాకు కాదుగా, ప్యారీ?" అన్నాడు.
అదేం మనిషో గాని, అతగాడి నరాల్లో చీమూ నెత్తురూ ప్రవహిస్తున్నట్లు లేదు. మానాభిమానాలూ, ఉచ్చ నీచాలూ రవ్వంత లేవు ఆ మనిషి లో!
"సుఖ పెట్టేవన్నీ నా కిష్టం . తక్కినవన్నీ నాకు అయిష్టం" అన్నాడో సారి.
"మరి మీ ఆవిడ మీకు సుఖ మేం తక్కువ చేసిందని దేశం మీద పడ్డారు?' అని అడిగాను.
"భార్య అయిన మరుక్షణం రంభ కూడా, ఇంట్లో స్తంభాల్లో చేరిపోతుందే, చిలకా?' అన్నాడు.
ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా, అతగాడు కూడా నాతొ పాటు సారధి ని వెతకటం మొదలు పెట్టాడు. "సారధి కనబడితే ఎన్నాళ్ళ యినా మద్రాసు లో ఉంటాను" అని చెప్పాను. అది దివ్య మంత్రం లా పని చేసింది. టాంక్ నిండా పెట్రోలు కొట్టించు కుని, ఉదయం నుంచీ సాయంత్రం దాకా ఒకటే వెర్రి తిరుగుడు. ఒకనాడు సాయంత్రం మెరీనా బీచ్ లో వెల్లకిలా పడుకున్న సారధిని చూశాము.
సారధిని చూసి నేను అనుభవించిన ఆనందం కంటే మా ప్రొడ్యూసర్ గారను భావించిం దేక్కువ.
సారధి అవతారం చూసి నేను సిగ్గు పడ్డాను. యదార్ధం చెబుతున్నాను. 'ఈ కొరమాలిన మనిషి కోసం ఎందు కింత వ్యధ ననుభవిస్తున్నదీ హృదయం?' అని నన్ను నేను ప్రశ్నించు కున్నాను. మాసిపోయిన పైజామా మీద లాల్చీ తోడుకున్నాడు. మెడ సాగినట్లు కొంగ మెడలా కనిపించింది. కళ్ళు ఇంకాస్త లోతుకు పోయినట్లున్నాయి. తలకి నూనె లేదు. దువ్వుకున్నాడు ఎలాగో. అప్పుడే తల నెరిసి పోతుంది. ఆకాశపు ఆవలి లోకాలని చూస్తున్నట్టు శూన్యంగా కళ్ళు తేలవేశాడు.
ఆ క్షణం లో అనిర్వచనీయమైన జుగుప్స నాలో పొంగింది. ఇతనికి నేనెంత నిర్లక్ష్యంగా గడ్డి పోచ కిచ్చిన విలవ కూడా ఈ మనిషి నాకివ్వటం లేదు. కీటకం కంటే హీనంగా చూస్తూ, "క్షుద్రశక్తి కి దూరంగా తొలగినట్టు తొలగి పోతున్నాడు. ఇతనీలో ఏముందని నేను లొంగి పోయాను? అందమా? అవయవ సౌష్టవమా? చదువా? హోదానా? అధికారమా? ఏ ఆకర్షణ నన్ను కుంగదీసి, అతనికి లొంగ జేస్తున్నది? ఎందుకు అతని కోసం నా కళ్ళు వెర్రిగా వెతికి వెతికి బరువెక్కి నీరసించి నిస్తేజాలై పోతున్నాయి? అతనితో పాటు అతన్ని వెన్నాడుతూ, అందరి దురదృష్టాన్ని అన్వేషిస్తూ నేనూ అధఃపాతాళానికి పతనమై పోవటం లేదు కదా? పరిపరి విధాల ఆలోచనలు నన్ను ఆనందంతో, విషాదం తో కంపింప జేశాయి.
నన్ను చూశాడు. నన్ను చూడగానే అతని కళ్ళు మెరుపులు చిమ్మాయి. కాని మరుక్షణమే ఆ వెలుగు శూన్యమై పోయింది.
అదే నవ్వు. ఆ నవ్వంటే నాకు భయం. అదే నన్నత నికి బానిసను చేసింది. అదే అతనికి జీవితాన్ని బానిసగా మార్చింది.
"నన్ను వెతుక్కుంటూ వచ్చావా?' అన్నాడు.
నా కళ్ళల్లో కృతజ్ఞత ద్రవించి చెక్కిళ్ళ మీద జారి, ఇసక పై రాలి ఇంకి పోయింది.
"నీకు తెలియదా , సారదీ?" అని అడిగాను.
అతను సమాధానం చెప్పకుండా నా కళ్ళల్లో కి చూశాడు, బిడ్డను తల్లి చూసినట్లు; భగవంతుని భక్తుడు చూసినట్లు;భూమిని ఆకాశం చూసినట్లు, సమస్తం కళ్ళల్లో నింపి చూశాడు.
సారధి మనిషిలా కనిపించలేదు. భయం వేసింది. వణికాను.
బలవంతం చేశాను. ఇంటికి రమ్మని.
"ఎవరింటికి?' అని అడిగాడు.
"నేను ఈ రాజుగారితో ఉంటున్నాను. టీ నగర్ లో. అక్కడికి వెళ్దాం రా, నే బ్రతికున్నాను, సారదీ! నిన్నీ స్థితిలో చూస్తె నీ తల్లి ఎంత బాధ పడుతుందో ఊహించ గలవా?"

"మా అమ్మ బాధపడే మనిషి కాదు."
"అలా అందర్నీ అనుమానించకు సారదీ. కన్న తల్లిని, మనసిచ్చిన పిల్లను శంకిస్తే, నువ్వింకా లోకంలో ఎవర్ని విశ్వసించ గలవు? మగాడి కోసం బాధపడే వ్యక్తులు ఇద్దరే. తల్లి, మనసిచ్చిన ఆడది."
"నన్నేం చెయ్యమంటావు?"
"నాతో రా."
"రాను."
"ఎందుకని?"
"ఈ బట్టలతో, ఈ స్వరూపంతో భూమికి గూడా నేను భారంగానే ఉన్నాను. రేపు వస్తాను మీ ఇంటికి. నీకోసం తప్పకుండా వస్తాను" అన్నాడు.
"పోనీ , నువ్వెక్కడుంటున్నావో చెప్పు, సారదీ."
"ఎందుకు? నీలాంటి వాళ్ళు రావలసిన చోటు కాదది. అక్కడికి వచ్చినా, నువ్వు క్షణం కూర్చోలేవు."
సారధి తో వాదించ లేక, అతని మనస్సు మార్చలేక "రేపు రమ్మని" మరీ మరీ చెప్పి దిగులుగా కారులో ఇంటికి చేరుకున్నాం. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. చిత్ర చిత్రంగా మనస్సు నాట్యం కేసింది. మా ప్రాణాల్ని బంధించిన బంధం ఎటువంటిదో , ఎంత బలీయ మైనదో , దీని పర్యవసానం ఏమిటో అర్ధం కాలేదు.
'సారదీ , నిన్ను వేయి జన్మ లేత్తయినా పొంద గలిగితే ,ఎంత దూరమైనా నీకోసం ఈ అనంత విశ్వం లో ప్రయాణం చేస్తాను. కాని , నీవు చాలా క్రూరుడివి, సారదీ! అంత పాపం చేయటం లో నీకానందం కనిపిస్తుంది. అది నీ అదృష్టమో, నా దురదృష్ట మో భగవంతుడి కే తెలియాలి' అనుకుంటూ నిద్రపోయాను" అని నిట్టూర్చింది హెలెన్.
